టెట్, టెన్త్, వీసీ నియామకాలకు తాత్కాలిక బ్రేక్
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖకు ఎన్నికల తంటా తప్పడం లేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో విద్యాశాఖలో వివిధ కార్యక్రమాలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు(టెట్) దరఖాస్తుల స్వీకరణ, పదో తరగతి పరీక్షల షెడ్యూలు జారీ, వైస్‌చాన్స్‌లర్ల నియామకాలకు ఆటంకం ఏర్పడింది. ఆయా పనులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌కు విద్యాశాఖ రాసింది. దీంతో ఎన్నికల కమిషన్ నుంచి ఆమోదం వచ్చే వరకు వాటి ప్రకటన నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రంలో టెట్ నిర్వహించేందుకు నవంబరు 14న విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 18వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని భావించింది. వరంగల్ ఉప ఎన్నిక కోడ్ అమల్లోకి రావడంతో దరఖాస్తుల స్వీకరణ నిలిచిపోయింది. ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం లేఖ రాసినా, స్పష్టత వచ్చేలోగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది.
దీంతో మళ్లీ ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. మరోవైపు పదో తరగతి పరీక్షలను 2016 మార్చి 21 నుంచి ఏప్రిల్ 9 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. షెడ్యూలును సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం కూడా ఆమోదించింది. అదే సమయంలో ఎన్నికల్ కోడ్ రావడంతో పదో తరగతి పరీక్షల షెడ్యూలు జారీలో జాప్యం జరుగుతోంది.
విద్యాశాఖకు ఎన్నికల కోడ్ తంటా!
Published Fri, Dec 4 2015 12:58 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
Advertisement