సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అవసరమయ్యే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ను జూలై ఆరో తేదీన విడుదల చేస్తామని, ఆగస్టు 23 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. డీఎస్సీ ద్వారా 10,351 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఆయన శనివారం విశాఖలో డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేశారు. మంత్రి మాట్లాడుతూ తొలిసారిగా ఏపీపీఎస్సీ ద్వారా ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీలు, మ్యూజిక్/డ్యాన్స్, మోడల్ స్కూల్ టీచర్లుగా ఆరు కేటగిరీల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. జూలై 7 నుంచి ఆగస్టు 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగస్టు ఒకటిన ఆన్‌లైన్‌లో మాక్ టెస్ట్ నిర్వహిస్తామని, ఆగస్టు 15 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. డీఎస్సీ రాత పరీక్షలు ఆగస్టు 23 నుంచి 30 వరకు ఉదయం 9.30 నుంచి 12 మధ్య, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల మధ్య నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 31న ప్రాథమిక కీ, సెప్టెంబర్ 9న ఫైనల్ కీ విడుదల చేస్తామని, సెప్టెంబర్ 15న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.
మే 4న రెండో టెట్ నోటిఫికేషన్
ఫిజికల్ లిటరసీని బలోపేతం చేయడంలో భాగంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు మే 4న రెండో విడత టెట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు మంత్రి గంటా తెలిపారు. ఈ పరీక్షలు జూన్ 10 నుంచి 21 వరకు జరుగుతాయన్నారు. పేపర్–1 పరీక్ష 10, 11, 12 తేదీల్లో, పేపర్–2ఎ 13, 15, 17, 19 తేదీల్లో, పేపర్–2బి 21న జరుగుతాయని 30న ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ప్రాథమిక కీ జూన్ 22న, ఫైనల్ కీ 28న విడుదల చేసి 30న ఫలితాలు వెల్లడిస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు, రాష్ట్ర స్థాయిలో ఫలితాలు సాధించిన టెట్ అభ్యర్థులకు గరిష్టంగా 30 మార్కులు వెయిటేజీ ఇస్తున్నామని వివరించారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల నియామకాలను మూడు కేటగిరీల్లో చేపడుతున్నామని మంత్రి తెలిపారు. ఐదుగురు వీసీలతో కమిటీని నియమించామని, కమిటీ నివేదిక ఆధారంగా నియామకాలుంటాయని చెప్పారు.
డ్రాపవుట్లు పెరగకుండా..
ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్లు పెరగకుండా పిల్లలకు యూనిఫారాలు, బాలికలకు సైకిళ్లు అందజేస్తామని మంత్రి గంటా తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఎల్‌కేజీ, యూకేజీల నుంచి అడ్మిషన్లు ఇస్తామన్నారు. రెవెన్యూ డివిజన్‌కు ఒక స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ తయారు చేస్తామన్నారు. జూన్ 4న మన ఊరు–మనబడి నిర్వహిస్తామని చెప్పారు.
డీఎస్సీ ద్వారా 10,351 టీచర్ పోస్టుల భర్తీ
Published Sun, Apr 29 2018 3:37 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment