అందరివాడికే అందలం | Ap voters are once again ready to make Jagan CM | Sakshi
Sakshi News home page

అందరివాడికే అందలం

Published Sat, May 11 2024 4:37 AM | Last Updated on Sat, May 11 2024 4:37 AM

Ap voters are once again ready to make Jagan CM

తన వల్ల మేలు జరిగిందీ అంటేనే ఓటేయండి అని జగన్‌ అడిగిన తీరు ఎన్నడూ కననిదీ, విననిదీ. బహుశా దేశంలోనే ఏ నాయకుడు కూడా ఇంత ఆత్మవిశ్వాసంతో సూటిగా అడిగి ఉండరు. అన్ని వర్గాల ప్రజలూ వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులే అన్నది ఈ విశ్వాసానికి కారణం. దానికి రుజువే ఎన్నికల ప్రచారంలో ఆయనకు లభిస్తున్న అమితమైన ఆదరణ! ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు మరోసారి ఆయన్ని అధికార పీఠం ఎక్కించడానికి ‘సిద్ధం’గా ఉన్నారని దీన్నిబట్టి అర్థమవుతోంది.

‘కాణి’ ముత్యాలు ఇంటికే – మళ్లీ పట్టం జగన్‌కే!
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మరోమారు విస్పష్టంగా జగన్‌మోహన్‌ రెడ్డికి అధికారం ఇవ్వనున్నారు. ఇది తెలుసుకోవడానికి ‘సర్వేశ్వరులను’ అడగనవసరం లేదు. గతంలో సర్వేలన్నీ సుప్రసిద్ధ మీడియా సంస్థలు నిర్వహించేవి. ఇప్పుడు ఎవరికి నచ్చిన విధంగా వారు సర్వేలు చేయించుకుంటూ ‘స్వింగ్‌’ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన దగ్గర నుంచి ఇటు వైసీపీ, అటు కూటమి ప్రచార సరళి, అభ్యర్థుల ఎంపిక, ప్రజాస్పందన నిశితంగా పరిశీలిస్తే, తీర్పు ఎలా ఉండబోతోందో మనకే అర్థమవుతుంది.

జగన్‌ అన్ని పార్టీల కంటే ముందుగానే విడతల వారీగా అభ్యర్థులను  ప్రకటించారు. టీడీపీ, జనసేన అవగాహన కుదుర్చుకున్నా, చివరి వరకూ బీజేపీ జత కడుతుందో లేదో తెలియని సందిగ్ధం. అందుకే చాలాచోట్ల ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించేసుకున్నారు. తీరా బీజేపీ వచ్చి చేరాక, మళ్ళీ అభ్యర్థుల ప్రకటనలో కుస్తీ పట్టాల్సి వచ్చింది. ఆశించిన స్థాయిలో కాక అతి తక్కువ సీట్లు జనసేన తీసుకోవడం, బీజేపీ పూర్వ అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా సిసలైన బీజేపీ వారికి టికెట్లు దక్కకపోవడం వంటివి లుకలుకలకు కారణమయ్యాయి. పేరుకే మూడు పార్టీల జెండాలు. జన శ్రేణులు మాత్రం కలిసి పనిచేసే పరిస్థితి చాలా చోట్ల లేకుండా పోయింది.

పోనీ నిలబెట్టిన టీడీపీ అభ్యర్థుల్లో ఆణిముత్యాల లాంటి వారు ఉన్నారా అంటే, అబ్బే! చాలావరకు కాణి ముత్యాలే! ఇంచుమించు చంద్రబాబు మహా దోపిడీలో భాగస్వాములు లేదా ఆ దోపిడీ నుంచి స్ఫూర్తి పొందినవారే. ఇటు బెజవాడ దుర్గమ్మ, అటు విశాఖ కనకమహాలక్ష్మి, ఆ పక్క అనకాపల్లి నూకాలమ్మ సాక్షిగా వీరంతా కాణి ముత్యాలు. ఇలాంటివాళ్లే చంద్రబాబుకు కావాలి. టిప్పర్‌ డ్రైవర్లు, కమతగాళ్లు అంటే ఆయనకు అసహ్యం. ఈ బాపతు కాణి ముత్యాల్ని జనం ఆదరించరని చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే వీళ్ళు ఎక్కువగా ‘బ్యాక్‌ డోర్‌ పాలిటిక్స్‌’ నడుపుతుంటారు.

ఇక ప్రచార తీరు పరిశీలిస్తే, తన వల్ల మేలు జరిగిందీ అంటేనే ఓటేయండి అని జగన్‌ అడిగిన తీరు... బహుశా దేశంలోనే ఏ నాయకుడు ఇంత ఆత్మ విశ్వాసంతో సూటిగా అడిగి ఉండరు. ఆయన ప్రచారాస్త్రాలు కూడా విలక్షణంగా ఉన్నాయని చెప్పాలి. ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా విమర్శలకే పరిమితమయ్యారు తప్ప స్థాయి మరచి తిట్లులంకించుకోలేదు, హుందాతనాన్ని కోల్పోలేదు. మరి కూటమి విషయానికొస్తే– వెకిలితనం, బూతు పురాణం, కొట్టండి, చంపండి, నరకండి అని జనాల్ని ప్రేరేపించటం సభ్య సమాజాన్ని విస్తుపరిచాయి.

 జగన్‌పై విసిరిన రాయి దాడిని ఖండించాల్సింది పోయి ‘గులక రాయి’ అని వెకిలితనాన్ని ప్రదర్శించటం, వలంటరీ వ్యవస్థను కట్టడి చేయడం, పండు టాకుల, పుండు రెక్కలపై ఆక్రోశం వెలిబుచ్చి వాళ్ళ చావుకి కారణం కావడం, లేని భూయాజమాన్య హక్కు చట్టంపై దుష్ప్రచారానికి పూనుకోవడం వంటివి అన్నీ బూమరాంగ్‌ ఆయ్యాయి. అయితే జగన్‌ పని అయిపోయింది, ఇక తామే అధికారంలోకి వస్తున్నామనే ఫేక్‌ సర్వేలలో మాత్రం ముందున్నారు. 

రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 13 లక్షలు. ఇందులో అర్బన్‌ ఓటర్లు కేవలం 87 లక్షలు. జగన్‌కు పెట్టని కోటల వంటి గ్రామీణ ఓటర్ల సంఖ్య 3 కోట్ల 20 లక్షలు. అందులో సంక్షేమ పథకాల లబ్ధిదారులే అధికం. ఇక కులాల ప్రాతిపదికగా చూస్తే... ఎస్సీలు 35 లక్షల 46 వేల 748, ఎస్టీలు 25 లక్షల 85 వేల 726, ముస్లింలు 23 లక్షల 84 వేల 449, బీసీ యాదవులు 25 లక్షలు, మత్స్యకారులు 15 లక్షల 74 వేల 868, గౌడలు 19 లక్షల 78 వేల 866,చంద్రబాబు చేత తీవ్ర అవమానాలకు గురైన రజకులు, నాయీ బ్రాహ్మణులు 8 లక్షల 41 వేల 400+ 4 లక్షల 15 వేల 520, బ్రాహ్మణులు 7 లక్షల 4 వేల 165. క్రైస్తవులు 3 లక్షల 15 వేల 320... ఈ సామాజిక వర్గాలలో అత్యధికులు జగన్‌ వైపే ఉన్నారు. 

అధిక శాతం ఉన్న మరొక వర్గం, గోదావరి జిల్లాల్లో నిర్ణయాత్మక శక్తి అని చెబుతున్న కాపులు, రాయలసీమలోని బలిజలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ప్రాంతాల్లో ప్రధానంగా, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులు, ఒంటరులు మొత్తం 52 లక్షల 97 వేల 748 మంది. వీరిలో జనసేన వైపు ఆశగా చూసి భంగపడిన వారు, చంద్రబాబు సామాజిక వర్గంతో దశాబ్దాల వ్యతిరేకత ఉన్నవారు, వైసీపీలోని కాపు నాయకుల వెంట ఉన్నవారు... ఇలా భిన్నాభిప్రాయాలతో అటూ ఇటూ ఉంటారు. 

ఇక రెడ్డి వర్గంలోని 26 లక్షల 748 మందిలో అధికులు జగన్‌ వైపు ఉండగా, కమ్మ వర్గంలోని 26 లక్షల 46 వేల 748 మందిలో అత్యధికులు చంద్రబాబు వైపు ఉంటారు. ఇతర బీసీలు, 13 లక్షల పైచిలుకు ఉన్న వైశ్యులు ఆయా ప్రాంతాల పార్టీ అభ్యర్థుల ప్రాతిపదికన రెండు వైపులా చీలతారు. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలలో అధిక శాతం వైసీపీ వైపే ఉన్నారు. గెలుపును నిర్ణయించే మరో శక్తి, నారీ శక్తి. అలాంటి మహిళలు జగన్‌ వైపే ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. దీనిని బట్టి, ‘మళ్లీ పట్టం జగన్‌కే – కాణి ముత్యాలు ఇంటికే!’
_వ్యాసకర్త పూర్వ సంపాదకుడు
- పి. విజయబాబు

ముస్లింలు బీజేపీని ఓడించాలి – వైసీపీని గెలిపించాలి!
ప్రధాని నరేంద్ర మోదీజీ, బీజేపీల నాయకత్వంలో పదేళ్ళుగా కేంద్రంలో అధికా రంలో వున్న ఎన్డీయే ప్రభుత్వం దేశ సంపదను అస్మదీయ కార్పొరేట్లకు కట్టబెడు తున్నది. ఒకవైపు భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానంటూనే మరోవైపు దేశ ప్రజల్ని పేదరికం లోనికి నెట్టి వేస్తున్నది. దేశ ప్రజలంటే 80 శాతం హిందువులు, 14 శాతం ముస్లింలు, 6 శాతం క్రైస్తవులు, సిక్కులు, తదిత రులు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన హ్యాపీనెస్‌ రిపోర్టులో భారతదేశం 126వ స్థానంలో వుంది. భారత ప్రజలు సంతోషంగా లేరు. 

అణిచివేతకు గురవుతున్న ప్రతి ఆరుగురిలో ఒకరు మాత్రమే ముస్లిం, ఐదుగురు హిందువులు. దీని అర్థం ఏమంటే మోదీ పాలనకు ప్రధాన బాధితులు హిందువులు. ఈ వాస్తవాన్ని కప్పి పుచ్చడానికి, హిందూ–ముస్లింల మధ్య తగువుపెట్టి ఎన్నికల్ని ఒక మత యుద్ధంగా మార్చడానికిస్వయంగా మోదీజీ నడుం బిగించారు. 2019 లోక్‌ సభ ఎన్నికల్ని ఆ పార్టీ 1761 నాటి పానిపట్టుయుద్ధంతో పోల్చేది. ఆ యుద్ధంలో అహ్మద్‌ షా అబ్దాలీ దుర్రానీ చేతుల్లో పీష్వా బాలాజీ బాజీరావు ఓడిపోవడంతో హిందువులు 250 ఏళ్లు అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేసి, మళ్ళీ అలాంటి దుఃస్థితి వస్తుందని భయపెట్టింది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్ని ఔరంగజేబ్, శివాజీ మహారాజ్‌ల మధ్య పోరాటంగా ప్రచారం చేసింది. గతేడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో టిప్పూ సుల్తాన్‌కు ఓటేస్తారా? రాణి అబ్బక్కకు ఓటేస్తారా? అని అడిగింది.

వివిధ రాష్ట్రాలు విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి హిందూ సమా జంలోని కింది కులాలకు కేటాయిస్తామని బీజేపీ చెపుతున్నది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని విస్తారంగా ప్రచారం చేశారు. ఆ రెండు రాష్ట్రాల ప్రజలూ ఈ మాటల్ని నమ్మలేదు. మత ప్రాతి పదికన రిజర్వేషన్లను బీజేపీ ఆమోదించదని మరో బూటకపు ప్రచారాన్ని ప్రధాని సాగిస్తున్నారు. నిజానికి మత ప్రాతిపదికనే కులాలుంటాయి. భారత రాజ్యాంగం కొన్ని సమూహాలకు ఇచ్చిన రిజర్వేషన్లు వాస్తవా నికి మత రిజర్వేషన్లే. మాల సామాజిక వర్గానికిచెందిన ఒక వ్యక్తి తాను హిందువుననిగానీ, సిక్కును అనిగానీ ప్రకటించుకుంటేనే ఎస్సీ రిజర్వేషను పొందు తాడు. 

క్రైస్తవుడినని ప్రకటించుకుంటే బీసీ రిజర్వేషను పొందుతాడు. ఏమిటి దీనర్థం? బీజేపీ ముస్లిం రిజర్వేషన్‌గా ప్రచారం చేస్తున్నది కూడా నిజానికి ముస్లిం రిజర్వేషన్‌ కాదు. ముస్లిం సమాజంలో ఓసీలుగా పరిగణించే సయ్యద్, పఠాన్, మొఘల్, బేగ్‌లకు బీసీ రిజర్వేషన్‌ వర్తించదు. మహా అయితే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన సమూహాల (ఇడబ్ల్యూఎస్‌) కోటాలో లబ్ధి పొందవచ్చు. ముస్లింలను సాంస్కృతిక రంగంలో వివక్షకు గురి చేయడం, ఆర్థిక రంగంలో అతి క్రూరంగా బుల్‌ డోజర్లతో కూల్చి వేయడం బీజేపీ విధానంగా మారింది. 

ఏపీలో ప్రధాన పోటీదారులు అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్‌ మొదటి నుండీ మత సామరస్యవాదుల నేల, సామ్యవాదుల భూమి. మతవిద్వేషాన్ని రగిల్చితే తప్ప రాజకీయ మనుగడ సాగించలేని బీజేపీ ఈ నేల మీద తనంత తానుగా మొలకెత్తలేని విత్తనం. 2019 ఎన్నికల్లో విడిగా పోటీచేస్తే బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడ రాలేదు. లోక్‌ సభ, అసెంబ్లీల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. 

జాతీయ స్థాయిలో ఎన్డీయేకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఇండియా కూటమి మాత్రమే. ఏపీ ముస్లింలు ఈసారి ఒక లెక్క ప్రకారం కాంగ్రెస్‌కు మద్దతు పలకాలి. అయితే, కర్ణాటక, తెలంగాణాల్లా ఏపీలో కాంగ్రెస్‌ నిర్మాణం బలంగా లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ఎంచుకున్న  ప్రాధాన్య తల్ని ఆ పార్టీ ఏపీ నాయకులు పట్టించుకుంటున్నట్టు లేదు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకు బీజేపీని ఓడించాలనే పట్టుదల వున్నట్టు లేదు. కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఇండియా కూటమిని గెలిపించాలా? బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించాలా? అనేది ఏపీ ముస్లింల ముందున్న ప్రశ్న. 

రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసమో, మరో కారణాలతోనో వైసీపీ జగన్‌ ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న ఎన్డీయేతో సఖ్యంగా వున్నారు. ఇప్పుడు ఆయనే ఏపీ నేల మీద బీజేపీని ఎదుర్కోవాల్సిన స్థితిలో పడ్డారు. ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసేలోగా బీజేపీ, జగన్‌ల మధ్య పోరు మరింత వుధృతం అవుతుంది. భారత జాతీయ కాంగ్రెస్సా? వైఎస్సార్‌ కాంగ్రెస్సా? అనే ప్రశ్న మళ్ళా ముస్లింల ముందుకు వచ్చి నిలిచింది. ఇది రాజకీయ సమస్య మాత్రమే కాదు. ఒక విధంగా నైతిక సమస్య కూడా.

 ఆంధ్రప్రదేశ్‌ భౌతిక రాజకీయ సమీకరణలు, కాంగ్రెస్‌ ఏపీ యూనిట్‌ వాస్తవిక బలాబలాలు, పనితీరుల్ని పరిగణన లోనికి తీసుకుంటే ముస్లింలు వైసీపీకి మద్దతు ఇవ్వడమే మెరుగైన నిర్ణయం అవుతుంది. అది అవసరం కూడా. ఇటీవల విజయవాడలో ముస్లిం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (ముస్లిం జేఏసీ), ముస్లిం ఆలోచనాపరుల వేదిక(ఎంటీఎఫ్‌) సంయుక్తంగా నిర్వహించిన ముస్లిం ఉలేమాలు, ఆలోచనాపరులు, అడ్వకేట్లు, డాక్టర్లు, ప్రొఫె షనల్స్‌తో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం కూడా ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. 
-వ్యాసకర్త ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటీఎఫ్‌) కన్వీనర్‌
-ఏఎం ఖాన్‌యజ్దానీ డానీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement