వచ్చే నెల 2 వరకూ కంప్యూటర్ బేస్డ్‌గా పరీక్ష
రోజుకు రెండు షిప్టులుగా నిర్వహణ
గంటన్నర ముందే హాల్లోకి అనుమతి.. ఒక్క నిమిషం నిబంధన అమలు
రాష్ట్రవ్యాప్తంగా 80 కేంద్రాలు.. పరీక్ష రాయనున్న 2.86 లక్షల మంది అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) సోమవారం ఉదయం ప్రారంభమైంది. పూర్తిగా కంప్యూటర్ బేస్డ్‌గా.. రోజుకు రెండు సెషన్లు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇంకో సెషన్‌లో పరీక్ష జరగనుంది.
వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 42 కేంద్రాలు ఉన్నాయి. ఈసారి కొత్తగా బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి సొంత ప్రాంతాల్లోనే పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు.
ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రం దూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు అలాట్ అయ్యాయి. సెంటర్ల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని.. సెల్‌ఫోన్లు, ఇతర ఎలాంటి ఎల్రక్టానిక్స్ వస్తువులను అనుమతించరని అధికారులు తెలిపారు.
2.86 లక్షల మందికిపైగా దరఖాస్తు..
మొత్తంగా టెట్ పరీక్షకు 2,86,386 మంది దరఖాస్తు చేసుకున్నారు. డీఈడీ అర్హత ఉన్నవారు పేపర్–1 రాయనున్నారు. వారు ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు అర్హులవుతారు. పేపర్–1కు 99,588 మంది దరఖాస్తు చేశారు. బీఈడీ అర్హత ఉన్నవారు టెట్ పేపర్–2 రాయనున్నారు. వారు ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు అర్హత ఉంటుంది. దీనికి 1,86428 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో భాగంగా ముందుగా పేపర్–2 నిర్వహిస్తారు. తర్వాత పేపర్–1 నిర్వహిస్తారు.
ఇక పదోన్నతులు పొందాలనుకునే సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాల్సి ఉంటుంది. మొత్తం 80 వేల మంది సర్వీస్ టీచర్లు పరీక్ష రాయాల్సి ఉండగా.. 48 వేల దరఖాస్తులే వచ్చాయి. వాస్తవానికి టెట్ గడువు పెంచడం వల్లే దరఖాస్తులు పెరిగాయి. తొలుత ఏప్రిల్ 10 వరకు గడువు ఇవ్వగా 2 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. తర్వాత అదనంగా పది రోజులు గడువు పెంచగా.. సర్వీస్ టీచర్లు సహా మరో 80 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. 2016లో టెట్‌కు 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు, 2023లో 2.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
మేథ్స్ సబ్జెక్టు వాళ్లే ఎక్కువ
గణితం, సైన్స్ సబ్జెక్టుల నేపథ్యం ఉన్న వారే ఎక్కువగా టెట్‌కు దరఖాస్తు చేశారు. మొత్తం అప్లికేషన్లలో ఈ సబ్జెక్టు వారే 99,974 మంది ఉన్నారు. సోషల్ నేపథ్యంతో టెట్ రాసేవారు 86,454 మంది ఉన్నారు. పేపర్–1కు ఎక్కువగా ఆదిలాబాద్ (7,504), వికారాబాద్ (5,879) జిల్లాల నుంచి.. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి (771) జిల్లా నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇక పేపర్–2కు నల్గొండ (7,163) జిల్లా నుంచి అధికంగా.. జయశంకర్ భూపాలపల్లి (935), ములుగు (963) జిల్లాల నుంచి అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి.
ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో టెట్ రాయాలి. ఎలాంటి ఒత్తిడికి లోనుకావద్దు. పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకురావాలి. పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలి.
– రాధారెడ్డి, టీఎస్ టెట్ కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment