సాక్షి, అమరావతి: డీఎస్సీ–2024లో ప్రతి అంశంలోను పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని, అభ్యర్థులకు ఎటువంటి గందరగోళం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులకు నష్టం జరగకుండా జీవో నం.77 ప్రకారం రోస్టర్ పాయింట్లు చూపించామని చెప్పారు. ప్రస్తుత డీఎస్సీని 2018 డీఎస్సీ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తు నుంచి పరీక్ష వరకు అప్పటి నిబంధనలే ఉంటాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ ‘ఈనాడు’ పత్రిక డీఎస్సీ అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టేలా కథనం ప్రచురించిందన్నారు.
రోస్టర్ విధానం తెలియకుండా ఆ పత్రిక ప్రచురించిన కథనం డీఎస్సీ అభ్యర్థులను ఆందోళనకు గురిచేసేలా ఉందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన జీవో 77 ప్రకారం అన్ని రోస్టర్లను చూపించామని, కానీ, బ్యాక్‌లాగ్ పోస్టుల విషయంలో ఆ సంవత్సరం రిక్రూట్‌మెంట్ రోస్టర్లను అలాగే కొనసాగించాలని అన్నారు. జీవో ప్రకారం పాయింట్లు ప్రోస్పెక్టివ్‌గానే ఉంటాయిగానీ, రెట్రోస్పెక్టివ్‌గా ఉండదని చెప్పారు. ఆయన చెప్పిన వివరాలివీ..
♦ మొదటి దరఖాస్తుదారులకు ఈడబ్లు్యఎస్ కోటా కనిపించలేదనడంలోనూ వాస్తవం లేదు. దరఖాస్తులు ప్రారంభమైన తేదీ నుంచే ఆప్షన్‌లో ఈడబ్లు్యఎస్ కోటా ఉంది. ఈనాడులో రాసింది తప్పు.
♦ పరీక్ష ఫీజుపైనా తప్పుగా రాశారు. వాస్తవానికి అభ్యర్థి అప్లికేషన్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా 2018 డీఎస్సీ నిబంధనే.
♦ స్థానికేతర అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకున్న సమయంలో స్థానికేతర ఆప్షన్ (ఓపెన్) ఇవ్వవచ్చు. ఒకసారి ఈ ఆప్షన్ ఎంచుకుని దరఖాస్తు చేసుకుంటే అభ్యర్థి నియామకం కూడా ఎంచుకున్న జిల్లాకే పరిమితం అవుతుంది. ఇదే విధానం జోనల్ పోస్టులకూ వర్తిస్తుంది. అలాగే దరఖాస్తు చేసుకోవాలి.
♦ డీఎస్సీ వెబ్‌సైట్‌కు సర్వర్ సమస్య ఎప్పుడూ లేదు. ఇప్పటివరకు టెట్ – 2024కు 3,17,950 దరఖాస్తులు అందాయి. డీఎస్సీకి 3,19,176 మంది నమోదు చేసుకున్నారు. సర్వర్ సమస్య ఉంటే ఇంత మంది దరఖాస్తు చేసుకోలేరు. అభ్యర్థులు కొందరికి ఫీజు చెల్లించే సమయంలో ఇంటర్నెట్ సమస్య ఉత్పన్నమై ఉంటుంది. దరఖాస్తు అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించాం. ఎవరైనా ఫీజు చెల్లించి ‘జర్నల్ నంబర్’ రాకుంటే చెల్లించిన ఫీజు మొత్తం వారి బ్యాంకు ఖాతాలో ఐదు రోజుల్లో తిరిగి జమ అవుతుంది.
♦ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఫిబ్రవరి 12 నుంచే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. బుధవారం వరకు మొత్తం 2,40,119 మంది ఫీజు చెల్లించారు.
♦సెంటర్ టెట్ (సీటెట్) విషయంలో కొందరికి అవగాహన లేదు. వాస్తవానికి ఏపీ విద్యా శాఖ వద్ద సీటెట్ డేటాబేస్ ఉండదు. సీటెట్ అభ్యర్థులు మొత్తం మార్కులు, గరిష్ట మార్కులను వారే స్వయంగా నమోదు చేయాలి. ఏపీ టెట్ అభ్యర్థులు మాత్రం హాల్ టికెట్ నంబరు నమోదు చేస్తే సరిపోతుంది.
అభ్యర్థులకు ఎడిట్ అవకాశం
దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ లేకండా 30 వేల మంది అవస్థలు పడుతున్నారని అనడం కూడా సరికాదు. దరఖాస్తు సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పులు జరిగితే సవరించే అవకాశం లేదని బులెటిన్‌లోనే పేర్కొన్నాం. కానీ అభ్యర్థుల సమస్యను దృష్టిలో ఉంచుకుని అప్లికేషన్‌ను ఎడిట్ చేసుకొనే అవకాశం కల్పించాం. అభ్యర్థులు మొదట వెబ్‌సైట్‌లో డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాలి.
పాత జర్నల్ నంబర్, మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ పొందవచ్చు. దీనిద్వారా ఎలాంటి రుసుం చెల్లించకుండా తప్పులు సరిదిద్దుకుని తిరిగి అప్లై చేసుకోవచ్చు. ఇందులో అభ్యర్థి పేరు, ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అన్ని అంశాలూ ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ తప్పుగా ఉంటే పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్స్‌లో సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకునే అవకాశం ఉందని సురేష్ కుమార్ తెలిపారు.
25 వరకు ఫీజు చెల్లింపు గడువు
డీఎస్సీ అభ్యర్థులు ఫీజు చెల్లించే గడువును పెంచినట్టు పాఠశాల కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈనెల 25వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని, ఈ ఆవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే, హెల్ప్ డెస్క్ సమయాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment