వచ్చే నెల 18న ఫలితాలు... వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్
టెట్‌కు హాజరుకానున్న 4,49,902 మంది అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) ఈనెల 29న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం సెకండరీ విద్యా శాఖ మంత్రి పార్థసారథి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట టెట్‌ను నిర్వహించి, వెనువెంటనే 20,508 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని నిర్ణయించారు. దీంతో ఫిబ్రవరి మొదటి వారం లేదా రెండో వారంలో డీఎస్సీ నిర్వహించేందుకు విద్యాశాఖ షెడ్యూలును సిద్ధం చేస్తోంది. అయితే వీటికి రాత పూర్వకంగా ప్రభుత్వ ఆమోదం కోసం విద్యాశాఖ మంగళవారం సాయంత్రం సెకండరీ విద్యాశాఖకు ఫైలును పంపించింది. ప్రభుత్వం ఓకే చెబితే అధికారికంగా ఒకటీ రెండు రోజుల్లో ప్రకటన వెలువడనుంది.
4.49 లక్షల మంది నిరీక్షణకు తెర
టెట్, డీఎస్సీల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగుల నిరీక్షణకు తెర పడనుంది. ఇప్పటికే టెట్ రాసేందుకు 4,49,902 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరితో ఇప్పటికే నిర్వహించిన మూడు టెట్‌ల లో అర్హత సాధించిన వారు మరో 3.50 లక్షల మంది వరకు ఉన్నారు. వీరంతా డీఎస్సీకి హాజరయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి సెప్టెంబర్ 1వ తేదీనాడు టెట్ నిర్వహించి, 14వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని విద్యాశాఖ జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. అయితే రాష్ట్ర విభజన నిర్ణయంతో ఈ రాత పరీక్షను వాయిదా వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం అనుమతి ఇచ్చాకే టెట్, డీఎస్సీలను నిర్వహిస్తామని పేర్కొంది. మంగళవారం జరిగిన సమావేశంలో వీటిని నిర్వహించాలని నిర్ణయించారు.
పేపరు-2 పరీక్షకే ఎక్కువ మంది అభ్యర్థులు..
రాష్ట్రంలో 1,975 కేంద్రాల్లో నిర్వహించనున్న టెట్‌కు 4,49,902 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో పేపరు-1 పరీక్షకు 56,202 మంది, పేపరు-2 పరీక్షకు 3,86,367 మంది, పేపరు-1, పేపరు-2 రెండు పేపర్లకు 7,333 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. డీఎస్సీలో 16,287 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులే అత్యధికంగా ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు 2,532 పోస్టులు ఉండగా, 1,425 పండిట్, 264 పీఈటీ పోస్టులు ఉన్నాయి.
ఇదీ షెడ్యూలు..
23వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 29వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష. జనవరి 18న ఫలితాలు వెల్లడి.
ఈనెల 29న టెట్!
Published Wed, Dec 4 2013 2:11 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM
Advertisement
Advertisement