డీఎస్సీకి మోక్షమెప్పుడు?
► సీఎం చెబుతున్నా ముందుకు పడని అడుగులు
► నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది ఎదురుచూపులు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులు ఏళ్లుగా నిరీక్షిస్తున్నా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అడుగులు ముందుకు పడటం లేదు. ఉద్యోగాల భర్తీని వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ పదేపదే చెబుతున్నా సమస్యలు తప్పడం లేదు. ఒక్కో అధికారి ఒక్కో విధానం చూపుతూ చివరకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని జటిల సమస్యగా మార్చేశారు. దీంతో ఏటా ఏదో ఓ కారణంతో డీఎస్సీ నోటిఫికేషన్ ఆగిపోతోంది. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ అన్న ప్రతిసారీ నిరుద్యోగులు కోచింగ్ కేంద్రాల్లో చేరిపోవడం.. అప్పులు చేసి శిక్షణ పొందడం.. ఆ తర్వాత వాయిదా పడుతుండటంతో ఉసూరుమంటున్నారు.
కోచింగ్‌లకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో టీచర్ పోస్టులను భర్తీ చేసి ఐదేళ్లు గడిచిపోయింది. అయినా ఇంకా వివిధ కారణాలతో కాలయాపన తప్ప ఉద్యోగ ప్రకటన జారీ కావడం లేదు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన రామకృష్ణ మూడుసార్లు అప్పుల చేసి డీఎస్సీ కోచింగ్ తీసుకున్నాడు. నోటిఫికేషన్ వస్తుందని ఎదురుచూసి చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నెలరోజులు అన్నం మానేసి అనారోగ్యం పాలై చనిపోయాడు.
ఇలా అనేక మంది అప్పు చేసి కోచింగ్‌లు తీసుకుంటున్నారు. చివరకు నోటిఫికేషన్ రాకపోవడంతో ఆందోళనలో పడిపోతున్నారు. కొందరు ప్రైవేటు స్కూల్లో టీచర్ ఉద్యోగాన్ని వదిలేసి.. రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు అప్పులు చేసి మరీ శిక్షణ తీసుకొంటున్నారు. కొందరు ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాలన్న ఆలోచనలతో పెళ్లిళ్లనే వాయిదా వేసుకుంటున్నారు. ఇలా ఏళ్ల తరబడి 3 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నా నోటిఫికేషన్ జారీ కాకపోవడంతో నిరాశలో మునిగిపోయారు.
ప్రతిసారీ ఏదో ఓ కారణం...
అనేక సందర్భాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పినా వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. రెండేళ్ల కిందట మహబూబ్‌నగర్‌లోని పాఠశాలల్లో పిల్లలు లేరని హైకోర్టులో పిల్ వేసినపుడు త్వరలో నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా టీచర్ల నియామకాలు వెంటనే చేపట్టాలని ఆదేశించింది. ఇది జరిగి ఏడాది కావొస్తున్నా.. నోటిఫికేషన్‌కు మోక్షం కలగలేదు. ఓసారి టెట్ నోటిఫికేషన్ జారీచేసి.. ‘టెట్ నిర్వహిస్తున్నాం.. తర్వాత డీఎస్సీ’ అని చెప్పి పక్కనపెట్టేశారు.
అంతకుముందూ ఇదే పరిస్థితి. ఓసారి హేతుబద్ధీకరణ తర్వాత డీఎస్సీ అంటారు.. ఆ తర్వాత మళ్లీ టెట్ అంటారు.. టెట్ నిర్వహించాక మళ్లీ ఏదో సమస్య. 2014 నుంచి ఇప్పటివరకు ఇదే తంతు కొనసాగు తోంది. 4 నెలల కిందట కొత్త జిల్లాల ప్రకారం డీఎస్సీకి న్యాయ శాఖ ఓకే చెప్పింది. కానీ ఆచరణకు నోచుకోలేదు. ‘జూన్‌లో టెట్ నిర్వహిస్తాం.. ఆగస్టు 5న ఫలితాలను వెల్లడించిన వారానికే నోటిఫికేషన్ ఇస్తాం’ అని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి గతంలో ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. ఆగస్టు 4 నాడే టెట్ ఫలితాలు వచ్చినా నోటిఫికేషన్ మాత్రం రాలేదు. తాజాగా మరో సమస్య తెరపైకి వచ్చింది. పోస్టులను కొత్త జిల్లాల ప్రకారం భర్తీ చేయాలా? లేక పాత జిల్లాల ప్రకారం చేయాలా? అన్న సందేహంలో పడ్డారు. దానిపై సమావేశమవుతామని చెప్పినా ఇంతవరకు భేటీ కాలేదు.
రూ.60 వేలు అప్పు చేశా
మాది వ్యవసాయ కుటుంబం. టెట్, డీఎస్సీ శిక్షణకు ఇప్పటివరకు రూ.60 వేలు అప్పు చేయాల్సి వచ్చింది. గతేడాది డీఎస్సీ వస్తుందన్నçప్పుడు ప్రైవేటు స్కూల్లో ఉద్యోగం మానేసి శిక్షణ తీసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలో అర్థ«ం కావడం లేదు. నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియడం లేదు. – ప్రవళిక, ఆదిలాబాద్
మూడేళ్లుగా కోచింగ్ తీసుకుంటున్నా
మాది నిరుపేద గిరిజన కుటుంబం. అమ్మానాన్న కూలీ పని చేసి చదివించారు. అప్పు చేసి టెట్, డీఎస్సీ శిక్షణకు పంపించారు. మూడేళ్లు హన్మకొండలో ఉండి శిక్షణ పొందేందుకు రూ.50 వేలు అప్పు చేశా. టీచర్ ఉద్యోగం సంపాదించాకే పెళ్లి చేసుకోవాలని మూడేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నా. – ఎం.లలిత, భూపాలపల్లి
ఒక్కోసారి ఒక్కో మాట
డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలో ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడటం సరికాదు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. నోటిఫికేషన్ వస్తుందన్న ఆశతో ప్రైవేటు స్కూల్‌లో ఉద్యోగంలో చేరడం లేదు. తీరా నోటిఫికేషన్ రాకపోయేసరికి మధ్యలో ప్రైవేటు స్కూళ్లు తీసుకోవడం లేదు.
– హరీశ్, కరీంనగర్
త్వరగా నోటిఫికేషన్ ఇవ్వండి
రాష్ట్ర ప్రభుత్వం తొందరగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలి. ఇప్పటికే పలుమార్లు ప్రకటించి వాయిదా వేస్తుండటంతో ఆందోళన పెరిగిపోతోంది. డీఎస్సీ అన్నప్పుడల్లా శిక్షణ కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. – ప్రజ్ఞవర్ష, నిజామాబాద్