tet results
-
రేపు టెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: 12న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు వెల్లడి కాను న్నాయి. మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 2,86,381 దరఖాస్తులు రాగా, 2,36,487 మంది హాజరయ్యారు.3న ప్రాథమిక ‘కీ’విడుదల చేశారు. అభ్యంతరాల అనంతరం ఈనెల 12న ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
టెట్ ప్రాథమిక కీ, తుది కీ మధ్య తేడాలు.. ఇంత‘కీ’ ఏం జరిగింది!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించి ప్రాథమిక ‘కీ’లో వచ్చిన అభ్యంతరాలను శాస్త్రీయంగా చూడకపోవడం..తుది ’కీ’ఆలస్యంగా వెబ్సైట్ ఉంచడంతో పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక కీ చూసుకొని పాస్ గ్యారంటీ అనుకున్నవారు కూడా ఫెయిల్ అవ్వడం అనేక సందేహాలకు తావిస్తోంది. ప్రాథమిక కీలో ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్స్ తుది కీ వచ్చే నాటికి మార్చడం కూడా ఈ పరిస్థితికి కారణమని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు నిజమని భావిస్తే, సాధారణంగా రెండు ఆప్షన్లు ఇస్తారని, అప్పుడు అభ్యర్థులకు అన్యాయం జరగదని టెట్ రాసినవారు అంటున్నారు. ఇదేమీలేకుండా, ఆప్షన్లు మార్చడం వల్ల కొంతమంది ఐదు మార్కుల వరకూ కోల్పోయినట్టు చెబుతున్నారు. ఒకటి, రెండు మార్కులు తక్కువై అర్హత సాధించలేని వారు దాదాపు 50 వేల మంది ఉన్నారని అధికారవర్గాలు అంటున్నాయి. అధికారుల గోప్యతపై అనుమానాలు టెట్ ఫలితాల వెల్లడి సందర్భంగా అధికారులు ఏ విషయంపైనా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. తుది కీ కూడా ఆలస్యంగా వెబ్సైట్లో ఉంచారు. ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు ఏమిటి? అందులో వేటిని పరిగణనలోనికి తీసుకున్నారు? వేటిలో మార్పులు చేశారు? అనే సమాచారం వెల్లడించనేలేదు. టెట్ రాసిన అభ్యర్థులు ఓంఎంఆర్ షీట్ ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ..టెట్ కన్వినర్‌ను కలిసినా స్పందించలేదు. ఈ విషయమై పలువురు మంత్రిని కలిసి, టెట్, ఆప్షన్ల మార్పు, సమాచారం వెల్లడించకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పరీక్ష, ఫలితాల వెల్లడిపై సరైన సమన్వయం లేదని అధికారవర్గాల నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. టెట్ కన్వీనర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని, ఏ సమాచారం చెప్పేందుకు వెళ్లినా ఆమె పట్టించుకోవడం లేదని కొందరు అధికారులు అంటున్నారు. మంత్రి కార్యాలయం నుంచి వచ్చే సూచనలు కూడా పరిశీలించని సందర్భాలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహణ తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దారుణంగా దెబ్బతిన్న పేపర్–2 అభ్యర్థులు పేపర్–2కు రాష్ట్రవ్యాప్తంగా 2,08,499 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 1,90,047 మంది పరీక్ష రాశారు. కేవలం 29,073 మంది మాత్రమే అర్హత సాధించారు. జనరల్ కేటగిరీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫలితాలు దారుణంగా పడిపోయాయి. కేవలం 563 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే 3.65 శాతం ఉత్తీర్ణతగా నమోదైంది. జనరల్ కేటగిరీలో 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే అర్హత సాధిస్తారు. ఈ కారణంగా చాలామంది ఫెయిల్ అయినట్టు చెబుతున్నారు. -
టెట్‌లో తగ్గిన రిజల్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 15న జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. టెట్ రెండు పేపర్లకు కలిపి 4,13,629 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా వారిలో 1,11,562 మంది అర్హత పొందారు. పేపర్–1ను 2,23,582 మంది రాస్తే 82,489 (36 .98%)మంది అర్హత పొందగా పేపర్–2లో మేథ్స్, సైన్స్ సబ్జెక్టులను 1,01,134 మంది రాస్తే 18,874 మంది (18.66%), సోషల్ స్టడీస్‌సబ్జెక్టును88,913 మంది రాస్తే 10,199 మంది (11.47%) అర్హత సాధించారు. పేపర్–2లో 1,90, 047 మందికి గాను 29,073 (15.30%) మంది అర్హత పొందారు. టెట్‌కు సంబంధించిన అధికారిక వెబ్సైట్ https://cgg.gov.inÌలో తుది ‘కీ’తోపాటు ఫలితాలు అందుబాటులో ఉన్నాయని టీఎస్ టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పడిపోయిన ఫలితాలు...: ఉమ్మడి రాష్ట్రంలో 2011లో టెట్ నిర్వహించగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి ఇప్పటి వరకూ ఐదుసార్లు పరీక్ష జరిగింది. ఇప్పటికే దాదాపు 3.5 లక్షల మంది టెట్ అర్హులు రాష్ట్రంలో ఉన్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది టెట్ ఫలితాలు దారుణంగా పడిపోయాయి. సాధారణంగా పేపర్–1లో 2022లో మినహా అంతకు ముందు రెండేళ్లలో 50 శాతానికిపైగా రిజల్ట్ వచ్చింది. పేపర్–2లో మొదట్నుంచీ రిజల్ట్ తగ్గుతున్నా ఈసారి అతితక్కువగా 15.30 శాతమే నమోదైంది. గతేడాది ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు ఇవ్వడం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామనే ప్రకటనతో అభ్యర్థులు కోచింగ్ కేంద్రాలకు వెళ్లి మరీ టెట్‌కు సన్నద్ధమయ్యారు. ఈసారి టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేసినా పోస్టులు తక్కువగా ఉండటం, రోస్టర్ విధానం తర్వాత కొన్ని జిల్లాల్లో ఏమాత్రం ఖాళీలు లేకపోవడంతో ఎక్కువ మంది టెట్‌కు ప్రిపేర్ కాలేదు. టీఆర్టీ దరఖాస్తుకు అర్హులు తాజాగా టెట్ ఉత్తీర్ణులు ప్రస్తుతం ప్రభుత్వం నియమించే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టెట్ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితాలు వెల్లడవ్వడంతో ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలు కూడా ఆలస్యం చేయకుండా ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. టీఆరీ్టకి ఇప్పటివరకు పెద్దగా దరఖాస్తులు రాలేదు. కొన్ని జిల్లాల్లో స్థానికత ఉన్నప్పటికీ పోస్టులు లేవని, పోస్టులు ఉన్న చోట నాన్–లోకల్ కోటాలో వెళ్లినా, ఆ కేటగిరీలో తక్కువ పోస్టులు ఉన్నాయని అభ్యర్థులు టీఆర్టీకి వెనకడుగు వేస్తున్నారు. తాజా టెట్ అర్హులు టీచర్ పోస్టులకు ఎక్కువగా దరఖాస్తు చేసే వీలుందని భావిస్తున్నారు. -
టెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాల విడుదలయ్యాయి.. బుధవారం (సెప్టెంబర్ 27) ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను అధికారులు విడుదల చేశారు.టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. ఫలితాలు sakshieducation.com వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. TS TET 2023 Results - Paper 1 | Paper 2 కాగా ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా 2,052 కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష కోసం దాదాపు 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పేపర్-1కు 2.26 లక్షలు(84.12శాతం), పేపర్-2కు 1.90 లక్షల మంది (91.11 శాతం) హాజరయ్యారు. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్‌లో క్వాలిఫై కావడం తప్పనిసరి అని తెలిసిందే. దీని కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు.. పేపర్ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు. చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్ -
రేపు టెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) ఫలితాలను ఈనెల 27న విడుదల చేయనున్నారు. ఇందుకు కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు విడుదలవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. 27వ తేదీన తుది ‘కీ’ తో పాటు ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. టెట్ పరీక్ష పేపర్–1కు 2,69,557 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 2,26,744 (84.1 శాతం) మంది పరీక్ష రాశారు. పేపర్–2కు 2,08,498 మంది దరఖాస్తు చేస్తే, 1,89,963 మంది (91.11 శాతం) పరీక్ష రాశారు. వచ్చే నెల జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కి టెట్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసే వీలుంది. ఈ కారణంగా టెట్ ఫలితాలను ఆలస్యం చేయకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సీటెట్ ఫలితాల విడుదల సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సోమవారం విడుదల చేసింది. ఈ పరీక్ష ఆగస్టు 20వ తేదీన దేశవ్యాప్తంగా జరిగింది. మొత్తం 29 లక్షల మంది ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. పేపర్–1కు (1–5 తరగతి బోధకు అర్హత) 15 లక్షల మంది, పేపర్–2కు (6–8 తరగతులకు బోధనకు అర్హత) 14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హత సాధిస్తే దేశవ్యాప్తంగా ప్రముఖ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేసే వీలుంది. -
TS TET Results 2022: టెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను అధికారులు వెల్లడించారు. టెట్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (https://results.sakshieducation.com/)లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. - టెట్ పేపర్-1లో 1,04,078 మంది అభ్యర్థులు అర్హత, 32.68% ఉత్తీర్ణత సాధించారు. - టెట్ పేపర్-2లో 1,24,535 మంది అర్హత, 49.64 % ఉత్తీర్ణత సాధించారు. కాగా, ఇప్పటికే టెట్ ఫైనల్ కీని టెట్ కన్వీనర్ రాధారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక, జూన్ 12న నిర్వహించిన టెట్ పరీక్ష పేపర్-1కు 3,18,506, పేపర్-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. -
TS TET 2022: టెట్ ఫలితాల విడుదలపై విద్యాశాఖ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్-2022) ఫలితాల విడుదలపై రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఫలితాల్లో జాప్యానికి ఆస్కారం లేకుండా జులై 1 న విడుదల చేస్తామని వెల్లడించింది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో విద్యా శాఖ పనితీరును ఆమె సమీక్షించారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎస్ఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జులై 1న టెట్ ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. చదవండి👇 టెట్ @ 90 శాతం ఇంటర్ ఫలితాలు విడుదల.. ఒకే క్లిక్‌లో రిజల్ట్స్ ఇలా చూడండి -
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీలో ఇటీవల నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2018 (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖపట్నం ఏయూలోని డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. 57.48 శాతం మంది అభ్యర్తులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 3,97,957 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా 3,70,573 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 2.13 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో మొత్తం 113 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల ప్రకారం అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకం చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి కాగా 10,351 ఉపాధ్యాయ పోస్టులకు జూలై 6న ఏపీపీఎస్సీ నోటిఫీకేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. జులై 7 నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తులు స్వీకరణ, ఆగస్టు 24, 25, 26 తేదీల్లో రాత పరీక్ష, సెప్టెంబర్ 15న డీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి గంటా గతంలో వెల్లడించారు. -
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇటీవల నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2018 (టెట్) ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఏపీ టెట్‌కు 4,14,120 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ పేపర్ -1లో 57.88 శాతం అభ్యర్థులు, పేపర్ -2లో 37.26 శాతం మంది, పేపర్ -3లో 43.60 శాతం అభ్యర్థులు అర్హత సాధించారని మంత్రి గంటా తెలిపారు. మొత్తంగా 25 శాతం అభ్యర్థులు 90 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఏపీ టెట్ ఫలితాలు . ఈ నెల 4న ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక కీని విడుదల చేసింది. టెట్ పేపర్-1పై అత్యధికంగా 9,867 అభ్యంతరాలు రాగా, 9,867, పేపర్-2పై 4,162, పేపర్-3పై అభ్యర్థుల నుంచి 1,858 అభ్యంతరాలు వచ్చిన విషయం తెలిసిందే. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఫలితాలను విడుదల చేశారు. -
డీఎస్సీ ఇంకొన్నాళ్లు ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీకి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. టెట్ ఫలితాలు వెల్లడించిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొన్నా.. వాటికి సంబంధించిన నిబంధనల రూపకల్పన ఇంకా పూర్తి కాలేదు. దీంతో 8,792 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీలో ఆలస్యం తప్పేలా లేదు. పైగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విదేశీ పర్యటనలో ఉండటం కూడా ఇందుకు ఒక కారణంగా మారింది. ఆయన ఈ నెల 10న వచ్చాక అర్హతలు, నిబంధనలను ఖరారు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కంటే ముందుగా ఉపాధ్యాయ బదిలీలు చేయాల్సి ఉంటుంది. సీనియారిటీ కలిగిన టీచర్లకు ప్రాధాన్య పాయింట్లు ఉన్నందున వారికి ముందుగా బదిలీలు చేపట్టాకే కొత్త వారికి పోస్టింగులు ఇచ్చే వీలుంటుంది. -
పేపర్–2లో ఢమాల్!
టెట్ ఫలితాలు విడుదల ► పేపర్–1లో మాత్రం స్వల్పంగా పెరిగిన అర్హులు ► విత్‌హెల్డ్‌లో 1,632 మంది ఫలితాలు ► పేపర్–1లో టాప్ రాజన్న సిరిసిల్ల జిల్లా.. ► పేపర్–2లో మంచిర్యాల టాప్ ► ‘విత్‌హెల్డ్’వారి ఫలితాలనూ పరిశీలిస్తామన్న పాఠశాల విద్యా కమిషనర్ ► వారు తగిన కారణాలు చూపుతూ దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడి సాక్షి, హైదరాబాద్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు వెల్లడయ్యాయి. పాఠశాల విద్యా డైరెక్టరేట్‌లో శుక్రవారం పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ ఈ ఫలితాలను విడుదల చేశారు. టెట్ పేపర్–1లో గత టెట్ కంటే అర్హుల శాతం పెరగగా... పేపర్–2లో అర్హుల శాతం బాగా తగ్గిపోయింది. పేపర్–1లో గతేడాది 54.45 శాతం మంది అర్హత సాధించగా.. ఈసారి 57.37 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పేపర్–2లో గతేడాది 25.04 శాతం మంది ఉత్తీర్ణులవగా.. ఈసారి 19.51 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. పేపర్–1లో అత్యధికంగా 74.27 అర్హుల శాతంతో రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 48.40 శాతం మందితో రంగారెడ్డి జిల్లా చివరి స్థానంలో ఉంది. పేపర్–2లో 24.02 శాతం అర్హులతో మంచిర్యాల జిల్లా తొలిస్థానంలో పొందగా.. 16.80 శాతంతో సిద్దిపేట జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇక పేపర్–1, పేపర్–2లలో 150 గరిష్ట మార్కులకు గాను పలువురు అభ్యర్థులు అత్యధికంగా 136 వరకు కూడా సాధించినట్లు తెలిసింది. వెయిటేజీ నేపథ్యంలో.. ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉండటంతో.. మార్కులు పెంచుకునేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 150 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షల్లో జనరల్ అభ్యర్థులు కనీసంగా 60 శాతం మార్కులు, బీసీలు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 40 శాతం మార్కులు సాధిస్తేనే అర్హత సాధించినట్లుగా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వరుసగా టెట్లలో పేపర్–1లో అర్హుల సంఖ్య దాదాపుగా పెరుగుతుండగా.. పేపర్–2లో మాత్రం తగ్గిపోతూ వస్తోంది. ఈసారి అత్యంత తక్కువగా కేవలం 19.51 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదైంది. పరీక్షలో ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్‌తో కూడిన ప్రశ్నలు ఇవ్వడంతో అర్హత శాతం తగ్గినట్లు చెబుతున్నారు. పేపర్–1లో పెరిగిన ఉత్తీర్ణత డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) అభ్యర్థులకు సంబంధించిన పేపర్–1 పరీక్షకు 1,11,647 మంది దరఖాస్తు చేసుకోగా.. 98,848 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 56,708 మంది (57.37 శాతం) అర్హత సాధించారు. పేపర్–2లో తగ్గిన అర్హులు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), పండిట్ కోర్సులు చేసిన అభ్యర్థులకు నిర్వహించిన పేపర్–2కు 2,56,265 మంది దరఖాస్తు చేసుకోగా... 2,30,932 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 45,055 మంది (19.51శాతం) మాత్రమే అర్హత సాధించారు. ఇందులో గణితం–సైన్స్ విభాగంలో 1,11,018 మంది పరీక్ష రాయగా.. 20,323 మంది (18.31 శాతం) అర్హత సాధించారు. సాంఘిక శాస్త్రం విభాగంలో 1,19,914 మంది పరీక్ష రాయగా.. 24,732 మంది (20.62 శాతం) అర్హత సా«ధించారు. విత్ హెల్డ్పై పరిశీలనకు కమిటీ టెట్ ఓఎంఆర్ జవాబు పత్రంలో అభ్యర్థి వివరాలను పొందుపర్చకపోవడం, తప్పుడు వివరాలు ఇవ్వడం, డబుల్ బబ్లింగ్ చేయడం వంటి తప్పిదాలకు పాల్పడిన 1,632 మంది అభ్యర్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వెల్లడించారు. అవి ఎవరికి సంబంధించిన జవాబు పత్రాలన్నది గుర్తించడం కష్టమని.. అయితే ఏదైనా ప్రత్యేక కారణంతో అభ్యర్థులెవరైనా దరఖాస్తు చేసుకుంటే పరిశీలన జరుపుతామని తెలిపారు. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు. -
టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు
- టెట్ ఫలితాల నాటికి నియామక నిబంధనలు - 23న టెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి - వచ్చే నెల 5న ఫలితాలు! - తర్వాత టీఆర్టీ నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల్లో అమలు చేయాల్సిన నిబంధనల రూపకల్పనపై విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. కేటగిరీల వారీగా అర్హతలు, రాత పరీక్షల విధానం తదితర అంశాలతో కూడిన నిబంధనలను రూపొందించే పనిలో పడింది. మరో వైపు ఈ నెల 23న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. వాటికి సంబంధించిన హాల్‌టికెట్లనూ శనివారం అందుబాటులోకి తెచ్చింది. రాత పరీక్ష ఫలితాల ను వచ్చేనెల 5న విడుదల చేయాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ నియామక నిబంధనల రూపకల్పనను వేగవంతం చేసింది. ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసి, నిబంధనల రూపకల్పనకు చర్యలు చేపట్టినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ పేర్కొన్నారు. మొత్తానికి టెట్ ఫలితాలను వెల్లడించిన తరువాత ఉపాధ్యాయ నియామకాలకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లను చేస్తోంది. అయితే అంతకంటే ముందుగానే విద్యాశాఖ రూపొందించే నియమ, నిబంధనలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. నిబంధనలతోపాటు కేటగిరీల వారీగా పోస్టుల రాత పరీక్షలో పరిగణనలోకి తీసుకునే సిలబస్‌ను ఖరారు చేసే పని చేస్తోంది. మొత్తానికి ఈనెలాఖరుకల్లా నిబంధనలను, జిల్లాల వారీగా, పోస్టుల వారీగా రోస్టర్, రిజర్వేషన్ల విధానాన్ని ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వీటిపై టీఎస్పీఎస్సీతోనూ సంప్రదించే అవకాశం ఉంది. ప్రస్తుతం గురుకులాల్లో టీచర్ పోస్టుల భర్తీకి అనుసరిస్తున్న పరీక్ష విధానంలో ప్రిలిమ్స్, మెయిన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టడమే కాకుండా సబ్జెక్టు పేపర్లతోపాటు జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ పేపర్లను ప్రవేశ పెట్టింది. అయితే పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో వాటిని పొందుపరచాలా వద్దా? అనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు విధించిన ఈ నిబంధనలే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీతో సంప్రదింపులు జరిపాకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. టెట్ ఫలితాల నాటికి ప్రభుత్వం వాటిపై ఉత్తర్వులు జారీ చేస్తే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ను వచ్చే నెలలోనే జారీ చేయనుంది. లేదంటే మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. -
టెట్‌కు పెరిగిన దరఖాస్తులు
- గతేడాది కంటే 12 వేల దరఖాస్తులు అధికం - ఈ నెల 23న ఉపాధ్యాయ అర్హత పరీక్ష - 17 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఈ నెల 23న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షకు (టెట్) భారీగా దరఖాస్తులు వచ్చాయి. గతేడాది మే 22న నిర్వహించిన టెట్‌కు 3,40,567 మంది అభ్యర్థులు హాజరు కాగా, ఈనెల 23న జరిగే టెట్‌కు హాజరయ్యేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,52,816 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది కంటే ఈసారి దాదాపు 12 వేల మంది అధికంగా దరఖాస్తు చేసుకున్నారు. అందులో పేపర్–1 పరీక్ష రాసేందుకు 96,551 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్–2 పరీక్ష రాసేందుకు 2,41,169 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లూ రాసేందుకు 15,096 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారు ఈనెల 17 నుంచి వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈనెల 23న పేపర్–1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 వరకు నిర్వహించేందుకు టెట్ కన్వీనర్ బి.శేషుకుమారి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోనూ టెట్ పరీక్షలను నిర్వహణకు అవసరమైన పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వచ్చే నెల 5న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. రంగారెడ్డిలో అత్యధికం టెట్‌కు రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అభ్యర్థులు హాజరు కానున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏర్పాటు చేసే పరీక్ష కేంద్రాల్లో 60,452 మంది హాజరయ్యే అవకాశముంది. ఖమ్మం జిల్లాలోని కేంద్రాల్లో 30,741 మంది హాజరుకానున్నారు. అతి తక్కువగా 1,488 మంది యాదాద్రిలో హాజరు కానున్నారు. -
టెట్ ఫలితాల్లో ‘అవనిగడ్డ’ విద్యార్థుల ప్రభంజనం
నల్లగొండ : టెట్ ఫలితాల్లో నల్లగొండలోని అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ప్రభంజనం సృష్టించింది. పేపర్-1లో సీహెచ్ మౌనిక 126 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచినట్లు డెరైక్టర్ కె.చంద్రశేఖర్‌గౌడ్ తెలిపారు. వి.దివ్య 122 మార్కులు సాధించి (8 వర్యాంకు), ఎ.నిఖిల 121 మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పేపర్-1లో మొదటి పది స్థానాలు అవనిగడ్డ విద్యార్థులే కైవసం చేసుకున్నట్లు చెప్పారు. పేపర్-2, పేపర్-1లో అన్ని విభాగాల్లో 150 మంది విద్యార్థులు వందకు పైగా మార్కులు సాధించడంతో శిక్షణ తీసుకున్న వారిలో 96 శాతం అర్హత సాధించారని డెరైక్టర్ తెలిపారు. -
టెట్ ఫలితాలు విడుదల
పేపర్-1లో 73.92 శాతం మందికి అర్హత సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మార్చి 16న జరిగిన ఈ పరీక్ష ఫలితాలను టెట్ వెబ్సైట్ www.aptet.cgg.gov.in లో పొందుపరిచారు. పేపర్-1కు 56,929 మంది, పేపర్-2కు 3,40,561 మంది అభ్యర్థులు హాజరయ్యారు. డీఎడ్ అభ్యర్థులు రాసిన పేపర్-1లో 42,086 మంది (73.92 శాతం) మంది అర్హత సాధించారు. బీఎడ్ అభ్యర్థులు రాసిన పేపర్-2లో 1,10,099 మంది (32.32 శాతం) అర్హత మార్కులు సంపాదించారు. టెట్‌లో అర్హత సంపాదించడానికి మొత్తం 150 మార్కుల్లో జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం మార్కులు రావాలి. ఈసారి నలుగురు విద్యార్థులకు గరిష్టంగా 135 మార్కులొచ్చాయి. మార్కుల జాబితాలను మే 15 నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికార వర్గాలు చెప్పాయి. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా వెబ్సైట్లో చూసుకోవడానికి అవకాశం కల్పించామన్నాయి. ఇవి జూన్ 15 దాకా సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నాయి. పలుమార్లు ఆలస్యమయ్యాక చివరికి మార్చి 16న టెట్ జరగడం తెలిసిందే. విద్యా శాఖ ప్రకటించిన ‘కీ’ మీద దాదాపు 25 వేల అభ్యంతరాలు రావడం, విద్యా శాఖ కమిషనర్ జగదీశ్వర్ ఎన్నికల విధులపై ఇతర రాష్ట్రాలకు వెళ్లడం తదితర కారణాల వల్ల ఫలితాల వెల్లడి కూడా ఆలస్యమైంది.