
వేటకు వెళ్లే మత్స్యకారులకు సంక్షేమ పథకాలు కట్
వేట నిషేధ భృతికి జారీ చేసిన మెమోలె తేల్చి చెప్పిన ప్రభుత్వం.. మండిపడుతున్న మత్స్యకార సంఘాలు
ఆందోళనకు సిద్ధమన్న మత్స్యకార సంఘాల సమాఖ్య
సాక్షి, అమరావతి: గంగపుత్రులకు తీరని అన్యాయం చేసేలా టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రకు తెరతీసింది. వేట నిషేధ భృతి పొందేవారు ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులని తేల్చి చెప్పింది. పథకం అమలు కోసం జిల్లా మత్స్యశాఖ అధికారులకు జారీ చేసిన మెమోలో ఈ మేరకు స్పష్టం చేయడంతో ఇదెక్కడి న్యాయమంటూ మత్స్యకారులు మండిపడుతున్నారు. వేట నిషేధ భృతి తమ హక్కు అని, దీన్ని అడ్డం పెట్టుకుని సంక్షేమ పథకాలకు కోత పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
ఐదేళ్లూ.. ఆంక్షలు లేకుండా అమలు
మత్స్య సంపద వృద్ధి కోసం ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజుల పాటు ప్రభుత్వం సముద్రంలో చేపల వేటపై నిషేధం విధిస్తోంది. ఈ దృష్ట్యా జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాల పోషణ కోసం పరిహారం ఇవ్వడం పరిపాటి. గతంలో రూ.4 వేలు ఉన్న భృతిని రూ.10 వేలకు పెంచిన వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఐదేళ్ల పాటు మత్స్యకారులకు అందించింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఐదేళ్ల పాటు 5.38 లక్షల మందికి రూ.538 కోట్ల లబ్ధి చేకూర్చింది. వేట నిషేధ భృతి పొందిన వారికి అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరాతో పాటు ఇతర సంక్షేమ పథకాలన్నీ వర్తింపచేశారు.
భృతి పొందితే సంక్షేమ పథకాలకు అనర్హులే
తాము అధికారంలోకి వస్తే ఈ భృతిని రూ.20 వేలకు పెంచి ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం తొలి ఏడాది అటకెక్కించేసింది. ఇటీవలే వేట నిషేధం అమలులోకి రాగా.. ఈ ఏడాదైనా ఇస్తారో లేదో అనే సందేహం మత్స్యకారుల్లో వ్యక్తమవుతున్న తరుణంలో ఈ నెల 26న వేట నిషేధ భృతి జమ చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు.
రెండ్రోజులు తిరక్కుండానే దాన్ని వాయిదా వేసి మే నెలలోనే అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మత్స్యశాఖ అధికారులకు జారీ చేసిన మెమోలో ఈ పథకం అమలు కోసం విధించిన నిబంధనలు మత్స్యకార కుటుంబాల పాలిట ఆశనిపాతంగా మారాయి. కుటుంబంలో ఒకరికి మాత్రమే వేట నిషేధ భృతి ఇస్తామని, అంతేకాకుండా వేట నిషేధ భృతి పొందేవారు ఇతర డీబీటీ స్కీమ్స్ పొందేందుకు అనర్హులని మెమోలో ప్రభుత్వం స్పష్టం చేసింది.
సూపర్ సిక్స్‌తో సహా ఎన్నికల్లో ఇచ్చిన డీబీటీ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయని కూటమి ప్రభుత్వం ఈ భృతి పొందే వారు ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్విద్యోన్నతితో పాటు ఎన్టీఆర్భరోసా పెన్షన్ కూడా పొందేందుకు అనర్హులుగా తేల్చింది.
300 యూనిట్ల విద్యుత్ వాడినా అనర్హులే
మరోవైపు వేట నిషేధ భృతి పొందేందుకు 60 ఏళ్ల పైబడిన వారు అనర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.44 లక్షలకు మించి ఆదాయం ఉండకూడదు. 3 ఎకరాలు మాగాణి, 10 ఎకరాల మెట్ట లేదా మెట్ట, మాగాణి కలిపి 10 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. వేట నిషేధ భృతి పొందే మత్స్యకార కుటుంబంలో ఏ ఒక్కరూ ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో వంటివి కూడా కలిగి ఉండకూడదు. ఏడాదిలో సగటున నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగం ఉండకూడదు.
పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల్లో సొంత ఇంటిని కలిగి ఉండకూడదు. కుటుంబంలో ఏ ఒక్కరూ ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల ఉద్యోగి అయి ఉండకూడదు. పూర్తిస్థాయి వేతనంతో సొసైటీలు, ఫెడరేషన్స్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అయి ఉండకూడదు. ఎలాంటి ప్రభుత్వ పెన్షన్‌దారుడు కుటుంబంలో ఉండకూడదు. ఇన్‌కం టాక్స్ పన్ను చెల్లింపుదారులు కూడా ఉండకూడదు.
సంక్షేమ పథకాలకు అనర్హులనడం దారుణం
వేట నిషేధ భృతిని తొలి ఏడాది ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం ఈ ఏడాదైనా ఇస్తుందనుకుంటే మత్స్యకారుల నోట్లో మట్టికొట్టేలా నిబంధనలు విధించింది. గతంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా మత్స్యకార భరోసా అందజేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకార భృతికి కోత పెట్టేలా ఆంక్షలు విధించింది. ఈ భృతి పొందేవారు ఇంకా అమలుకు నోచుకోని ఇతర సంక్షేమ పథకాలకు అనర్హులని తేల్చడం విడ్డూరంగా ఉంది. ఆంక్షలు సడలించకపోతే ఉద్యమం చేస్తాం. – అర్జిల్లి దాసు, ప్రధాన కార్యదర్శి, జాతీయ మత్స్యకారుల సంఘాల సమాఖ్య