చెన్నై: ఇప్పటిదాకా చిన్నాచితకా బ్రాండ్లు, స్మార్ట్‌ఫోన్ల వంటి ఉత్పత్తులకు మాత్రమే పరిమితమైన ఆన్‌లైన్ ఈ–కామర్స్ పోర్టల్స్ వైపు ఇప్పుడు బడా కంపెనీలు కూడా చూస్తున్నాయి. నెస్లే, శాంసంగ్ మొదలుకుని మారికో, హిందుస్తాన్ యూనిలీవర్ వంటి సంస్థల దాకా ఆన్‌లైన్ బాట పడుతున్నాయి. ఆహారోత్పత్తుల నుంచి సౌందర్య సాధనాలు, లక్షల రూపాయల ఖరీదు చేసే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల బ్రాండ్స్‌ను కూడా ఆవిష్కరిస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ సంస్థ నెస్లే ఇండియా ఇటీవలే తమ పాపులర్ మ్యాగీ బ్రాండ్‌లో కొత్త వేరియంట్‌ను ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఆవిష్కరించింది. అటు కొరియన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తమ అంతర్జాతీయ ఫ్రిజ్ బ్రాండ్ ’ఫ్యామిలీ హబ్’ ను అమెజాన్‌లోనూ, ఇతరత్రా ఎక్స్‌క్లూజివ్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ప్రవేశపెట్టింది. దీని ధర దాదాపు రూ.2,80,000. అటు హర్మన్ ఇంటర్నేషనల్ సంస్థ తమ ఆడియో బ్రాండ్ జేబీఎల్ కోసం ఆన్‌లైన్ స్టోర్ ప్రారంభించింది. హిందుస్తాన్ యూనిలీవర్ ఇండియా, మారికో వంటి సంస్థలు కేవలం ఆన్‌లైన్‌లోనే విక్రయించే పురుషుల గ్రూమింగ్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాయి. హ్యుందాయ్ ఇండియా వంటి ఆటోమొబైల్ సంస్థలు వాహనాల అప్‌గ్రేడెడ్ మోడల్స్‌ను ఆవిష్కరించేందుకు డిజిటల్ మాధ్యమాలనే ఉపయోగించుకుంటున్నాయి.
ఆన్‌లైన్‌కు అనేక కారణాలు..
కొంగొత్త ఉత్పత్తులను ఆఫ్‌లైన్ మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ముందుగానే ఆన్‌లైన్‌లో ఆవిష్కరించడం వల్ల అనేక ప్రయోజనాలున్నట్లు ఆయా కంపెనీలు చెబుతున్నాయి. సదరు ఉత్పత్తి విషయంలో అత్యంత వేగంగా కస్టమర్ల స్పందనను తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతోందని నెస్లే ఇండియా వర్గాలు వెల్లడించాయి. ‘‘ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రవేశపెట్టిన మ్యాగీ స్పెషల్ మసాలా నూడుల్స్‌కి మంచి స్పందన వచ్చింది. మూడు రోజుల్లోనే ఏకంగా 1,00,000 పైచిలుకు సింగిల్ యూనిట్ ప్యాక్స్‌ని విక్రయించాం’’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మరో ఎఫ్‌ఎంసీజీ సంస్థ మారికో.. ప్రత్యేకంగా స్టూడియో ఎక్స్ పేరిట డిజిటల్ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. పురుషుల గ్రూమింగ్ ఉత్పత్తుల విభాగం సెట్ వెట్ కింద దీన్ని ప్రవేశపెట్టింది. ఏడాది వ్యవధిలో మరో 5–6 డిజిటల్ ఉత్పత్తులు ఆవిష్కరించే అవకాశం ఉందని సంస్థ వర్గాలు తెలిపాయి. అటు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్ కూడా తమ బ్రిల్ క్రీమ్ శ్రేణికి ఆన్‌లైన్ లేబుల్ కింద కొత్త రూపురేఖలిస్తోంది. చాలా సరళమైనది, తక్కువ వ్యయాలతో కూడుకున్నదే కాకుండా అవసరమైనంత మేర విస్తరించుకోవడానికి అనువైనది కూడా కావడమే డిజిటల్ మాధ్యమంతో ప్రయోజనమని హ్యుందాయ్ ఇండియా సీనియర్ అధికారులు తెలిపారు. కంపెనీ ఇటీవలే క్రెటా కారుకు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ఆన్‌లైన్‌లోనే ఆవిష్కరించింది. అంతక్రితమే గ్రాండ్ ఐ10ను కూడా ప్రవేశపెట్టింది.
తేలిగ్గానే బ్రాండ్ సృష్టి..
కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టేటప్పుడు అనేక రిస్కులుంటాయి. వాటికి స్పందన ఎలా ఉంటుందో ముందుగా తెలియదు. ఒకవేళ డిమాండ్ ఉంటుందనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఉత్పత్తి చేసినా.. కొనుగోలుదారులు ఇష్టపడకపోతే అప్పటిదాకా పెట్టిన పెట్టుబడి వృథా అవుతుంది. కొనుగోలుదారుల నాడి తెలుసుకునేందుకు ఇప్పటిదాకా వ్యయాలతో కూడుకున్న ఆఫ్‌లైన్ మార్కెట్ ఒక్కటే మార్గంగా ఉండేది. కానీ, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి, ఆన్‌లైన్ షాపింగ్‌పై అవగాహన పెరుగుతున్న కొద్దీ కంపెనీలు తమ తమ ఉత్పత్తులకుండే డిమాండ్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించుకునేందుకు డిజిటల్ మాధ్యమం కూడా తోడవుతోంది. ఏదైనా బ్రాండ్‌ను సృష్టించడానికి ఇది చాలా చౌకైన మాధ్యమం అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఉత్పత్తికి స్పందన సరిగ్గా లేకపోయిన పక్షంలో అక్కడితో ఆగిపోవచ్చని.. బోలెడు ఖర్చు పెట్టి ఆఫ్‌లైన్ మార్కెట్లోకి వెళ్లనక్కర్లేదని పేర్కొన్నాయి.
పెరుగుతున్న ఆన్‌లైన్ కొనుగోళ్లు..
అంతర్జాతీయ బ్రాండ్లు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు కూడా ఆన్‌లైన్ మాధ్యమానికి గణనీయంగా ఉపయోగపడుతోంది. గడిచిన కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌లో టీవీల కొనుగోళ్లకు సంబంధించి బిల్లింగ్ పరిమాణం సగటున 50 శాతం దాకా పెరిగింది. గత ఏడాది వ్యవధిలో స్మార్ట్‌ఫోన్లు, ఇతరత్రా గృహోపకరణాల బిల్లింగ్ పరిమాణం 20 శాతం మేర పెరిగింది. రూ.30,000 పైగా ఖరీదు చేసే తమ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో సింహభాగం వాటా ఆన్‌లైన్‌దే ఉంటోందని చైనాకి చెందిన స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ వన్‌ప్లస్ వెల్లడించింది. మొత్తం అమ్మకాల్లో ఈ సంస్థ వాటా 11%. దీన్లో ఆఫ్‌లైన్ స్టోర్స్ వాటా నాలుగు కాగా ఆన్‌లైన్ వాటా ఏడు శాతం మేర ఉంటోంది. మరో చైనా స్మార్ట్‌ఫోన్స్ సంస్థ షావోమీ ఇటీవలే పోకో పేరిట కొత్త స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను (ధర రూ.20,999 పైగా) ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఏకంగా లక్ష యూనిట్లు అమ్ముడైపోయినట్లు సంస్థ వెల్లడించింది. నోకియా బ్రాండ్‌ను రీ లాంచ్ చేసిన హెచ్‌ఎండీ గ్లోబల్ అనుభవం కూడా ఇలాంటిదే. నోకియా 6 ఫోన్‌కు అమెజాన్‌లో ఏకంగా పది లక్షల పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఇక ఫ్లిప్‌కార్ట్, నోకియా డాట్‌కామ్‌లో విక్రయించిన నోకియా 6.1 ప్లస్‌కు కూడా భారీ స్పందన వచ్చిందని, నిమిషాల్లోనే స్టాక్ అంతా అమ్ముడైపోయిందని సంస్థ తెలియజేసింది. మరోవైపు తమ జేబీఎల్ బ్రాండ్ అమ్మకాల్లో దాదాపు సగభాగం వాటా ఆన్‌లైన్‌దే ఉంటోందని హర్మన్ ఇంటర్నేషనల్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment