ప్రైవేటు టీచర్లకూ టెట్ తప్పనిసరి
వచ్చే ఏడాది ఉంచి అమలు చేసేలా విద్యాశాఖ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అర్హత సాధించిన ఉపాధ్యాయులను తప్పనిసరి చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని కచ్చితంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అవసరమైన కార్యాచరణపై దృష్టి సారించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ అన్ని పాఠశాలల్లోనూ బోధించే ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలకు టెట్ అర్హతను తప్పనిసరి చేశారు. ఇక రాష్ట్రంలో దాదాపు 11 వేలకుపైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. చాలా వాటిల్లో ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణ పొందని వారు కూడా టీచర్లుగా పనిచేస్తున్నారు.
పలు చోట్ల ఇంజనీరింగ్ చేసిన వారు ఉన్నత పాఠశాల్లో సైన్స్, గణితం వంటి సబ్జెక్టులను బోధిస్తున్నారు. అలాంటి వారికి బోధనకు సంబంధించిన పదజాలంపై, బోధనా విధానాలపై పట్టు ఉండదు. కేవలం పాఠం వివరించి, జ్ఞాపకం చేయించడం, పరీక్షలు నిర్వహించడం వంటివే చేస్తున్నారు. దీంతో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. విద్యా శాఖ క్షేత్రస్థాయి సర్వేలో తేలిన లెక్కల ప్రకారం.. ప్రైవేటు ప్రాథమిక పాఠశాలల్లో బోధించే వారిలో 36 శాతం, ఉన్నత పాఠశాలల్లో 48 శాతం మంది మాత్రమే టెట్ అర్హులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ శిక్షణ పొందిన, టెట్ అర్హత సాధించినవారినే ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా నియమించుకునేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
అయితే స్కూల్‌లోని టీచర్లందరూ టెట్ అర్హత పొందిన వారే ఉండాలా, కొంత శాతం వెసులుబాటు ఉండాలా అన్నదానిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశముంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో 2010 కంటే ముందు (టెట్ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చేప్పటికి) టీచర్లుగా నియమితులైన వారు టెట్ అర్హత సాధించి ఉండాల్సిన అవసరం లేదన్న వెసులుబాటు ఉంది. దీంతో ప్రైవే టు స్కూళ్లలోనూ ఆ నిబంధనను అమలు చేయాలా అనే దిశగా యోచిస్తున్నారు.
త్వరలో యాజమాన్యాలతో భేటీ
టెట్ అర్హత లేని టీచర్లతో బోధన కొనసాగిస్తున్న పాఠశాలలకు నోటీసులు జారీ చేయాలని విద్యా శాఖ భావిస్తోంది. దీనిపై ప్రైవేటు యాజమాన్యాలతో సమావేశమై... వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించనుంది. ప్రస్తుతం పలు ప్రైవేటు పాఠశాలలు ప్రాథమిక పాఠశాల నుంచి ప్రాథమికోన్నతం, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడేషన్‌కు దరఖాస్తులు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం వాటిలో టెట్‌లో అర్హత సాధించిన టీచర్లను నియమిస్తేనే అప్‌గ్రేడ్ చేసేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
అర్హులంతా స్కూళ్లలోనే
టెట్‌లో అర్హత సాధించిన వారంతా ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నారు. టెట్‌లో అర్హత సాధించినవారు తెలుగు మీడియం వారే దొరుకుతున్నారు. ఇంగ్లిషు మీడియం టీచర్లు లభించడం లేదు. దాంతో అర్హతలున్న అన్‌ట్రైన్డ్ వారితో నాణ్యమైన విద్యనందిస్తున్నాం. - శ్రీనివాసరెడ్డి, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు