
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు బాసటగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు షర్మిల మంగళవారం వనపర్తి జిల్లా తాడిపత్రిలో ఉద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ అడ్‌హక్ కమిటీ సభ్యురాలు ఇందిరాశోభన్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బతుకులు బాగుపడతాయనుకుంటే నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇక్కడి లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆపార్టీ నేతలు సత్యవతి, విజయ్‌రెడ్డి, గౌతమ్‌ప్రసాద్‌లతో కలసి ఆమె మాట్లాడారు.
పీఆర్సీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఉద్యోగం కోసం వనపర్తి జిల్లాకు చెందిన నిరుద్యోగి కొండల్ మంత్రి నిరంజన్‌రెడ్డి చుట్టూ పదే పదే తిరిగి విసిగిపోయి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మంత్రి మొసలికన్నీరు కారుస్తూ కొండల్ కు టుంబాన్ని పరామర్శించడాన్ని ఆక్షేపించారు. షర్మిల మంగళవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉద్యోగదీక్ష చేపట్టనుండటంతో మంత్రి కి కొండల్ కుటుంబం గుర్తుకువచ్చిందన్నారు.