డీఎస్సీ అభ్యర్థులు ఆగాల్సిందే | DSC candidates must to be wait | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అభ్యర్థులు ఆగాల్సిందే

Published Thu, Apr 18 2019 4:04 AM | Last Updated on Thu, Apr 18 2019 4:04 AM

DSC candidates must to be wait - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ–2018 ఎంపికలు మరింత జాప్యం కానున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఎంపికల జాబితా విడుదల ఆలస్యమవుతోంది. ఇందుకు ఎన్నికల కోడ్‌ ఆటంకంగా మారింది.  ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాకే పోస్టుల భర్తీకి అవకాశం ఉంది. మే ఆఖరు నాటికి ఎంపిక ప్రక్రియను ముగించాలని పాఠశాల విద్యా శాఖాధికారులు ముందుగా ప్రణాళిక రూపొందించుకున్నా.. ఎన్నికల కోడ్‌ కారణంగా ప్రభుత్వం నుంచి జీవోల విడుదల నిలిచిపోవడంతో ప్రణాళిక అమలుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఎన్నికల కోడ్‌ మే ఆఖరు వరకు ఉండడంతో అప్పటివరకు జీవోలు వచ్చే అవకాశం లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. జూన్‌ లేదా ఆ తరువాత మాత్రమే డీఎస్సీ ఎంపికలు పూర్తిచేయడానికి వీలవుతుందని అధి కారులు పేర్కొంటున్నారు. 

సర్కారు జాప్యమే కారణం
ఎన్నికల షెడ్యూల్‌ వెలువడక ముందే డీఎస్సీ పరీక్షలు ముగియగా.. మెరిట్‌ జాబితాలు ప్రకటించారు. ఆ తరువాత ఎంపికల జాబితాలు రూపొందించి జిల్లాలకు పంపించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జీవో విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కానీ.. జీవో విడుదల చేయకుండా సర్కారు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. ఈలోగా అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించి, ఆ క్షణం నుంచే కోడ్‌ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో ప్రభుత్వం విధానపరమైన ఎలాంటి నిర్ణయాలపైనా ఉత్తర్వులు జారీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు ఎంతో సమయం ఉన్నా జీవో విడుదల చేయనందునే ఎంపిక   ప్రక్రియ పూర్తికాలేదు.

5.55 లక్షల మంది హాజరు
రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల భర్తీకి ఎన్నికలు వస్తున్నాయనగా ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయించింది. దాదాపు 30 వేల టీచర్‌  పోస్టులు ఖాళీగా ఉన్నా రెండేళ్లుగా నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఇదిగో... అదిగో అంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు నిరుద్యోగులను మభ్యపెడుతూ వచ్చారు. ఒకసారి 22 వేల ఖాళీలను భర్తీ చేస్తామని, మరోసారి 14 వేల పోస్టుల భర్తీ అని, ఇంకోసారి 12 వేల పోస్టుల భర్తీ అని ప్రకటనలు చేశారు. రెండుసార్లు డీఎస్సీ షెడ్యూల్స్‌ కూడా ప్రకటించారు. కానీ నిర్ణీత తేదీల్లో మాత్రం నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ఐదేళ్లలో పోస్టుల భర్తీ చేయకున్నా అభ్యర్థులకు రెండుసార్లు టెట్‌ నిర్వహించి భారీగా ఫీజులు దండుకున్నారు. చివరకు అక్టోబర్‌ 26న నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అనేక ఖాళీ పోస్టులున్నా.. కేవలం 7,902 పోస్టులు మాత్రమే ప్రకటించారు. పోస్టులకు అర్హతల నిర్ణయంలో గందరగోళం తలెత్తడం, సిలబస్‌ ఖరారు, పోస్టుల సంఖ్యలో మార్పులు వంటి కారణాలతో దరఖాస్తు గడువును, ఆప్షన్ల నమోదు గడువును పలుమార్లు పొడిగించారు.

చివరకు పరీక్షలను డిసెంబర్‌ 24 ప్రారంభించి, జనవరి 30 వరకు నిర్వహించారు. మొత్తం 6,08,155 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 5,89,165 మందికి హాల్‌టికెట్లు ఇచ్చారు. మొత్తంగా 5,55,047 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రాథమిక కీ, తుది కీ విడుదలలోనూ జాప్యం జరిగింది. పాఠశాల విద్యాశాఖ మెరిట్‌ జాబితాలను ప్రకటించే నాటికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాలేదు. జిల్లాల వారీగా ఎంపికల జాబితాలను సిద్ధం చేసినా జీవో కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. మార్చి 10న అమల్లోకి వచ్చిన కోడ్‌ ఏకంగా మే 27వ తేదీ వరకు కొనసాగనుంది. ఆ తరువాతే ప్రభుత్వం జీవో ఇవ్వాలి. కోడ్‌ ముగిసినా కొత్త ప్రభుత్వం కొలువు తీరడం వంటి కార్యక్రమాలు ఉండడం వల్ల జీవో ఱవెంటనే వచ్చే అవకాశాలు తక్కువేనని, జూన్‌లో లేదా ఆ తరువాత మాత్రమే అందుకు అవకాశముంటుందని అంటున్నారు. అంతవరకు నిరుద్యోగుల నిరీక్షణ తప్పదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement