Teacher Eligibility Test
-
టెట్.. సర్వీస్ టీచర్లు లైట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)పై సర్వీస్ టీచర్లు ఆసక్తి చూపడం లేదు. ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న టీచర్లు అసలే ముందుకు రావడం లేదు. ఎవరు ఏ పేపర్ రాయాలో స్పష్టత లేదని.. దానికితోడు సన్నద్ధతకు సమయం లేదని ప్రభుత్వ టీచర్లు పేర్కొంటున్నారు. విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ, ఆపై ఎన్నికల విధులు ఉంటాయని.. అలాంటిది టెట్కెలా సన్నద్ధమవు తామని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 2012కు ముందు సర్వీస్‌లో చేరిన 80వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లకు టెట్ అర్హత లేదు. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం.. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ).. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత పొందాలి. అయితే ఈ పదోన్నతి కూడా అవసరం లేదనే భావన టీచర్లలో కనిపిస్తోందని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. పదోన్నతి వస్తే వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందని కొందరు టీచర్లు అంటున్నారు. ఉన్న ప్రాంతంలోనే పనిచేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. టెట్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో.. సర్వీస్ టీచర్లు విద్యాశాఖ వద్ద అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. పరీక్షపై స్పష్టత ఏదీ? వృత్తి నైపుణ్యం పెంపు కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారని.. పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి అని చెప్పలేదని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే టీచర్లు డీఎడ్ అర్హతతో ఉంటారు. వారు పేపర్–1 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేయాలంటే బీఈడీ అర్హత ఉండాలి. వారు పేపర్–2 రాయాలి. ఎస్జీటీలు పేపర్–1 మాత్రమే రాయగలరు. వారికి బీఈడీ లేని కారణంగా పేపర్–2 రాయలేరు. పదోన్నతులూ పొందే ఆస్కారం లేని పరిస్థితి తలెత్తుతుంది. ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంలుగా మాత్రం వెళ్లే వీలుంది. ఆ పదోన్నతి వస్తే ఇతర స్కూళ్లకు వెళ్లాలి. వేతనంలోనూ పెద్దగా తేడా ఉండదనేది టీచర్ల అభిప్రాయం. అంతేగాకుండా ఎవరు ఏ పేపర్ రాయాలనే దానిపై నోటిఫికేషన్లో స్పష్టత ఇవ్వలేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సన్నద్ధతకు సమయమేదీ? చాలా మంది టీచర్లు పదేళ్ల క్రితమే ఉపాధ్యాయులుగా చేరారు. అప్పటికి, ఇప్పటికి బీఈడీ, డీఎడ్‌లో అనేక మార్పులు వచ్చాయి. టెన్త్ పుస్తకాలు అనేక సార్లు మారాయి. అయితే టీచర్లు వారు బోధించే సబ్జెక్టులో మాత్రమే అప్‌గ్రేడ్ అయ్యారు. కానీ టెట్ రాయాలంటే అన్ని సబ్జెక్టులూ చదవాలి. జూన్ 12 నుంచి టెట్ పరీక్షలు జరగనున్నాయి. టీచర్లు ఏప్రిల్ నెలాఖరు వరకు పరీక్షల నిర్వహణ, పేపర్లు దిద్దడంలోనే నిమగ్నమై ఉంటారు. మే నెలలో లోక్‌సభ ఎన్నికలున్నాయి. టీచర్లు ఆ విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది. దీనితో టెట్ సన్నద్ధతకు అతి తక్కువ రోజులే ఉంటాయని టీచర్లు చెప్తున్నారు. ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు అన్ని తరగతులకు సంబంధించిన అని సబ్జెక్టులు చదివితే తప్ప టెట్‌లో అర్హత మార్కులు సాధించడం కష్టమని అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది టీచర్లు టెట్ రాసేందుకు సుముఖత చూపడం లేదు. టీచర్ల కోసం ప్రత్యేక టెట్ చేపట్టాలని, నోటిఫికేషన్‌లోని అంశాలపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
డీఎడ్ అర్హులకే ఎస్జీటీ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: మెగా డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అర్హులే దరఖాస్తు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పేపర్–2 ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించడం లేదని వెల్లడించింది. బీఈడీ నేపథ్యంతో ఉన్న వాళ్లంతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ విధి విధానాలను రూపొందించింది. ఇందుకు సంబంధించిన సమాచార బులెటిన్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇప్పటికే డీఎస్సీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 2వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి, ఈసారి రిజర్వేషన్ అభ్యర్థులకు కొత్తగా ఇంటర్ మార్కుల అర్హతలో 5 మార్కులు సడలింపు ఇచ్చారు. టెట్ ఉత్తీర్ణులై, బీఈడీ, డీఎడ్ ఆఖరి సంవత్సరంలో ఉన్న వారు కూడా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్ష మొత్తం ఆన్లైన్ విధానంలో ఉంటుందని, 11 పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. కొత్తగా దరఖాస్తు చేసే వాళ్లు రూ.వెయ్యి పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సినవసరం లేదు. పరీక్షాకేంద్రాలు ఇవీ.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి. అయితే ఈ పట్టణాల్లో ఎన్ని పరీక్షాకేంద్రాలు ఉండాలనేది వచ్చే దర ఖాస్తుల ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు. మహిళలకు మూడోవంతు పోస్టులు ఉంటాయి. వయో పరిమితి మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసేవారు 18–46 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. 2005 జూలై 7కు ముందు పుట్టి ఉండాలి. 1977 జూలై 2 నుంచి పుట్టిన వారిని గరిష్ట వయో పరిమితిగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాలు, రోస్టర్ విధానాన్ని తర్వాత వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. నియామక విధానం రాత పరీక్షకు 80 మార్కులుంటాయి. టెట్ వెయిటేజ్ 20 శాతం ఉంటుంది. టీఎస్, ఏపీ టెట్, కేంద్ర టెట్లను పరిగణనలోనికి తీసు కుంటారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దర ఖాస్తు చేసే వారు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45%) డిగ్రీ ఉండాలి. బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి సంవత్సరం బీఈడీ అభ్యర్థులు నియామకం జరిగే నాటికి సర్టిఫికెట్ పొంది ఉండాలి. టెట్ పేపర్ 2 ఉత్తీర్ణులై ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు, సబ్జెక్టు టీచర్లు ఆయా సబ్జెక్టులతో బీఈడీ చేసి ఉండాలి. ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50% మార్కులతో ఇంటర్మిడియెట్ (రిజర్వేషన్ అభ్యర్థులకు 40%) పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల కాలపరిమితి గల డీఎడ్, నాలుగేళ్ల స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. పేపర్–1 టెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు సంబంధిత సబ్జెక్టుల్లో డీఎడ్ చేయాలి. -
టెట్ ప్రాథమిక కీ, తుది కీ మధ్య తేడాలు.. ఇంత‘కీ’ ఏం జరిగింది!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించి ప్రాథమిక ‘కీ’లో వచ్చిన అభ్యంతరాలను శాస్త్రీయంగా చూడకపోవడం..తుది ’కీ’ఆలస్యంగా వెబ్సైట్ ఉంచడంతో పరీక్ష రాసిన అభ్యర్థుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక కీ చూసుకొని పాస్ గ్యారంటీ అనుకున్నవారు కూడా ఫెయిల్ అవ్వడం అనేక సందేహాలకు తావిస్తోంది. ప్రాథమిక కీలో ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్స్ తుది కీ వచ్చే నాటికి మార్చడం కూడా ఈ పరిస్థితికి కారణమని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు నిజమని భావిస్తే, సాధారణంగా రెండు ఆప్షన్లు ఇస్తారని, అప్పుడు అభ్యర్థులకు అన్యాయం జరగదని టెట్ రాసినవారు అంటున్నారు. ఇదేమీలేకుండా, ఆప్షన్లు మార్చడం వల్ల కొంతమంది ఐదు మార్కుల వరకూ కోల్పోయినట్టు చెబుతున్నారు. ఒకటి, రెండు మార్కులు తక్కువై అర్హత సాధించలేని వారు దాదాపు 50 వేల మంది ఉన్నారని అధికారవర్గాలు అంటున్నాయి. అధికారుల గోప్యతపై అనుమానాలు టెట్ ఫలితాల వెల్లడి సందర్భంగా అధికారులు ఏ విషయంపైనా స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. తుది కీ కూడా ఆలస్యంగా వెబ్సైట్లో ఉంచారు. ప్రాథమిక కీలో వచ్చిన అభ్యంతరాలు ఏమిటి? అందులో వేటిని పరిగణనలోనికి తీసుకున్నారు? వేటిలో మార్పులు చేశారు? అనే సమాచారం వెల్లడించనేలేదు. టెట్ రాసిన అభ్యర్థులు ఓంఎంఆర్ షీట్ ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ..టెట్ కన్వినర్‌ను కలిసినా స్పందించలేదు. ఈ విషయమై పలువురు మంత్రిని కలిసి, టెట్, ఆప్షన్ల మార్పు, సమాచారం వెల్లడించకపోవడంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పరీక్ష, ఫలితాల వెల్లడిపై సరైన సమన్వయం లేదని అధికారవర్గాల నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. టెట్ కన్వీనర్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని, ఏ సమాచారం చెప్పేందుకు వెళ్లినా ఆమె పట్టించుకోవడం లేదని కొందరు అధికారులు అంటున్నారు. మంత్రి కార్యాలయం నుంచి వచ్చే సూచనలు కూడా పరిశీలించని సందర్భాలున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టెట్ నిర్వహణ తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దారుణంగా దెబ్బతిన్న పేపర్–2 అభ్యర్థులు పేపర్–2కు రాష్ట్రవ్యాప్తంగా 2,08,499 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 1,90,047 మంది పరీక్ష రాశారు. కేవలం 29,073 మంది మాత్రమే అర్హత సాధించారు. జనరల్ కేటగిరీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఫలితాలు దారుణంగా పడిపోయాయి. కేవలం 563 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అంటే 3.65 శాతం ఉత్తీర్ణతగా నమోదైంది. జనరల్ కేటగిరీలో 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే అర్హత సాధిస్తారు. ఈ కారణంగా చాలామంది ఫెయిల్ అయినట్టు చెబుతున్నారు. -
రేపు టెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) ఫలితాలను ఈనెల 27న విడుదల చేయనున్నారు. ఇందుకు కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు విడుదలవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. 27వ తేదీన తుది ‘కీ’ తో పాటు ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. టెట్ పరీక్ష పేపర్–1కు 2,69,557 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 2,26,744 (84.1 శాతం) మంది పరీక్ష రాశారు. పేపర్–2కు 2,08,498 మంది దరఖాస్తు చేస్తే, 1,89,963 మంది (91.11 శాతం) పరీక్ష రాశారు. వచ్చే నెల జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కి టెట్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసే వీలుంది. ఈ కారణంగా టెట్ ఫలితాలను ఆలస్యం చేయకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సీటెట్ ఫలితాల విడుదల సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సోమవారం విడుదల చేసింది. ఈ పరీక్ష ఆగస్టు 20వ తేదీన దేశవ్యాప్తంగా జరిగింది. మొత్తం 29 లక్షల మంది ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. పేపర్–1కు (1–5 తరగతి బోధకు అర్హత) 15 లక్షల మంది, పేపర్–2కు (6–8 తరగతులకు బోధనకు అర్హత) 14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హత సాధిస్తే దేశవ్యాప్తంగా ప్రముఖ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేసే వీలుంది. -
బీఈడీ అభ్యర్థులకూ పేపర్–1 అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో తీసుకొచ్చిన మార్పులు తమకు నష్టం చేస్తాయని డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో పోటీ తీవ్రంగా ఉంటుందనే భావన వ్యక్తం చేస్తున్నారు. డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ పేపర్–1 రాస్తారు. వీరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు (ఎస్జీటీ) అర్హులవుతారు. బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు సాధారణంగా పేపర్–2 రాస్తారు. వీరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు. కానీ ఇప్పుడు బీఈడీ అభ్యర్థులు కూడా పేపర్–2తో పాటు, పేపర్–1 కూడా రాసే అవకాశం కల్పించారు. దీంతో వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే కాకుండా, ఎస్జీటీ పోస్టులకూ పోటీ పడే వీలుంది. దీంతో తమకు అవకాశాలు తగ్గుతాయని డీఎడ్ అభ్యర్థులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేపడితే.. 6,500 ఎస్జీటీ, 3 వేలపైన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. డీఎడ్ నాణ్యతపైనే సందేహాలు... వాస్తవానికి కొన్నేళ్లుగా డీఎడ్ కాలేజీల్లో ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆ అభ్యర్థులు చెబుతున్నారు. సరైన ఆదరణ లేక ప్రైవేటు కాలేజీలు పెద్దగా దృష్టి పెట్టలేదంటున్నారు. నిజానికి ఐదేళ్లుగా రాష్ట్రంలో సగం డీఎడ్ కాలేజీలు మూతపడ్డాయి. 2016–17లో రాష్ట్రంలో 212 డీఎడ్ కాలేజీలుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య వందకు చేరింది. గతేడాది వంద కాలేజీల్లో 6,250 సీట్లకు గానూ 2,828 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీలు సరైన ఫ్యాకల్టీని నియమించడం లేదనే ఆరోపణలున్నాయి. మారుతున్న బోధనా విధానాలు, విద్యార్థుల సైకాలజీ తెలుసుకుని బోధించే మెళకువలు, ప్రాజెక్టు వర్క్‌లు అసలే ఉండటం లేదని డీఎడ్ అభ్యర్థులు అంటున్నారు. మాకు అన్యాయమే... ఉపాధ్యాయ పోస్టుకు బీఈడీ అభ్యర్థులతో సమానంగా మేమెలా పోటీపడగలం. ఎస్జీటీ పోస్టులను డీఎడ్ వారికే పరిమితం చేస్తే బాగుండేది. చిన్న తరగతులకు బోధించే విధానాలే డీఎడ్‌లో ఉంటాయి. పెద్ద తరగతులకు బీఈడీ సరిపోతుంది. బీఈడీ అభ్యర్థులు తేలికగా మా స్థాయి పోస్టులు సాధిస్తే, మాకు అన్యాయం జరుగుతుంది. – ప్రవీణ్ కుమార్ (డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థి) వారితో పోటీ సరికాదు... బీఈడీ, డీఎడ్ బోధనా విధానంలో చాలా మార్పులున్నాయి. కాలేజీలు కూడా డీఎడ్‌కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం లేదు. ప్రయోగాత్మక బోధనా పద్ధతులపై దృష్టి పెట్టడం లేదు. ఇవన్నీ డీఎడ్ అభ్యర్థులకు ఇబ్బంది కలిగించే అంశాలు. ఈ నేపథ్యంలో మా స్థాయి పోస్టులకు బీఈడీ వారినీ పోటీకి తేవడం సరికాదు. – సంజీవ్ వర్థన్ (టెట్‌కు దరఖాస్తు చేసిన డీఎడ్ అభ్యర్థి) -
జూలై 7న సెంట్రల్ టెట్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష అయిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును (సీటెట్) వచ్చే జూలై 7న నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చర్యలు చేపట్టింది. మంగళవారం నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు www. ctet. nic. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, పరీక్ష ఫీజును వచ్చే నెల 8వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించింది. ఒక పేపరుకు దరఖాస్తు చేస్తే జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.700, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.350 పరీక్ష ఫీజుగా నిర్ణయించినట్లు తెలిపింది. పేపరు–1, పేపరు–2 రెండు పరీక్షలు రాయాలనుకుంటే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.600 చెల్లించాలని పేర్కొంది. -
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీలో ఇటీవల నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2018 (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖపట్నం ఏయూలోని డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. 57.48 శాతం మంది అభ్యర్తులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 3,97,957 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా 3,70,573 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో 2.13 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో మొత్తం 113 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల ప్రకారం అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకం చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి కాగా 10,351 ఉపాధ్యాయ పోస్టులకు జూలై 6న ఏపీపీఎస్సీ నోటిఫీకేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. జులై 7 నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తులు స్వీకరణ, ఆగస్టు 24, 25, 26 తేదీల్లో రాత పరీక్ష, సెప్టెంబర్ 15న డీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి గంటా గతంలో వెల్లడించారు. -
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇటీవల నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2018 (టెట్) ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఏపీ టెట్‌కు 4,14,120 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ పేపర్ -1లో 57.88 శాతం అభ్యర్థులు, పేపర్ -2లో 37.26 శాతం మంది, పేపర్ -3లో 43.60 శాతం అభ్యర్థులు అర్హత సాధించారని మంత్రి గంటా తెలిపారు. మొత్తంగా 25 శాతం అభ్యర్థులు 90 కంటే ఎక్కువ మార్కులు సాధించారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఏపీ టెట్ ఫలితాలు . ఈ నెల 4న ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక కీని విడుదల చేసింది. టెట్ పేపర్-1పై అత్యధికంగా 9,867 అభ్యంతరాలు రాగా, 9,867, పేపర్-2పై 4,162, పేపర్-3పై అభ్యర్థుల నుంచి 1,858 అభ్యంతరాలు వచ్చిన విషయం తెలిసిందే. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం ఫలితాలను విడుదల చేశారు. -
టెట్ 'కీ'పై 16 వేల అభ్యంతరాలు
సాక్షి, అమరావతి: ఇటీవల నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2018 (టెట్) ప్రాథమిక కీపై 16వేల అభ్యంతరాలు వచ్చాయి. ఈ నెల 4న ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక కీని విడుదల చేసింది. టెట్ పేపర్-1పై అత్యధికంగా 9,867 అభ్యంతరాలు రాగా, 9,867, పేపర్-2పై 4,162, పేపర్-3పై అభ్యర్థుల నుంచి 1,858 అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. తుది కీ విడుదలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా, ఈ నెల 16న ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
రేపు టెట్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం (23న) జరగనుంది. 1,574 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 3,67,912 మంది హాజరవనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపరు–1కు 1,11,647 మంది; మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు జరిగే పేపరు–2కు 2,56,265 మంది హాజరవుతారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. టెట్ నిలుపుదలకు హైకోర్టు తిరస్కృతి కంటెంట్ ఆధారంగా ప్రశ్నలివ్వడంలో తప్పులేదని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యా శాఖ నిర్వ హించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిలుపుదలకు ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించ బోయే వారికి టెట్‌లో సీనియర్ సెకండరీ స్కూల్ (ఇంటర్) కంటెంట్ ఆధారంగా ప్రశ్నలు ఇవ్వడం లో తప్పేముందని పిటిషనర్లను ప్రశ్నించింది.ఇటువంటి ప్రశ్నలు ఇవ్వడం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలకు విరుద్ధమేమీ కాదని వ్యాఖ్యానించింది. టెట్‌లో ఇంటర్ స్థాయి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయంటూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫి కేషన్‌ను సవాలు చేస్తూ నల్లగొండకు చెందిన జి.సునీత, మరికొందరు వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ... ఇంటర్ స్థాయి ప్రశ్నలు ఇవ్వడం సరికాదని, దీనివల్ల టెట్‌లో అర్హత సాధించడం కష్టతరమవుతుందని తెలిపారు. కనుక టెట్ పరీక్షను నిలుపుదల చేస్తూ ఉత్తర్వు లివ్వాలని కోరారు. న్యాయమూర్తి ఇందుకు తిరస్కరించారు. సిలబస్ కంటెం ట్‌పై ఎన్‌సీటీఈలో పరిమితులు ఎక్కడున్నాయో చూపాలన్నారు. పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు విషయ పరిజ్ఞానం నిమిత్తమే ప్రభుత్వం ఈ నోటిఫి కేషన్ జారీ చేసినట్లుందన్నారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే స్థాయిలో ఉపాధ్యాయులు ఉండాలన్న న్యాయమూర్తి, టెట్ నిలుపుదలకు నిరాకరించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. గ్రూప్–1 ఇంటర్వ్యూల నిలిపివేతకు నో... గ్రూప్–1 ఇంటర్వ్యూల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఉమ్మడి రాష్ట్రం లో జారీ చేసిన 2011 నోటిఫికేషన్ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ సాగుతుంటే సాంకేతిక కారణాలను చూపుతూ వాటిని నిలిపేయాలని కోరడం సరికాదని వ్యాఖ్యానించింది. నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని మరో సారి స్పష్టం చేసింది. గ్రూప్–1 రాత పరీక్షల ఆధారంగా తయారు చేసిన తాత్కా లిక జాబితాలో లోపాలున్నాయని, అందువల్ల ఇంటర్వ్యూలను నిలిపేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి విచారణ జరిపారు. 2011 నోటిఫికేషన్ ఆధారంగా ఇప్పుడు పోస్టుల భర్తీ ప్రక్రియ సాగుతోందని గుర్తు చేశారు. ఇప్పుడు సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఆ ప్రక్రియను ఆపాలనడం సరికాదంటూ విచారణను వాయిదా వేశారు. -
ఈ నెల 23న టెట్: శేషుకుమారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం (23వ తేదీ) 1,574 కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) నిర్వహించనున్నట్లు టెట్ కన్వీనర్ శేషుకుమారి తెలిపారు. ఈ పరీక్షకు మొత్తంగా 3,67,912 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పేపరు–1 పరీక్షకు 1,11,647 మంది, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపరు–2 పరీక్షకు 2,56,265 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందుగా చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. -
ప్రైవేటు టీచర్లకూ టెట్ తప్పనిసరి
వచ్చే ఏడాది ఉంచి అమలు చేసేలా విద్యాశాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అర్హత సాధించిన ఉపాధ్యాయులను తప్పనిసరి చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని కచ్చితంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అవసరమైన కార్యాచరణపై దృష్టి సారించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ అన్ని పాఠశాలల్లోనూ బోధించే ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలకు టెట్ అర్హతను తప్పనిసరి చేశారు. ఇక రాష్ట్రంలో దాదాపు 11 వేలకుపైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. చాలా వాటిల్లో ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణ పొందని వారు కూడా టీచర్లుగా పనిచేస్తున్నారు. పలు చోట్ల ఇంజనీరింగ్ చేసిన వారు ఉన్నత పాఠశాల్లో సైన్స్, గణితం వంటి సబ్జెక్టులను బోధిస్తున్నారు. అలాంటి వారికి బోధనకు సంబంధించిన పదజాలంపై, బోధనా విధానాలపై పట్టు ఉండదు. కేవలం పాఠం వివరించి, జ్ఞాపకం చేయించడం, పరీక్షలు నిర్వహించడం వంటివే చేస్తున్నారు. దీంతో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. విద్యా శాఖ క్షేత్రస్థాయి సర్వేలో తేలిన లెక్కల ప్రకారం.. ప్రైవేటు ప్రాథమిక పాఠశాలల్లో బోధించే వారిలో 36 శాతం, ఉన్నత పాఠశాలల్లో 48 శాతం మంది మాత్రమే టెట్ అర్హులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ శిక్షణ పొందిన, టెట్ అర్హత సాధించినవారినే ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా నియమించుకునేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అయితే స్కూల్లోని టీచర్లందరూ టెట్ అర్హత పొందిన వారే ఉండాలా, కొంత శాతం వెసులుబాటు ఉండాలా అన్నదానిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో 2010 కంటే ముందు (టెట్ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చేప్పటికి) టీచర్లుగా నియమితులైన వారు టెట్ అర్హత సాధించి ఉండాల్సిన అవసరం లేదన్న వెసులుబాటు ఉంది. దీంతో ప్రైవే టు స్కూళ్లలోనూ ఆ నిబంధనను అమలు చేయాలా అనే దిశగా యోచిస్తున్నారు. త్వరలో యాజమాన్యాలతో భేటీ టెట్ అర్హత లేని టీచర్లతో బోధన కొనసాగిస్తున్న పాఠశాలలకు నోటీసులు జారీ చేయాలని విద్యా శాఖ భావిస్తోంది. దీనిపై ప్రైవేటు యాజమాన్యాలతో సమావేశమై... వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించనుంది. ప్రస్తుతం పలు ప్రైవేటు పాఠశాలలు ప్రాథమిక పాఠశాల నుంచి ప్రాథమికోన్నతం, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడేషన్‌కు దరఖాస్తులు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం వాటిలో టెట్‌లో అర్హత సాధించిన టీచర్లను నియమిస్తేనే అప్‌గ్రేడ్ చేసేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అర్హులంతా స్కూళ్లలోనే టెట్‌లో అర్హత సాధించిన వారంతా ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నారు. టెట్‌లో అర్హత సాధించినవారు తెలుగు మీడియం వారే దొరుకుతున్నారు. ఇంగ్లిషు మీడియం టీచర్లు లభించడం లేదు. దాంతో అర్హతలున్న అన్ట్రైన్డ్ వారితో నాణ్యమైన విద్యనందిస్తున్నాం. - శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
‘టెట్’ వెయిటేజీపై తొలగని సందిగ్ధం
గురుకులాల్లో టీచర్ల భర్తీ విషయంలో అస్పష్టత సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు వెయిటేజీ ఉంటుందా, ఉండదా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఉత్తర్వుల ప్రకారం ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధించే వారు టెట్ అర్హత సాధించి ఉంటేనే ఉపాధ్యాయ పోస్టుల్లో నియామకాలు పొందేందుకు అర్హులు. అయితే ఇటీవల గురుకులాల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి జారీ చేసిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం టెట్ ప్రస్తావనే చేయలేదు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాసిన విద్యా శాఖ.. ఎన్సీటీఈ ఆదేశాల ప్రకారం 8వ తరగతిలోపు బోధించే టీచర్ కచ్చితంగా టెట్ అర్హత సాధించి ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో గురుకుల విద్యాలయాల సొసైటీలు టెట్‌ను అర్హత పరీక్షగా తీసుకుంటామని పేర్కొన్నాయి. మరోవైపు టెట్ స్కోర్‌కు ప్రాధాన్యం, కొంత వెయిటేజీ ఇవ్వాలని ఎన్సీటీఈ అదే మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులిచ్చింది. విద్యా శాఖ ఈ నిబంధనను పాటిస్తూ, టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ, రాత పరీక్ష స్కోర్‌కు 80 శాతం వెయిటేజీ ఇచ్చి నియామకాలు చేపడుతోంది. కాని దీనిపై గురుకుల సొసైటీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టెట్‌ను అర్హత పరీక్షగా పరిగణనలోకి తీసుకుంటామన్నాయే తప్ప టెట్ స్కోర్ వెయిటేజీ విషయంపై నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతం టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఇవ్వాలా, వద్దా అన్న అంశంపై గురుకుల సొసైటీలను స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలిసింది. సొసైటీలు నిర్ణయాన్ని తెలిపిన వెంటనే టీఎస్పీఎస్సీ 2,500కు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. -
రేపే టెట్!
♦ నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ♦ ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం (22వ తేదీన) ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,618 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 3,73,494 మంది హాజరుకానున్నారు. 22న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. పేపర్ల వారీగా చూస్తే 443 కేంద్రాల్లో నిర్వహించే పేపర్-1 పరీక్షకు 1,00,184 మంది, 1,175 కేంద్రాల్లో నిర్వహించే పేపర్-2 పరీక్షకు 2,73,310 మంది హాజరుకానున్నారు. ఈ పరీక్ష ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్ శుక్రవారం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న టెట్ కోసం అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతానికి భిన్నంగా ఈసారి జిల్లా కేంద్రాలతోపాటు డివిజన్ కేంద్రాలు, పలు మండల కేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ముందురోజే చూసుకోవాలని.. పరీక్ష రోజున నిర్ధారిత సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. వేలి ముద్రలు ఇవ్వాలి.. టెట్‌లో తొలిసారిగా బయోమెట్రిక్ డాటా సేకరించనున్నట్లు కిషన్ తెలిపారు. హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో అతికించాలని, ఇన్విజిలేటర్ ముందు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలని చెప్పారు. అభ్యర్థుల వేలి ముద్రలను పరీక్ష కేంద్రంలో అధికారులు సేకరిస్తారని పేర్కొన్నారు. టెట్ వాయిదా పడక ముందు డౌన్లోడ్ చేసుకున్న పాత హాల్‌టికెట్లు చెల్లవని స్పష్టం చేశారు. కొత్త హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకుని, తీసుకురావాలని సూచించారు. అభ్యర్థులు బ్లూ పెన్ కాకుండా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతోనే పరీక్ష రాయాలని చెప్పారు. టెట్ పరీక్షపై ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య కూడా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారని తెలిపారు. టెట్‌ను పక్కాగా నిర్వహించే బాధ్యతను జిల్లాల కలెక్టర్లకు అప్పగించామని చెప్పారు. ఇందుకోసం కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ సభ్యులుగా, డీఈవో కన్వీనర్‌గా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని.. ఆ కమిటీల ఆధ్వర్యంలోనే పరీక్ష కేంద్రాలు, ఇతర ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేస్తామన్నారు. పరీక్ష రాసేప్పుడు మధ ్యలో బయటకు పంపించరని, టాయిలెట్ వంటి కనీస అవసరాలను ముందుగానే తీర్చుకోవాలని సూచించారు. టెట్ ప్రాథమిక ‘కీ’ని 23వ తేదీన విడుదల చేస్తామని, తర్వాత పది రోజుల్లోగా ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. -
టెట్‌లో ‘అర్హత’ తంటా!
♦ ఒక్కో కేటగిరీలో ఒక్కోలా మార్కులు ♦ నష్టపోతున్నామంటూ ఓసీల ఆవేదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో కనీస అర్హత మార్కులతో అభ్యర్థులకు తంటా తప్పడం లేదు! ఒక్కో రిజర్వేషన్ కేటగిరీలో ఒక్కోలా అర్హత మార్కులు ఉండటంతో తాము నష్టపోతున్నామని ఓసీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఓసీలకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 60 మార్కులు (40 శాతం) వస్తే టెట్‌లో అర్హత సాధించినట్లు పరిగణనలోకి తీసుకుంటుండటంతో తాము నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. దాన్ని అర్హత పరీక్షగానే చూడకుండా... మార్కులకు వెయిటేజీ కూడా ఉండటం వల్ల తాము ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు 2014లో నిర్వహించిన టెట్ తీసుకుంటే.. నల్లగొండ జిల్లాలో లాంగ్వేజ్ పండిట్ (హిందీ) కోసం 689 మంది పరీక్ష రాస్తే అందులో జనరల్ అభ్యర్థులు ముగ్గురే అర్హత సాధించారని వారు పేర్కొంటున్నారు. ఇక బీసీలు 415 మంది, ఎస్సీలు 185 మంది, ఎస్టీలు 75 మంది, వికలాంగులు 11 మంది అర్హత సాధించారని, ఇతర కేటగిరీలు, వేరే జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అయితే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలే ఆ నిబంధన విధించిందని అధికారులు పేర్కొంటున్నారు. కనీస అర్హత మార్కులు 60 శాతంగా పరిగణనలోకి తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు కన్సెషన్ ఇవ్వాలని ఎన్సీటీఈ మార్గదర్శకాలే చెబుతున్నాయంటున్నారు. హిందీలో సోషల్ ప్రశ్నపత్రమా? రాష్ట్రంలో టెట్ అధికారుల నిర్వాకం వల్ల తాము కూడా నష్టపోవాల్సి వస్తోందని హిందీ పండిట్ అభ్యర్థులు చెబుతున్నారు. తాము పరీక్ష రాసే సబ్జెక్టు హిందీ అయినప్పుడు ఆ సబ్జెక్టు ప్రశ్నపత్రాన్ని హిందీ లేదా ఇంగ్లిషులో ఇస్తే ఫర్వా లేదని, అయితే పేపర్-2లో 60 మార్కులకు ఉన్న సోషల్ సబ్జెక్టు పేపర్ కూడా హిందీ, ఇంగ్లిష్‌లో ఇవ్వడంతో నష్టపోతున్నామంటున్నారు. పదో తరగతి వరకు సోషల్ను తెలుగు మీడియంలో చదివినందున ఆ ప్రశ్నపత్రాన్ని అదే భాషలో ఇవ్వాలని కోరుతున్నారు. హిందీ భాషలో సోషల్ పదజాలం ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. -
టెట్‌కు.. సెట్ కావాలిలా..
ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించాలనుకునే వారికి టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో అర్హత తప్పనిసరి. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే కాదు. ఇందులో సాధించిన ప్రతి 15 మార్కులకు డీఎస్సీలో 2 మార్కుల వెయిటేజీ ఉంటుంది. అందువల్ల డీఎస్సీ ద్వారా ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులు టెట్‌ను కూడా అంతే సీరియస్‌గా తీసుకోవాలి. తెలంగాణ టెట్‌ను మే 22న నిర్వహించనున్నారు.పరీక్షకు ఇంకా కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు అన్ని అంశాలను మరోసారి మననంచేసుకోవడంతోపాటు.. కష్టతరంగా ఉన్న విషయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. టైంటేబుల్ రూపొందించుకుని.. పరీక్షకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు అన్ని అంశాలను రివిజన్ చేసుకునేందుకు ప్రత్యేకంగా టైంటేబుల్ రూపొందించుకోవాలి. దీన్ని కచ్చితంగా అనుసరిస్తూ రోజూ అన్ని సబ్జెక్టులను చదివేలా చూసుకోవాలి. క్లిష్టమైన అంశాలను షార్టనోట్స్ రూపంలో రాసుకుని వీలైన సమయాల్లో ఎక్కువసార్లు చదువుకుంటూ ఉండాలి. దీనివల్ల అవి బాగా గుర్తుంటాయి. ముఖ్యాంశాలకు ప్రాధాన్యం.. అభ్యర్థులు పాఠ్యపుస్తకాల్లోని ప్రతి పాఠం చివర ఉండే ‘ముఖ్యాంశాలు’ను తప్పకుండా చదవాలి. దీనివల్ల మొత్తం పాఠాన్ని మరోసారి చదివినట్లవుతుంది. ఏవైనా సందేహాలుంటే నివృత్తి అవుతాయి. అన్ని అంశాలపై స్పష్టత వస్తుంది. టెట్ పేపర్-2లో లాంగ్వేజ్ 1, 2; మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్‌లో ప్రశ్నల క్లిష్టత ఇంటర్ స్థాయి వరకు ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ఆయా అంశాలపై ఇంటర్ స్థాయి వరకు లోతైన అవగాహన కలిగి ఉండాలి. వీలైనన్ని మోడల్ పేపర్లు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో వీలైనన్ని మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ప్రిపరేషన్ పరంగా లోటుపాట్లు తెలుస్తాయి. వాటిని సరిదిద్దుకునేందుకు వీలవుతుంది. ఇంకా ఏవైనా సందేహాలుంటే ఫ్యాకల్టీ సహాయంతో నివృత్తి చేసుకోవాలి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో.. టెట్ పేపర్-1, 2ల్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి 30 మార్కులు కేటాయించారు. మిగిలిన వాటితో పోలిస్తే ఇది కొంచెం కష్టమైన సబ్జెక్టు. పరీక్షలో ఈ అంశానికి సంబంధించి ప్రశ్నలు కొంచెం తికమకగా ఉండే అవకాశం ఉంది. డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, అండర్స్టాండింగ్ లెర్నింగ్, పెడగాజికల్ కన్సర్న్స్ తదితరాలను ఈ విభాగంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇందులో ప్రాథమిక భావనలను అర్థం చేసుకుంటూ చదవడం వల్ల అన్ని అంశాలపై పట్టు ఏర్పడుతుంది. ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. పరీక్షకు ఉన్న ఈ కొద్ది సమయంలో అభ్యర్థులు వీటిని చదివేందుకు రోజూ కొంత సమయం కేటాయించాలి. అవసరమైతే ముఖ్యమైన అంశాలను ఒక పుస్తకంలో రాసుకుని రోజులో వీలైనన్ని ఎక్కువసార్లు చదవడం వల్ల బాగా గుర్తుంటాయి. లాంగ్వేజ్‌లలో.. టెట్ పేపర్-1, 2ల్లో లాంగ్వేజ్ 1, 2 (తెలుగు, ఇంగ్లిష్)కు 30 మార్కుల చొప్పున కేటాయించారు. ముఖ్యంగా తెలుగు సబ్జెక్టు కొంత తేలిగ్గా అనిపించినా... వ్యాకరణం, సంధులు, సమాసాలు వంటివి కొంత తికమకకు గురిచేస్తాయి. అందువల్ల అభ్యర్థులు ఈ అంశాలపై దృష్టి సారించాలి. అలాగే ఇంగ్లిష్‌లో కూడా కష్టతరంగా భావించే అంశాలను రోజూ మననం చేసుకుంటూ ఉండాలి. బోధనాపద్ధతుల్లో.. లాంగ్వేజ్లతో పాటు ఇతర అంశాలకు సంబంధించి బోధనాపద్ధతులకు కూడా మార్కులు కేటాయించారు. ఇది కూడా అభ్యర్థులకు కొంత కష్టంగా అనిపించేదే. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే.. బోధన పద్ధతులు, బోధనోపకరణాలు, మూల్యాంకనం, కరిక్యులంపై ఎక్కువ దృష్టిసారించాలి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్‌లో.. టెట్ పేపర్ 1లో ఈ అంశానికి 30 మార్కులు కేటాయించారు. ఇందులో మై ఫ్యామిలీ, వర్క్ అండ్ ప్లే, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, అవర్ ఫుడ్, ఎనర్జీ, వాటర్, అవర్ కంట్రీ తదితర అంశాలను పేర్కొన్నారు. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే.. ఇటీవలి కాలంలో వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, నీటి కొరత, వర్షాభావం, తెలంగాణలో కరువు మండలాలు తదితర అంశాలపై దృష్టి సారించాలి. రోజూ దినపత్రికలు చదివేవారికి ఈ అంశాలపై ఎక్కువ పట్టు ఉంటుంది. -
విద్యాశాఖకు ఎన్నికల కోడ్ తంటా!
టెట్, టెన్త్, వీసీ నియామకాలకు తాత్కాలిక బ్రేక్ సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖకు ఎన్నికల తంటా తప్పడం లేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో విద్యాశాఖలో వివిధ కార్యక్రమాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు(టెట్) దరఖాస్తుల స్వీకరణ, పదో తరగతి పరీక్షల షెడ్యూలు జారీ, వైస్చాన్స్లర్ల నియామకాలకు ఆటంకం ఏర్పడింది. ఆయా పనులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌కు విద్యాశాఖ రాసింది. దీంతో ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం వచ్చే వరకు వాటి ప్రకటన నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో టెట్ నిర్వహించేందుకు నవంబరు 14న విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 18వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని భావించింది. వరంగల్ ఉప ఎన్నిక కోడ్ అమల్లోకి రావడంతో దరఖాస్తుల స్వీకరణ నిలిచిపోయింది. ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం లేఖ రాసినా, స్పష్టత వచ్చేలోగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో మళ్లీ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. మరోవైపు పదో తరగతి పరీక్షలను 2016 మార్చి 21 నుంచి ఏప్రిల్ 9 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. షెడ్యూలును సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం కూడా ఆమోదించింది. అదే సమయంలో ఎన్నికల్ కోడ్ రావడంతో పదో తరగతి పరీక్షల షెడ్యూలు జారీలో జాప్యం జరుగుతోంది. -
టెట్టా... టెర్టా!
* టెట్ వేరుగానా లేక ఎంపిక పరీక్షతో కలిపి నిర్వహించాలా? * ఉపాధ్యాయ అర్హత పరీక్షపై విద్యాశాఖ ఆలోచనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే జనవరి నాటికి కొత్త టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భర్తీ విధానంపై మళ్లీ చర్చ మొదలైంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను వేరుగా నిర్వహిం చాలా? లేక ఉపాధ్యాయ నియామక పరీక్షతో (టీఆర్టీ) టెట్‌ను కలిపి.. టీచర్ ఎలిజిబిలిటీ కమ్ రిక్రూట్మెంట్ టెస్టు (టెర్ట్) పేరుతో ఉమ్మడి పరీక్ష నిర్వహించాలా? అన్న అంశంపై విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. ఇటీవల టీచర్ల హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియ చేపట్టిన అనంతరం 7,974 పోస్టుల అవసరం ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. ఈ లెక్కలు తేలాక.. వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరవడానికి ముందే కొత్త ఉపాధ్యాయులను నియమిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అసలు టెట్ అవసరమా? అన్న అంశాన్ని తేల్చేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) జారీ చేసిన టెట్ మార్గదర్శకాలనూ పరిశీలించే పనిలో పడింది. ఎన్సీటీఈ ఆదేశాల మేరకు 2011 మే నెలలో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహించింది. ఆ తరువాత మూడు సార్లు టెట్ నిర్వహించింది. అయితే ఉపాధ్యాయ విద్యా కోర్సులో చేరేందుకు ఎంపిక పరీక్ష, కోర్సు వార్షిక పరీక్షలు, ఆ తరువాత ఉపాధ్యాయ నియామక పరీక్ష.. ఇలా ఇన్ని పరీక్షల్లో అర్హతతో పాటు ప్రతిభ కనబరిస్తేనే ఉపాధ్యాయ ఉద్యోగం ఇస్తున్నపుడు మళ్లీ ప్రత్యేకంగా టెట్ అవసరమా? అన్న వాదన వ్యక్తమయింది. దీనిపై అధ్యయనం చేసేందుకు 2013లో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు టెట్, డీఎస్సీల నేతృత్వంలోని టీఆర్టీ వేర్వేరుగా కాకుండా రెండూ కలిపి టెర్ట్ పేరుతో నిర్వహించాలని సిఫారసు చేసింది. ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఆ తరువాత చివరి నిమిషంలో ఉమ్మడి పరీక్షపై వెనక్కి తగ్గింది. ఇక ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగింది. వేర్వేరు పరీక్షలు కాకుండా టీఈఆర్టీ పేరుతో ఒకే రోజు పేపరు-1, పేపరు-2 (ఒకటి టెట్, మరొకటి టీఆర్టీ) ఈ పరీక్షలను నిర్వహించాలన్న ఆలోచనలు ఉన్నాయి. వీలుకాకపోతే టెట్‌ను వేరుగా నిర్వహించడాన్నీ పరిశీలించాలని భావిస్తోంది. మరోవైపు ఏపీలో ఇటీవల రెండింటికి ఒకే రోజు టెర్ట్ను రెండు పేపర్లుగా నిర్వహించారు. అయితే రెండూ కలిపి నిర్వహించడం ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్ధమంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో తుది తీర్పు రావాల్సి ఉంది. అది వ చ్చే వరకు వేచి చూడాలని, ఆ తీర్పు ప్రకారం తాము ముందుకు సాగాలన్న ఆలోచనలు అధికారుల్లో ఉన్నాయి. -
డీఎస్సీ.. దగా .
సాధ్యం కాని హామీలతో ఎన్నికల్లో గెలిచిన టీడీపీ నిరుద్యోగ ఉపాధ్యాయులతో చెలగాటమాడుతోంది. ఊరించి.. ఊరించి విడుదల చేసిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్ అండ్ టీఆర్టీ) ‘బాబు మార్క్’ కొర్రీల్లో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. రుణమాఫీని తలపిస్తున్న ఈ డీఎస్సీ నోటిఫికేషన్ అర్హులైన అభ్యర్థుల పాలిట శాపంలా మారింది. తాజాగా ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు అర్హతపై సందిగ్ధత నెలకొంది. నెల్లూరు(విద్య) : నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన రమేష్ చదువు పదో తరగతి వరకు సాఫీగా సాగింది. వేసవి సెలవుల్లో కూలి పని చేసే తండ్రి అకస్మాత్తుగా మరణించాడు. తల్లితోపాటు తాను కూలి పనులకు పోవడం ప్రారంభించాడు. ఇద్దరు చెల్లెళ్లతోపాటు తల్లి బాధ్యత మీద పడింది. దీంతో ఇంటర్మీడియట్ చేరే అవకాశం లేకుండా పోయింది. కూలి పనులు నుంచి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాడు. చదువు మీద ఆశ చావలేదు. దీంతో దృష్టి ఓపెన్ యూనివర్సిటీపై పడింది. ఇంటర్మీడియట్ లేకుండానే ఓపెన్ యూనివర్సిటీలో చేరి డిగ్రీ పూర్తి చేశాడు. అంతటితో ఆగకుండా అప్పులు చేసి బీఈడీ చదివి పట్టా సాధించాడు. తాజాగా బీఎస్సీ నోటిఫికేషన్ వెలువడంతో కష్టాలు తీరిపోయాయని ఎగిరి గంతేశాడు. తీరా దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తే ఓపెన్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు అర్హులా కాదా అనే అంశంపై అధికారులు తర్జభర్జన పడ్డారు. స్పష్టమైన ఆదేశాలు లేవన్నారు. రెండు రోజుల తర్వాత రమ్మన్నారు. తీరా రెండు రోజుల తర్వాత వెళ్లిన రమేష్‌కు పిడుగులాంటి వార్త అధికారులు చెప్పారు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసినా, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఉంటే డీఎస్సీకి అర్హులని అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. ఏమి చేయాలో తెలియక రమేష్ దిగాలు పడిపోయాడు. ఇలా రమేష్ ఒక్కడే కాదు. ఓపెన్ యూనివర్సిటీల ద్వారా డిగ్రీ, ఆపై బీఈడీ చేసిన విద్యార్థులకు బాబు ప్రభుత్వం పెట్టిన మెలిక వారిపాలిట శాపంగా మారింది. అసలు ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులను బీఈడీకి అర్హులను చేయడం తప్పని విద్యాశాఖ అధికారులు కొందరు మాట్లాడుకోవడం వారికి మరింత బాధను కలిగిస్తోంది. ప్రతి ఒక్కరూ చదవాలనే ప్రకటనలు గుప్పించే ప్రభుత్వం కష్టాలుపడి చదుుకున్న వారికి ప్రోత్సహించే తీరు ఇదేనా అని ప్రశ్నను రేకెత్తిస్తోంది. ప్రయోజనంలేని దూర విద్య విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వందే తప్పవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగానికి పనికిరాని చదువులకోసం తాము పడిన కష్టాన్ని కనబడిన వారందరికీ ఏడుస్తూ వివరిస్తున్నారు. బాబు మార్క్ కొర్రీలు... నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 20 శాతం పోస్టులకు అనధికారికంగా కోత విధించారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఒప్పుకోవడంలేదనే సాకు చూపారు. బీకాం విద్యార్థులకు సంబంధిత కోర్సులు నాలుగు సబ్జెక్టులు ఉండాలనే నిబంధన, ఇండస్ట్రీయల్ ఆర్గనైజేషన్, బిజినెస్ ఆర్గనైజేషన్ పేపర్లు రెండూ ఒకటేనా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. బీఎస్సీ విద్యార్థుల్లో రెండు సబ్జెక్టులు సైన్స్‌కు సంబంధించినవి ఉండాలన్నారు. మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, బయోటెక్, డెయిరీ సైన్స్ చదివిన అభ్యర్థుల అర్హతపై స్పష్టత లేదు. సోషల్‌లో ఏఈఎస్ (అకౌంట్స్, ఎకనామిక్స్, స్టాటస్టిక్స్) గ్రూప్ అభ్యర్థులకు బీఈడీలో మెథడాలజీకి సంబంధించిన అంశంపై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు అర్హత కోల్పోయారు. ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు కచ్చితంగా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఉంటేనే అర్హులని ప్రకటించారు. అదే ఉంటే ఓపెన్ యూనివర్సిటీ ఎందుకు అని వారి వాదన. ఇంటర్ తత్సమాన అర్హత.. గతంలో ఇంటర్మీడియట్‌కు సమాన అర్హతగల బీఓఎల్ (బ్యాచలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్)ను ఈ నోటిఫికేషన్లో ప్రస్తావించలేదు. సక్సెస్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియం నిర్వహిస్తున్నప్పటికీ ఇంగ్లిష్ మాధ్యమ ఉపాధ్యాయుల పోస్టులకు నోటిఫికేషన్లో తావు లేకుండా పోవడం. గత మూడు డీఎస్సీల్లో ఉర్దూ భాషాపండితులను ఎస్సీ, ఎస్టీ విభాగాలకు కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 18 ఉర్దూ ఎస్జీటీలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని డీ రిజర్వ్ చేసి ఓపెన్ కేటగిరి చేయాల్సి ఉంది. ఆ అంశం, నోటిఫికేషన్లో లేదు. ఇలా ఎన్నికల్లో హామీలిచ్చి కొర్రీలు పెట్టి డీఎస్సీ అభ్యర్థులతో చెలగాటమాడుతున్న క్రమంలో మేలో డీఎస్సీ నిర్వహిస్తారా లేదా అనే నియమాంశ అటు విద్యావేత్తల్లో ఇటు అభ్యర్థుల్లో నెలకొంది. -
టీచర్‌పోస్టుల జాతర
* జిల్లాకు 907 పోస్టులు మంజూరు * డీఎస్సీ ప్రక్రియను టెట్ కంటీఆర్టీగా మార్పు * డిసెంబర్ 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ * వచ్చే ఏడాది మేలో రాత పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్ : ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వచ్చిన ఉపాధ్యాయుల నియూమకానికి ఎట్టకేలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గత సెప్టెంబర్ ఐదో తేదీన డీఎస్సీ-2014 ప్రక్రియ రెండున్నరల నెలల అనంతరం మొదలుకాబోతోంది. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటి వరకూ కొనసాగించిన టెట్, డీఎస్సీ ప్రక్రియలను రద్దుచేసిన ప్రభుత్వం వాటి స్థానంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కం రిక్రూట్మెంట్ టెస్ట్(టెట్ కం టీఆర్టీ)ను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో 907 పోస్టులు భర్తీ కానున్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పరిమితమైన బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తామని గత సెప్టెంబర్ 5న జారీ చేయాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ప్రభుత్వం దీనిపై ఎటూ తేల్చలేదు. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో అర్హత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో చివరికి పాత విధానంలోనే బీఈడీలతో స్కూల్ అసిస్టెంట్స్, డీఈడీలతో ఎస్జీటీ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించి జీవో విడుదల చేసింది. ఇందులో భాగంగా డిసెంబర్ 3వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరించనుంది. వచ్చే ఏడాది మే 9, 10, 11 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించి జూన్ 28న ఫలితాలు విడుదల చేయనుంది. ఎస్జీటీ పోస్టులకు 180 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 200 మార్కులుగా ఖరారు చేశారు. కేటగిరీల వారీగా పోస్టులు.. జిల్లాకు మంజూరైన పోస్టుల్లో ఎస్జీటీ తెలుగు-672, ఉర్ధూ-10, స్కూల్ అసిస్టెంట్ విభాగంలో తెలుగు-51, గణితం-16, భౌతికశాస్త్రం-4, జీవశాస్త్రం-17, ఇంగ్లిష్-10, సాంఘికశాస్త్రం-52, సంస్కృతం-1, భాషా పండిట్ ఉర్దూ-1, తెలుగు-15, సంస్కృతం ఒక పోస్టు, పీఈటీలు 23 పోస్టుల చొప్పున ఉన్నాయి. -
ఈ ఏడాది టెట్ యథాతథం: గంటా
విశాఖపట్నం : ఈ ఏడాది టెట్‌ను యథతథంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.... వచ్చే ఏడాది నుంచి టెట్ కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. టీచర్ల బదిలీలలో రేషనలైజేషన్ విధానాన్ని చేపడతామన్నారు. డీఎస్సీ ఉద్యోగాల భర్తీ అయ్యే వరకు విద్యా వాలంటీర్ల సర్వీసును కొసాగిస్తామని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
ఉపాధ్యాయ కెరీర్‌కు తొలి మెట్టు.. సీటెట్
విద్యాహక్కు చట్టం ప్రకారం.. ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే వారు కొన్ని నిర్దేశిత ప్రమాణాలను అందుకోవాల్సిఉంటుంది.. దేశంలో ఉపాధ్యాయ విద్యను పర్యవేక్షించే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) కూడా ఆ మేరకు మార్గదర్శకాలను రూపొందించింది.. ఈ క్రమంలో టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అమల్లోకి వచ్చింది.. దీన్ని రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో నిర్వహిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ సీటెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్ వివరాలు.. సెంట్రల్ స్కూల్స్‌లో ఉపాధ్యాయులుగా కెరీర్‌గా ప్రారంభించాలనుకునే వారు సీటెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షను సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నిర్వహిస్తుంది. రెండు పేపర్లుగా: సీటెట్ రెండు పేపర్లుగా ఉంటుంది. అవి.. పేపర్-1:1 నుంచి 5 తరగతులకు ఉద్దేశించింది. అంటే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాలనుకునే వారు ఈ పేపర్‌కు హాజరు కావాలి. అర్హత: 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/తత్సమానంతోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (ఈ కోర్సును ఏ పేరుతో వ్యవహరించినా) లో ఉత్తీర్ణత. లేదా 45 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు రెండేళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఐఈడీ) ఉత్తీర్ణత/చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/తత్సమానంతోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా గ్రాడ్యుయేషన్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు.పేపర్-2:6 నుంచి 8 తరగతులకు ఉద్దేశించింది. అంటే ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాలనుకునే వారు ఈ పేపర్‌కు హాజరు కావాలి. అర్హత: గ్రాడ్యుయేషన్‌తోపాటు రెండేళ్ల వ్యవధి ఉండే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ పూర్తి చేసిన/ చదువుతున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఐఈడీ) ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువు తున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత/ తత్సమానంతోపాటు బీఏ/ బీఎస్సీ బీఈడీ/ బీఏఎడ్/ బీఎస్సీఎడ్ ఉత్తీర్ణత/ చివరి సంవత్సరం చదువు తున్న విద్యార్థులు లేదా 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) చదువుతున్న విద్యార్థులు. పరీక్ష విధానం: పరీక్షను మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది. సమాధానాలను గుర్తించడానికి 150 నిమిషాల సమయం కేటాయించారు. వివరాలు.. పేపర్-1 అంశం పశ్నలు మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ 30 30 లాంగ్వేజ్-1 30 30 లాంగ్వేజ్-2 30 30 మ్యాథమెటిక్స్ 30 30 ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 30 మొత్తం 150 150 పేపర్-2 అంశం పశ్నలు మార్కులు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగీ 30 30 లాంగ్వేజ్-1 30 30 లాంగ్వేజ్-2 30 30 ఎంచుకున్న సబ్జెక్ట్ 60 60 మొత్తం 150 150 ఎంచుకున్న సబ్జెక్ట్‌లో మ్యాథమెటిక్స్, సైన్స్ అభ్యర్థులకు మ్యాథమెటిక్స్, సైన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌ల నుంచి 30 ప్రశ్నలు చొప్పున ఇస్తారు. సోషల్ స్టడీస్ అభ్యర్థులకు మాత్రం ఆ సబ్జెక్ట్ నుంచే ప్రశ్నలు అడుగుతారు. ప్రయోజనం: పరీక్షలో 60 శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధించిన వారికి అర్హత సర్టిఫికెట్ ఇస్తారు. సీటెట్ స్కోర్ ఫలితాలు విడుదల చేసిన తేదీ నుంచి ఏడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. సీటెట్‌లో అర్హత సాధిస్తే కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు (కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, సెంట్రల్ టిబెటన్ స్కూల్స్ తదితర పాఠశాలలు), చండీగఢ్, దాద్రా-నగర్ హవేలీ, డయ్యూడామన్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోని పాఠశాలలు, నేషనల్ క్యాపిటల్ టెరీటరీ న్యూఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు/స్థానిక సంస్థల నిర్వహణలో ఉన్న పాఠశాలల్లోని ఉపాధ్యాయ పోస్టుల నియామకం కోసం సీటెట్ అభ్యర్థులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. నోటిఫికేషన్ సమాచారం: దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్ట్ 4, 2014. పరీక్ష తేదీ: సెప్టెంబర్ 21, 2014. వివరాలకు: http://ctet.nic.in/ ప్రిపరేషన్ సీటెట్ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే టెట్ మాదిరిగానే ఉంటుంది. కానీ టెట్‌తో పోల్చితే ప్రశ్నలు క్లిష్టంగా ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లిష్/హిందీ మాధ్యమంలో అడుగుతారు. కాబట్టి సంబంధిత సబ్జెక్ట్‌ల పదజాలంపై పట్టు ఉంటే మంచి స్కోర్ సాధించవచ్చు.సైకాలజీని అభ్యసనం చేసేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, వాటిని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర అంశాలను విశ్లేషణాత్మకంగా, సమన్వయం చేస్తూ చదవాలి. కీలకాంశాలైన శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం- నాయకత్వం- మార్గనిర్దేశకత్వం- మంత్రణం (కౌన్సెలింగ్)లను గత ప్రశ్నపత్రాల ఆధారంగా సిలబస్‌ను అనుసరించి విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.లాంగ్వేజ్ విభాగంలో గ్రామర్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని పరీక్షిస్తూ.. ప్రశ్నలు అడుగుతారు. ఈ నేపథ్యంలో.. బేసిక్ గ్రామర్ మీద పట్టు చాలా అవసరం. ఈ క్రమంలో.. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రొవెర్బ్స్, కొశ్చన్స్ ట్యాగ్స్, యాక్టివ్ వాయిస్-ప్యాసివ్ వాయిస్, కాంప్రెహెన్షన్, ఫొనెటిక్స్, లెటర్ రైటింగ్, సింపుల్- కాంపౌండ్- కాంప్లెక్స్ సెంటెన్సెస్.. ఇలా గ్రామర్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని ఔపోసన పట్టాలి. సబ్జెక్ట్‌ల విషయానికొస్తే.. ఎన్సీఆర్టీఈ పుస్తకాల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. వీటిని అప్లికేషన్ పద్ధతిలో అడుగుతారు. కాబట్టి ఆయా అంశాలకు సంబంధించి ప్రాథమిక భావనలపై పట్టు ఉండాలి. పాఠ్యాంశాల చివరన ఇచ్చే ప్రాక్టీస్ బిట్స్ చదవాలి. కంటెంట్ చదివేటప్పుడు.. ఏదైనా ఒక అంశం 3, 4, 5 తరగతి పుస్తకాల్లో ఉండి.. 6, 7, 8, 9, 10 తరగతి పుస్తకాల్లో పునరావృతమైతే.. ఆ అంశాలన్నింటినీ ఒకేసారి చదవడం వల్ల సమన్వయం ఏర్పడుతుంది. తమ నేపథ్యానికి చెందని పాఠ్యాంశాలు (అంటే.. బయాలజీ వాళ్లు గణితం చదవడం, తెలుగు, ఇంగ్లిష్ అభ్యర్థులు సోషల్ స్టడీస్ చదవడం) చదివేటప్పుడు కొంత ఇబ్బందికి గురవడం సహజం. కాబట్టి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠ్యాంశాల విషయంలో సిలబస్‌ను అనుసరిస్తూ.. ప్రతి పాఠ్యాంశం వెనుక ఇచ్చిన బిట్స్‌ను ఔపోసన పడితే సులభంగానే ఈ సమస్యను అధిగమించొచుెు్చథడాలజీ విషయంలో మెథడ్స్ ఆఫ్ టీచింగ్, ఎవాల్యుయేషన్, ల్యాబ్, రిలేషన్ టు అదర్ సబ్జెక్ట్స్, టీచర్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్ఎం), రీసెంట్ ట్రెండ్స్(ఇటీవలి కాలంలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు/పథకాలు), డెవలప్మెంట్ ఆఫ్ కరికుల్యం వంటివి ప్రధాన అంశాలు. -
టెట్ ఫలితాలు విడుదలు
హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. గురువారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. టెట్ వెబ్సైట్ www. aptet.cgg.gov.inలో ఫలితాలు పొందుపరిచినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెట్ ఫైనల్ కీని కూడా విడుదల చేశారు. మార్చి 16న జరిగిన టెట్ పేపర్-1కు 56వేల 546 మంది, పేపర్2కు 3లక్షల 39వేల 251 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. రెండు పేపర్లు రాసిన అభ్యర్థులు 7వేల మంది ఉన్నారు. డీఈడీ అభ్యర్థులు రాసిన పేపర్ వన్-1లో 73.92 మంది, బీఈడీ పేపరు-2లో 32.32 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల 15 నుంచి ఆన్సర్ షీట్లు aptet వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి. ఫలితాల కోసం www.sakshieducation.comలో చూడవచ్చు. -
నేడు టెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు టెట్ వెబ్సైట్ www.aptet.cgg.gov.inలో ఫలితాలను పొందుపరుస్తామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెట్ ఫైనల్ కీని కూడా విడుదల చేశారు. మార్చి 16న జరిగిన టెట్ పేపర్-1కు 56,546 మంది, పేపర్-2కు 3,39,251 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండు పేపర్లు రాసిన అభ్యర్థులు 7 వేల మంది ఉన్నారు. -
ప్రశాంతంగా ‘టెట్’
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రం లో ఆదివారం నిర్వహించిన టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్) ప్రశాంతంగా ముగిసింది. 38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన పరీక్షకు 1,807 మంది హాజరుకావాల్సి ఉండగా 1661 మంది వచ్చారు. అలాగే.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించిన పేపర్-2 పరీక్షకు 6,384 మందికి గాను 5,668 మంది పరీక్ష రాశారు. రెండు పరీక్షలకు కలిపి మొత్తం 862 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతారావు, ఏఎస్పీ డేవిస్, పరీక్షల రాష్ట్ర అబ్జర్వర్ తులసీదాస్, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు పరిశీలించారు. జిల్లా కేంద్రంలో సందడి.. టెట్ పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులతో జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది. హోటళ్లు, లాడ్జీలు కిటకిటలాడాయి. అభ్యర్థులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు సమయానికి బస్సుల్లేక అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధిక ఖర్చు పెట్టి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. -
నిమిషం లేటైతే ఇంటికే..
కరీంనగర్‌ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను ఆదివారం నిర్వహించడానికి జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లావ్యాప్తంగా 28,117 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వీరికోసం జిల్లాకేంద్రంలో 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో కె.లింగయ్య తెలిపారు. గుర్తుంచుకోండి.. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. పరీక్ష ముగిసేంత వరకు సెంటర్ నుంచి బయటికి వెళ్లరాదు. అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు సెల్ఫోన్లు లోనికి తెచ్చుకోరాదు. కాలిక్యులెటర్లు, మహిళల హ్యాండ్ బ్యాగులను లోనికి తీసుకెళ్లేందుకు అమతించరు. పరీక్షలో బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి. -
16నే ఉపాధ్యాయ అర్హత పరీక్ష
‘టెట్’ నిర్వహణకు ఈసీ ఓకే ఉదయం 9.30 - 12 గంటల వరకు పేపర్-1 మధ్యాహ్నం 2.30 - 5 గంటల వరకు పేపర్-2 ఏప్రిల్ 2న ఫలితాల వెల్లడి... విద్యాశాఖ సన్నద్ధం సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈనెల 16న టెట్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వాస్తవానికి గత నెల 9నే ఈ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇలా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన టెట్‌ను నిర్వహించడానికి అనుమతి కోరుతూ విద్యాశాఖ ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ)కి లేఖ రాసింది. టెట్ కేవలం అర్హత పరీక్షేనని, ఉద్యోగాల భర్తీకి సంబంధం లేదని విన్నవించింది. దీనిపై సీఈసీ సానుకూలంగా స్పందించింది. టెట్ నిర్వహణకు అభ్యంతరం లేదంది. దీంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా.. టెట్ నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈనెల 16న ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్-2 నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బుధవారం వెల్లడించారు. ఏప్రిల్ 2న ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 4.49 లక్షల మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షకు పది రోజులు కూడా సమయం లేకపోవడంతో సన్నద్ధం కావడం కష్టమని వారు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల తర్వాతే డీఎస్సీ: టెట్ నిర్వహణ పూర్తయినా డీఎస్సీ ప్రకటన ఎన్నికల తర్వాతే వెలువడనుంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి అవకాశం ఉండదు. ఎన్నికల తర్వాతే రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. -
టెట్ వాయిదా: పార్థసారధి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న జరగాల్సిన ఈ పరీక్షను సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కారణంగా వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. సంబంధిత అధికారులతో గురువారం జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం విద్యాశాఖ మంత్రి పార్థసారధి పరీక్ష వాయిదాకే నిర్ణయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల ఆఖరులోగా నిర్వహిస్తామన్నారు. అయితే, ఉద్యోగుల సమ్మె ఈ నెల 21 వరకు కొనసాగే అవకాశం ఉండడం, 23న పంచాయతీ కార్యదర్శి నియామక పరీక్ష, ఫిబ్రవరి ఆఖర్లో ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో టెట్ నిర్వహణ ప్రశ్నార్థకమేనని అధికారులు చెబుతున్నారు. డీఎస్సీ అనుమానమే!: టెట్ ఫలితాల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. మంత్రి చెబుతున్నట్లు ఫిబ్రవరి ఆఖరులో టెట్ నిర్వహిస్తే దీని ఫలితాల అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ మార్చిలో వెల్లడించాలి. ఫిబ్రవరి నెలాఖరుకే ఎన్నికల షెడ్యూలు వెలువడితే ఇక డీఎస్సీ జరిగే అవకాశంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. -
మళ్లీ నిరాశ
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు చెందిన ఏపీఎన్జీవో ఉద్యోగులు బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. టెట్‌ను ఈ నెల 9వ తేదీన నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పరీక్ష నిర్వహణకు ఉద్యోగులు సహకరించని నేపథ్యంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)ను వాయి దా వేస్తున్నట్టు ప్రభుత్వం గురువారం రాత్రి ప్రకటించింది. ఫిబ్రవరి నెలాఖరులోగా నిర్వహిస్తామని మంత్రి పార్థసారథి ప్రకటించారు. దీం తో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఫిబ్రవరిలో రెవెన్యూ, ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ అర్హత పరీక్షలు ఉన్నాయని, అదే విధంగా తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అల్లర్లకు అవకాశం ఉండటంతో టెట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని జనవరి 7వ తేదీన సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. వాయిదాల పర్వం మొదట సెప్టెంబర్ 30 తేదీన నిర్వహించనున్నామని విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వాయిదా పడటంతో నవంబర్‌లో నిర్వహిస్తామని రెండోసారి ప్రకటించారు. రెండో ప్రయత్నంలో కూడా వాయిదా పడటంతో నిరుద్యోగులు నిరాశకు లోనయ్యారు. ఎట్టకేలకు మూడోసారి ఫిబ్రవరి 9న పరీక్ష నిర్వహిస్తున్నామని ప్రకటించి, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మూడోసారి కూడ వాయిదా పడటంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ పొందిన అభ్యర్థులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రకటన వెలువడే నాటికి 7,998 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
31 నుంచి ‘టెట్’ హాల్ టికెట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 9న నిర్వహించనున్న టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) కు హాజరయ్యే అభ్యర్థులు 31 నుంచి aptet.cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారవర్గాలు సూచించాయి. అదనపు సమాచారం కోసం 040-23232340, 23232349 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపాయి. -
విశ్లేషణాత్మక అధ్యయనమే విజయ సోపానం..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆకర్షణీయ వేతనాలతో పాటు సమాజంలో గౌరవం కూడా లభించే ఉపాధ్యాయ కొలువును చేజిక్కించుకోవాలంటే టెట్‌తో పాటు డీఎస్సీలో మంచి స్కోర్ సాధించాల్సిందే! ఈ నేపథ్యంలో టెట్‌తో పాటు డీఎస్సీ ప్రిపరేషన్ ప్రణాళికపై ఫోకస్.. మెథడాలజీ: ఇందులో ప్రధానంగా బోధనా పద్ధతులు; టీచర్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం); బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలను చదవాలి. పేపర్-1, పేపర్-2లో అడిగే అంశాలు ఒక్కటే అయినా.. వాటి క్లిష్టత స్థాయిలో తేడా ఉంటుంది. దీన్ని గుర్తించి ప్రిపరేషన్ కొనసాగించాలి. ఉదాహారణ: హెర్బార్ట్ పాఠ్యపథక రచనలో సాధారణీకరణం తర్వాత సోపానం ఏది? 1) సంసర్గం 2) పునర్విమర్శ 3) విషయ విశదీకరణం 4) అన్వయం జవాబు: 4 ఉదాహారణ :‘విద్యార్థి దేన్నీ అసంపూర్తిగా వదిలేయడు’ అనేది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? 1) ఆత్మవిశ్వాసం 2) అనుకూల వైఖరి 3) అభినందన 4) శాస్త్రీయ వైఖరి జవాబు : 1 కంటెంట్ -సోషల్ స్టడీస్: ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అన్ని అంశాలను చదివాలి. వాతావరణ, భౌగోళిక పరిస్థితులు, నదులు.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా పౌరనీతి శాస్త్రం, అర్థ శాస్త్రం చదివేటప్పుడు వాటిని సమకాలీన అంశాలతో సరిపోల్చుతూ, జరుగుతున్న పరిణామాలకు అన్వయిస్తూ అధ్యయనం చేయాలి. సైన్స: పేపర్-1 కోసం కూడా మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. పేపర్-2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. గత టెట్‌లో ఈ విభాగంలో ప్రశ్నలు క్లిష్టంగానే ఉన్నాయి. చదివేటప్పుడు ఆయా అంశాల నుంచి ప్రశ్నార్హమైన వాటిని గుర్తించి వాటిని బిట్స్ రూపంలో నోట్స్ రాసుకోవడం ఉత్తమం. మ్యాథమెటిక్స్: అభ్యర్థులు మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎస్సీఈఆర్టీ పుస్తకాలను తప్పనిసరిగా చదవాలి. గణితం మెథడాలజీ విషయంలో డీఎస్సీ తరహాలోనే ప్రిపరేషన్ సాగిస్తే ఎక్కువ ఉపయోగం. మ్యాథ్స్‌కు తెలుగు అకాడెమీ పుస్తకాలు, ఆబ్జెక్టివ్ మెటీరియల్ చదవాలి. లాంగ్వేజ్‌లు: లాంగ్వేజ్ 1, లాగ్వేజ్ 2లో భాషావిభాగాలకు సంబంధించిన సాధారణ వ్యాకరణ అంశాలు, బోధనపద్ధతులు గురించి ఉంటుంది. పాఠశాల స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు తెలుగు బోధన పద్ధతులను చదవాలి. ఇంగ్లిష్: పేపర్-1, పేపర్-2లలో ఇంగ్లిష్ సబ్జెక్టుపై ప్రశ్నలు అడుగుతారు. గతంలో నిర్వహించిన టెట్‌లో వ్యాకరణానికి సంబంధించి ప్రతి అంశాన్ని పరీక్షిస్తూ ప్రశ్నలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్; ఆర్టికల్స్, డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ స్పీచ్; డిగ్రీస్ ఆఫ్ కంపేరిజన్, వొకాబ్యులరీ ఇలా అన్ని అంశాలపైనా అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. రిఫరెన్స్ బుక్స్: కంటెంట్: పేపర్-1: 1-5వ తరగతి టెక్ట్స్ బుక్స్ పేపర్-2: 6-8వ తరగతి టెక్ట్స్ బుక్స్ మెథడాలజీ కోసం-తెలుగు అకాడమీ పుస్తకాలు విద్యా మనో విజ్ఞాన శాస్త్రం- డీఈడీ, బీఈడీ పుస్తకాలు. ఏపీ టెట్ శిశు వికాసం, పెడగాజి సిలబస్‌లో పేర్కొన్న అంశాలు.. అభ్యర్థులు డీఎడ్, బీఎడ్ స్థాయిలో సైకాలజీలో చదువుకున్నవే. వీటితో పాటు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అంశాలు: ఛోమ్‌స్కీ, కార్ల్‌రోజర్స్ వికాస సిద్ధాంతాలు. వైగాట్స్కీ అభ్యసన సిద్ధాంతం బోధన దశలు. ఉపాధ్యాయ నైపుణ్యాలు. జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం, విద్యా హక్కు చట్టం. ఉదాహారణ: ‘స్కిమాట’ అనేది? 1) ప్రవర్తనా నమూనా లేదా సంజ్ఞానాత్మక నిర్మితి 2) భాషా వికాసం వల్ల ఏర్పడేది 3) అనర్గళంగా సంభాషించడం 4) ఒకరకమైన భాషా దోషం జవాబు: 1 ఉదాహారణ: మానవులను ధనాత్మక సంపదగా పేర్కొన్నది? 1) కొఠారి కమిషన్ 2) మొదలియార్ కమిషన్ 3) నూతన విద్యా విధానం-1968 4) నూతన విద్యా విధానం- 1986 జవాబు: 4 టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉపాధ్యాయ వృత్తిని కెరీర్‌గా ఎంపిక చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎన్సీటీఈ నిబంధనల మేరకు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)లో అర్హత సాధించాల్సిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహిస్తోంది. గత ఆగస్టు 25న మరోసారి టెట్ నిర్వహించేందుకు షెడ్యూల్‌ను విడుదల చేసినా, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో టెట్ నిర్వహణకు అధికారులు సిద్ధమవుతున్నారు. డీఈడీ, బీఈడీ, భాషా పండిత శిక్షణ, తత్సమాన అర్హత ఉన్న వారందరూ టెట్ రాయొచ్చు. ఎస్జీటీ అభ్యర్థులు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్ ఔత్సాహికులు పేపర్-2లో అర్హత సాధించాల్సి ఉంటుంది. వెయిటేజ్: డీఎస్సీలో టెట్ స్కోర్‌కు వెయిటేజ్ 20 మార్కులకు ఉంటుంది. టెట్‌లో సాధించే ప్రతి 7 1/2 మార్కులకు 1 మార్కు చొప్పున వెయిటేజీ ఉంటుంది. అందువల్ల డీఎస్సీలో సక్సెస్‌కు టెట్ కీలకం. సిలబస్: శిశు వికాసం, పెడగాజి: ప్రస్తుతం అభ్యర్థులు ప్రధానంగా శిశువు ప్రవర్తనకు సంబంధించిన అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. వికాస దశలు, వికాస అంశాలైన శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలు, వైయక్తిక భేదాలు, వాటిలో కనిపించే నిర్దిష్ట అంశాలైన ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, మూర్తిమత్వం అంశాలను ఒకటికి రెండుసార్లు చదవాలి. శిశువు ప్రవర్తనలో మార్పునకు సంబంధించిన అభ్యాసం, అభ్యసన బదలాయింపు అంశాలను చదవాలి. మనో వైజ్ఞానిక శాస్త్రం (సైకాలజీ) అంశాలను చదివేటప్పుడు కీలక భావనలు, సాంకేతిక పదాలు, సిద్ధాంతాలు-సూత్రాలు, ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు, వారి గ్రంథాలు తదితర విషయాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. పెడగాజి అంటే బోధన శాస్త్రం. ఇందులో సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం- నాయకత్వం -మార్గనిర్దేశకత్వం- మంత్రణం (కౌన్సెలింగ్) లను గురించి అధ్యయనం చేయాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ఏయే అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి? ప్రశ్నలు ఎలా అడుగుతున్నారు? అనే వాటిపై అవగాహన పెంపొందించుకోవాలి. టెట్ విద్యార్థికి, ఉపాధ్యాయుడికి అన్వయించుకుంటూ.. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను కేవలం అర్హత పరీక్షగా మాత్రమే భావించకూడదు. అది ఒక పోటీ పరీక్ష. ఎందుకంటే అభ్యర్థులు టెట్‌లో సాధించిన ప్రతి 15 మార్కులకు డీఎస్సీలో రెండు మార్కుల వెయిటేజ్ ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు సైకాలజీ, తెలుగు, ఇంగ్లిష్, కంటెంట్, మెథడాలజీలపై పట్టుసాధించాలి. సైకాలజీలోని భావనలు, సిద్ధాంతాలు, నియమాలను బట్టీ పద్ధతిలో కాకుండా, తార్కికంగా విశ్లేషించుకొని చదవాలి. సైకాలజీలోని అంశాలను విద్యార్థి, ఉపాధ్యాయుడికి అన్వయించుకుంటూ అభ్యసించాలి. ఇంగ్లిష్, తెలుగు విభాగంలో అభ్యర్థులు వ్యాకరణ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. ప్రస్తుతం ముఖ్యమైన అంశాలను చదవడానికే సమయాన్ని కేటాయించాలి. గత ప్రశ్నపత్రాల ఆధారంగా ఇంగ్లిష్, తెలుగు, పెడగాజి విభాగాన్ని అధ్యయనం చేయాలి. కంటెంట్ విభాగంలో పేపర్-1 రాసే అభ్యర్థులు.. 3, 4, 5 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యాంశాలను రివిజన్ చేయాలి. పేపర్-2 రాసే అభ్యర్థులు 6, 7, 8 తరగతుల పాఠ్యపుస్తకాల్లోని కీలకాంశాలను చదవాలి. కంటెంట్‌కు సంబంధించి ఎక్కువగా సమాచార ఆధారిత ప్రశ్నలే వస్తున్నాయి కాబట్టి అభ్యర్థులు జ్ఞాపకశక్తిని పెంపొందించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి టెట్‌లో క్లిష్టమైన విభాగం మెథడాలజీ. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే లక్ష్యాలు, స్పష్టీకరణాలు, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు, మూల్యాంకనం, కరిక్యులం అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి. ప్రస్తుతం అభ్యర్థులు వీలైనన్ని మోడల్ పేపర్లను సేకరించి, సాధన చేయాలి. దీనివల్ల ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నారో తెలుస్తుంది. అప్పుడు ఆయా అంశాలకు ఎక్కువ సమాయాన్ని కేటాయించొచ్చు. డీఎస్సీ విద్యా దృక్పథాలపై అవగాహన అవసరం టెట్‌తో పోల్చుకుంటే డీఎస్సీకి ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఇటు టెట్‌తో పాటు డీఎస్సీకి ఉపయోగపడే కంటెంట్, మెథడాలజీ అంశాలను ఏకకాలంలో ప్రిపేర్ కావాలి. నూతన విద్యా దృక్పథాలపై అభ్యర్థులు సరైన అవగాహన పెంపొందించుకోవాలి. ఇందులోని చారిత్రక, మనోవైజ్ఞానిక, తాత్విక, సామాజిక అంశాలను చదివేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. జనరల్ నాలెడ్జ్ విభాగం విస్తారమైంది. ఖండాలు, వాటిలోని దేశాలు, ఆ దేశాలకు సంబంధించిన భౌగోళిక, చారిత్రక అంశాలను చదవాలి. అభ్యర్థులు ఆర్థిక, సామాజిక, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలను వర్తమాన వ్యవహారాలకు అన్వయించుకొని చదవాలి. కంటెంట్ విభాగానికి సంబంధించి ఎస్జీటీ అభ్యర్థులు 6 నుంచి పదో తరగతి స్థాయి వరకు అధ్యయనం చేయాలి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఇంటర్మీడియెట్ స్థాయి వరకు చదవాలి. డీఎస్సీ ప్రిపరేషన్: ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) రెండు విభాగాలకు ఉమ్మడిగా ఉండే సబ్జెక్ట్‌లు కంటెంట్, టీచింగ్ మెథడాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే. ఎస్జీటీకి అదనంగా లాంగ్వేజెస్ ఉంటాయి. కంటెంట్, మెథడాలజీ సబ్జెక్టులను టెట్ కోసం చదువుతారు కాబట్టి ఇది డీఎస్సీ ప్రిపరేషన్‌కు కొంత వరకూ ఉపయోగపడుతుంది. టెట్ సిలబస్‌తో పోల్చితే డీఎస్సీ సిలబస్ విస్తృతంగా ఉంటుంది. కాబట్టి సమయపాలనను అలవరచుకొని, ప్రణాళిక ప్రకారం చదవాలి. రోజుకు ఎన్ని గంటలు చదివామనే దానికంటే ఎంత విశ్లేషణాత్మకంగా చదివామన్నదే ప్రధానం. ఎస్జీటీ కంటెంట్‌కు సంబంధించి ఏదైనా ఒక అంశం ఎనిమిదో తరగతి వరకు ఉండి, 9, 10 తరగతి పుస్తకాల్లో పునరావృతమైతే అలాంటి అంశాలను చదివేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్‌కు సంబంధించి హైస్కూల్ స్థాయి వరకు ఉండి, ఇంటర్మీడియెట్ పుస్తకాల్లో పునరావృతమయ్యే అంశాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి. లాంగ్వేజెస్: ఎస్జీటీ విభాగంలో మాత్రమే లాంగ్వేజెస్ ఉంటాయి. ఆయా భాషల్లో అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. తెలుగుకు సంబంధించి కవులు- రచయితలు- వారి రచనలు, భాషారూపాలు తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌కు సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, సెంటెన్సెస్, డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ స్పీచెస్; వొకాబ్యులరీ వంటి అంశాలపై పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. టెట్‌లో లాంగ్వేజెస్ కోసం సాగించిన ప్రిపరేషన్ డీఎస్సీకి సరిపోతుంది. మెథడాలజీ: ఇందులో ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా ఉంటాయి. దీనిలో బోధనా లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకనం, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు ప్రధానాంశాలుగా ఉంటాయి. మెథడాలజీ అంశాలను కంటెంట్‌లోని పాఠ్యాంశాలకు అన్వయించుకుని ప్రిపరేషన్ సాగించాలి. భావనలను తరగతి, ఉపాధ్యాయుడు, విద్యార్థికి అనుప్రయుక్తం చేసుకుని అధ్యయనం చేయాలి. బోధన పద్ధతులను చదివేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ సబ్జెక్టుకు ఏ బోధనా పద్ధతి సరిపోతుందో విశ్లేషించుకుని చదవాలి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్: పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌లో విద్య, ఉపాధ్యాయుడు చారిత్రక నేపథ్యం, వేద విద్య, జైనుల, ముస్లిం, బ్రిటిష్ విద్యా విధానాలతోపాటు స్వాతంత్య్రానంతర ఉన్నత కమిషన్ల గురించి చదవాలి. ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించే అంశాలు, ఉపాధ్యాయుల వృత్తి పూర్వక, వృత్యంతర శిక్షణ, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వాటి విధులు, రికార్డులు, రిజిస్టర్లకు సంబంధించిన అంశాలపై దృష్టిసారించాలి. అర్థశాస్త్రం- విద్య, జనాభావిద్య, ప్రజాస్వామ్య విద్య, పర్యావరణ విద్య, కేంద్ర రాష్ట్ర పథకాలకు సంబంధించిన అంశాలను చదవాలి. జాతీయ విద్యా ప్రణాళిక, విద్యా హక్కు చట్టం గురించిన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. ఎస్జీటీ/ఎస్‌ఏలకు ఒకే రకమైన సిలబస్ ఉన్నప్పటికీ.. ప్రశ్నల క్లిష్టతలో తేడా ఉంటుంది. స్థూలంగా చూస్తే ఐదు విభాగాలుగానే కనిపిస్తున్నప్పటికీ.. అందులోని అంశాలను చూసినప్పుడు విస్తృత ప్రిపరేషన్ అవసరం. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, సర్వశిక్ష అభియాన్, మిడ్ డే మీల్స్, సమ్మిళిత విద్య, పర్యావరణ విద్య, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఉచిత నిర్భంద విద్య, బాలల హక్కులు, మానవ హక్కులు, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్- 2005.. ఇలా చాలా అంశాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్: కరెంట్ అఫైర్స్‌లో వర్తమాన, శాస్త్ర సాంకేతిక అంశాలు, జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో చోటు చేసుకున్న పరిణామాలు, వార్తల్లోని వ్యక్తులు, సమావేశాలు, క్రీడలు తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. జీకే కోసం.. చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు-తెగలు-సంస్కృతులు, రాజధానులు, కరెన్సీ, తదితర అంశాలపై దృష్టి సారించాలి. ఉదాహారణ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ ఎక్కడ ఉంది? జవాబు : కోల్‌కతా ఉదాహారణ : ఆస్ట్రేలియా 28వ ప్రధానమంత్రిగా ప్రమాణం చేసింది ఎవరు? జవాబు : టోనీ అబోట్ (లిబరల్ పార్టీ) ప్రిపరేషన్ ప్రణాళిక: మన విద్యా విధానంలో పాఠ్యాంశాలను రూపొందించేటప్పుడు ఏకకేంద్ర విధానాన్నే పాటిస్తున్నారు. ఒక పాఠ్యాంశానికి సంబంధించిన ప్రాథమిక భావనలను కింది తరగతుల్లో పొందుపరిచి.. ఎగువ తరగతులకు వెళ్లే కొద్దీ వాటి క్లిష్టత స్థాయిని పెంచుతూ పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. కాబట్టి కంటెంట్ చదివేటప్పుడు కింది తరగతుల పుస్తకాలను చదవడం ప్రారంభిస్తే.. ఎగువ తరగతుల్లో పునరావృతమయ్యే అంశాలపై పట్టు చిక్కుతుంది. అభ్యర్థులు ప్రతి పాఠ్యాంశానికి చివర్లో ఇచ్చిన ముఖ్యాంశాలను, బిట్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. డీఎస్సీలో విజయం సాధించాలంటే పక్కా ప్రణాళికతో చదవాలి. కటెంట్‌కు 6 నుంచి 8వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను చదివి సొంతంగా నోట్సు ప్రిపేర్ చేసుకుంటే మంచిది. మెథడాలజీకి తెలుగు అకాడమీ పుస్తకాలను క్షుణ్ణంగా చదవాలి. సబ్జెక్టులను విశ్లేషణాత్మకంగా చదివితేనే మంచి స్కోర్‌కు అవకాశముంటుంది. రిఫరెన్స్ బుక్స్: ఎస్జీటీ: కంటెంట్: 1-10వ తరగతి టెక్ట్స్ బుక్స్ ఇంగ్లిష్ గ్రామర్: రెన్ అండ్ మార్టిన్, మార్కెట్లో లభించే ఏదైనా ప్రామాణిక పుస్తకం. మెథడాలజీ: తెలుగు అకాడమీ పుస్తకాలు ఎస్ఏ: కంటెంట్: 6-10వ తరగతి పుస్తకాలు, ఇంటర్మీడియెట్ తెలుగు అకాడమీ పుస్తకాలు జీకే: మనోరమ ఇయర్ బుక్, తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలు. టిప్స్: వివిధ అంశాలను చదువుతున్నప్పుడు ప్రశ్నలు వచ్చేందుకు అవకాశమున్న వాటిని గుర్తించి వాటిని బిట్స్ రూపంలో నోట్స్ రాసుకోవాలి. తెలుగు అకాడమీ పుస్తకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే.. ప్రశ్నల క్లిష్టతపై అవగాహన ఏర్పడుతుంది. అధ్యాయాల వారీగా ప్రాక్టీస్ టెస్ట్ రాయడం వల్ల ప్రిపరేషన్లో లోటుపాట్లు తెలుస్తాయి. -
22 లేదా జనవరి 5న టెట్!
గుంటూరు, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) ఈనెల 22 లేదా వచ్చే నెల 5న నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. 29న టెట్‌ను నిర్వహించేందుకు అనుమతి కోరుతూ విద్యాశాఖ 3న ప్రభుత్వానికి ఫైలు పంపించింది. అయితే అదే రోజు‘నెట్’ పరీక్ష ఉన్నందున ఈ మార్పు చేయాలని భావిస్తోంది. దీనిపై ఒకటీరెండు రోజుల్లో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సెకండరీ విద్యా శాఖ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో డీఎస్సీ: మంత్రి పార్థసారథి వచ్చే ఫిబ్రవరి 15నాటికి డీఎస్సీ పరీక్ష నిర్వహించి అదే నెల చివరల్లో ఫలితాలు ప్రకటిస్తామని సెకండరీ విద్యాశాఖ మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. -
ఈనెల 29న టెట్!
వచ్చే నెల 18న ఫలితాలు... వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ టెట్‌కు హాజరుకానున్న 4,49,902 మంది అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) ఈనెల 29న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం సెకండరీ విద్యా శాఖ మంత్రి పార్థసారథి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట టెట్‌ను నిర్వహించి, వెనువెంటనే 20,508 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని నిర్ణయించారు. దీంతో ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారంలో డీఎస్సీ నిర్వహించేందుకు విద్యాశాఖ షెడ్యూలును సిద్ధం చేస్తోంది. అయితే వీటికి రాత పూర్వకంగా ప్రభుత్వ ఆమోదం కోసం విద్యాశాఖ మంగళవారం సాయంత్రం సెకండరీ విద్యాశాఖకు ఫైలును పంపించింది. ప్రభుత్వం ఓకే చెబితే అధికారికంగా ఒకటీ రెండు రోజుల్లో ప్రకటన వెలువడనుంది. 4.49 లక్షల మంది నిరీక్షణకు తెర టెట్, డీఎస్సీల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగుల నిరీక్షణకు తెర పడనుంది. ఇప్పటికే టెట్ రాసేందుకు 4,49,902 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరితో ఇప్పటికే నిర్వహించిన మూడు టెట్ల లో అర్హత సాధించిన వారు మరో 3.50 లక్షల మంది వరకు ఉన్నారు. వీరంతా డీఎస్సీకి హాజరయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి సెప్టెంబర్ 1వ తేదీనాడు టెట్ నిర్వహించి, 14వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని విద్యాశాఖ జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. అయితే రాష్ట్ర విభజన నిర్ణయంతో ఈ రాత పరీక్షను వాయిదా వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చాకే టెట్, డీఎస్సీలను నిర్వహిస్తామని పేర్కొంది. మంగళవారం జరిగిన సమావేశంలో వీటిని నిర్వహించాలని నిర్ణయించారు. పేపరు-2 పరీక్షకే ఎక్కువ మంది అభ్యర్థులు.. రాష్ట్రంలో 1,975 కేంద్రాల్లో నిర్వహించనున్న టెట్‌కు 4,49,902 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో పేపరు-1 పరీక్షకు 56,202 మంది, పేపరు-2 పరీక్షకు 3,86,367 మంది, పేపరు-1, పేపరు-2 రెండు పేపర్లకు 7,333 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. డీఎస్సీలో 16,287 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులే అత్యధికంగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు 2,532 పోస్టులు ఉండగా, 1,425 పండిట్, 264 పీఈటీ పోస్టులు ఉన్నాయి. ఇదీ షెడ్యూలు.. 23వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 29వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష. జనవరి 18న ఫలితాలు వెల్లడి. -
‘టెట్’కు సమ్మె సెగ
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: నిరుద్యోగ ఉపాధ్యాయుల ఓట్లను స్థానిక ఎన్నికల్లో బుట్టలోవేయడానికి డీఎస్సీ ప్రకటనను ఎరగా వాడుకోవాలన్న సర్కారు వ్యూహాలు బెడిసికొట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా 22 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ-13 ద్వారా భర్తీచేస్తామని హడావుడిగా ప్రకటించిన ప్రభుత్వానికి ఎన్నికల కోడ్ బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. వీటికి ముందు నిర్వహించాల్సిన టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్) ప్రక్రియను నిర్వహించి నిరుద్యోగులను మభ్యపెట్టాలని ప్రభుత్వం చూసింది. దరఖాస్తులను స్వీకరించి పరీక్షల తేదీని కూడా ప్రకటించింది. ఈ మేరకు పరీక్షను సెప్టెంబర్ 1వ తేదీ నిర్వహించాల్సి ఉంది. అయితే సమైక్యాంధ్రా ఉద్యమం నేపథ్యంలో నిర్వహణ సాధ్యంకాదని నిర్ధారించుకొని పరీక్షల తేదీని నిరవధికంగా వాయిదా వేసినట్లు ఉన్నతాధికారుల నుంచి జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు డీఈఓ జి.కృష్ణారావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 14 వేలమంది నిరుద్యోగ ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సమైక్యాంధ్రా ఉద్యమం కారణంగా నిరవధిక వాయిదా వేస్తున్నామని తెలిపారు. పొడిగించిన తేదీని తర్వాత తెలియజేస్తామని పేర్కొన్నారు. దీంతో డీఎస్సీ-13 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. డీఎస్సీ ద్వారా జిల్లాలో భర్తీ చేసే 384 టీచర్ పోస్టులకు సుమారు 20 వేల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశాలున్నాయి. -
సమైక్య సెగతో టెట్ వాయిదా!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను వాయిదా వేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో సెప్టెంబర్ 1న టెట్‌ను నిర్వహించలేమంటూ ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు చేతులెత్తేయడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మంగళవారం విద్యాశాఖ ప్రభుత్వానికి ఫైలు పంపించింది. ఇప్పటికే ఆందోళన ప్రభావం జిల్లాల్లో స్కూళ్లపై ఉండగా, ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి నుంచి సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు కూడా సమ్మెకు దిగుతుండటంతో అధికారులు టెట్ వాయిదావైపే మొగ్గుచూపుతున్నారు. ఇన్విజిలేటర్లుగా వ్యవహరించాల్సిన ఉపాధ్యాయులు లేకుండా పరీక్ష నిర్వహణ అసాధ్యమని, ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా మినహా మరే ప్రత్యామ్నాయం లేదని డీఈఓలు నిస్సహాయత వ్యక్తం చేయడంతో ఉన్నతాధికారులు కూడా టెట్‌ను వాయిదా వేసేందుకే సిద్ధమయ్యారు. దీంతో ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న 4.47 లక్షల మంది అభ్యర్థులు మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పేలా లేదు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే వాయిదాకు సంబంధించి విద్యాశాఖ అధికారికంగా ప్రకటన వెలువరిస్తుంది. -
వాయిదా దిశగా టెట్!
సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగితే కష్టమే.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 1న జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. పరీక్షను వాయిదా వేసే దిశగా విద్యాశాఖ వర్గాలు ఆలోచనలు చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఉపాధ్యాయులు ఆందోళనల్లో పాల్గొంటే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పరీక్షను నిర్వహించడం సాధ్యం కాదని ఆయా జిల్లాలకు చెందిన డీఈవోలు విద్యాశాఖ ఉన్నతాధికారులకు మౌఖికంగా తెలియజేశారు. కాగా, ఇదే విషయాన్ని పేర్కొంటూ.. నిర్వహణలో తలెత్తే సమస్యలను తెలియజేస్తూ రాతపూర్వకంగా అందజేయాలని ఆయా జిల్లాల అధికారులను పాఠశాల విద్యా అదనపు డెరైక్టర్, టెట్ జాయింట్ డెరైక్టర్ ఎస్.జగన్నాథరెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ముఖ్యంగా పరీక్ష నిర్వహణకు అవసరమైన సామగ్రి పంపిణీ, పరీక్ష కేంద్రాల్లో పర్యవేక్షించాల్సిన ఇన్విజిలేటర్ల నియామకం వంటివి జిల్లాల్లో అధికారులకు సమస్య కానున్నాయి. దీంతో నిర్ణీత తేదీలో టెట్ నిర్వహణ కష్టం కానుంది. దీనిపై జిల్లాల నుంచి రాతపూర్వక ప్రతిపాదనలు అందాక మరో రెండు, మూడు రోజుల్లో ఉన్నతాధికారులు సమావేశమై అధికారిక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల పరీక్ష కేంద్రాల్లో 2 వేల వరకు పరీక్ష కేంద్రాలు సీమాంధ్ర జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. అయితే విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలోని ఉద్యోగులు సమ్మె చేస్తుండగా ఉపాధ్యాయులూ ఆందోళనలకు దిగారు. టెట్ పరీక్షకు 4,44,718 మంది దరఖాస్తు చేసుకోగా.. వారికి ఈ నెల 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకా శం కల్పిస్తామని విద్యాశాఖ తెలిపింది.