Right to Education Act
-
విద్యాహక్కు చట్టం అమలు ఏ దశలో ఉంది
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిల్లల ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం–2009ను రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఎందుకు అమలుచేయడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అసలు చట్టం అమలు ఇప్పుడు ఏ దశలో ఉందో పూర్తి వివరాలు తెలుసుకొని చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ‘రాష్ట్రంలో విద్యాహక్కు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. చట్టంలో 121 సీ ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు 25 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంది. అలా ఎక్కడా జరగడం లేదు. దీనిని ప్రభుత్వం కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలి’అని కోరుతూ న్యాయవాది యోగేష్ ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇస్తున్నట్టు ఎక్కడా లేదని, రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు ఎంత వరకు వచ్చి0దో చెప్పాలని ఏఏజీ ధర్మాసనం ఆదేశించింది. కాగా, విద్యాహక్కు చట్టంపై తమకు సాయం చేసేందుకు అమికస్‌గా నియమితులైన సీనియర్ న్యాయవాది సునీల్ బి.గణు సేవలను ధర్మాసనం ప్రశంసించింది. మరో పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వ హాస్టళ్లలో బాత్రూమ్లు, టాయిలెట్లు, పరుపులు, దిండ్లు లాంటి ఏర్పాట్లపై కూడా వివరాలు అందజేయాలని చెబుతూ, విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
టెట్.. సర్వీస్ టీచర్లు లైట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)పై సర్వీస్ టీచర్లు ఆసక్తి చూపడం లేదు. ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్న టీచర్లు అసలే ముందుకు రావడం లేదు. ఎవరు ఏ పేపర్ రాయాలో స్పష్టత లేదని.. దానికితోడు సన్నద్ధతకు సమయం లేదని ప్రభుత్వ టీచర్లు పేర్కొంటున్నారు. విద్యార్థులకు వార్షిక పరీక్షల నిర్వహణ, ఆపై ఎన్నికల విధులు ఉంటాయని.. అలాంటిది టెట్కెలా సన్నద్ధమవు తామని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో 2012కు ముందు సర్వీస్‌లో చేరిన 80వేల మందికిపైగా ప్రభుత్వ టీచర్లకు టెట్ అర్హత లేదు. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం.. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) నుంచి స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ).. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పదోన్నతి పొందాలంటే టెట్ ఉత్తీర్ణత పొందాలి. అయితే ఈ పదోన్నతి కూడా అవసరం లేదనే భావన టీచర్లలో కనిపిస్తోందని విద్యాశాఖ వర్గాలు చెప్తున్నాయి. పదోన్నతి వస్తే వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుందని కొందరు టీచర్లు అంటున్నారు. ఉన్న ప్రాంతంలోనే పనిచేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. టెట్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో.. సర్వీస్ టీచర్లు విద్యాశాఖ వద్ద అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. పరీక్షపై స్పష్టత ఏదీ? వృత్తి నైపుణ్యం పెంపు కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారని.. పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి అని చెప్పలేదని ఉపాధ్యాయ వర్గాలు చెప్తున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే టీచర్లు డీఎడ్ అర్హతతో ఉంటారు. వారు పేపర్–1 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేయాలంటే బీఈడీ అర్హత ఉండాలి. వారు పేపర్–2 రాయాలి. ఎస్జీటీలు పేపర్–1 మాత్రమే రాయగలరు. వారికి బీఈడీ లేని కారణంగా పేపర్–2 రాయలేరు. పదోన్నతులూ పొందే ఆస్కారం లేని పరిస్థితి తలెత్తుతుంది. ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంలుగా మాత్రం వెళ్లే వీలుంది. ఆ పదోన్నతి వస్తే ఇతర స్కూళ్లకు వెళ్లాలి. వేతనంలోనూ పెద్దగా తేడా ఉండదనేది టీచర్ల అభిప్రాయం. అంతేగాకుండా ఎవరు ఏ పేపర్ రాయాలనే దానిపై నోటిఫికేషన్లో స్పష్టత ఇవ్వలేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సన్నద్ధతకు సమయమేదీ? చాలా మంది టీచర్లు పదేళ్ల క్రితమే ఉపాధ్యాయులుగా చేరారు. అప్పటికి, ఇప్పటికి బీఈడీ, డీఎడ్‌లో అనేక మార్పులు వచ్చాయి. టెన్త్ పుస్తకాలు అనేక సార్లు మారాయి. అయితే టీచర్లు వారు బోధించే సబ్జెక్టులో మాత్రమే అప్‌గ్రేడ్ అయ్యారు. కానీ టెట్ రాయాలంటే అన్ని సబ్జెక్టులూ చదవాలి. జూన్ 12 నుంచి టెట్ పరీక్షలు జరగనున్నాయి. టీచర్లు ఏప్రిల్ నెలాఖరు వరకు పరీక్షల నిర్వహణ, పేపర్లు దిద్దడంలోనే నిమగ్నమై ఉంటారు. మే నెలలో లోక్‌సభ ఎన్నికలున్నాయి. టీచర్లు ఆ విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది. దీనితో టెట్ సన్నద్ధతకు అతి తక్కువ రోజులే ఉంటాయని టీచర్లు చెప్తున్నారు. ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు అన్ని తరగతులకు సంబంధించిన అని సబ్జెక్టులు చదివితే తప్ప టెట్‌లో అర్హత మార్కులు సాధించడం కష్టమని అంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది టీచర్లు టెట్ రాసేందుకు సుముఖత చూపడం లేదు. టీచర్ల కోసం ప్రత్యేక టెట్ చేపట్టాలని, నోటిఫికేషన్‌లోని అంశాలపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఉచిత విద్యకు దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి (2024–25) విద్యాహక్కు చట్టం కింద దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నిజానికి ఈ గడువు సోమవారంతో ముగుస్తుండగా, విద్యాశాఖాధికారులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రతికూల పరిస్థితుల్లోని పిల్లలైన అనాథలు, హెచ్ఐవీ బాధితులు, విభిన్న ప్రతిభావంతులు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించాలి. వీరికి విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు, అన్ఎయిడెడ్ స్కూళ్లల్లో 25 శాతం సీట్లు కేటాయించాలి. దీనిప్రకారం ఇప్పటివరకు 49,208 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 38,150 మంది పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. విద్యార్థుల నివాసాలకు సమీపంలో ఉన్న ఐబీ, ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్‌ను బోధిస్తున్న స్కూళ్లలోను పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఉచితంగా కేటాయించాలని సమగ్రశిక్ష ఎస్సీడీ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థుల తల్లిదండ్రులు తమ నివాసాలకు సమీపంలోని సచివాలయం లేదా ఇంటర్నెట్, ఎంఈవో కార్యాలయం, మీ–సేవా కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయ పనివేళల్లో సమగ్రశిక్షా పాఠశాల విద్యాశాఖ (టోల్ ఫ్రీ) 18004258599 నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు. అర్హతగల పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్.. ఇక ఆసక్తిగల పిల్లల తల్లిదండ్రులు పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో విద్యార్థి పేరు, ఇతర వివరాలు నమోదుచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. పిల్లల ఆధార్ నంబర్, లేదా తల్లిదండ్రుల ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం ఆన్లైన్లో కనిపించే స్కూళ్లలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులకు ఆన్లైన్ లాటరీ ద్వారా స్కూళ్లను కేటాయిస్తారు. http://cse.ap.gov.in/RTE వెబ్సైట్లో లాగిన్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. -
దేశంలో బాల్యవిద్య బలహీనమే!
సాక్షి, అమరావతి: ఆరేళ్ల లోపు పిల్లల్లో మెదడు ఎదుగుదల అధికంగా ఉంటుంది. ఆ వయసులో మానసిక వికాసానికి సాన పెట్టాలి. అయితే దేశంలో ఇప్పటికీ 3.7 కోట్ల మందికి పైగా బాలలు పూర్వ బాల్య విద్యకు దూరమైనట్లు ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం సత్ఫలితాలనివ్వాలంటే పూర్వ బాల్యవిద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొంది. విద్యాహక్కు చట్టం–2009, నేషనల్ ఈసీసీఈ పాలసీ–2013, జాతీయ నూతన విద్యావిధానం–2020లో పూర్వ బాల్య విద్య ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే పూర్వ బాల్య విద్యకు తగినన్ని నిధులు కేటాయించాలి. 3– 6 ఏళ్ల వయసు వారి విద్యాభ్యాసాన్ని పాఠశాల విధానంలో చేర్చేలా ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టాలని నూతన విద్యావిధానం సిఫార్సు చేసింది. 2011 జనాభా లెక్కల నివేదిక పూర్వ బాల్య విద్యకు అర్హులైన బాలలు దేశంలో 10 కోట్ల మంది ఉన్నారు. ప్రస్తుతం పూర్వ బాల్య విద్య, ప్రాథమిక విద్యకు దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 0.1 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తుండగా కనిష్టంగా 1.6 నుంచి 2.2 శాతం వరకు పెంచాలి. అమెరికా, యూకే, ఈక్వెడార్ లాంటి దేశాల్లో 1.17 శాతం వరకు నిధులు కేటాయిస్తున్నారు. రాష్ట్రంలో బాల్య విద్య భేష్ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక విద్యారంగ సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్వ బాల్య విద్య, ప్రాథమిక విద్యకు ప్రాధాన్యమిచ్చారు. జాతీయ నూతన విద్యావిధానం కంటే ముందే రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక విద్యకు రూపకల్పన చేశారు. అంగన్వాడీలను స్కూళ్లతో అనుసంధానించి పీపీ–1, పీపీ–2 తరగతులతో ఫౌండేషన్ స్కూళ్లకు శ్రీకారం చుట్టారు. పూర్తిగా బాలల కోసమే ప్రత్యేక బడ్జెట్ పెట్టి ఏటా రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. 2021–22లో సీఎం జగన్ ప్రభుత్వం రూ.16,748.47 కోట్లతో తొలిసారిగా బాలల బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2022 – 23లో ఇందుకోసం రూ.16,903 కోట్లు కేటాయించారు. -
బడి బయటి పిల్లల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బడుల్లో చేరని బాలల కోసం నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు (ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ) ఏర్పాటు చేయాలని సమగ్ర శిక్ష విభాగం రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం.. 6 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలకు నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలన్న లక్ష్యం మేరకు సమగ్ర శిక్ష విభాగం ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. విద్యా సంవత్సరంలో ఏ స్కూల్లోనూ నమోదు కాకుండా బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారికి ప్రాథమిక విద్యను ఈ కేంద్రాల ద్వారా అందించనున్నారు. ఇలా బడి బయట ఉన్న పిల్లలు రాష్ట్రవ్యాప్తంగా 11,331 మంది ఉన్నట్లు సమగ్ర శిక్ష విభాగం గుర్తించింది. వీరికి నాన్ రెసిడెన్షియల్ విధానంలో 3, 6, 9 నెలల కాల వ్యవధితో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. విద్యార్థులు ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వీటిలో టీచర్ వలంటీర్లను నియమించి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించనున్నారు. అనంతరం ఆ విద్యార్థులను వారి వయసుకు తగ్గ తరగతుల్లో చేర్చనున్నారు. సమగ్ర శిక్ష విభాగం జిల్లా అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తల ద్వారా టీచర్ వలంటీర్లను నియమించనున్నారు. టెట్ ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ప్రత్యేక శిక్షణా కేంద్రాలకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో టీచర్ వలంటీర్లకు ఇంటర్మీడియెట్‌తో డీఈడీ, ప్రాథమికోన్నత స్థాయిలో డిగ్రీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణులకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. టీచర్ వలంటీర్లకు నెలకు రూ.7,500 చొప్పున అందిస్తారు. వలంటీర్లకు ఐదు రోజులపాటు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. టీచింగ్ టెర్నింగ్ మెటీరియల్ కింద ప్రతి సెంటర్‌కు రూ.1,000 విలువైన వస్తువులు అందిస్తారు. ఇవికాకుండా ప్రతి కేంద్రంలోని పిల్లలకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇస్తారు. పిల్లలకు సంబంధించిన స్టేషనరీకి రూ.200, బ్యాగుకు రూ.200, చెప్పులకు రూ.100 చొప్పున అందిస్తారు. పిల్లలకు కావాల్సిన వివిధ సబ్జెక్టుల పుస్తకాలను సమగ్ర శిక్ష విభాగం అందజేస్తుంది. ప్రతి కేంద్రంలో కనిష్టంగా 20 మంది ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 1 నుంచి 3 కిలోమీటర్ల దూరంలోపు ఉన్న పిల్లల కోసం ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కొండలు, నదులు, వాగులు వంటి ఆటంకాలు ఉన్న చోట స్కూల్ పాయింట్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఎంఈవోలు, హెడ్మాస్టర్ల పర్యవేక్షణలోనే ఇవి కొనసాగాలని, ఎన్జీవోల ద్వారా నిర్వహించరాదని సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి కేంద్రంలో కనిష్టంగా 20 మంది విద్యార్థులు ఉండాలని సూచించారు. మారుమూల, కొండ ప్రాంతాల్లో వీరి సంఖ్య 13 వరకు ఉండొచ్చన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉండే కమిటీ ఈ కేంద్రాలకు అనుమతి మంజూరు చేస్తుంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు సంబంధిత మండలం, పంచాయతీ, గ్రామానికి చెందిన వారికి ప్రాధాన్యమిస్తారు. అర్హులైనవారు లేనిపక్షంలో మండల పరిధిలో లేదా డివిజన్ పరిధిలో ఇతరులకు అవకాశం కల్పిస్తారు. -
తుది తీర్పునకు లోబడే 25% కోటా సీట్ల ఫీజు చెల్లింపు వ్యవహారం
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటా కింద ఉచిత సీట్లు పొందే పిల్లల తల్లిదండ్రులు అమ్మఒడి పథకం చెల్లించే మొత్తం నుంచే ఫీజులు చెల్లించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 24ను సవాలు చేస్తూ ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) అధ్యక్షుడు కోగంటి శ్రీకాంత్, యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫెడరేషన్(యుపీఈఐఎఫ్) చైర్మన్ గొల్లపూడి మోహనరావు హైకోర్టును ఆశ్రయించారు. 25 శాతం కోటా కింద భర్తీ చేసే సీట్ల ఫీజులను తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా పాఠశాలలకు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. 25 శాతం కోటా సీట్ల ఫీజులను ప్రభుత్వం సరైన రీతిలో నిర్ణయించలేదని వారు కోర్టుకు నివేదించారు. ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా పాఠశాలల ఖాతాలో సొమ్ము జమ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. ఫీజు చెల్లింపు వ్యవహారం ఈ వ్యాజ్యాల్లో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు నోటీసులిచ్చారు. తదుపరి విచారణను 15కి వాయిదా వేశారు. -
ప్రైవేటు స్కూళ్లలో ఆర్టీఈ చట్టం కింద 1వ తరగతిలో ప్రవేశాలు
సాక్షి, అమరావతి: విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం కింద రాష్ట్రంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి ఒకటో తరగతిలో అర్హులైన పేద విద్యార్ధులకు 25 శాతం సీట్ల కేటాయింపుపై ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఈమేరకు జీవో 24ను విడుదల చేశారు. ఐబీ (అంతర్జాతీయ), ఐసీఎస్ఈ, సీబీఎస్ఈ, స్టేట్ సిలబస్ స్కూళ్లన్నిటిలోను విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లను అర్హులైన పేదలకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ సీట్లకు సంబంధించి మార్చి 4న ప్రవేశాల క్యాలెండర్‌తో సహా నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆయా ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లు మార్చి 6 నుంచి 16 వరకు సంబంధిత వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి సంబంధిత వెబ్సైట్ విండో మార్చి 18నుంచి అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 7వ తేదీవరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థుల ఎంపిక ఏప్రిల్ 9 నుంచి 12 వరకు చేపడతారు. మొదటి విడత కేటాయింపు ఏప్రిల్ 13న ఉంటుంది. విద్యార్థులు ఏప్రిల్ 15 నుంచి 21వ తేదీలోపు ఆయా స్కూళ్లలో చేరికలను ఖరారు చేసుకోవాలి. అనంతరం రెండోవిడత సీట్ల కేటాయింపు ఏప్రిల్ 25న చేపడతారు. ఈ విద్యార్థులు ఏప్రిల్ 26 నుంచి 30వ తేదీలోపు ఆయా స్కూళ్లలో చేరాలి. రిజిస్ట్రేషన్లను హెచ్‌టీటీపీఎస్://సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్లో నమోదు చేయాలి. ఈ ప్రైవేటు స్కూళ్లలో ఆర్టీఈ చట్టం కింద ప్రవేశాలకు సంబంధించి సమస్యలు తలెత్తితే 14417 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించాలి. ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాలను, విధివిధానాలను జీవోలో వివరించారు. ఈ స్కూళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఒక్కో విద్యార్థికి పట్టణప్రాంతాల్లో రూ.8 వేలు, రూరల్‌లో రూ.6,500, గిరిజన ప్రాంతాల్లో రూ.5,100 చొప్పున చెల్లిస్తారని జీవోలో తెలిపారు. రాష్ట్రంలోని తమ పిల్లలను బడులకు (ప్రభుత్వ, లేదా ప్రైవేటు) పంపించే అర్హులైన పేద తల్లులందరికీ అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. 75 శాతం, ఆపై హాజరు నిబంధన అమలు చేస్తూ పేద పిల్లలందరికీ అమ్మ ఒడి పథకం వర్తింపజేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో సీట్లు పొందే ఈ పిల్లలకు సంబంధించి ఆయా స్కూళ్లకు చెల్లించాల్సిన ఫీజును నిబంధనలను అనుసరించి అమ్మ ఒడిని అందుకున్న అనంతరం విద్యాసంవత్సరం చివరన ఆయా స్కూళ్లకు రీయింబర్స్ చేస్తారని జీవోలో పేర్కొన్నారు. అలా తల్లిదండ్రులు చెల్లించకపోతే ప్రభుత్వం ఆమొత్తాన్ని తదుపరి అమ్మ ఒడి నుంచి మినహాయించి స్కూళ్లకు చెల్లిస్తుందని తెలిపారు. -
ప్రీ–మెట్రిక్ ఉపకార వేతనం 9, 10 తరగతులకే: కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే ప్రీ మెట్రిక్ ఉపకార వేతన పథకాన్ని ఇకపై 9, 10వ తరగతి విద్యార్థులకే వర్తింపజేస్తామని కేంద్రం స్పష్టంచేసింది. గతంలో ఒకటి నుంచి పదో తరగతి దాకా మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం కింద స్కాలర్షిప్ వచ్చేది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు నిర్బంధ ఉచిత విద్య అమలవుతున్నందున వారికి ఉపకార వేతన ప్రయోజనాల అవసరం ఉండదని చెప్పుకొచ్చింది. ఇకపై స్కాలర్‌షిప్‌ల కోసం 9, 10 తరగతి విద్యార్థుల దరఖాస్తులనే పరిశీలించాలని రాష్ట్ర, జిల్లా నోడల్ అధికారులకు సూచించింది. దీనిపై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ‘దశాబ్దాలుగా లబ్ధి పొందుతున్న పేద విద్యార్థులను ఆర్థికంగా మరింత కుంగదీసేలా బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతిలోకి ఉచిత ప్రవేశాలు
సాక్షి, అమరావతి: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలోకి ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వర్గాలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీలు, మైనార్టీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 6 శాతం సీట్లు కేటాయిస్తున్నట్లు వివరించారు. ప్రైవేటు స్కూళ్లలో ఒకటో తరగతి విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తున్నామన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను డీఈవోల ద్వారా ఆయా పాఠశాలల యాజమాన్యాలకు పంపినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు కూడా సమాచారం అందించామన్నారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ నెల 12లోపు ప్రవేశాలు పూర్తి చేయాలన్నారు. ఆ తేదీలోపు చేరని వారు అడ్మిషన్లు కోల్పోతారన్నారు. విద్యార్థుల జాబితాను cse.ap.gov.in/DSE/లో ఉంచామన్నారు. ఈ విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ తదితర సదుపాయాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
ప్రైవేట్ స్కూళ్లలో పేదల పిల్లలకు 25 % సీట్లు
సాక్షి, అమరావతి: పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లలో ప్రవేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయనుంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి 25 శాతం సీట్లను పేద వర్గాల పిల్లలతో భర్తీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, అనాధ, దివ్యాంగ, హెచ్ఐవీ బాధిత పిల్లలకు రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు చేపడతారు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ మైనారిటీ, ఓసీలకు 6 శాతం, అనాథ, దివ్యాంగ, హెచ్ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు ప్రాతిపదికగా నిర్ణయించారు. ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి బాలల హక్కుల చట్టం–2009 జీవో 20ని సవరిస్తూ జీవో 129లో సవివర మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాల కోసం రెండో జాబితా విడుదల చేయనున్నారు. 16 నుంచి దరఖాస్తు ప్రక్రియ 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లలో పేద విద్యార్థులకు ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 16వ తేదీనుంచి ప్రారంభం అవుతుందని కమిషనర్ తెలిపారు. ఆగస్టు 26వ తేదీ వరకు http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 1వ తరగతిలో ప్రవేశాలు, జీవో సవరణ వివరాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లు వివరించారు. -
కార్పొరేట్ స్కూళ్లలోనూ 'కోటా'
సాక్షి, అమరావతి: పేద విద్యార్ధులకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించేలా చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2022 – 23 విద్యాసంవత్సరం నుంచి దీన్ని పక్కాగా అమలు చేసేలా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. తద్వారా వీటిల్లో ఏటా లక్ష సీట్లు పేద విద్యార్ధులకు అందుబాటులోకి రానున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం పేద పిల్లలందరికీ కార్పొరేట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించేలా ‘ఇండస్ యాక్షన్’ అనే సంస్థతో పాఠశాల విద్యాశాఖ ఎంవోయూ కూడా కుదుర్చుకుంది. గవర్నెన్స్, టెక్నాలజీ సపోర్టు తదితర అంశాల్లో సంస్థ ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ సంస్థ ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఆర్టీఈ చట్టం అమలుకు తోడ్పాటునిచ్చి లక్షల మంది పేద విద్యార్ధులకు మేలు చేకూర్చింది. ఆర్టీఈపై న్యాయ వివాదాలు.. దేశంలో 6 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యకోసం కేంద్ర ప్రభుత్వం 2009లో జాతీయ విద్యాహక్కు చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టంలోని సెక్షన్ 12 (1సి) ప్రకారం ప్రైవేట్, అన్ ఎయిడెడ్, నాన్ మైనారిటీ, గుర్తింపు పొందిన ప్రతి పాఠశాల యాజమాన్యాలు నర్సరీ, ఎల్కేజీ, లేదా ఒకటో తరగతి నుంచి సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను కేటాయించాలి. చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించి దశాబ్దం దాటినా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2010లోనే ఆర్టీఈ చట్టాన్ని నోటిఫై చేసినా విధానపరమైన కారణాలతో పాటు కోర్టు స్టే ఉత్తర్వుల కారణంగా పేద విద్యార్ధులకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం కోటా అమలుకు నోచుకోలేదు. సీఎం ఆదేశాలతో కోటాపై కదలిక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీఈ చట్టం అమలుపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలకు 25 శాతం కోటా ప్రకారం సీట్లు కేటాయించేలా చర్యలు చేపట్టారు. వరుసగా రెండేళ్లు కరోనా కారణంగా పాఠశాలలు మూతబడిన నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది. తాజాగా ఈ ఏడాది నుంచి కోటా అమలుకు సన్నద్ధమైంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు. ఫీజులపై నిర్ణయానికి కమిటీ అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించేందుకు 25 శాతం కోటా తోడ్పడనుంది. ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్ స్కూళ్లలో విద్యను పేద విద్యార్థులు అందుకోలేకపోతున్నారు. ఆర్టీఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం కోటా కింద సీట్లను కేటాయించి ఫీజులను ప్రభుత్వమే యాజమాన్యాలకు చెల్లిస్తుంది. స్కూళ్లు, తరగతుల వారీగా చెల్లించాల్సిన ఫీజులపై పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే కమిటీని నియమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా తరగతుల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని అనుసరించి ప్రైవేట్ స్కూళ్లకు ఫీజులను చెల్లించనున్నారు. ఏటా లక్ష మందికి అవకాశం ఆర్టీఈ చట్టం ప్రకారం 25 శాతం కోటా అమలుతో రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో దాదాపు లక్ష సీట్లు పేద పిల్లలకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది లెక్కల ప్రకారం 9,500 స్కూళ్లలో 35 వేల సీట్లు ఈ విద్యాసంవత్సరంలో పేద పిల్లలకు అందనున్నాయి. -
బాలలకు భద్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ప్రధాన ప్రభుత్వ శాఖలన్నింటినీ సమన్వయపరుస్తోంది. బాలల హక్కుల పరిరక్షణకు వచ్చే నెలలో ప్రత్యేకంగా ‘కంప్లైంట్ మానిటరింగ్ సెల్ (సీఎంఎస్)’ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా వచ్చే విజ్ఞాపనలు, ఫిర్యాదులను పరిశీలించి సమన్వయం చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఒక సమన్వయకర్త (కోఆర్డినేటర్)ను నియమిస్తారు. ప్రతి గ్రామ, పట్టణాల్లోని వార్డు స్థాయిల్లో అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, మహిళా పోలీస్, వలంటీర్లను సైతం భాగస్వాముల్ని చేస్తారు. ఇందుకోసం ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. ప్రాథమికంగా దృష్టి సారించిన కీలక అంశాలు, చర్యలు ► విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయనున్నారు. ► బాలలపై లైంగిక వేధింపులు, లైంగిక దాడులు తదితర నేరాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా పోలీస్ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తారు. పోక్సో చట్టంతోపాటు బాలల హక్కులపైన పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ► బాలల అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుంది. పేదరికం, ఆర్థిక సమస్యలు, కోవిడ్ నేపథ్యంలో చితికిపోయిన కుటుంబాలకు చెందిన బాలలు అక్రమ రవాణా బారిన పడుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో తేలిగ్గా డబ్బు సంపాదన మరిగిన కొందరు బ్రోకర్లు బాలలను కార్మికులుగా, బలవంతపు వ్యభిచారానికి, కిరాయి యాచక వృత్తిలోకి దింపుతున్నారు. బాలలపై ఈ క్రూరత్వాన్ని కట్టడి చేసేలా చర్యలు చేపట్టింది. ► ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బాల్య వివాహాలు, డ్రాపవుట్స్ (బడి మానేయడం) వంటి వాటిని నివారించేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను భాగస్వాముల్ని చేయనున్నారు. ► దత్తత పేరుతో జరుగుతున్న దగాను నివారించడంపై దృష్టి పెట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దత్తత రిజిస్ట్రేషన్ చెల్లదనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల దత్తతకు కేంద్ర, రాష్ట్ర మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కఠినంగా అమలు చేయనున్నారు. ► భ్రూణ హత్యలకు దారితీసే లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడ శిశువులను వదిలించుకునేలా రోడ్డు, చెత్త కుప్పల్లో వదిలేసే దారుణాలు, సరోగసి (అద్దె గర్భాల) మాఫియాలపైనా దృష్టి పెట్టారు. ప్రభుత్వ యంత్రాంగం జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు, పోలీసులను సమన్వయపరిచి ఈ మాఫియాపై కఠిన చర్యలు చేపడుతున్నారు. ► బాలల స్వీయ రక్షణకు తోడ్పడే దిశ అప్లికేషన్ (యాప్)పై ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టి రోడ్డుపైన, విద్యాలయాల్లో బాలల మొబైల్ ఫోన్లలో దిశ యాప్‌ను ఇన్స్టాల్ చేయిస్తున్నారు. ఈ యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆపద సమమంలో దిశ యాప్ రక్షణ కవచంలా ఉంటుందని బాలలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. పది ప్రభుత్వ శాఖలతో సమన్వయం బాలల హక్కులు, సమస్యలపై పది ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నాం. ప్రధానంగా వైద్య ఆరోగ్య, విద్య, పోలీస్, కార్మిక, పంచాయతీరాజ్, మహిళా శిశు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలతోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో బాలల సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోంది. – డాక్టర్ కేసలి అప్పారావు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ -
పక్కాగా లెక్క.. బడి బయట పిల్లలెందరు..?
సాక్షి,మేడ్చల్ జిల్లా: బడి ఈడు పిల్లల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తున్నాయి. పలు కారణాలతో మధ్యలో బడిమానేసిన వారిని తిరిగి చదువు బాట పట్టించే చర్యలను విద్యాశాఖ తీసుకుంటోంది. ఇందులో భాగంగా బడిమానేసిన పిల్లల వివరాలు సేకరించాలని ఆదేశించింది. చదువుకు దూరమైన పాఠశాల స్థాయిలో 06–14. కళాశాల స్థాయిలో 15–19 ఏళ్ల వారిపై క్షేత్రస్థాయిలో సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నారు. సీఆర్పీలు ఇంటింటికీ వెళ్లి ‘ప్రభంద’ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. నేటి నుంచి ప్రారంభం గ్రేటర్‌తో సహా శివారు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో 2,498 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో మేడ్చల్ జిల్లాలో 515, రంగారెడ్డి జిల్లాలో 1,301, హైదరాబాద్ జిల్లాలో 682 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో బడిమానేసిన విద్యార్థుల వివరాల జాబితా అందుబాటులో ఉంది. దీని ఆధారంగా పది, ఇంటర్, డిగ్రీ.. ఏ దశలో విద్యను మానేశారో స్పష్టంగా తేల్చనున్నారు. గురువారం నుంచి వచ్చే నెల 12 వరకు గ్రామపంచాయతీ, పురపాలక సంఘాలు, జీహెచ్ఎంసీ పరిధిలో విద్యాశాఖకు చెందిన ఐఈఆర్పీలు, సీఆర్పీలు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించనున్నారు. ఉదయం..సాయంత్రం.. ఎండల తీవ్రత బడి బయట పిల్లల సర్వేపై ప్రభావం చూపనుంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో సర్వే చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆసక్తి ఉన్న వారిని వృత్తి విద్యా కోర్సులో చేర్పించనున్నారు. ఉన్నత విద్యా ఫలాలు అందించి జీవితంలో స్థిరపడేలా చేయూతనివ్వనున్నారు. సర్వే వేగవంతం చేసేలా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షిస్తారు. పక్కాగా వివరాల సేకరణ చదువుకునే వయస్సులో ఆర్థిక స్తోమత, కుటుంబ పరిస్థితుల కారణంగా పలువురు చిన్నారులు బడికి వెళ్లడంలేదు. ఉన్నత విద్య అభ్యసించాలనే వారి ఆశయం నెరవేరడం లేదు. ఈ సర్వేలో విద్యార్థి పేరు, ఆధార్, సెల్‌ఫోన్ నంబరు, ఏ తరగతిలో బడి మానేశారు. కారణాలు ఏమిటి..? తల్లి స్వశక్తి సంఘంలో సభ్యురాలిగా ఉందా? తల్లితండ్రుల వృత్తి, ప్రత్యేక అవసరాల పిల్లలు, వలస కూలీల పిల్లల సమాచారాన్ని సేకరించి నమోదు చేయనున్నారు. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా సర్వే మొక్కబడిగా సాగింది. ప్రస్తుతం ఆయా వివరాల సేకరణ పక్కాగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.కొందరు ఇంటివద్దనే ఉంటూ కూలీ పనులకు వెళుతున్నారు. మరికొందరు కుల వృత్తిలో కొనసాగుతూ.. విద్యకు దూరమవుతున్నారు. గత సర్వేలో బడి బయట పిల్లల సంఖ్య –1226 బడి బయట పిల్లల వివరాలకు సంబంధించి 2020–21లో విద్యాశాఖ సర్వే నిర్వహించగా ,గ్రేటర్‌తో సహా శివారు జిల్లాల్లో 1226 మంది లెక్క తేల్చారు. ఇందులో మేడ్చల్ జిల్లాలో 294 , రంగారెడ్డి జిల్లాలో 413, హైదరాబాద్ జిల్లాలో 519 మంది ఉండగా, వీరందరికీ ఆయా పాఠశాలలు, సార్వత్రిక విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పించి చదువుకునేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. (చదవండి: జల్లు..ఝల్లు) -
పేద వర్గాల పిల్లలకు ఆన్లైన్ విద్య
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్), అణగారిన వర్గాల పిల్లలకు ఆన్లైన్ విద్య అందుబాటులో ఉండడం లేదని, ఫలితంగా వారు ఎంతో నష్టపోతున్నారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విద్యా హక్కు చట్టాన్ని (ఆర్టీఈ) కచ్చితంగా అమలు చేసే దిశగా ఒక వాస్తవిక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని కేంద్ర, ప్రభుత్వాలకు శుక్రవారం సూచించింది. ఆన్లైన్ తరగతులు వినడానికి వీలుగా పేద విద్యార్థులకు పరికరాలు(స్మార్ట్ ఫోన్లు లేదా ల్యాప్‌ట్యాప్‌లు) అందజేయాలని, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని ఢిల్లీ హైకోర్టు 2020 సెప్టెంబర్ 18న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ గుర్తింపు పొందిన అన్–ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ల యాక్షన్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏను నిజం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అది జరగాలంటే పేద, అణగారిన వర్గాల పిల్లలకు ఆన్లైన్ విద్యను నిరాకరించరాదని స్పష్టం చేసింది. వారికి ఆన్లైన్ విద్య అందకపోతే సంపన్న కుటుంబాల పిల్లల కంటే వెనుకబడే ప్రమాదం ఉందని, ఇరు వర్గాల మధ్య అంతరం పెరిగిపోతుందని తెలిపింది. మంచి తీర్పు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు ధర్మాసనం అభినందించింది. -
AP: జీవో- 44 అమలుపై స్టే ఎత్తివేత
