సాక్షి, అమరావతి: 2018 మెయిన్స్ పరీక్ష రద్దుపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్. సర్వీస్ కమిషన్, ప్రభుత్వంపైనా రాజకీయ విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. అసలు రాజకీయ విమర్శలకు కమిషన్ స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. అయితే నిరుద్యోగులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు.
2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిబంధనలకు అనుగుణంగా జరిగిందని గౌతమ్ సవాంగ్ తెలిపారు. మెయిన్స్ పరీక్ష ప్రశ్నాపత్రాలను పకడ్బందీగా ఒకేసారి మాన్యువల్ వ్యాల్యువేషన్ చేశామని, రెండోసారి జరగలేదని స్పష్టం చేశారు. 162 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు 55 రోజులు క్యాంపులో కూర్చుని వ్యాల్యువేషన్ చేశారన్నారు. వ్యాల్యువేషన్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాలో రికార్డు చేసినట్లు తెలిపారు.
నియామకాలకు సంబంధించి అన్ని ఆధారాలూ ఎపీపీఎస్సీ వద్ద ఉన్నాయని చెప్పారు. నియామకాల్లో ఏపీపీఎస్సీ చాలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఉద్యోగాలు చేస్తున్న 162 ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి న్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ క్రమంలో సోమవారం హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అప్పీల్ దాఖలు చేశారు.
2019 నుంచి ఇప్పటి దాకా కమిషన్ ఒక్క తప్పు లేకుండా పూర్తి పారదర్శకతతో వేలాది పోస్టులు భర్తీ చేసిందని పేర్కొన్నారు గౌతమ్ సవాంగ్. 2018 గ్రూప్-1 పోస్టుల భర్తీలోనూ అంతే పారదర్శకంగా మెయిన్స్, ఇంటర్వ్యూలు నిర్వహించాయని చెప్పారు. ఎంపికైన అభ్యర్థుల్లో 14 మంది ఐఏఎస్‌కు ఎంపికవ్వడమే అందుకు నిదర్శనమని తెలిపారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో దేశంలోని 15 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు వివాదాల్లో చిక్కుకుంటే, వివాద రహితంగా ఉద్యోగాలు భర్తీ చేసిన బోర్డుగా ఏపీపీఎస్సీ ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 78 నోటిఫికేషన్లు ఇచ్చి, 6,296 ఉద్యోగాలను వివాదరహితంగా భర్తీ చేసిందని తెలిపారు.
బాబు హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి వివాదాల్లో ఉన్నవాటిని సైతం పరిష్కరించి, పోస్టుల భర్తీ ప్రక్రియను సీఎం జగన్ ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ఇందులో విద్యావంతులైన నిరుద్యోగ యువతకు మేలు చేసేలా గ్రూప్-1, గ్రూప్-2 వంటి గెజిటెడ్ పోస్టులతోపాటు, వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజినీర్లు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు, మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టులకు నియామకాలు జరిగాయని తెలిపారు.
నాడే పడిన వివాదాల బీజం
2018లో బాబు హయాంలో గ్రూప్-1 విషయంలో వివాదాలు తలెత్తిన్నట్లు గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. 2018 మే నెలలో నిర్వహించిన ప్రిలిమ్స్ పేపర్‌లో దాదాపు 62 తప్పులు దొర్లాయని చెప్పారు. వీటికి నాటి చంద్రబాబు ప్రభుత్వంగానీ, నాటి సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్గానీ సమాధానం చెప్పలేదని ప్రస్తావించారు. గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను సంప్రదాయ పద్ధతిలో సబ్జెక్టు నిపుణులు మూల్యాంకనం చేయడం ఎప్పటి నుంచో ఉండగా..డిజిటల్ మూల్యంకనం ప్రతిపాదన నాటి చైర్మన్ ఉదయ్ భాస్కర్‌దేనని అన్నారు.
సంప్రదాయ పద్ధతి విధానంలో అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఉదయ్ భాస్కర్ డిజిటల్ మూల్యాంకనం ప్రతిపాదన చేయగా, నాటి కమిషన్‌లోని సభ్యులు కూడా ఆమోదం తెలిపి కొత్త ప్రభుత్వం ముందుంచారని చెప్పుకొచ్చారు. అనంతరం దీనిపై జాతీయ స్థాయి సదస్సును విజయవాడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేయగా అందుకు ప్రభుత్వం నిధులు కూడా కేటాయించిందని తెలిపారు. మెయిన్స్ పేపర్లను ఈ విధానంలోనే మూల్యాంకనం చేయాలని చూడగా.. నోటిఫికేషన్‌లో చెప్పని కారణంగా కోర్టు ద్వారా ఈ ప్రక్రియను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. దీంతో సంప్రదాయ విధానంలోనే పేపర్లను మూల్యాంకనం చేశారన్నారు.
‘2018 గ్రూప్-1 ఇంటర్వ్యూలకు 325 మంది ఎంపిక అయ్యారు. ఇందులో ఐఐటీ నుంచి 19 మంది, ఐఐఎం నుంచి 7, ఎన్ఐటీ నుంచి 17, బిట్స్ పిలానీ నుంచి 2, ట్రిపుల్ ఐటీల నుంచి 13 మంది ఉన్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ చేసినవారు 177 మంది, సాధారణ పీజీ 51, గ్రాడ్యుయేట్లు 39 మంది ఉన్నారు. ఇక ఇంటర్వ్యూకు ఎంపికైన వారిలో 40 మంది సివిల్స్ రాయగా.. వీరిలో 14 మంది అదే ఏడాది ఐఏఎస్ సాధించగా, ఇద్దరు కేంద్ర సర్వీసుకు ఎంపికయ్యారు.
మరో 24 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. 163 మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నారు. వీరంతా 2018 గ్రూప్-1 కంటే ముందే పలు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నవారు. వీరంతా మెయిన్స్‌లో ప్రతిభ చూపిన తర్వాతే ఇంటర్వ్యూని ఎదుర్కొన్నారు. సివిల్స్ ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకుని చదివినవారికి గ్రూప్-1లో గెలవడం లెక్కకాదు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment