47 వేల పోలింగ్ బూత్‌ల పరిధిలో ‘జగన్ కోసం సిద్ధం’ పేరుతో ఇంటింటా ప్రచారానికి శ్రీకారం
ప్రచారంలో పాల్గొన్న 4.70 లక్షల మందికి పైగా బూత్ కన్వినర్లు, కమిటీ సభ్యులు
ప్రభుత్వంవల్ల మంచి జరిగి ఉంటే మీరే స్టార్ క్యాంపెయినర్లు కావాలని సీఎం జగన్ పిలుపు
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రచారంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు దూసుకెళ్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు జనం సునామీలా పోటెత్తుతూ నీరాజనాలు పలుకుతుంటే.. కూటమి ప్రధానంగా టీడీపీ, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రచారానికి జనస్పందన కన్పించడంలేదు. కానీ, ఇంటింటా ప్రచారాన్ని నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతుంటే.. కూటమి అభ్యర్థుల ప్రచారానికి ప్రజా స్పందన లభించడంలేదు.
ఇది కూటమి కార్యకర్తలను నైరాశ్యానికి గురిచేస్తే.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని నింపాయి. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి ‘జగన్ కోసం సిద్ధం’ పేరుతో ఇంటింటా ప్రచారానికి పార్టీ శ్రేణులు శ్రీకారం చుట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 శాసనసభ స్థానాల్లోని 47 వేల పోలింగ్ బూత్‌ల పరిధిలో బూత్ కమిటీల కన్వినర్లు, అందులోని సభ్యులు మొత్తం కలిపి 4.70 లక్షల మంది ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ సీఎం వైఎస్ జగన్ అమలుచేశారని వివరిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వివరిస్తూ.. నవరత్నాలు ప్లస్ ద్వారా పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా చేసేందుకు సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను వివరించారు. ‘మీ బిడ్డ ప్రభుత్వంవల్ల మీ ఇంట్లో మీకు మేలు జరిగి ఉంటే.. మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి.. స్టార్ క్యాంపెయినర్లుగా మారి ప్రభుత్వం చేసిన మంచిని వంద మందికి వివరించి, ప్రతి ఒక్కరితో ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేయించండి’ అని సీఎం జగన్ ఇచ్చిన పిలుపును గుర్తుచేస్తున్నారు.
ప్రజలు బ్రహ్మరథం
ఇదిలా ఉంటే.. తొలిరోజున స్వచ్ఛందంగా తొమ్మిది లక్షల మంది సీఎం జగన్‌కు, వైఎస్సార్‌సీపీకి స్టార్ క్యాంపెయినర్లుగా మారుతామని తమ పేర్లను నమోదు చేయించుకున్నారు. ప్రచారపర్వం ముగిసే వరకూ ‘జగన్ కోసం సిద్ధం’ పేరుతో ఇంటింటా ప్రచారాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిర్వహించనున్నాయి.
మద్యం సరఫరా, విక్రయాలపై నిరంతర నిఘా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిస్టిలరీలు, రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్‌కు చెందిన ఐఎంఎల్ మద్యం డిపోలు, మద్యం దుకాణాల్లోని మద్యాన్ని ఎన్నికల అక్రమాలకు వినియోగించకుండా ఎక్సైజ్ శాఖ పటిష్ట కార్యాచరణను అమలు చేస్తున్నది. అందుకోసం రాష్ట్రంలోని 37 డిస్టిలరీలు, 4 బ్రూవరీలలో తయారైన మద్యాన్ని 29 ఐఎంఎల్ డిపోలకు సరఫరా.. డిపోల నుంచి మద్యం దుకాణాలు, బార్లకు సరఫరా వరకు పటిష్ట నిఘాను ఏర్పాటు చేసింది.
మద్యం సరఫరా చేసే అన్ని వాహనాలను జీపీఎస్ ద్వారా పర్యవేక్షిస్తుంది. ఇక రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీలు, మద్యం డిపోలు, మద్యం దుకాణాల్లో 363 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కమాండ్‌కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి నిశితంగా పర్యవేక్షిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment