సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన వారంలోనే నోటిఫికేషన్ వెలువరించనున్నామని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వారం క్రితం ప్రకటించినప్పటికీ ఇప్పట్లో అది వెలువడే సూచనలు కనిపించడం లేదు. ఆ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ పంపిన ఫైలు పెండింగ్‌లో ఉండిపోవడమే ఇందుకు కారణం. ఈ ఫైలును దాదాపు నెల రోజుల క్రితమే ప్రభుత్వానికి సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఆమోదం రాలేదు. డీఎస్సీలో భర్తీకి ప్రకటించాల్సిన టీచరపోస్టుల్లో కొన్నిటికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. వాటికి ప్రభుత్వం ఆర్థికపరమైన సమ్మతిని తెలియచేస్తేనే వాటిని డీఎస్సీ నోటిఫికేషన్లో చేర్చి భర్తీ చేయగలుగుతారు. నోటిఫికేషన్ జారీచేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినా ప్రభుత్వం నుంచి ఆమోదం రాకపోవడంతో పాఠశాల విద్యాశాఖ దానికోసం ఎదురుచూపులు చూస్తోంది. తాము పంపిన ఫైలుకు ప్రభుత్వం నుంచి ఆమోదం లేకపోవడంతో మంత్రి ప్రకటించిన మేరకు నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కావడం లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే ఫిబ్రవరి రెండు, లేదా మూడో వారంలో నోటిఫికేషన్‌కు వీలుంటుందని చెబుతున్నాయి.
అదనపు పోస్టులపై సర్కారు మల్లగుల్లాలు
టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఏపీ ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టులో నోటీసులు జారీచేసింది. పోస్టులు భర్తీచేయకపోవడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఖాళీలపై తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆమేరకు 14,194 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం నివేదించింది. వాటిని త్వరలోనే భర్తీచేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు 5655, స్కూల్ అసిస్టెంటు 3119, ఎల్పీలు 260, పీఈటీలు 1115, మ్యూజిక్ 77, మోడల్ స్కూలు 938, ఐఈడీఎస్‌ఎస్ 860, మున్సిపల్ 1147, కంప్యూటర్ 1023 పోస్టులు ఉన్నట్లు చూపించారు. ఈ పోస్టుల భర్తీకోసం ముందుగా ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఆ తరువాత డీఎస్సీ పరీక్షను నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 15న డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు మంత్రి గంటా డిసెంబర్ 6న ప్రకటించారు. డిసెంబర్ 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ, మార్చి 23, 24, 26 తేదీల్లో రాతపరీక్ష నిర్వహించి 2018 జూన్ 11వ తేదీనాటికి నియామక పత్రాలు ఎంపికైన అభ్యర్ధులకు ఇస్తామని తెలిపారు. కానీ ఈ పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా ఖాళీలు, రిజర్వేషన్లపై స్పష్టత లేకపోవడంతో నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో పాటు వాస్తవ ఖాళీలకు అదనంగా అవసరమని తేల్చిన 3,400 వరకు పోస్టులకు ప్రభుత్వం నుంచి ఆమోదం పెండింగ్‌లోనే ఉంది. మరోవైపు జిల్లాల వారీగా ఖాళీలు రిజర్వుడ్ పోస్టులపై కసరత్తు చేపట్టగా ఆయా పోస్టుల సంఖ్యలో కొన్ని హెచ్చుతగ్గులు ఏర్పడుతూ వచ్చాయి. చివరకు 14,300 పోస్టులకు ప్రాథమికంగా లెక్కతేల్చారు. అయితే అదనపు పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆమోదం రాకపోవడంతో విద్యాశాఖ నోటిఫికేషన్ జారీకి ఆటంకంగా పరిణమించింది.
ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ జీఓ ఎప్పుడు?
టీచర్ పోస్టుల భర్తీని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించనున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించాలంటే అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడిగా విడుదల చేయాల్సి ఉంది. ఆ జీఓ కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. దీంతో ఈ పరీక్షకు సంబంధించి ఏపీపీఎస్సీ కార్యకలాపాలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు నిలిచిపోయాయి. ఒకటి రెండుసార్లు ఏపీపీఎస్సీ, పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్చలు చేసినా ప్రభుత్వం నుంచి జీఓ లేకపోవడంతో తదుపరి చర్యలు సాగడం లేదు. ప్రభుత్వం ఇప్పటికీ పోస్టులకు ఆమోదముద్రతో పాటు డీఎస్సీ నిర్వహణ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ జీఓ కూడా విడుదల చేయకపోవడంతో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికల్లా కొత్త టీచర్ల నియామకం సాధ్యం కాదని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment