పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడి
సాక్షి, అమరావతి: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (టెట్) ఫలితాల ప్రకటన, డీఎస్సీ–2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు.
తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్నా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సెట్ ఫలితాలు ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటు డీఎస్సీ నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్‌లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
కానీ ఈ విషయం తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్, డీఎస్సీని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51 వేల మంది ఎస్‌టీజీ పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment