టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు
- తర్వాత టీఆర్‌టీ నోటిఫికేషన్
ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసి, నిబంధనల రూపకల్పనకు చర్యలు చేపట్టినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ పేర్కొన్నారు. మొత్తానికి టెట్ ఫలితాలను వెల్లడించిన తరువాత ఉపాధ్యాయ నియామకాలకు టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. అయితే అంతకంటే ముందుగానే విద్యాశాఖ రూపొందించే నియమ, నిబంధనలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. నిబంధనలతోపాటు కేటగిరీల వారీగా పోస్టుల రాత పరీక్షలో పరిగణనలోకి తీసుకునే సిలబస్‌ను ఖరారు చేసే పని చేస్తోంది. మొత్తానికి ఈనెలాఖరుకల్లా నిబంధనలను, జిల్లాల వారీగా, పోస్టుల వారీగా రోస్టర్, రిజర్వేషన్ల విధానాన్ని ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
వీటిపై టీఎస్‌పీఎస్సీతోనూ సంప్రదించే అవకాశం ఉంది. ప్రస్తుతం గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీకి అనుసరిస్తున్న పరీక్ష విధానంలో ప్రిలిమ్స్, మెయిన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టడమే కాకుండా సబ్జెక్టు పేపర్లతోపాటు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పేపర్లను ప్రవేశ పెట్టింది. అయితే పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో వాటిని పొందుపరచాలా వద్దా? అనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు విధించిన ఈ నిబంధనలే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీతో సంప్రదింపులు జరిపాకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. టెట్ ఫలితాల నాటికి ప్రభుత్వం వాటిపై ఉత్తర్వులు జారీ చేస్తే టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను వచ్చే నెలలోనే జారీ చేయనుంది. లేదంటే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.