భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రభుత్వ ప్రాధాన్యం ప్రజల సంక్షేమమేనని చాలా స్పష్టంగా పేర్కొంటున్నాయి. అణగారిన వర్గాలు ఉన్నతస్థాయికి చేరుకొనేందుకు ప్రజలందరికీ కులమత, వర్గ రహితంగా చదువుకొనే అవకాశాలను కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించింది. పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ, మాతాశిశు సంరక్షణలను ప్రాధాన్యంగా స్వీకరించి, వాటికి అనుగుణమైన కార్యక్రమాలు అమలు చేయా లని సూచించింది.
రాజ్యాంగానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మొదటి నుంచి పేద వర్గాలకు, అట్టడుగు ప్రజానీకానికి పలు వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద ప్రజల మన్ననలు పొందుతోంది. దీన్ని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం జీర్ణించుకోలేకపోతోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిన తెలుగు దేశం పార్టీ... నేటి ప్రభుత్వం ప్రజాధనాన్ని పప్పుబెల్లాల్లా పంచుతోందని దుష్ప్రచారం సాగిస్తూ... పేద వర్గాలకు అందుతున్న రాయితీలను, సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నది.
పన్ను చెల్లింపుదారుల సొమ్మును పేద వర్గాలకు దోచి పెడుతున్నారన్న అడ్డగోలు వాదనను తారస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ప్రజలలో ప్రతి ఒక్కరూ పన్ను చెల్లింపుదారులే! అత్యధికశాతం ప్రజలు పరోక్ష పన్నులు చెల్లిస్తుంటారు. జనాభాలో ప్రత్యక్ష పన్ను చెల్లించేవారి శాతం చాలా తక్కువ. నిత్యావసర వస్తువులు మొదలుకొని దైనందిన జీవితంలో అవసరమయ్యే ఏ వస్తువును కొనుగోలు చేసినా వాటిపై ఉండే పన్నులను ప్రజలు చెల్లించాల్సిందే! జనాభాలో అధికంగా ఉన్న పేద ప్రజలు పరోక్షంగా చెల్లించే పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎవరికి ఖర్చు చేయాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో రాష్ట్రంలో రైతులు అప్పులపాలై 10,000 మంది ఆత్మహత్య చేసుకొన్నారు.
బలన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి కొంత మొత్తాన్ని ఎక్స్‌గ్రేషియాగా చెల్లించాలని ఆనాటి ప్రతిపక్షాలు కోరితే ‘ఎక్స్‌గ్రేషియా ఇస్తే ప్రత్యేకంగా ఎక్స్‌గ్రేషియా కోసమే మరింత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటారు’ అంటూ రైతుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకొని పోయింది. వ్యవసాయరంగాన్ని నిరుత్సాహ పర్చి, సేవల రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సేవల రంగానికే భవిష్యత్తు ఉందని వ్యవసాయం దండుగమారిది అన్న విధానాన్ని పాటించడంతో ఉపాధి కోల్పోయిన గ్రామీణ ప్రాంత ప్రజలు పొట్టచేత పట్టుకొని పక్క రాష్ట్రాలకు వలసబాట పట్టారు. ఉచిత కరెంటు ఇవ్వకపోగా, కరెంట్ చార్జీలు పెంచారు. తగ్గించమంటే ప్రజలను గుర్రాలతో తొక్కించి చంపారు. (చదవండి: రెండు నాల్కలు-పొల్లు మాటలు)
ఇంజనీరింగ్ కాలేజీలను ఇబ్బడిముబ్బడిగా స్థాపించి అధిక ఫీజులు, డొనేషన్లు నిర్ణయించి పేదలకు ఆ విద్యను దూరం చేశారు. ఈ దుఃస్థితి నుంచి సామాన్య వర్గాలను కాపాడాలనే ఉద్దేశంతో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రారంభించారు. ఆ కారణంగానే పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన యువతకు ఉన్నత విద్యనభ్యసించే అవకాశం లభించింది. ఫలితంగా పేద వర్గాల కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది.
విద్యతోపాటు ఆరోగ్య రంగాన్ని కూడా పూర్తిగా ప్రైవేటుపరం చేసిన ఘనత బాబుదే! కార్పొరేట్ ఆసు పత్రుల సంస్కృతిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసి... ప్రభుత్వ రంగంలోని వైద్య ఆరోగ్య సేవలను గాలికి వదిలేశారు. 2004లో వైఎస్సార్ సీఎం అయిన తర్వాత ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పేదల పాలిట కల్పతరువుగా మారింది. లక్షలమంది పేదలు గుండె ఆపరేషన్లతో సహా ఖర్చులతో కూడుకొన్న అనేక జబ్బులను ఖర్చు లేకుండా నయం చేసుకోగలిగారు. ఆరోగ్యశ్రీతోపాటు ఆనాడు ప్రవేశపెట్టిన 104, 108 వంటి సేవలతో రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు ప్రభుత్వ వైద్య సేవల్ని విస్తరించి సామాన్య ప్రజల జీవితాల్లో భరోసా నింపారు.
సంపద పెంచానంటూ అసత్యాలు చెప్పడం ద్వారా చంద్రబాబునాయుడు సెల్ఫ్‌గోల్ చేసుకొన్నట్లయింది. కారణం చంద్రబాబు పాలనలో రైతుల ఆదాయం పెరగ లేదు సరికదా... మరింత అప్పుల్లో కూరుకొనిపోయారు. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఆదుకోకుండా నిరాశకు గురిచేశారు. విద్యార్థుల, యువతీ యువకుల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. పేదలకు అందించే సబ్సిడీల్లో కోత పెట్టారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదించాలంటూ... వేలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులను కూడా అలాగే గాలికి వదిలేశారు. ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులను అనేక వేధింపులకు గురిచేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే... చంద్రబాబు పాలనలో ఎవరికి మేలు జరిగినట్లు? ఆయన పెంచానని చెప్పుకొనే సంపద ఎవరి జేబుల్లోకి వెళ్లింది? (చదవండి: చెప్పేటందుకే చంద్రబాబు నీతులు...)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ తప్పుల్ని వెతుకుతున్నారు, వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. రైతులకు రైతుభరోసా కింద ఆర్థిక సాయం చేయడం, పేదలకు ఉచితంగా 32 లక్షల ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం, వాటిలో ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం దోహదం చేయడం, మధ్యతరగతి వర్గాలకు జగనన్న ఇండ్ల కాలనీల పథకం ప్రవేశపెట్టడం... ఇలా పేద వర్గాల అభ్యున్నతికి ప్రవేశ పెట్టిన ప్రతి పథకం ప్రతిపక్షానికి కంటగింపుగా తయాౖ రెంది. కంటి మీద కునుకులేకుండా చేస్తున్నది. సాధికారతే పరమావధిగా పరిపాలన సాగిస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రజల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. భవిష్యత్తు లోనూ దీర్ఘకాలం ఉంటాయనేది నేటి వాస్తవం! (చదవండి: పనిమంతుడికి అక్కర్లేదు ప్రచారం)
- డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment