టెట్టా... టెర్టా!
* టెట్ వేరుగానా లేక ఎంపిక పరీక్షతో కలిపి నిర్వహించాలా?
* ఉపాధ్యాయ అర్హత పరీక్షపై విద్యాశాఖ ఆలోచనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే జనవరి నాటికి కొత్త టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భర్తీ విధానంపై మళ్లీ చర్చ మొదలైంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను వేరుగా నిర్వహిం చాలా? లేక ఉపాధ్యాయ నియామక పరీక్షతో (టీఆర్‌టీ) టెట్‌ను కలిపి.. టీచర్ ఎలిజిబిలిటీ కమ్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టెర్ట్) పేరుతో ఉమ్మడి పరీక్ష నిర్వహించాలా?
అన్న అంశంపై విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. ఇటీవల టీచర్ల హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియ చేపట్టిన అనంతరం 7,974 పోస్టుల అవసరం ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. ఈ లెక్కలు తేలాక.. వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరవడానికి ముందే కొత్త ఉపాధ్యాయులను నియమిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అసలు టెట్ అవసరమా? అన్న అంశాన్ని తేల్చేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) జారీ చేసిన టెట్ మార్గదర్శకాలనూ పరిశీలించే పనిలో పడింది.
ఎన్‌సీటీఈ ఆదేశాల మేరకు 2011 మే నెలలో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహించింది. ఆ తరువాత మూడు సార్లు టెట్ నిర్వహించింది. అయితే ఉపాధ్యాయ విద్యా కోర్సులో చేరేందుకు ఎంపిక పరీక్ష, కోర్సు వార్షిక పరీక్షలు, ఆ తరువాత ఉపాధ్యాయ నియామక పరీక్ష.. ఇలా ఇన్ని పరీక్షల్లో అర్హతతో పాటు ప్రతిభ కనబరిస్తేనే ఉపాధ్యాయ ఉద్యోగం ఇస్తున్నపుడు మళ్లీ ప్రత్యేకంగా టెట్ అవసరమా? అన్న వాదన వ్యక్తమయింది. దీనిపై అధ్యయనం చేసేందుకు 2013లో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
ఆ కమిటీ సిఫారసుల మేరకు టెట్, డీఎస్సీల నేతృత్వంలోని టీఆర్‌టీ వేర్వేరుగా కాకుండా రెండూ కలిపి టెర్ట్ పేరుతో నిర్వహించాలని సిఫారసు చేసింది. ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఆ తరువాత చివరి నిమిషంలో ఉమ్మడి పరీక్షపై వెనక్కి తగ్గింది. ఇక ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగింది. వేర్వేరు పరీక్షలు కాకుండా టీఈఆర్‌టీ పేరుతో ఒకే రోజు పేపరు-1, పేపరు-2 (ఒకటి టెట్, మరొకటి టీఆర్‌టీ) ఈ పరీక్షలను నిర్వహించాలన్న ఆలోచనలు ఉన్నాయి. వీలుకాకపోతే టెట్‌ను వేరుగా నిర్వహించడాన్నీ పరిశీలించాలని భావిస్తోంది.
మరోవైపు ఏపీలో ఇటీవల రెండింటికి ఒకే రోజు టెర్ట్‌ను రెండు పేపర్లుగా నిర్వహించారు. అయితే రెండూ కలిపి నిర్వహించడం ఎన్‌సీటీఈ నిబంధనలకు విరుద్ధమంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో తుది తీర్పు రావాల్సి ఉంది. అది వ చ్చే వరకు వేచి చూడాలని, ఆ తీర్పు ప్రకారం తాము ముందుకు సాగాలన్న ఆలోచనలు అధికారుల్లో ఉన్నాయి.