టెట్‌లో ‘అర్హత’ తంటా!
♦ ఒక్కో కేటగిరీలో ఒక్కోలా మార్కులు
♦ నష్టపోతున్నామంటూ ఓసీల ఆవేదన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో కనీస అర్హత మార్కులతో అభ్యర్థులకు తంటా తప్పడం లేదు! ఒక్కో రిజర్వేషన్ కేటగిరీలో ఒక్కోలా అర్హత మార్కులు ఉండటంతో తాము నష్టపోతున్నామని ఓసీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఓసీలకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 60 మార్కులు (40 శాతం) వస్తే టెట్‌లో అర్హత సాధించినట్లు పరిగణనలోకి తీసుకుంటుండటంతో తాము నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. దాన్ని అర్హత పరీక్షగానే చూడకుండా... మార్కులకు వెయిటేజీ కూడా ఉండటం వల్ల తాము ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
ఉదాహరణకు 2014లో నిర్వహించిన టెట్ తీసుకుంటే.. నల్లగొండ జిల్లాలో లాంగ్వేజ్ పండిట్ (హిందీ) కోసం 689 మంది పరీక్ష రాస్తే అందులో జనరల్ అభ్యర్థులు ముగ్గురే అర్హత సాధించారని వారు పేర్కొంటున్నారు. ఇక బీసీలు 415 మంది, ఎస్సీలు 185 మంది, ఎస్టీలు 75 మంది, వికలాంగులు 11 మంది అర్హత సాధించారని, ఇతర కేటగిరీలు, వేరే జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అయితే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలే ఆ నిబంధన విధించిందని అధికారులు పేర్కొంటున్నారు. కనీస అర్హత మార్కులు 60 శాతంగా పరిగణనలోకి తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు కన్సెషన్ ఇవ్వాలని ఎన్‌సీటీఈ మార్గదర్శకాలే చెబుతున్నాయంటున్నారు.
హిందీలో సోషల్ ప్రశ్నపత్రమా?
రాష్ట్రంలో టెట్ అధికారుల నిర్వాకం వల్ల తాము కూడా నష్టపోవాల్సి వస్తోందని హిందీ పండిట్ అభ్యర్థులు చెబుతున్నారు. తాము పరీక్ష రాసే సబ్జెక్టు హిందీ అయినప్పుడు ఆ సబ్జెక్టు ప్రశ్నపత్రాన్ని హిందీ లేదా ఇంగ్లిషులో ఇస్తే ఫర్వా లేదని, అయితే పేపర్-2లో 60 మార్కులకు ఉన్న సోషల్ సబ్జెక్టు పేపర్ కూడా హిందీ, ఇంగ్లిష్‌లో ఇవ్వడంతో నష్టపోతున్నామంటున్నారు. పదో తరగతి వరకు సోషల్‌ను తెలుగు మీడియంలో చదివినందున ఆ ప్రశ్నపత్రాన్ని అదే భాషలో ఇవ్వాలని కోరుతున్నారు. హిందీ భాషలో సోషల్ పదజాలం ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు.