ఒక రోజు కష్టం.. మరో రోజు సులభం | Candidates have Many doubts on online DSC Online Exams | Sakshi
Sakshi News home page

ఒక రోజు కష్టం.. మరో రోజు సులభం

Published Mon, Jan 28 2019 3:24 AM | Last Updated on Mon, Jan 28 2019 3:24 AM

Candidates have Many doubts on online DSC Online Exams - Sakshi

సాక్షి, అమరావతి: డీఎస్సీ–2018 ఆన్‌లైన్‌ పరీక్షలను అస్తవ్యస్తంగా నిర్వహిస్తూ ప్రభుత్వం లక్షలాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతోంది. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసి, లక్షలు వెచ్చించి కోచింగ్‌లు తీసుకుని, రాత్రింబవళ్లు కష్టపడినవారి జీవితాలతో చెలగాటమాడేలా డీఎస్సీ పరీక్షల తీరు నడుస్తోంది. గతేడాది డిసెంబర్‌ 24 నుంచి నిర్వహిస్తున్న డీఎస్సీ–2018 పరీక్షలు ఆన్‌లైన్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఆన్‌లైన్‌ విధానం ఉండడం, అభ్యర్థులు ఎక్కువమంది దరఖాస్తు చేయడంతో పరీక్షలు ఎక్కువ రోజులు జరుగుతున్నాయి. రోజూ రెండు సెషన్లలో ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలు పెడుతున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ సోషల్‌ స్టడీస్‌ పరీక్షను రెండు రోజులు పెట్టగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పరీక్షలను ఏకంగా 8 రోజుల పాటు 16 సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఇలా ఒకే సబ్జెక్ట్‌ పరీక్ష ఒకటికి మించి ఎక్కువ రోజులు, ఎక్కువ సెషన్లలో జరిగినప్పుడు కొన్ని రోజుల్లో ప్రశ్నలు సులువుగా ఉంటున్నాయని, మరికొన్ని రోజుల్లో చాలా కష్టంగా ఉంటున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు. ఇలా రావడం పట్ల వారిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

టెట్‌లోనూ ఇదే పరిస్థితి
గతంలో టెట్‌ను రెండుసార్లు ఆన్‌లైన్‌లో నిర్వహించినప్పుడు కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఒక రోజు పరీక్ష రాసిన వారికి గరిష్టంగా 90 శాతం మార్కులు వస్తే మరో రోజు పరీక్ష రాసిన వారికి 50 శాతం లోపు మాత్రమే వచ్చాయి. దీంతో ప్రశ్నలు సులభంగా ఉన్నరోజు పరీక్ష రాసిన వారికి లాభం చేకూరగా తక్కిన రోజుల్లో రాసిన వారు నష్టపోయారు. అప్పట్లో అభ్యర్థులు దీనిపై మొరపెట్టుకున్నా పాఠశాల విద్యా శాఖ అధికారులు పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తింది. డీఎస్సీలో అర మార్కు తేడాతో పోస్టులు కోల్పోయే ప్రమాదముందని, ఇలాంటి సమయంలో సెషన్‌కు, సెషన్‌కు మధ్య ఒక్కసారిగా 15 నుంచి 20 మార్కులు తేడా ఉండడం వల్ల తమకు తీరని నష్టం వాటిల్లుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై పాఠశాల విద్యా శాఖకు తెలియచేసినా ఫలితం లేదని వాపోతున్నారు. 

నార్మలైజేషన్‌ విధానాన్ని అనుసరించాలి..
ఈ నెల 18 నుంచి ఎస్‌జీటీ పోస్టులకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. 18, 19వ తేదీల్లో ఇచ్చిన ప్రశ్నపత్రాలు చాలా సులభంగా ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. తర్వాత రోజుల్లో రాసినవారికి చాలా కఠినంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండటం, రోజూ రెండు సెషన్లలో ఎక్కువ రోజుల పాటు ఒకే సబ్జెక్టు పరీక్షలు జరుగుతుండడంతో ప్రశ్నలను వేర్వేరుగా రూపొందించి వాటిని పరీక్ష రోజు ఆయా సెషన్ల వారీగా అభ్యర్థులకు కేటాయించిన కంప్యూటర్లలో అప్‌లోడ్‌ చేయిస్తారు. ప్రశ్నల రూపకల్పన, వాటిని కంప్యూటర్ల ద్వారా అప్‌లోడ్‌ చేయించడంలో తాము నార్మలైజేషన్‌ పద్ధతిని పాటిస్తున్నామని అధికారులు చెబుతున్నా పరీక్షల్లోని ప్రశ్నపత్రాలు చూస్తే అలా ఉండడం లేదని నిపుణులు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. మూల్యాంకనంలోనైనా జేఈఈ తదితర పరీక్షల్లో చేసినట్లు నార్మలైజేషన్‌ విధానాన్ని అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఫిబ్రవరిలోపు నియామకాలు పూర్తయ్యేనా?
డీఎస్సీ షెడ్యూల్‌ ప్రకారం.. ఈ నెల 10న స్కూల్‌ అసిస్టెంట్‌ పరీక్షల ఫలితాలు ప్రకటించి 13న మెరిట్‌ జాబితా, 17న ఎంపిక జాబితాను కూడా ఇవ్వాల్సి ఉంది. కానీ పరీక్షల ఫైనల్‌ ‘కీ’లను విడుదల చేసినా వాటిపై స్పష్టత లేదు. ఫైనల్‌ ‘కీ’లు విడుదల చేసినప్పుడు వాటిలో ఏ ప్రశ్నల సమాధానాల్లో మార్పులు జరిగాయి? వేటిని తొలగించారు? రెండు సరైన సమాధానాలున్న ప్రశ్నలు ఏవి అన్నవి స్పష్టంగా వెబ్‌సైట్‌లో పెట్టాలి. ఆ తర్వాతే ఏ ప్రశ్నలకు మార్కులు కలపాలి? ఏ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల్లో తప్పులుంటే తొలగించాలి? అన్నది తేలి తుది ఫలితాలను, మెరిట్‌ జాబితాను విడుదల చేయడానికి వీలవుతుంది. ఇలా ఇప్పటివరకు స్పష్టత లేదు. అసలు ఏ ప్రశ్నలకు ఏ సమాధానం సరైందో, ఏది తప్పో తెలియక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఫిబ్రవరి చివరిలోగా నియామక ప్రక్రియ ముగిసేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షలు ముగిసి షెడ్యూల్‌ ప్రకారం ఫలితాలు వెల్లడవుతాయని ఎదురుచూస్తున్నవారికి పాఠశాల విద్యా శాఖ తీరని నిరాశను మిగులుస్తోంది. 

స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు మాత్రమే ఫైనల్‌ ‘కీ’ విడుదల
టీచర్‌ పోస్టుల భర్తీని ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పూర్తిచేస్తామని ప్రభుత్వం కూడా కోర్టుకు తెలిపింది. డీఎస్సీ ఫలితాల విడుదల ఆలస్యమవుతోంది. పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదలకే చాలా రోజులు తీసుకుంటున్నారు. మొదటి దశలో స్కూల్‌ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్, నాన్‌ లాంగ్వేజెస్‌), పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపాళ్లు, పీఈడీ, మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్రాయింగ్, భాషా పండితుల పోస్టుల పరీక్షలు ముగిశాయి. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు మాత్రమే ప్రాథమిక, తుది ‘కీ’లు విడుదలయ్యాయి. పీజీటీ, టీజీటీ పోస్టులకు ప్రాథమిక ‘కీ’ ఇచ్చినా ఫైనల్‌ ‘కీ’లు విడుదల కాలేదు. మిగతా వాటికి ప్రాథమిక ‘కీ’నే విడుదల చేయలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement