టెట్‌ ప్రాథమిక కీ, తుది కీ మధ్య తేడాలు.. ఇంత‘కీ’ ఏం జరిగింది! | TS Tet: Demand to keep OMR sheets online | Sakshi
Sakshi News home page

టెట్‌ ప్రాథమిక కీ, తుది కీ మధ్య తేడాలు.. ఇంత‘కీ’ ఏం జరిగింది!

Published Fri, Sep 29 2023 4:04 AM | Last Updated on Fri, Sep 29 2023 8:04 AM

TS Tet: Demand to keep OMR sheets online - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు సంబంధించి ప్రాథమిక ‘కీ’లో వచ్చిన అభ్యంతరాలను శాస్త్రీయంగా చూడకపోవడం..తుది ’కీ’ఆలస్యంగా వెబ్‌సైట్‌ ఉంచడంతో పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక కీ చూసుకొని పాస్‌ గ్యారంటీ అనుకున్నవారు కూడా ఫెయిల్‌ అవ్వడం అనేక సందేహాలకు తావిస్తోంది.

ప్రాథమిక కీలో ఇచ్చిన ఆన్సర్‌ ఆప్షన్స్‌ తుది కీ వచ్చే నాటికి మార్చడం కూడా ఈ పరిస్థితికి కారణమని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు నిజమని భావిస్తే, సాధారణంగా రెండు ఆప్షన్లు ఇస్తారని, అప్పుడు అభ్యర్థులకు అన్యాయం జరగదని టెట్‌ రాసినవారు అంటున్నారు. ఇదేమీలేకుండా, ఆప్షన్లు మార్చడం వల్ల కొంతమంది ఐదు మార్కుల వరకూ కోల్పోయినట్టు చెబుతున్నారు. ఒకటి, రెండు మార్కులు తక్కువై అర్హత సాధించలేని వారు దాదాపు 50 వేల మంది ఉన్నారని అధికారవర్గాలు అంటున్నాయి. 

అధికారుల గోప్యతపై అనుమానాలు  
టెట్‌ ఫలితాల వెల్లడి సందర్భంగా అధికారులు ఏ విషయంపైనా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. తుది కీ కూడా ఆలస్యంగా వెబ్‌సైట్‌లో ఉంచారు. ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు ఏమిటి? అందులో వేటిని పరిగణనలోనికి తీసుకున్నారు? వేటిలో మార్పులు చేశారు? అనే సమాచారం వెల్లడించనేలేదు. టెట్‌ రాసిన అభ్యర్థులు ఓంఎంఆర్‌ షీట్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేస్తూ..టెట్‌ కన్వినర్‌ను కలిసినా స్పందించలేదు.

ఈ విషయమై పలువురు మంత్రిని కలిసి, టెట్, ఆప్షన్ల మార్పు, సమాచారం వెల్లడించకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పరీక్ష, ఫలితాల వెల్లడిపై సరైన సమన్వయం లేదని అధికారవర్గాల నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. టెట్‌ కన్వీనర్‌ ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని, ఏ సమాచారం చెప్పేందుకు వెళ్లినా ఆమె పట్టించుకోవడం లేదని కొందరు అధికారులు అంటున్నారు. మంత్రి కార్యాలయం నుంచి వచ్చే సూచనలు కూడా పరిశీలించని సందర్భాలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టెట్‌ నిర్వహణ తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

దారుణంగా దెబ్బతిన్న పేపర్‌–2 అభ్యర్థులు
పేపర్‌–2కు రాష్ట్రవ్యాప్తంగా 2,08,499 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 1,90,047 మంది పరీక్ష రాశారు. కేవలం 29,073 మంది మాత్రమే అర్హత సాధించారు. జనరల్‌ కేటగిరీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫలితాలు దారుణంగా పడిపోయాయి. కేవలం 563 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే 3.65 శాతం ఉత్తీర్ణతగా నమోదైంది. జనరల్‌ కేటగిరీలో 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే అర్హత సాధిస్తారు. ఈ కారణంగా చాలామంది ఫెయిల్‌ అయినట్టు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement