Service teachers
-
Telangana: ప్రారంభమైన టెట్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) సోమవారం ఉదయం ప్రారంభమైంది. పూర్తిగా కంప్యూటర్ బేస్డ్గా.. రోజుకు రెండు సెషన్లు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇంకో సెషన్లో పరీక్ష జరగనుంది. వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 42 కేంద్రాలు ఉన్నాయి. ఈసారి కొత్తగా బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి సొంత ప్రాంతాల్లోనే పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రం దూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు అలాట్ అయ్యాయి. సెంటర్ల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని.. సెల్ఫోన్లు, ఇతర ఎలాంటి ఎల్రక్టానిక్స్ వస్తువులను అనుమతించరని అధికారులు తెలిపారు. 2.86 లక్షల మందికిపైగా దరఖాస్తు.. మొత్తంగా టెట్ పరీక్షకు 2,86,386 మంది దరఖాస్తు చేసుకున్నారు. డీఈడీ అర్హత ఉన్నవారు పేపర్–1 రాయనున్నారు. వారు ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు అర్హులవుతారు. పేపర్–1కు 99,588 మంది దరఖాస్తు చేశారు. బీఈడీ అర్హత ఉన్నవారు టెట్ పేపర్–2 రాయనున్నారు. వారు ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు అర్హత ఉంటుంది. దీనికి 1,86428 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో భాగంగా ముందుగా పేపర్–2 నిర్వహిస్తారు. తర్వాత పేపర్–1 నిర్వహిస్తారు. ఇక పదోన్నతులు పొందాలనుకునే సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాల్సి ఉంటుంది. మొత్తం 80 వేల మంది సర్వీస్ టీచర్లు పరీక్ష రాయాల్సి ఉండగా.. 48 వేల దరఖాస్తులే వచ్చాయి. వాస్తవానికి టెట్ గడువు పెంచడం వల్లే దరఖాస్తులు పెరిగాయి. తొలుత ఏప్రిల్ 10 వరకు గడువు ఇవ్వగా 2 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. తర్వాత అదనంగా పది రోజులు గడువు పెంచగా.. సర్వీస్ టీచర్లు సహా మరో 80 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. 2016లో టెట్‌కు 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు, 2023లో 2.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మేథ్స్ సబ్జెక్టు వాళ్లే ఎక్కువ గణితం, సైన్స్ సబ్జెక్టుల నేపథ్యం ఉన్న వారే ఎక్కువగా టెట్‌కు దరఖాస్తు చేశారు. మొత్తం అప్లికేషన్లలో ఈ సబ్జెక్టు వారే 99,974 మంది ఉన్నారు. సోషల్ నేపథ్యంతో టెట్ రాసేవారు 86,454 మంది ఉన్నారు. పేపర్–1కు ఎక్కువగా ఆదిలాబాద్ (7,504), వికారాబాద్ (5,879) జిల్లాల నుంచి.. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి (771) జిల్లా నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇక పేపర్–2కు నల్గొండ (7,163) జిల్లా నుంచి అధికంగా.. జయశంకర్ భూపాలపల్లి (935), ములుగు (963) జిల్లాల నుంచి అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ప్రశాంతంగా పరీక్షలు రాయాలి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో టెట్ రాయాలి. ఎలాంటి ఒత్తిడికి లోనుకావద్దు. పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకురావాలి. పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలి. – రాధారెడ్డి, టీఎస్ టెట్ కన్వీనర్ -
టెట్.. సర్వీస్ టీచర్లు లైట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)పై సర్వీస్ టీచర్లు ఆసక్తి చూపడం లేదు. ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న టీచర్లు అసలే ముందుకు రావడం లేదు. ఎవరు ఏ పేపర్ రాయాలో స్పష్టత లేదని.. దానికితోడు సన్నద్ధతకు సమయం లేదని ప్రభుత్వ టీచర్లు పేర్కొంటున్నారు. విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ, ఆపై ఎన్నికల విధులు ఉంటాయని.. అలాంటిది టెట్కెలా సన్నద్ధమవు తామని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 2012కు ముందు సర్వీస్‌లో చేరిన 80వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లకు టెట్ అర్హత లేదు. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం.. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ).. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత పొందాలి. అయితే ఈ పదోన్నతి కూడా అవసరం లేదనే భావన టీచర్లలో కనిపిస్తోందని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. పదోన్నతి వస్తే వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందని కొందరు టీచర్లు అంటున్నారు. ఉన్న ప్రాంతంలోనే పనిచేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. టెట్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో.. సర్వీస్ టీచర్లు విద్యాశాఖ వద్ద అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. పరీక్షపై స్పష్టత ఏదీ? వృత్తి నైపుణ్యం పెంపు కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారని.. పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి అని చెప్పలేదని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే టీచర్లు డీఎడ్ అర్హతతో ఉంటారు. వారు పేపర్–1 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేయాలంటే బీఈడీ అర్హత ఉండాలి. వారు పేపర్–2 రాయాలి. ఎస్జీటీలు పేపర్–1 మాత్రమే రాయగలరు. వారికి బీఈడీ లేని కారణంగా పేపర్–2 రాయలేరు. పదోన్నతులూ పొందే ఆస్కారం లేని పరిస్థితి తలెత్తుతుంది. ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంలుగా మాత్రం వెళ్లే వీలుంది. ఆ పదోన్నతి వస్తే ఇతర స్కూళ్లకు వెళ్లాలి. వేతనంలోనూ పెద్దగా తేడా ఉండదనేది టీచర్ల అభిప్రాయం. అంతేగాకుండా ఎవరు ఏ పేపర్ రాయాలనే దానిపై నోటిఫికేషన్లో స్పష్టత ఇవ్వలేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సన్నద్ధతకు సమయమేదీ? చాలా మంది టీచర్లు పదేళ్ల క్రితమే ఉపాధ్యాయులుగా చేరారు. అప్పటికి, ఇప్పటికి బీఈడీ, డీఎడ్‌లో అనేక మార్పులు వచ్చాయి. టెన్త్ పుస్తకాలు అనేక సార్లు మారాయి. అయితే టీచర్లు వారు బోధించే సబ్జెక్టులో మాత్రమే అప్‌గ్రేడ్ అయ్యారు. కానీ టెట్ రాయాలంటే అన్ని సబ్జెక్టులూ చదవాలి. జూన్ 12 నుంచి టెట్ పరీక్షలు జరగనున్నాయి. టీచర్లు ఏప్రిల్ నెలాఖరు వరకు పరీక్షల నిర్వహణ, పేపర్లు దిద్దడంలోనే నిమగ్నమై ఉంటారు. మే నెలలో లోక్‌సభ ఎన్నికలున్నాయి. టీచర్లు ఆ విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది. దీనితో టెట్ సన్నద్ధతకు అతి తక్కువ రోజులే ఉంటాయని టీచర్లు చెప్తున్నారు. ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు అన్ని తరగతులకు సంబంధించిన అని సబ్జెక్టులు చదివితే తప్ప టెట్‌లో అర్హత మార్కులు సాధించడం కష్టమని అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది టీచర్లు టెట్ రాసేందుకు సుముఖత చూపడం లేదు. టీచర్ల కోసం ప్రత్యేక టెట్ చేపట్టాలని, నోటిఫికేషన్‌లోని అంశాలపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
సమాచారం @ ఆన్లైన్
సాక్షి, మంచిర్యాల : ఉపాధ్యాయుల సమస్త సమాచారాన్ని అవసరం ఉన్నప్పుడల్లా సేకరించే తిప్పలు తప్పేలా జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుల సర్వీసు వివరాలతోపాటు వారి విద్యాభ్యాసం, పదోన్నతుల అర్హత సమాచారాన్ని వారి నుంచి సేకరిస్తున్నారు. తద్వారా త్వరలో జరగబోయే బదిలీలు, పదోన్నతులు, సర్దుబాట్లకు సమాచారం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం అన్ని కేటగిరీల ఉపాధ్యాయులను కలుపుకొని దాదాపు 11,000 మంది పనిచేస్తున్నారు. బదిలీలు, పదోన్నతులు, ఎన్నికల విధులు, పీఆర్సీ, డీఏ భత్యాల చెల్లింపు వంటి సందర్భాల్లో అప్పటికప్పుడు వివరాల సేకరణ విద్యాశాఖ వర్గాలకు తలకుమించిన భారంగా మారుతోంది. ఈ తిప్పలు తప్పేలా తాజాగా జిల్లా అధికారులు ఒక నమూనా రూపొందించారు. ఇందులో ఉపాధ్యాయుడి విద్యాభ్యాసం, ఉద్యోగంలో చేరిన తేదీ, పొందిన పదోన్నతులు, అందుకుంటున్న జీత భత్యాలు, శారీరక అంగవైకల్యం, పదోన్నతులకు అనుగుణమైన విద్యాభ్యాసం చేసిన వివరాలు, డిపార్ట్మెంటల్ టెస్టుల వివరాలు, ఎంఈడీ, బీఈడీ, డీఈడీ, భాషా పండిత పరీక్షలు ఉత్తీర్ణులు అయితే ఆ వివరాలు, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి వివరాలు వంటి సమాచారాన్ని పొందుపర్చనున్నారు. ఈ వివరాలను ఆయా అధికారుల ద్వారా ఆన్లైన్లో పొందపరుస్తున్నారు. దీంతో పాటు స్కూల్ హెడ్మాస్టర్ వద ్ద ఆ స్కూల్‌కు సంబంధించిన సమస్త సమాచారం అప్డేట్ చేసేలా పాస్‌వర్డ్‌తో కూడిన అనుమతి ఉంటుంది. పదోన్నతులు, బదిలీలు, నెలవారిగా విద్యార్థుల హాజరు వివరాలను ఆన్లైన్లో పొందుపరిచే అవకాశం ఉంటుంది. జీతభత్యాలు వీట న్నింటినీ త్వరలో రూపొందించే అవకాశాలున్న ఏకీకృత సర్వీసు రూల్సు, పదోన్నతులు, బదిలీలు, స్కూళ్ల మూసివేత కసరత్తు మార్గదర్శకాలు సిద్ధమయ్యే వరకు సిద్ధం చేయనున్నారు. ఆసక్తి పెరగాలి అయితే ఉపాధ్యాయుల నుంచి పూర్తిస్థాయిలో స్పందన రావడంలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం గడువు ముగిసే స మయానికి దాదాపు సగం మంది ఉపాధ్యాయులే వారి వివరాలను అ ప్లోడ్ చేసినట్లు సమాచారం. కొన్ని వివరాలు అందుబాటులో ఉండకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. బీఈడీ/డీఈడీ/ఇంటర్మీడియట్ తదితర చదువులకు సంబంధించిన హాల్‌టిక్కెట్ నంబర్లు అందజేయడం కష్టమవుతోందని ఓ ఉపాధ్యాయుడు పేర్కొన్నారు. అయితే వాటి ని అందజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అన వసర శ్రమను తగ్గించేందుకే.. - సత్యనారాయణరెడ్డి, డీఈవో, ఆదిలాబాద్ ఉపాధ్యాయులకు వివరాలు అందజేసేందుకు మండల, జిల్లా విద్యాశాఖ వరకు రావాల్సిన శ్రమను తప్పించేందుకు ఈ ప్రయత్నం. ఆన్లైన్లో స్కూళ్లవారిగా వివరాలు ఉండటం వల్ల సమచారహక్కు ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయాస కూడా తొలగిపోతుంది.