ఏపీపీఎస్సీని నిరర్ధకంగా మార్చిన చంద్రబాబు ప్రభుత్వం
ఉన్న చైర్మన్, సభ్యులు కుట్రపూరితంగా తొలగింపు
3 నెలలుగా కమిషన్ చైర్మన్‌ను నియమించకుండా నిర్లక్ష్యం
నిలిచిపోయిన ఉద్యోగ నియామకాలు... పెండింగ్‌లో 21 నోటిఫికేషన్లు
పరీక్షల తేదీలు ప్రకటించని సర్విస్ కమిషన్
దీర్ఘకాలం శిక్షణతో ఆర్థికంగా నష్టపోతున్నామని అభ్యర్థుల ఆందోళన
వాయిదా అవకాశాన్ని సొమ్ము చేసుంటున్న శిక్షణ సంస్థలు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. సీఎం చంద్రబాబు తన రాజయకీయాలకు నిరుద్యోగ యువతను బలిచేస్తున్నారు. బాబు ప్రభుత్వ నిర్వాకంతో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిరర్ధకంగా మారిపోయింది. కమిషన్‌కు చైర్మన్ కూడా లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షల నిర్వహణ, ఎంపికలు గందరగోళంలో పడ్డాయి. గతంలోనే ప్రకటించిన నోటిఫికేషన్లకు ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో తెలియక నిరుద్యోగులు అందోళనకు గురవుతున్నారు.
మరోపక్క ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యి, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయి, ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉన్నా.. అదీ చేయడం లేదు. లక్షల్లో ఉద్యోగాలిస్తాం, జాబ్ కేలండర్ విడుదల చేస్తామని సీఎం, మంత్రుల ప్రకటనలే తప్ప ఒక్క ఉద్యోగమూ ఇచ్చే ప్రయత్నం కూడా చేయడంలేదు. ఏపీపీఎస్సీ ద్వారా ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు, పరీక్షల తేదీలపైనా స్పష్టత ఇవ్వడంలేదు. దీనిని అవకాశంగా మార్చుకుంటున్న శిక్షణ సంస్థలు ‘వచ్చే నెలలో పరీక్షలు.. స్పెషల్ బ్యాచ్ శిక్షణ’ పేరుతో నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి.
మూడు నెలలుగా చైర్మన్ పదవి ఖాళీ
సర్విస్ కమిషన్ నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షల తేదీల ప్రకటన, పోస్టింగ్స్.. ఇలా దేనికైనా చైర్మన్ అనుమతి తప్పనిసరి. అయితే, ఈ ఏడాది జూన్‌లో అధికారంలోకి వచి్చన వెంటనే కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న సర్విస్ కమిషన్ చైర్మన్‌పై కుట్రకు తెరతీసింది. 2025 జూలై వరకు పదవిలో ఉండాల్సిన చైర్మన్‌పైన, సభ్యులపైన వేధింపులకు దిగి, చివరికి తొలగించింది. నిబంధనల ప్రకారం సర్విస్ కమిషన్ చైర్మన్ ఏదైనా కారణాలతో అందుబాటులో లేకున్నా, లేదా ఆ పోస్టు ఖాళీ అయినా ఆ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి కొత్త చైర్మన్ వచ్చే వరకు ఆ బాధ్యతలను సభ్యుల్లో ఒకరికి అప్పగించాలి.
కానీ ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత మూడు నెలలుగా చైర్మన్‌ను నియమించకుండా కమిషన్‌ను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఏపీపీఎస్సీకి ఇన్ని రోజులు చైర్మన్ లేకపోవడం ఇదే తొలిసారని అధికారవర్గాలు చెబుతున్నాయి. చైర్మన్ లేకపోవడంతో గతంలో ఇచి్చన 21 నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను ప్రకటించలేదు. కీలకమైన గ్రూప్–1, 2 పోస్టులకు నిర్వహించాల్సిన మెయిన్స్ వాయిదా వేశారు. దీంతో 8 లక్షల మందికి పైగా యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది.
వైఎస్ జగన్ ప్రభుత్వ చిత్తశుద్ధి బాబు సర్కారుకేదీ?
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏపీపీఎస్సీ ద్వారా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ఇచ్చి, ఉద్యోగాలు భర్తీ చేసింది. ఆ చిత్తశుద్ధి ప్రస్తుత చంద్రబాబు సర్కారులో కనిపించడంలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సర్విస్ కమిషన్ నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరిగాయి, ఉద్యోగాల భర్తీ పక్కాగా పూర్తి చేశారు. గత ఐదేళ్లలో కమిషన్ ద్వారా అన్ని శాఖల్లోను 78 నోటిఫికేషన్లు ఇచ్చి అర్హత గల ఏ నిరుద్యోగికీ అన్యాయం జరగకుండా 6,296 ఉద్యోగాలను వివాద రహితంగా భర్తీ చేశారు. బాబు ప్రభుత్వం వచ్చాక ఉన్న చైర్మన్‌ను కుట్రపూరితంగా తొలగించడమే కాకుండా, కొత్త చైర్మన్‌ను నియమించకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాయిదాలతో అభ్యర్థుల భవిష్యత్‌తో ఆటలు
గతంలో ఇచ్చిన 21 నోటిఫికేషన్లకు షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తికావాలి. ఇందులో గ్రూప్–2, గ్రూప్–1, డీవైఈవో, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వంటి కీలమైనవి 19 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటిలో గ్రూప్–2, గ్రూప్–1తో పాటు డీవైఈవో పోస్టులకు గత ప్రభుత్వ హయాంలో షెడ్యూల్ ప్రకారం ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తిచేసి ఫలితాలను సైతం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 మెయిన్స్ జూలైలో జరగాల్సి ఉండగా, వాయిదా వేశారు.
ఈ నెలలో జరగాల్సిన గ్రూప్–1 మెయిన్స్ కూడా వాయిదా వేశారు. డీవైఈవో మెయిన్స్ పరిస్థితీ అంతే. ఈ మూడు పరీక్షల మెయిన్స్‌కు అర్హత సాధించిన దాదాపు 1.15 లక్షల మంది అభ్యర్థుల జీవితాలు ఇప్పుడు అగమ్యగోచరంగా మారిపోయాయి. వీటితోపాటు డిగ్రీ, జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్లతో పాటు వివిధ శాఖల్లో దాదాపు 1,475 పోస్టులకు పరీక్షల షెడ్యూల్ కూడా ఇవ్వలేదు. ఆయుష్ విభాగంలో హోమియో మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు జూలైలనే సరి్టఫికెట్ల పరిశీలన కూడా పూర్తయినా, చైర్మన్ లేకపోవడంతో ఇప్పటికీ నియామకపత్రాలు ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment