డీఎస్సీ షెడ్యూలు విడుదల | DSC schedule released | Sakshi
Sakshi News home page

డీఎస్సీ షెడ్యూలు విడుదల

Published Sun, Jan 31 2016 6:41 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

DSC schedule released

- వారంలో స్కూల్ అసిస్టెంట్ల షెడ్యూలు
- మంత్రి గంటా వెల్లడి

విశాఖపట్నం

 ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న డీఎస్సీ-2014 నియామకాల షెడ్యూలును విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం విడుదల చేశారు. ఫిబ్రవరి 1న ఎంపికైన అభ్యర్థుల జాబితా వెబ్‌సైట్‌లో ఉంచడంతో మొదలయ్యే ప్రక్రియ మార్చి 5న జరిగే నియామకాలతో ముగుస్తుందని తెలిపారు. ఇక్కడ ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన షెడ్యూలు ప్రక్రియను వివరించారు. ఫిబ్రవరి 1న అభ్యర్థుల మెరిట్ లిస్టును వెబ్‌సైట్‌లో పెడతామన్నారు.


 5న ఎంపికైన అభ్యర్థుల పేర్లను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా సిద్ధం చేస్తామన్నారు. 8న ఈ అభ్యర్థుల జాబితాను జిల్లా ఎంపిక కమిటీ ఖరారు చేస్తుందని తెలిపారు. 9 నుంచి 15 వరకు ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికెట్ల పరిశీలన, అప్‌లోడ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 17న అనర్హత అభ్యర్థుల జాబితా వెల్లడిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను 22న మరోసారి ప్రదర్శిస్తామని చెప్పారు. 24న ఖాళీల జాబితాను డీఈవోలు అందజేస్తారని, 25న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని, 29న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని వివరించారు.


మార్చి ఒకటో తేదీన వెబ్ కౌన్సెలింగ్, 5న ఆయా అభ్యర్థులకు నియామకపు పత్రాలు అందజేస్తామని తెలిపారు. ఇన్నాళ్లూ డీఎస్సీ కోర్టు వివాదాల్లో ఉన్నందున నియామకాల్లో జాప్యం జరిగిందన్నారు. ఈ డీఎస్సీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 8086 సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ల ఖాళీల భర్తీపై కోర్టులు తీర్పులను రిజర్వ్‌లో ఉంచాయన్నారు. అవి కూడా వారం రోజుల్లో పరిష్కారమవుతాయని, ఆ వెంటనే స్కూల్ అసిస్టెంట్ల నియామకపు షెడ్యూలు ప్రకటిస్తామని చెప్పారు.
జంబ్లింగ్‌లోనే ఇంటర్ ప్రాక్టికల్స్
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జంబ్లింగ్ విధానంలోనే జరుగుతాయని మంత్రి గంటా పునరుద్ఘాటించారు. నాలుగునెలల క్రితమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గత ప్రభుత్వాలు ఆఖరు నిమిషంలో జంబ్లింగ్‌ను రద్దు చేస్తూ వచ్చాయని, దీంతో కొన్ని ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి తమ ఇబ్బందులను తెలియజేశాయన్నారు. అయినప్పటికీ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేవాలన్న ఉద్దేశంతో జంబ్లింగ్‌ను అమలు చేస్తున్నామని చెప్పారు. ఆయ సెంటర్లలో అవకతవకలు జరగకుండా వీడియో రికార్డింగ్ చేస్తున్నామని పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement