రేపే టెట్!
♦ నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
♦ ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం (22వ తేదీన) ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,618 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 3,73,494 మంది హాజరుకానున్నారు. 22న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. పేపర్ల వారీగా చూస్తే 443 కేంద్రాల్లో నిర్వహించే పేపర్-1 పరీక్షకు 1,00,184 మంది, 1,175 కేంద్రాల్లో నిర్వహించే పేపర్-2 పరీక్షకు 2,73,310 మంది హాజరుకానున్నారు.
ఈ పరీక్ష ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను పాఠశాల విద్య డెరైక్టర్ కిషన్ శుక్రవారం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న టెట్ కోసం అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతానికి భిన్నంగా ఈసారి జిల్లా కేంద్రాలతోపాటు డివిజన్ కేంద్రాలు, పలు మండల కేంద్రాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ముందురోజే చూసుకోవాలని.. పరీక్ష రోజున నిర్ధారిత సమయానికి గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
వేలి ముద్రలు ఇవ్వాలి..
టెట్‌లో తొలిసారిగా బయోమెట్రిక్ డాటా సేకరించనున్నట్లు కిషన్ తెలిపారు. హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో అతికించాలని, ఇన్విజిలేటర్ ముందు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలని చెప్పారు. అభ్యర్థుల వేలి ముద్రలను పరీక్ష కేంద్రంలో అధికారులు సేకరిస్తారని పేర్కొన్నారు. టెట్ వాయిదా పడక ముందు డౌన్‌లోడ్ చేసుకున్న పాత హాల్‌టికెట్లు చెల్లవని స్పష్టం చేశారు. కొత్త హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని, తీసుకురావాలని సూచించారు. అభ్యర్థులు బ్లూ పెన్ కాకుండా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నుతోనే పరీక్ష రాయాలని చెప్పారు.
టెట్ పరీక్షపై ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య కూడా జిల్లా కలెక్టర్లతో సమీక్షించారని తెలిపారు. టెట్‌ను పక్కాగా నిర్వహించే బాధ్యతను జిల్లాల కలెక్టర్లకు అప్పగించామని చెప్పారు. ఇందుకోసం కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ సభ్యులుగా, డీఈవో కన్వీనర్‌గా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని.. ఆ కమిటీల ఆధ్వర్యంలోనే పరీక్ష కేంద్రాలు, ఇతర ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందజేస్తామన్నారు. పరీక్ష రాసేప్పుడు మధ ్యలో బయటకు పంపించరని, టాయిలెట్ వంటి కనీస అవసరాలను ముందుగానే తీర్చుకోవాలని సూచించారు. టెట్ ప్రాథమిక ‘కీ’ని 23వ తేదీన విడుదల చేస్తామని, తర్వాత పది రోజుల్లోగా ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు.