మునిరత్నం నిర్మించుకున్న భారీ భవంతి
సాక్షి, కుప్పం : అధికార పార్టీలో నేతలే భార్య పేరు మీద రేషన్ కార్డు పొందడమే కాకుండా, మరుగుదొడ్లు నిర్మించుకున్నట్లు బిల్లులు చూపి వేల రూపాయలు పొందుతున్నారు. నేతలే అక్రమాలకు పాల్పడితే ఇక క్షేత్రస్థాయి నాయకులు ఏ మేరకు అక్రమాలు చేస్తారో స్పష్టంగా తెలుస్తోంది. నాలుగు మండలాల టీడీపీ ఇన్‌చార్జ్, రెస్కో సంస్థ చైర్మన్ పీఎస్ మునిరత్నం. ఆయనకు పట్టణం లోని ఆర్‌వీఎం వీధిలో మూడంతస్తుల భవనం ఉంది.
స్వగ్రామం కంగుందిలో వందల ఎకరాల భూస్వామి. పి.ఎస్.మునిరత్నం భార్య పేరు మీద కలైసెల్వి పేరుమీదుగా WAP106600901213 నెంబరుతో రేషన్ కార్డును పొందారు. ఈ కార్డు పట్టణంలోని 9వ రేషన్ షాపులో ఉన్నట్లు సమాచారం. కాగా, బ్రహ్మదేవర్లచేనులో స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్లు నిర్మించినట్లు బిల్లులు డ్రా చేశారు. పట్టణంలోని కెనరా బ్యాంకులో అకౌంటు నెం.2714101001401 కింద 2016 జూన్‌లో మొదటి బిల్లుగా రూ.6వేలు పొందారు.
ఆగస్టు 2016న రూ.9 వేల బిల్లును పొందారు. ప్రస్తుతం రేషన్ కార్డు ద్వారా ఎలాంటి పథకాలు పొందడం లేదు. బడుగు, బలహీన వర్గాల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే అధికార పార్టీలో నేతలకే పరిమితమైందని చెప్పడానికి ఇదే నిదర్శనం. పట్టణంలో ఉన్న రేషన్ కార్డుతో మారుమూల ప్రాంతం అటవీ గ్రామమైన బ్రహ్మదేవరచేన్లులో కేవలం రూ.15 వేల మరుగుదొడ్ల బిల్లును నియోజకవర్గ ఇన్‌చార్జ్ పొందడం దారుణంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment