పరీక్షకు ఎక్కువ మంది ప్రభుత్వ టీచర్లు దూరం
ఇప్పుడు సన్నద్ధత కష్టమంటూ అసంతృప్తి
ఏ పేపర్ ఎవరు రాయాలో స్పష్టత ఏది?
మారిన సిలబస్, సన్నద్ధతకు సమయంపై గందరగోళం
సర్వీస్ టీచర్లకోసం ప్రత్యేక టెట్ పెట్టాలనే డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)పై సర్వీస్ టీచర్లు ఆసక్తి చూపడం లేదు. ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న టీచర్లు అసలే ముందుకు రావడం లేదు. ఎవరు ఏ పేపర్ రాయాలో స్పష్టత లేదని.. దానికితోడు సన్నద్ధతకు సమయం లేదని ప్రభుత్వ టీచర్లు పేర్కొంటున్నారు. విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ, ఆపై ఎన్నికల విధులు ఉంటాయని.. అలాంటిది టెట్‌కెలా సన్నద్ధమవు తామని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో 2012కు ముందు సర్వీస్‌లో చేరిన 80వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లకు టెట్ అర్హత లేదు. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం.. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ).. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్‌ఎం పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత పొందాలి. అయితే ఈ పదోన్నతి కూడా అవసరం లేదనే భావన టీచర్లలో కనిపిస్తోందని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి.
పదోన్నతి వస్తే వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందని కొందరు టీచర్లు అంటున్నారు. ఉన్న ప్రాంతంలోనే పనిచేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. టెట్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో.. సర్వీస్ టీచర్లు విద్యాశాఖ వద్ద అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు.
పరీక్షపై స్పష్టత ఏదీ?
వృత్తి నైపుణ్యం పెంపు కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారని.. పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి అని చెప్పలేదని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే టీచర్లు డీఎడ్ అర్హతతో ఉంటారు. వారు పేపర్–1 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేయాలంటే బీఈడీ అర్హత ఉండాలి.
వారు పేపర్–2 రాయాలి. ఎస్జీటీలు పేపర్–1 మాత్రమే రాయగలరు. వారికి బీఈడీ లేని కారణంగా పేపర్–2 రాయలేరు. పదోన్నతులూ పొందే ఆస్కారం లేని పరిస్థితి తలెత్తుతుంది. ప్రాథమిక పాఠశాలల్లో హెచ్‌ఎంలుగా మాత్రం వెళ్లే వీలుంది. ఆ పదోన్నతి వస్తే ఇతర స్కూళ్లకు వెళ్లాలి. వేతనంలోనూ పెద్దగా తేడా ఉండదనేది టీచర్ల అభిప్రాయం. అంతేగాకుండా ఎవరు ఏ పేపర్ రాయాలనే దానిపై నోటిఫికేషన్‌లో స్పష్టత ఇవ్వలేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.
సన్నద్ధతకు సమయమేదీ?
చాలా మంది టీచర్లు పదేళ్ల క్రితమే ఉపాధ్యాయులుగా చేరారు. అప్పటికి, ఇప్పటికి బీఈడీ, డీఎడ్‌లో అనేక మార్పులు వచ్చాయి. టెన్త్ పుస్తకాలు అనేక సార్లు మారాయి. అయితే టీచర్లు వారు బోధించే సబ్జెక్టులో మాత్రమే అప్‌గ్రేడ్ అయ్యారు. కానీ టెట్ రాయాలంటే అన్ని సబ్జెక్టులూ చదవాలి. జూన్ 12 నుంచి టెట్ పరీక్షలు జరగనున్నాయి. టీచర్లు ఏప్రిల్ నెలాఖరు వరకు పరీక్షల నిర్వహణ, పేపర్లు దిద్దడంలోనే నిమగ్నమై ఉంటారు. మే నెలలో లోక్‌సభ ఎన్నికలున్నాయి.
టీచర్లు ఆ విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది. దీనితో టెట్ సన్నద్ధతకు అతి తక్కువ రోజులే ఉంటాయని టీచర్లు చెప్తున్నారు. ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు అన్ని తరగతులకు సంబంధించిన అని సబ్జెక్టులు చదివితే తప్ప టెట్‌లో అర్హత మార్కులు సాధించడం కష్టమని అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది టీచర్లు టెట్ రాసేందుకు సుముఖత చూపడం లేదు. టీచర్ల కోసం ప్రత్యేక టెట్ చేపట్టాలని, నోటిఫికేషన్‌లోని అంశాలపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment