Replacement of teacher posts
-
ముందు లిమిటెడ్.. తరువాత రెగ్యులర్ డీఎస్సీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల ప్రక్రియ ముగిసిన తరువాత టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ముందుగా బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి లిమిటెడ్ డీఎస్సీ నిర్వహించనున్నారు. గత డీఎస్సీల్లో మిగిలిపోయిన రిజర్వుడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం విద్యాశాఖకు మార్చిలోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కరోనా కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రస్తుత టీచర్ల బదిలీల ప్రక్రియ అనంతరం ‘లిమిటెడ్ డీఎస్సీ’ని నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా బ్యాక్లాగ్ పోస్టులను రోస్టర్ వారీగా కేటాయించి లిమిటెడ్ డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. లిమిటెడ్ డీఎస్సీకి 403 బ్యాక్లాగ్ పోస్టులను అధికారులు గుర్తించారు. ఈ లిమిటెడ్ డీఎస్సీ వల్ల ముందు ఆయా వర్గాల వారికి మేలు చేకూరనుంది. ఆ పోస్టులకు అర్హులైన ఆ కేటగిరీ అభ్యర్థులు లేకపోతే వాటిని జనరల్ కోటాలో తదుపరి డీఎస్సీలో భర్తీచేసే అవకాశాలున్నాయి. 2019 స్పెషల్ డీఎస్సీలో 78 పోస్టులు ఖాళీ 2019 స్పెషల్ డీఎస్సీలో మిగిలిన పోస్టులకు ప్రత్యే క నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అప్పట్లో 600కు పైగా పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగా 78 పోస్టులు మిగిలిపోయాయి. వాటి భర్తీకి ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇవి పూర్తయిన తరువాత రెగ్యులర్ డీఎస్సీకి చర్యలు తీసుకోనున్నారు. ఈ డీఎస్సీకి ముందుగా టీచర్ ఎలిజిబు లిటీ టెస్టు (టెట్) నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈసారి టెట్ సిలబస్‌లో మార్పులు చేస్తున్నారు. రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఈ కసరత్తు చేస్తోంది. టెట్ అనంతరం రెగ్యులర్ డీఎస్సీని నిర్వహించే అవకాశాలున్నాయ ని తెలిపారు. బదిలీలు పూర్తయితే ఈ డీఎస్సీకి ఎన్ని పోస్టులో తేలనుంది. 2020–21 విద్యాసంవత్సరం కోసం 8,700 కొత్త పోస్టులను నోటిఫై చేయాలని విద్యాశాఖ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చింది. ఇటీవల 2018 డీఎస్సీకి సంబంధించి మూడువేల ఎస్జీటీ పోస్టులను భర్తీచేశారు. ప్రస్తుత బదిలీల్లో గ్రామీణ ప్రాంత స్కూళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు 15 వేల వరకు పోస్టులను బ్లాక్ చేసినట్లు మంత్రి ప్రకటించినందున ఆ మేరకు రానున్న డీఎస్సీకి పోస్టులు అందుబాటులో ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఎక్కడ ఎంతమేర అవసరముందో విద్యాశాఖ ప్రతిపాదనలు ఇస్తే ప్రభుత్వ అనుమతితో ఆమేరకు టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించే అవకాశముంటుంది. -
అక్కడా రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలకు నూరు శాతం గిరిజనులకు రిజర్వేషన్లు వర్తింపజేయడం చెల్లదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఇది విరుద్ధమంది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విన్నపం మేరకు ఇప్పటివరకు జరిగిన నియామకాలకు రక్షణ ఇస్తున్నామని, ఏపీ, తెలంగాణలో ఇదేరీతిలో పునరావృతమైతే ఇప్పటివరకు జరిగిన వాటికి కూడా రక్షణ ఉండదని హెచ్చరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ చేబ్రోలు లీలాప్రసాదరావు, ఇతరులు 2002లో దాఖలు చేసిన సివిల్ అప్పీలును జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌తో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారించి బుధవారం 152 పేజీల తీర్పు వెలువరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1986లో షెడ్యూల్డు ఏరియాలో ఉపాధ్యాయ నియామకాల్లో వంద శాతం గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నంబరు 275 జారీచేసింది. 1989లో ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ దాన్ని రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వచ్చింది. సుప్రీం కోర్టు 1998లో దానిని కొట్టివేస్తూ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చి ంది. తిరిగి జనవరి 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చింది. పరిపాలన ట్రిబ్యునల్ దీనిని కొట్టివేయగా, హైకోర్టు జీవోను సమర్థించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరపున న్యాయవాది సీఎల్ఎన్ మోహన్‌రావు వాదనలు వినిపించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపింపచారు. వాటిపై ధర్మాసనం పైవిధంగా తీర్పునిచ్చింది. -
1998 డీఎస్సీ అర్హులకు పోస్టులు ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 1998లో నిర్వహించిన డీఎస్సీలో ఎంపికైన ప్రతిభావంతుల జాబితాలోని అర్హులను ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో భర్తీ చేయాలని హైకోర్టు తేల్చిచెప్పింది. దీనిపై ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 2009 డిసెంబర్ 4న ఇచ్చిన ఉత్తర్వుల్ని 4 వారాల్లోగా అమలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఇటీవల ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశాల్ని అమలు చేయాల్సిందేనన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసులను ఇటీవల సింగిల్ జడ్జి జస్టిస్ నవీన్‌రావు విచారించారు. అనంతరం నాలుగు జిల్లాల విద్యాధికారులకు (డీఈవో)లకు 2 నెలల జైలు శిక్ష, రూ.2 వేలు చొప్పున జరిమానా విధించిన విషయం విదితమే. ఈ శిక్షలపై కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల డీఈవోలు దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం ఇటీవల విచారించింది. 4 వారాల్లోగా 1998 డీఎస్సీ అర్హులను ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో భర్తీ చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అప్పటి వరకూ సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్ష, జరిమానాల అమలును నిలుపుదల చేసింది. -
టెట్టా.. టెట్ కమ్ టీఆర్టీనా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో వాటి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో కోటి ఆశలు వెల్లివిరుస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం అయిదేళ్ల పాటు టీచర్‌పోస్టులు భర్తీచేయకుండా కాలక్షేపం చేసింది. ప్రయివేటుకు ప్రోత్సాహం అందించేందుకు వీలుగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు లేక బోధన కుంటుపడినా పట్టించుకోలేదు. గత ఏడాది అక్టోబర్‌లో 7,902 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినా నిబంధనల్లో సమస్యల కారణంగా వాటిపై న్యాయ వివాదాలు ఏర్పడి నేటికీ తేలలేదు. ఈ నేపథ్యంలో ఖాళీ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆదేశించడంతో విద్యాశాఖ ఆ అంశంపై ప్రస్తుతం దృష్టి సారించింది. రానున్న నోటిఫికేషన్ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ పోస్టుల అర్హతకు అవసరమైన టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్)ను వేరేగా నిర్వహిస్తారా? లేక టీచర్ రిక్రూట్మెంట్తో కలిపి పెడతారా? అని తర్జనభర్జన పడుతున్నారు. గత ప్రభుత్వం తడవకో విధానాన్ని అనుసరించడంతో ఈసారి ఏ విధానం అమలు చేస్తారోనన్న ఆందోళనలో ఉన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీలో నిర్దిష్ట పద్ధతిని పాటించకపోవడంతో అభ్యర్ధుల్లో ఈ గందరగోళం నెలకొంది. టెట్‌ను రిక్రూట్‌మెంటును కలిపేసి.. ఏటా రెండుసార్లు టెట్ పెట్టాల్సి ఉన్నా రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం పెట్టలేదు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్ణయించిన పోస్టుల భర్తీకోసం ప్రభుత్వం టెట్‌ను, డీఎస్సీ రెండిటినీ కలిపి 2015లో నిర్వహించింది. ఆ తరువాత మళ్లీ టెట్, డీఎస్సీల ఊసేలేదు. అభ్యర్థుల నుంచి టీచర్ పోస్టుల భర్తీకి ఆందోళనలు రావడంతో 2018 ఫిబ్రవరి, మేలలో టెట్‌ను పెట్టారు. తరువాత డీఎస్సీ–2018కు వచ్చేసరికి విధానాన్ని మార్పుచేశారు. 2018 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంటు, భాషాపండితుల పోస్టులకు రిక్రూట్మెంటు టెస్టును పెట్టారు. బీఈడీ అభ్యర్ధులకు కొత్తగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అవకాశం కల్పిస్తూ ఎన్సీటీఈ నిర్ణయం తీసుకోవడంతో ఎస్జీటీ పోస్టులకు టెట్ కమ్‌టీఆర్టీని పెట్టారు. కాలపరిమితి ముగుస్తుండడంతో.. ఏడేళ్ల కాలపరిమితి నిబంధనతో ప్రస్తుతం 2014 టెట్, 2018 టెట్లలో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే డీఎస్సీకి అర్హత ఉంటుంది. అయితే గతంలో టెట్‌లో ఉత్తీర్ణులై కాలపరిమితి దాటిన వారు, టెట్లలో అర్హత సాధించలేని వారు టెట్ కోసం ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం టెట్‌ను ఏటా నిర్వహించి ఉన్నట్లయితే ఏదో ఒకసారి తాము అర్హత సాధించి టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండేదని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీకి నిర్ణయించడంతో ఈసారి ఏ విధంగా పరీక్ష నిర్వహిస్తారన్న చర్చ వారిలో కొనసాగుతోంది. టెట్‌ను వేరేగా పెడితేనే ఆధ్రువపత్రానికి ఏడేళ్లపాటు వేలిడేషన్ ఉంటుంది కనుక అదే తమకు మేలని వారు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ హయాంలో ఒక్కోసారి ఒక్కో విధానం ఉపాధ్యాయ పోస్టుల నియామకాలను గతంలో డీఎస్సీ ద్వారా ఎంపిక పరీక్ష నిర్వహించి భర్తీ చేసేవారు. జాతీయ విద్యాహక్కు చట్టం ఏర్పాటు తరువాత టీచర్‌పోస్టుల ఎంపికకు టీచర్ ఎలిజిబులిటీ టెస్టును నిర్వహించాలన్న నిబంధన అమల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రమైనా టీచర్ ఎలిజిబులిటీ టెస్టును తప్పనిసరిగా పాటించాలని అందులో పేర్కొన్నారు. ఈ టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే టీచర్ పోస్టులకు అర్హులవుతారు. ఆయా రాష్ట్రాలు టీచర్ పోస్టుల భర్తీకి తమతమ పద్ధతుల్లో ఎంపిక పరీక్షలు నిర్వహించినా టెట్ పాసైన వారిని మాత్రమే వాటికి అనుమతించాలి. టెట్ పాసైన వారికి ఆ ధ్రువపత్రం చెల్లుబాటు ఏడేళ్ల వరకు ఉంటుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం తాను ప్రత్యేక పరీక్ష నిర్వహించకుండా టెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపికలు నిర్వహించగా, బీహార్ వంటి కొన్ని రాష్ట్రాలు టెట్‌ను లేకుండా నేరుగా తమ ఎంపిక పరీక్షల ద్వారానే టీచర్‌పోస్టుల భర్తీ చేపట్టాయి. దీంతో టీచర్ పోస్టులకు ఈ అర్హత పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని ఎన్సీటీఈ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఏపీలో కూడా 2009లో విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చినా 2011 జులైలో మొదటి టెట్‌ను, 2012 జనవరిలో రెండో టెట్‌ను, అదే ఏడాది జూన్‌లో మూడో టెట్‌ను నిర్వహించారు. ఆ తరువాత 2013లో టెట్ నోటిఫికేషన్ వచ్చినా ఆ పరీక్షను మళ్లీ 2014 మార్చిలో పెట్టారు. ఈ టెట్‌లో పేపర్1లో 40,688 మంది, పేపర్2లో 115510 మంది అర్హత సాధించారు. -
డీఎస్సీ అభ్యర్థులు ఆగాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ–2018 ఎంపికలు మరింత జాప్యం కానున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఎంపికల జాబితా విడుదల ఆలస్యమవుతోంది. ఇందుకు ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాకే పోస్టుల భర్తీకి అవకాశం ఉంది. మే ఆఖరు నాటికి ఎంపిక ప్రక్రియను ముగించాలని పాఠశాల విద్యా శాఖాధికారులు ముందుగా ప్రణాళిక రూపొందించుకున్నా.. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం నుంచి జీవోల విడుదల నిలిచిపోవడంతో ప్రణాళిక అమలుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఎన్నికల కోడ్ మే ఆఖరు వరకు ఉండడంతో అప్పటివరకు జీవోలు వచ్చే అవకాశం లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. జూన్ లేదా ఆ తరువాత మాత్రమే డీఎస్సీ ఎంపికలు పూర్తిచేయడానికి వీలవుతుందని అధి కారులు పేర్కొంటున్నారు. సర్కారు జాప్యమే కారణం ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే డీఎస్సీ పరీక్షలు ముగియగా.. మెరిట్ జాబితాలు ప్రకటించారు. ఆ తరువాత ఎంపికల జాబితాలు రూపొందించి జిల్లాలకు పంపించేందుకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జీవో విడుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కానీ.. జీవో విడుదల చేయకుండా సర్కారు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. ఈలోగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించి, ఆ క్షణం నుంచే కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో ప్రభుత్వం విధానపరమైన ఎలాంటి నిర్ణయాలపైనా ఉత్తర్వులు జారీ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు ఎంతో సమయం ఉన్నా జీవో విడుదల చేయనందునే ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదు. 5.55 లక్షల మంది హాజరు రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి ఎన్నికలు వస్తున్నాయనగా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయించింది. దాదాపు 30 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా రెండేళ్లుగా నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇదిగో... అదిగో అంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు నిరుద్యోగులను మభ్యపెడుతూ వచ్చారు. ఒకసారి 22 వేల ఖాళీలను భర్తీ చేస్తామని, మరోసారి 14 వేల పోస్టుల భర్తీ అని, ఇంకోసారి 12 వేల పోస్టుల భర్తీ అని ప్రకటనలు చేశారు. రెండుసార్లు డీఎస్సీ షెడ్యూల్స్ కూడా ప్రకటించారు. కానీ నిర్ణీత తేదీల్లో మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఐదేళ్లలో పోస్టుల భర్తీ చేయకున్నా అభ్యర్థులకు రెండుసార్లు టెట్ నిర్వహించి భారీగా ఫీజులు దండుకున్నారు. చివరకు అక్టోబర్ 26న నోటిఫికేషన్ విడుదల చేశారు. అనేక ఖాళీ పోస్టులున్నా.. కేవలం 7,902 పోస్టులు మాత్రమే ప్రకటించారు. పోస్టులకు అర్హతల నిర్ణయంలో గందరగోళం తలెత్తడం, సిలబస్ ఖరారు, పోస్టుల సంఖ్యలో మార్పులు వంటి కారణాలతో దరఖాస్తు గడువును, ఆప్షన్ల నమోదు గడువును పలుమార్లు పొడిగించారు. చివరకు పరీక్షలను డిసెంబర్ 24 ప్రారంభించి, జనవరి 30 వరకు నిర్వహించారు. మొత్తం 6,08,155 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 5,89,165 మందికి హాల్‌టికెట్లు ఇచ్చారు. మొత్తంగా 5,55,047 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రాథమిక కీ, తుది కీ విడుదలలోనూ జాప్యం జరిగింది. పాఠశాల విద్యాశాఖ మెరిట్ జాబితాలను ప్రకటించే నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. జిల్లాల వారీగా ఎంపికల జాబితాలను సిద్ధం చేసినా జీవో కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. మార్చి 10న అమల్లోకి వచ్చిన కోడ్ ఏకంగా మే 27వ తేదీ వరకు కొనసాగనుంది. ఆ తరువాతే ప్రభుత్వం జీవో ఇవ్వాలి. కోడ్ ముగిసినా కొత్త ప్రభుత్వం కొలువు తీరడం వంటి కార్యక్రమాలు ఉండడం వల్ల జీవో ఱవెంటనే వచ్చే అవకాశాలు తక్కువేనని, జూన్‌లో లేదా ఆ తరువాత మాత్రమే అందుకు అవకాశముంటుందని అంటున్నారు. అంతవరకు నిరుద్యోగుల నిరీక్షణ తప్పదు. -
డీఎస్సీ.. ఐదో ‘సారీ’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి బుధవారం విడుదల కావాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ మరోసారి వాయిదా పడింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేకపోవడంతో షెడ్యూల్ ప్రకారం బుధవారం నోటిఫికేషన్ వెలువడే అవకాశం లేదని, ఈ నెలాఖరుకు కానీ ప్రకటన విడుదల చేయలేమని విద్యాశాఖాధికారులు స్పష్టం చేశారు. ఇలా ముందుగా షెడ్యూల్ ప్రకటించి నోటిఫికేషన్ విడుదల చేయకుండా వాయిదా వేయడం ప్రభుత్వానికి ఇది కొత్తకాదు. గత రెండేళ్లలో ఇది ఐదోసారి కావడం గమనార్హం. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ తాజా తీరుతో తీవ్ర నిరాశానిస్పృహలకు గురవుతున్నారు. ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటోందని మండిపడుతున్నారు. పదో తేదీన నోటిఫికేషన్ ఇస్తామని ఈనెల 5న మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడం తెలిసిందే. నవంబర్ 30న డీఎస్సీ పరీక్ష, వచ్చే జనవరి 3న ఫలితాలు విడుదల చేస్తామని షెడ్యూల్ తేదీలనూ ఆయన ఆర్భాటంగా ప్రకటించారు. అయితే షరామామూలుగానే ఈసారి కూడా నోటిఫికేషన్ విడుదల వాయిదా పడింది. పోస్టులకు కోతపెట్టినా.. భర్తీ చేయకుండా కాలయాపన ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం తొలి నుంచి నిరుద్యోగులతో దోబూచులాడుతోంది. ఏటా డీఎస్సీ వేస్తామని, ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినా గత నాలుగేళ్లలో ఒకే ఒక్కసారి ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తోంది. మంత్రి గంటాతోపాటు సీఎం చంద్రబాబు కూడా ఇటీవల కాలంలో డీఎస్సీ నిర్వహిస్తామని చెబుతూ వచ్చారు. మంత్రి గంటా గత రెండేళ్లలో ఐదుసార్లు షెడ్యూల్ ప్రకటించినా నోటిఫికేషన్ మాత్రం విడుదల కాలేదు. 2014 నాటికే దాదాపు 22 వేల పోస్టుల వరకు ఖాళీగా ఉన్నా కేవలం 10,313 పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. ఆ తర్వాత రిటైర్మెంట్లతో కలుపుకుంటే మళ్లీ ఖాళీ పోస్టుల సంఖ్య 30 వేలకు పైగా చేరింది. అయినా గత మూడేళ్లలో ఒక్క పోస్టూ భర్తీచేయలేదు. 2014 డీఎస్సీని రెండేళ్లకు కానీ పూర్తిచేయలేదు. ఏడాదిన్నర క్రితం మంత్రి గంటా విశాఖలో మాట్లాడుతూ 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు. నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. ఇటీవల 14,300 పోస్టులు భర్తీ అని, తర్వాత 12,370 పోస్టులని, మరోసారి 10,351 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్ తేదీలనూ వెల్లడించారు. అయినా నోటిఫికేషన్ జాడ మాత్రం లేదు. ఈ మధ్యన రెండుసార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్)ను నిర్వహించారు. వీటికి దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు. వీరంతా గత కొన్నేళ్లుగా వివిధ కోచింగ్ సెంటర్లలో అటు టెట్‌కు, డీఎస్సీకి వేర్వేరుగా వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ పొందుతున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూస్తున్న వీరికి తాజా పరిణామాలు తీరని నిరాశను మిగిల్చాయి. సీఎం అనుమతి లేక గ్రీన్‌సిగ్నల్ ఇవ్వని ఆర్థిక శాఖ 14,300 పోస్టుల భర్తీకి అనుమతుల కోసం విద్యా శాఖ ఫైలును ఆర్థిక శాఖ అనుమతికి పంపినా చంద్రబాబు నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో దానికి గతేడాది కాలంగా మోక్షం లభించలేదు. ఎట్టకేలకు ఇటీవల ఆర్థిక శాఖ విద్యాశాఖకు 6,100 (5వేల పోస్టులు జడ్పీ, 1100 పోస్టులు మున్సిపల్ స్కూళ్లు) పోస్టుల భర్తీకి అనుమతించింది. వీటితోపాటు 3,175 గురుకుల స్కూళ్ల పోస్టుల భర్తీకి నిర్ణయించింది. ఆర్థిక శాఖ జీవో సెప్టెంబర్ 19న విడుదలై 20 రోజులు దాటినా ఈ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాలేదు. దాదాపు 30 వేలకు పైగా ఖాళీలుండగా 6,100 పోస్టులను ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలో అర్థంకాక తలపట్టుకున్న అధికారులు ఎట్టకేలకు రోస్టర్ పాయింట్లను తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. ఈసారి ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులేనని ఎన్సీఈఆర్టీ పేర్కొనడంతో ఆ పోస్టుల వరకు టెట్ కమ్ టీఆర్టీని పెట్టాల్సి ఉంటుందని అధికారులు కసరత్తు చేశారు. స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు, భాషా పండితులకు డీఎస్సీ నిర్వహించాలని భావించారు. ఈ పోస్టుల భర్తీపై ప్రభుత్వం సమగ్ర ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు ఇవ్వలేదు. మరోవైపు మున్సిపల్ పోస్టులకు సంబంధించి కూడా స్పష్టత లేదు. ఇలాంటి తరుణంలో ఏ మార్గంలో ముందుకు వెళ్లాలో మంగళవారం రాత్రి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో నోటిఫికేషన్ విడుదలపై విద్యాశాఖ చేతులెత్తేసింది. సంక్షేమ శాఖల పోస్టులపైనా తేల్చని సర్కారు సంక్షేమ గురుకుల పాఠశాలల పోస్టులను కూడా డీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలా? లేదా వాటిని ఆయా శాఖల ద్వారానే నియామకం చేయాలా? అనే దానిపైనా ప్రభుత్వం తేల్చలేదు. మరోవైపు వేలాది పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం కేవలం 47 పోస్టులను మాత్రమే విడుదల కానున్న డీఎస్సీకి కేటాయించడంపై అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. అదనపు పోస్టులను ఈ డీఎస్సీలో ప్రకటించాలంటే వాటికి మళ్లీ ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉంది. పీఈటీ పోస్టుల సంఖ్య పెరిగితే ఎస్జీటీ పోస్టుల్లో కోతపడక తప్పదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పోస్టుల సంఖ్య భారీగా కుదించుకుపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని జిల్లాల్లో వేలాది మంది నిరుద్యోగులు పోస్టుల కోసం ప్రిపేరవుతుండగా అక్కడ పది లోపు పోస్టులు కూడా లేకపోవడంతో నిరాశలో మునిగిపోతున్నారు. ఇన్నేళ్లు కష్టపడి కోచింగ్‌లు తీసుకొని సన్నద్ధమవుతుంటే ఒకటీ అరా పోస్టులు కేటాయించి ప్రభుత్వం తమను మోసగిస్తోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. మంత్రి గంటా ప్రకటనల తీరు ఇదీ.. ఎన్నికలకు ముందు ఏటా డీఎస్సీ అని ప్రకటించిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచింది. అప్పటి నుంచి డీఎస్సీపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఇదిగో డీఎస్సీ, అదిగో డీఎస్సీ అని ప్రకటన చేయడమే తప్ప నోటిఫికేషన్ మాత్రం రాలేదు. - 2014, జూలై 3న టెట్ రద్దు చేస్తున్నామని, ఏటా డీఎస్సీని నిర్వహిస్తామని తొలి ప్రకటన చేశారు. - 2014, జూలై 6న సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ ప్రకటించారు. తీరా నోటిఫికేషన్ వెలువడలేదు. చివరకు 2015, సెప్టెంబర్‌లో టీఆర్టీ నోటిఫికేషన్ రాగా 2016 చివర్లో గానీ ఎంపికైనవారికి నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. - 2017, ఆగస్టులో 22 వేల పోస్టులకు త్వరలో డీఎస్సీ అని విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మంత్రి గంటా ప్రకటన చేశారు. - 2017, డిసెంబర్ 7న విజయవాడలో మీడియా సమావేశంలో 2018 డీఎస్సీ షెడ్యూలును మంత్రి గంటా విడుదల చేశారు. డిసెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు. 12,370 పోస్టులను భర్తీ చేస్తామని, 2018 మార్చి 23, 24, 25 తేదీల్లో రాతపరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. - డిసెంబర్లో ప్రకటన రాకపోగా అదే నెలలో 2018, జనవరి సంక్రాంతి నాటికి పండగ కానుకగా డీఎస్సీని ప్రకటిస్తామని ప్రకటన చేశారు. అయితే జనవరి గడిచిపోయినా డీఎస్సీ ప్రకటన ఊసేలేదు. - వేసవి సెలవుల్లో డీఎస్సీని పూర్తిచేసి స్కూళ్లు తెరిచే నాటికి నియామక ఉత్తర్వులు ఇస్తామని పలుమార్లు పేర్కొన్నా జూన్ దాటిపోయినా షెడ్యూల్ రాలేదు. - తాజాగా 14,300 పోస్టులు భర్తీ చేస్తామని ఒకసారి, 10,351 పోస్టులని మరోసారి పేర్కొంటూ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు - చివరకు 6,100 పోస్టులకు ఈ నెల 10న నోటిఫికేషన్ ఇవ్వనున్నామంటూ ఈ నెల 5న షెడ్యూల్ ప్రకటించారు. దీన్ని కూడా విడుదల చేయలేక వాయిదా వేశారు. -
సుప్రీం కళ్లకు సర్కారు గంతలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం చేసిన ప్రకటన లక్షలాది మంది నిరుద్యోగులకు తీరని నిరాశ మిగిల్చింది. మరోవైపు పోస్టుల ఖాళీలపై సుప్రీం కోర్టు కళ్లకూ సర్కారు గంతలు కడుతోంది. రాష్ట్రంలో 9,259 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఈ ఏడాది జూలై నాటికి భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇదివరకే సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆ నివేదికలో ప్రభుత్వం పేర్కొన్న ఖాళీలన్నీ ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు సంబంధించినవి మాత్రమే. జూలై దాటిపోయి సెప్టెంబర్ వచ్చినా ఇప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆర్థిక శాఖ ద్వారా జారీ చేసిన జీవో 153లో టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన ఖాళీలు 9,275గా పేర్కొన్నారు. అయితే ఇందులో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్లలోని ఖాళీల సంఖ్య కేవలం 5 వేలు మాత్రమే. సుప్రీంకోర్టుకు నివేదించిన వాటిలో 4,259 పోస్టులకు ప్రభుత్వం కోతపెట్టింది. మున్సిపల్ పోస్టులు 1,100, గిరిజన గురుకులాల్లో 750, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 500, ఆశ్రమ పాఠశాలాల్లో 300, బీసీ గురుకులాల్లో 350, ఏపీఆర్ఈఐ సొసైటీ పోస్టులు 175 కలిపి మొత్తం 9,275 పోస్టులు చూపించింది. సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలోని ఖాళీలను కాకుండా ఇతర శాఖల ఖాళీలను చూపించి మొత్తం అన్నీ భర్తీ చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు కళ్లకు సర్కారు గంతలు కడుతోంది. కేంద్రానికిచ్చిన నివేదికలో 30 వేలకు పైగా ఖాళీలు రాష్ట్రంలో సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) కింద విద్యాభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిధుల కోసం ఇచ్చే నివేదికలో ఎస్ఎస్ఏ అధికారులు రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల గురించి పొందుపరిచారు. అందులో జెడ్పీ, మండల పరిషత్ స్కూళ్లలో ప్రాథమిక పాఠశాలల్లో 11,576 పోస్టులు, యూపీ స్కూళ్లలో 2,040 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చూపించారు. ఇక హైస్కూళ్లలో 34.52 శాతం ఖాళీలున్నట్లు పేర్కొన్నారు. జెడ్పీల పరిధిలో హైస్కూళ్లు 4,641 ఉన్నాయి. ఇందులోని ఖాళీలనూ కలుపుకున్నా మొత్తం ఖాళీలు 30 వేలకు పైగానే ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్ విభాగాల్లో హైస్కూళ్లు 5,234 ఉన్నాయి. ఇందులో ఒక్కో స్కూల్లో కనిష్టంగా 15 మంది వరకు టీచర్లు ఉండాలని అంచనా వేసుకున్నా మొత్తం 78,510 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారం 70,358 మంది మాత్రమే. అంటే హైస్కూళ్లలోనే 8,152 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలుతోంది. ఉపాధ్యాయ సంఘాల అంచనా ప్రకారం 22 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నా జెడ్పీ స్కూళ్లకు సంబంధించి కేవలం 5 వేల పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతించడం అన్యాయమని నిరుద్యోగులు వాపోతున్నారు. కన్వర్షన్కూ అనుమతి ఇవ్వని ప్రభుత్వం గతంలో దాదాపు 4 వేలకు పైగా స్కూళ్లను హేతుబద్ధీకరణ పేరిట ప్రభుత్వం మూసేసింది. ఇందులో మిగిలిన పోస్టుల్లో ఎస్జీటీ విభాగంలోని 3,290 పోస్టులను కన్వర్షన్ చేయాలని ప్రభుత్వాన్ని అధికారులు కోరారు. అయితే దీన్ని కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఈ పోస్టులు కన్వర్షన్ అయితే పీఈటీ, మ్యూజిక్ తదితర విభాగాల్లో పోస్టులు వేయాలనుకున్నారు. ఇంతకు ముందు దాదాపు 1,000 పీఈటీ పోస్టులు వేస్తామని కూడా మంత్రి గంటా ప్రకటించారు. కానీ తాజాగా ఇచ్చిన పోస్టుల్లో వాటి సంఖ్య కేవలం 23 మాత్రమే. -
సర్టిఫికెట్ల వెరిఫికేషనా.. సమయం కావాలి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. అందులో కీలకమైన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సమయం వచ్చింది. నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష నిర్వ హణ, మూల్యాంకనం, రాష్ట్రస్థాయి ర్యాంకుల ప్రకట న, 1:3 మెరిట్ జాబితాల ప్రకటన ప్రక్రియను టీఎస్పీఎస్సీ పూర్తి చేసింది. జిల్లాల వారీ స్కూల్ అసి స్టింట్ జాబితాలు జిల్లా కలెక్టర్లకు పంపేందుకు చర్య లు చేపట్టింది. మరో మూడు రోజుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), పండిట్, పీఈటీ, స్కూల్ అసిస్టెం ట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) జాబితాలను సోమ, మంగళవారం నాటికి అన్ని జిల్లాలకు పంపేందుకు ఏర్పా ట్లు చేసింది. అనంతరం జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఈవోలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించాల్సి ఉంది. ఇటీవల డీఈవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వచ్చే వారంలో వెరిఫికేషన్ చేపట్టాలని టీఎస్పీఎస్సీ అధికారులు సూచించారు. నెల కిందటే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై శిక్షణిచ్చారు. కానీ ఇప్పటికిప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టడం సాధ్యం కాదని డీఈవోలు తెలిపారు. ప్రస్తుతం బదిలీలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో బిజీగా ఉన్నామని, ఆగస్టులోనే వెరిఫికేషన్ చేస్తామ న్నారు. అనుకున్న షెడ్యూలు ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సాధ్యం కాదని తేలడంతో జిల్లాల వారీ జాబితాలను తమ వద్ద ఉంచుకోవడం ఎందుకని, కలెక్టర్లకు పంపిస్తే వారికి సాధ్యమైనప్పుడు వారే వెరిఫికేషన్ చేసుకుంటారని ఆ జాబితాలను జిల్లాలకు పంపేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. జిల్లాల్లో వేర్వేరుగా వెరిఫికేషన్ షెడ్యూల్! దీంతో స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, పండిట్, పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు ఏయే తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారో.. తేదీల వారీగా షెడ్యూళ్లను ఆయా జిల్లాల్లో కలెక్టర్లు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని టీఎస్పీఎస్సీ వర్గా లు పేర్కొన్నాయి. ఆ ప్రక్రియను పూర్తి చేసి తమకు పంపిస్తే ఆ తరువాత 15 రోజుల్లో ఎంపికను పూర్తి చేసే అవకాశం ఉంటుందని తెలిపాయి. ఒక్కో జిల్లా లో ఒక్కో రకంగా వెరిఫికేషన్ షెడ్యూలు ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్లకు ఎలాంటి ఆదేశా లు అందలేదు. దీంతో వెరిఫికేషన్ చేపట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. -
డీఎస్సీ ద్వారా 10,351 టీచర్ పోస్టుల భర్తీ
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అవసరమయ్యే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ను జూలై ఆరో తేదీన విడుదల చేస్తామని, ఆగస్టు 23 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. డీఎస్సీ ద్వారా 10,351 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఆయన శనివారం విశాఖలో డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేశారు. మంత్రి మాట్లాడుతూ తొలిసారిగా ఏపీపీఎస్సీ ద్వారా ఆన్లైన్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు, మ్యూజిక్/డ్యాన్స్, మోడల్ స్కూల్ టీచర్లుగా ఆరు కేటగిరీల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. జూలై 7 నుంచి ఆగస్టు 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగస్టు ఒకటిన ఆన్లైన్లో మాక్ టెస్ట్ నిర్వహిస్తామని, ఆగస్టు 15 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. డీఎస్సీ రాత పరీక్షలు ఆగస్టు 23 నుంచి 30 వరకు ఉదయం 9.30 నుంచి 12 మధ్య, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల మధ్య నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 31న ప్రాథమిక కీ, సెప్టెంబర్ 9న ఫైనల్ కీ విడుదల చేస్తామని, సెప్టెంబర్ 15న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. మే 4న రెండో టెట్ నోటిఫికేషన్ ఫిజికల్ లిటరసీని బలోపేతం చేయడంలో భాగంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు మే 4న రెండో విడత టెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు మంత్రి గంటా తెలిపారు. ఈ పరీక్షలు జూన్ 10 నుంచి 21 వరకు జరుగుతాయన్నారు. పేపర్–1 పరీక్ష 10, 11, 12 తేదీల్లో, పేపర్–2ఎ 13, 15, 17, 19 తేదీల్లో, పేపర్–2బి 21న జరుగుతాయని 30న ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ప్రాథమిక కీ జూన్ 22న, ఫైనల్ కీ 28న విడుదల చేసి 30న ఫలితాలు వెల్లడిస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు, రాష్ట్ర స్థాయిలో ఫలితాలు సాధించిన టెట్ అభ్యర్థులకు గరిష్టంగా 30 మార్కులు వెయిటేజీ ఇస్తున్నామని వివరించారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల నియామకాలను మూడు కేటగిరీల్లో చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఐదుగురు వీసీలతో కమిటీని నియమించామని, కమిటీ నివేదిక ఆధారంగా నియామకాలుంటాయని చెప్పారు. డ్రాపవుట్లు పెరగకుండా.. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్లు పెరగకుండా పిల్లలకు యూనిఫారాలు, బాలికలకు సైకిళ్లు అందజేస్తామని మంత్రి గంటా తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్కేజీ, యూకేజీల నుంచి అడ్మిషన్లు ఇస్తామన్నారు. రెవెన్యూ డివిజన్‌కు ఒక స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ తయారు చేస్తామన్నారు. జూన్ 4న మన ఊరు–మనబడి నిర్వహిస్తామని చెప్పారు. -
నేడు వెబ్సైట్లో టీఆర్టీ ప్రాథమిక కీలు
సాక్షి, హైదరాబాద్: వివిధ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల నిర్వహించిన టీఆర్టీ పరీక్షల ప్రాథమిక కీలను tspsc.gov.in వెబ్సైట్లో బుధవారం నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల కీలపై ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్లో అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 31 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యంతరాలను స్వీకరించమని స్పష్టం చేసింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ‘టెక్స్ట్ బాక్స్ ఆఫ్ సబ్మిట్ ఆబ్జెక్షన్స్’లింకు ద్వారా పంపించాలని తెలిపింది. టెక్స్ట్ బాక్సులో ఇంగ్లిష్‌లో మాత్రమే టైప్ చేయాలని సూచించింది. ఇతర భాషల్లో తమ అభ్యంతరాలను తెలియజేయాలనుకునే వారు పీడీఎఫ్ రూపంలో ఫైల్ అటాచ్ లింకు ద్వారా పంపించాలని సూచించింది. అందులో అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పేపరు కోడ్, సిరీస్, ప్రశ్న నంబర్/ప్రశ్న ఐడీ ఉండేలా చూడాలని పేర్కొంది. -
నేటి నుంచి టీఆర్టీ పరీక్షలు
-
నేటి నుంచి టీఆర్టీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శనివారం నుంచి మార్చి 4వ తేదీ దాకా జరగనున్న పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,77,518 మంది పరీక్షలు రాయనున్నారు. ఉదయం పదింటికి మొదలయ్యే పరీక్షలకు 9:15కల్లా, మధ్యాహ్నం 2:30 పరీక్షలకు 1:45కల్లా అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలని టీఎస్పీఎస్సీ సూచించింది. ‘‘హాల్‌టికెట్‌తో పాటు ఏదో ఒక ఒరిజినల్ ఐడీ కార్డు విధిగా వెంట తీసుకెళ్లాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలూ, అభరణాలూ తేవొద్దు. పరీక్షలు ఆన్లైన్లో జరుగుతాయి’’ అని పేర్కొంది. తొలిరోజు శనివారం ఉదయం లాంగ్వేజ్ పండిట్ తెలుగు, మధాహ్నం స్కూల్ అసిస్టెంట్ తెలుగు పరీక్షలుంటాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లోనే అత్యధిక పోటీ స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులు తక్కువున్నా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో వీటికి అధిక పోటీ నెలకొంది. 1,941 పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 1,44,906 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) అభ్యర్థులు తక్కువగా ఉండటంతో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు మాత్రం పోటీ తక్కువే ఉంది. ఒక్కో పోస్టుకు 16.49 మంది పోటీ పడుతున్నారు. పోస్టుల్లో 80 శాతం జిల్లా స్థాయి లోకల్ పోస్టులే కావడంతో ప్రధాన పోటీ జిల్లా పరిధిలోనే ఉండనుంది. మిగతా 20 శాతం ఓపెన్ పోస్టుల్లో అన్ని జిల్లాల వారూ పోటీలో ఉంటారు. ఉపాధ్యాయ పోస్టులకు అత్యధిక పోటీ మహబూబ్‌నగర్‌లోనే నెలకొంది. జిల్లాలో 1,979 పోస్టులకు 42,529 మంది పోటీ పడుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) మినహా మిగతా అన్ని కేటగిరీల్లోనూ మహబూబ్‌నగర్‌లోనే అత్యధిక పోటీ నెలకొంది. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో నల్లగొండలో, ఎస్జీటీ పోస్టుల్లో మెదక్‌లో ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. స్కూల్ అసిస్టెంట్లకు మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 19,396 మంది, ఆ తర్వాత నల్లగొండలో 18,798 మంది పోటీ పడుతున్నారు. ఎస్జీటీ పోస్టులకు మహబూబ్‌నగర్‌లో 17,639 మంది, ఆ తర్వాత మెదక్‌లో 11,173 మంది పోటీ పడుతున్నారు. ఓపెన్ కోటాకు అన్ని జిల్లాల్లో పోటీ కొన్ని జిలాల్లో కొన్ని కేటగిరీలో పోస్టులు లేవన్న ఆందోళన ఈసారి అభ్యర్థులకు అవసరం లేదు. ఇతర జిల్లాలోని ఓపెన్ కోటా పోస్టు కోసం సొంత జిల్లాను వదిలి, ఇతర జిల్లాకు వెళ్లి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. అభ్యర్థులిచ్చే జిల్లా ప్రాధాన్యాల ఆప్షన్ ప్రకారం ఆయా జిల్లాల్లోని ఓపెన్ కోటా పోస్టులకు అన్ని జిల్లాల అభ్యర్థులూ పోటీలో ఉండేలా ఏర్పాటు చేశారు. -
పనికిరాని బీఈడీ సర్టిఫికెట్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ఈయన పేరు లింగస్వామి.. ఎంఏ, ఎంఈడీ పూర్తి చేశాడు. టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎట్టకేలకు సర్కారు టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చింది. దాన్ని చూసిన లింగస్వామికి నిరాశే ఎదురైంది. ఎందుకంటే నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం డిగ్రీలో 45 శాతం మార్కులు ఉన్న వారే దరఖాస్తుకు అర్హులు. మిగతా అన్ని కోర్సుల్లో మంచి మార్కులు సాధించినా డిగ్రీలో మాత్రం 45 శాతం మార్కులు లేవు. ఉద్యోగం వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఆ ఆవేదనతో ఏం చేయాలో తెలియక తన బీఈడీ సర్టిఫికెట్‌ను కాల్చేశాడు. తగలబెడుతున్న వీడియోను సామాజిక మాధ్యమంలో పెట్టాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామానికి చెందిన లింగస్వామిది నిరుపేద కుటుంబం. క్వారీలో పనిచేసుకుంటూ దూరవిద్యలో డిగ్రీ చదివాడు. 44 శాతం మార్కులతో పాసయ్యా డు. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) పూర్తి చేశాడు. ఎంఏ ఎకనామిక్స్‌లో 70 శాతం కన్నా ఎక్కువ మార్కులతో పాసై, ఎంఈడీ కూడా పూర్తి చేశాడు. లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ ఉపాధ్యాయ నియామకాల కోసం సన్నద్ధమయ్యాడు. తీరా నోటిఫికేషన్ చూసి తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఇది ఒక్క లింగస్వామిదే కాదు.. రాష్ట్రంలో వేలాది మంది బీఈడీ అభ్యర్థుల ఆవేదన. బీఈడీ సర్టిఫికెట్ అమ్మకం మరవకముందే.. బీఈడీ సర్టిఫికెట్‌ను ఫేస్బుక్లో అమ్మకానికి పెట్టిన అశోక్ సంఘటన మరవకముందే లింగస్వామి సర్టిఫికెట్‌ను కాల్చడం కలకలం రేపుతోంది. డిగ్రీలో మార్కులు తక్కువ ఉన్నాయన్న సాకుతో పరీక్షకు అనర్హులను చేయడం అన్యాయమని బీఈడీ అభ్యర్థులు వాపోతున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలకు వక్రభాష్యం చెప్పి అధికారులు తమను రోడ్డున పడేస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లేదు.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎన్సీటీఈ పేరుతో విద్యాశాఖ అధికారులు రూపొందించిన నిబంధనలపై అభ్యర్థులు మండిపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012 డీఎస్సీలో ఈ నిబంధనల్లేవు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఈ నిబంధనలు పెట్టలేదు. డిగ్రీ ఉత్తీర్ణులై ఉంటే చాలన్న నిబంధనలతో ఉపాధ్యాయ నియామకాలను చేపట్టింది. తెలంగాణలో మాత్రం ఎన్సీటీఈ నిబంధనల పేరుతో అభ్యర్థుల జీవితాలతో అధికారులు చెలగాటమాతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం తలచుకుంటే.. 8,792 పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనలు వేల మంది బీఈడీ అభ్యర్థులను రోడ్డుపాలు చేస్తున్నాయి. డిగ్రీలో నిర్ణీత మార్కుల్లేవన్న సాకుతో టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా మిగిలిపోతున్నారు. ఎన్సీటీఈ 2014లో బీఈడీ అభ్యర్థుల విషయంలో రెండు రకాల నిబంధనలను పొందుపరిచింది. అందులో జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం) ఉండాలన్న నిబంధన ఒకటైతే.. 2002, 2007 ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం డిగ్రీలో జనరల్ అభ్యర్థులకు 45 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం) ఉండాలని మరో నిబంధన పొందుపరిచింది. అలాగే డిగ్రీ అయినా లేదా పీజీ అయినా సరే వర్తిస్తుందని పేర్కొంది. కానీ డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాల్సిందేనని అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తలచుకుంటే తమకు న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు. 2002, 2007 ఎ¯న్‌సీటీఈ నిబంధనలను పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
టీఎస్పీఎస్సీ సవరణ నోటిఫికేషన్ నేడే!
-
టీఆర్టీ సవరణ నోటిఫికేషన్ నేడే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మంగళవారం సవరణ నోటిఫికేషన్ జారీ చేయనుంది. తొలి నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా 31 జిల్లాలవారీగా కాకుండా... పాత 10 జిల్లాల ప్రకారం కేటగిరీల వారీగా పోస్టులు, రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలను ప్రకటించనుంది. వాస్తవానికి పది జిల్లాల ప్రకారం పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల మెమో జారీ చేసింది. దీనిపై టీఎస్పీఎస్సీకి లేఖ రాసింది. అయితే 31 జిల్లాల వారీగా ఇచ్చిన జీవోను హైకోర్టు తప్పుపట్టినందున.. ఇప్పుడు 10 జిల్లాల వారీగా భర్తీ కోసం జీవోనే ఇవ్వాల్సి ఉంటుందనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నిర్ణయానికి వచ్చారు. దీనిపై కడియం శ్రీహరి అధికారులతో మాట్లాడారు. అనంతరం సోమవారం రాత్రి జీవో జారీ అయింది. పాత పది జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని అందులో టీఎస్పీఎస్సీకి సూచించారు. ప్రభుత్వం సూచించే అధికారి నియామక పత్రాలు అందజేస్తారని స్పష్టం చేశారు. వివరాలు ఇప్పటికే సిద్ధం సవరణపై ప్రభుత్వం జీవో జారీ చేయడంతో టీఎస్పీఎస్సీ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. ఇప్పటికే విద్యాశాఖ నుంచి పాత 10 జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు, రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలను తీసుకుంది. వాటి పరిశీలనను కూడా పూర్తయిన నేపథ్యంలో.. మంగళవారమే టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు సవరణ ప్రకటన ఇవ్వనుంది. అందులోనే పాత పది జిల్లాల వారీగా ఉండే పోస్టుల వివరాలు, కేటగిరీలు, రోస్టర్, రిజర్వేషన్ వివరాలను వెల్లడించనుంది. ఫిబ్రవరిలో పరీక్షలు పది జిల్లాల ప్రకారం భర్తీ చేయనున్న 8,792 పోస్టులకు పరీక్షలను ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీల మధ్య నిర్వహించేలా టీఎస్పీఎస్సీ షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. కేటగిరీల వారీగా, తేదీల వారీగా పరీక్ష తేదీలను సవరణ ప్రకటనలో వెల్లడించే అవకాశముంది. లేదా ఆ తర్వాత ప్రకటిస్తారు. మొత్తంగా మే నాటికి ఫలితాలను ప్రకటించి, ఎంపికైన అభ్యర్థుల జాబితాలను ఆయా జిల్లాలకు పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దరఖాస్తుల గడువు మళ్లీ పెంపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును ఈనెల 30 వరకు పొడిగించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. వాస్తవానికి గత నెల 30తోనే దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 15 వరకు గడువిచ్చారు. తాజాగా మరో 15 రోజులు పొడిగించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన వివరాలు వారి దరఖాస్తుల్లో ఉన్నందున.. వాటి ప్రకారం వారు పాత జిల్లాల్లో ఏ జిల్లాకు లోకల్ అవుతారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. లేదంటే వివరాలను ఎడిట్ చేసే ఆప్షన్‌ను కల్పించే వీలుంది. ఈ అంశంపై సవరణ ప్రకటనతో స్పష్టత రానుంది. -
డీఎస్సీకి మోక్షమెప్పుడు?
► సీఎం చెబుతున్నా ముందుకు పడని అడుగులు ► నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది ఎదురుచూపులు సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు ఏళ్లుగా నిరీక్షిస్తున్నా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అడుగులు ముందుకు పడటం లేదు. ఉద్యోగాల భర్తీని వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నా సమస్యలు తప్పడం లేదు. ఒక్కో అధికారి ఒక్కో విధానం చూపుతూ చివరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని జటిల సమస్యగా మార్చేశారు. దీంతో ఏటా ఏదో ఓ కారణంతో డీఎస్సీ నోటిఫికేషన్ ఆగిపోతోంది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ అన్న ప్రతిసారీ నిరుద్యోగులు కోచింగ్ కేంద్రాల్లో చేరిపోవడం.. అప్పులు చేసి శిక్షణ పొందడం.. ఆ తర్వాత వాయిదా పడుతుండటంతో ఉసూరుమంటున్నారు. కోచింగ్‌లకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో టీచర్ పోస్టులను భర్తీ చేసి ఐదేళ్లు గడిచిపోయింది. అయినా ఇంకా వివిధ కారణాలతో కాలయాపన తప్ప ఉద్యోగ ప్రకటన జారీ కావడం లేదు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన రామకృష్ణ మూడుసార్లు అప్పుల చేసి డీఎస్సీ కోచింగ్ తీసుకున్నాడు. నోటిఫికేషన్ వస్తుందని ఎదురుచూసి చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నెలరోజులు అన్నం మానేసి అనారోగ్యం పాలై చనిపోయాడు. ఇలా అనేక మంది అప్పు చేసి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. చివరకు నోటిఫికేషన్ రాకపోవడంతో ఆందోళనలో పడిపోతున్నారు. కొందరు ప్రైవేటు స్కూల్లో టీచర్ ఉద్యోగాన్ని వదిలేసి.. రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు అప్పులు చేసి మరీ శిక్షణ తీసుకొంటున్నారు. కొందరు ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాలన్న ఆలోచనలతో పెళ్లిళ్లనే వాయిదా వేసుకుంటున్నారు. ఇలా ఏళ్ల తరబడి 3 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నా నోటిఫికేషన్ జారీ కాకపోవడంతో నిరాశలో మునిగిపోయారు. ప్రతిసారీ ఏదో ఓ కారణం... అనేక సందర్భాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. రెండేళ్ల కిందట మహబూబ్‌నగర్‌లోని పాఠశాలల్లో పిల్లలు లేరని హైకోర్టులో పిల్ వేసినపుడు త్వరలో నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా టీచర్ల నియామకాలు వెంటనే చేపట్టాలని ఆదేశించింది. ఇది జరిగి ఏడాది కావొస్తున్నా.. నోటిఫికేషన్‌కు మోక్షం కలగలేదు. ఓసారి టెట్ నోటిఫికేషన్ జారీచేసి.. ‘టెట్ నిర్వహిస్తున్నాం.. తర్వాత డీఎస్సీ’ అని చెప్పి పక్కనపెట్టేశారు. అంతకుముందూ ఇదే పరిస్థితి. ఓసారి హేతుబద్ధీకరణ తర్వాత డీఎస్సీ అంటారు.. ఆ తర్వాత మళ్లీ టెట్ అంటారు.. టెట్ నిర్వహించాక మళ్లీ ఏదో సమస్య. 2014 నుంచి ఇప్పటివరకు ఇదే తంతు కొనసాగు తోంది. 4 నెలల కిందట కొత్త జిల్లాల ప్రకారం డీఎస్సీకి న్యాయ శాఖ ఓకే చెప్పింది. కానీ ఆచరణకు నోచుకోలేదు. ‘జూన్‌లో టెట్ నిర్వహిస్తాం.. ఆగస్టు 5న ఫలితాలను వెల్లడించిన వారానికే నోటిఫికేషన్ ఇస్తాం’ అని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గతంలో ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. ఆగస్టు 4 నాడే టెట్ ఫలితాలు వచ్చినా నోటిఫికేషన్ మాత్రం రాలేదు. తాజాగా మరో సమస్య తెరపైకి వచ్చింది. పోస్టులను కొత్త జిల్లాల ప్రకారం భర్తీ చేయాలా? లేక పాత జిల్లాల ప్రకారం చేయాలా? అన్న సందేహంలో పడ్డారు. దానిపై సమావేశమవుతామని చెప్పినా ఇంతవరకు భేటీ కాలేదు. రూ.60 వేలు అప్పు చేశా మాది వ్యవసాయ కుటుంబం. టెట్, డీఎస్సీ శిక్షణకు ఇప్పటివరకు రూ.60 వేలు అప్పు చేయాల్సి వచ్చింది. గతేడాది డీఎస్సీ వస్తుందన్నçప్పుడు ప్రైవేటు స్కూల్లో ఉద్యోగం మానేసి శిక్షణ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలో అర్థ«ం కావడం లేదు. నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియడం లేదు. – ప్రవళిక, ఆదిలాబాద్ మూడేళ్లుగా కోచింగ్ తీసుకుంటున్నా మాది నిరుపేద గిరిజన కుటుంబం. అమ్మానాన్న కూలీ పని చేసి చదివించారు. అప్పు చేసి టెట్, డీఎస్సీ శిక్షణకు పంపించారు. మూడేళ్లు హన్మకొండలో ఉండి శిక్షణ పొందేందుకు రూ.50 వేలు అప్పు చేశా. టీచర్ ఉద్యోగం సంపాదించాకే పెళ్లి చేసుకోవాలని మూడేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నా. – ఎం.లలిత, భూపాలపల్లి ఒక్కోసారి ఒక్కో మాట డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలో ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడటం సరికాదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో ప్రైవేటు స్కూల్లో ఉద్యోగంలో చేరడం లేదు. తీరా నోటిఫికేషన్ రాకపోయేసరికి మధ్యలో ప్రైవేటు స్కూళ్లు తీసుకోవడం లేదు. – హరీశ్, కరీంనగర్ త్వరగా నోటిఫికేషన్ ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇప్పటికే పలుమార్లు ప్రకటించి వాయిదా వేస్తుండటంతో ఆందోళన పెరిగిపోతోంది. డీఎస్సీ అన్నప్పుడల్లా శిక్షణ కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. – ప్రజ్ఞవర్ష, నిజామాబాద్ -
టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు
- టెట్ ఫలితాల నాటికి నియామక నిబంధనలు - 23న టెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి - వచ్చే నెల 5న ఫలితాలు! - తర్వాత టీఆర్టీ నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల్లో అమలు చేయాల్సిన నిబంధనల రూపకల్పనపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. కేటగిరీల వారీగా అర్హతలు, రాత పరీక్షల విధానం తదితర అంశాలతో కూడిన నిబంధనలను రూపొందించే పనిలో పడింది. మరో వైపు ఈ నెల 23న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. వాటికి సంబంధించిన హాల్‌టికెట్లనూ శనివారం అందుబాటులోకి తెచ్చింది. రాత పరీక్ష ఫలితాల ను వచ్చేనెల 5న విడుదల చేయాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక నిబంధనల రూపకల్పనను వేగవంతం చేసింది. ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసి, నిబంధనల రూపకల్పనకు చర్యలు చేపట్టినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ పేర్కొన్నారు. మొత్తానికి టెట్ ఫలితాలను వెల్లడించిన తరువాత ఉపాధ్యాయ నియామకాలకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. అయితే అంతకంటే ముందుగానే విద్యాశాఖ రూపొందించే నియమ, నిబంధనలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. నిబంధనలతోపాటు కేటగిరీల వారీగా పోస్టుల రాత పరీక్షలో పరిగణనలోకి తీసుకునే సిలబస్‌ను ఖరారు చేసే పని చేస్తోంది. మొత్తానికి ఈనెలాఖరుకల్లా నిబంధనలను, జిల్లాల వారీగా, పోస్టుల వారీగా రోస్టర్, రిజర్వేషన్ల విధానాన్ని ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వీటిపై టీఎస్పీఎస్సీతోనూ సంప్రదించే అవకాశం ఉంది. ప్రస్తుతం గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీకి అనుసరిస్తున్న పరీక్ష విధానంలో ప్రిలిమ్స్, మెయిన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టడమే కాకుండా సబ్జెక్టు పేపర్లతోపాటు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పేపర్లను ప్రవేశ పెట్టింది. అయితే పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో వాటిని పొందుపరచాలా వద్దా? అనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు విధించిన ఈ నిబంధనలే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీతో సంప్రదింపులు జరిపాకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. టెట్ ఫలితాల నాటికి ప్రభుత్వం వాటిపై ఉత్తర్వులు జారీ చేస్తే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ను వచ్చే నెలలోనే జారీ చేయనుంది. లేదంటే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.