సాక్షి, అమరావతి: ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలన్న విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) నిబంధనల అమలులో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై గతంలో విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసింది. విద్యాహక్కు చట్టం అమలును సుప్రీంకోర్టు సమర్థించిన నేపథ్యంలో ఈ చట్టాన్ని అసలైన స్ఫూర్తితో అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో అదనపు అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి గడువునిచ్చిన హైకోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది. ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యా యమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 25 శాతం ఉచిత సీట్ల నిబంధనను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, పిటిషనర్ యోగేష్ వాదనలు వినిపిస్తూ.. 25 శాతం సీట్ల కేటాయింపు నిబంధనల అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 44 అమలుపై హైకోర్టు గతంలో స్టే విధించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల ప్రతి విద్యా సంవత్సరంలో లక్షల మంది పిల్లలు ఉచిత సీట్లను కోల్పోతున్నారని వివరించారు. ఇది విద్యాహక్కు చట్టాన్ని నీరుగార్చడమేనన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, 25 శాతం సీట్ల కేటాయింపు నిబంధన అమలు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 44పై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. -
ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లపై ఆగస్టు 9న విచారణ
సాక్షి, అమరావతి: ప్రతి ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు 25 శాతం సీట్లను ఉచితంగా కేటాయించాలని విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) నిబంధనలు చెబుతున్నాయని, ఈ నిబంధనను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఆగస్టు 9న విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 25 శాతం ఉచిత సీట్ల నిబంధనను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ న్యాయవాది తాండవ యోగేష్ 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గురువారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా, పిటిషనర్ యోగేష్ స్వయంగా వాదనలు వినిపిస్తూ, చట్ట నిబంధనలు ఇప్పటికీ అమలు కావడం లేదన్నారు. పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ ఆగస్టు 9న ఈ వ్యాజ్యంపై విచారణ చేపడుతామని స్పష్టం చేసింది. -
పదేళ్ల నుంచి ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యాహక్కు చట్టం అమలుపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. 2010 నుంచి పెండింగ్‌లో ఉన్న పలు పిల్స్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో సోమవారం కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలుపగా, 10 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. విద్యా హక్కు చట్టం అమలవుతుందా? లేదా? అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది (చదవండి: రోజు పది మందే చనిపోతున్నారా?: హైకోర్టు) నిధులు, ఖర్చుల వాటాలపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని, హైకోర్టు ఆదేశించినప్పటికీ కేంద్రం తన వైఖరి వెల్లడించలేదని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. బడ్జెట్ వివాదాలను ఈనెల 17లోగా పరిష్కరించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. మరో వాయిదా ఇచ్చేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు స్పష్టం చేసింది. ఈనెల 18న తుది విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. (చదవండి: అది రాజ్యాంగ విరుద్ధం) -
ఇంగ్లిష్ మీడియంపై సిఫార్సులివ్వండి
సాక్షి, అమరావతి: ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన అమలుపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ప్రభుత్వానికి త్వరలోనే సిఫార్సులు అందించనుంది. వీటి ఆధారంగా ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టనుంది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో అత్యధికులు ఆంగ్ల మాధ్యమానికే మొగ్గు చూపిన దృష్ట్యా ఆ మాధ్యమం అమలుకు వీలుగా సిఫార్సులు అందించాలని ప్రభుత్వం ఎస్సీఈఆర్టీకి సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం ఉత్తర్వులు (జీవో–21) జారీ చేశారు. ఆంగ్ల మాధ్యమం అమలుపై హైకోర్టు తీర్పు మేరకు ఏపీ విద్యా చట్టం (ఎడ్యుకేషన్ యాక్ట్)లోని సంబంధిత సెక్షన్లను అనుసరించి ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించాలని జీవోలో పేర్కొన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో గతంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి అమలు చేసిన తీరు, అందుకు దశలవారీగా తీసుకున్న చర్యలకు సంబంధించిన అంశాలను కూడా నివేదికల్లో పొందుపర్చాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్‌తో పాటు విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ)లోని సంబంధిత అవకాశాలను కూడా పరిశీలించి సిఫార్సుల్లో పొందుపర్చాలన్నారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఆంగ్ల మాధ్యమం వైపు తల్లిదండ్రుల మొగ్గు ► ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు 81, 85లను రద్దు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ► అకడమిక్ అంశాలపై అధికారాలు ఎస్సీఈఆర్టీవేనని, విద్యాహక్కు చట్టం ప్రకారం అకడమిక్ వ్యవహారాల్లో ఎస్సీఈఆర్టీ ప్రమేయం లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తీర్పులో పేర్కొంది. ► అదే సమయంలో నిర్ణయం తీసుకునే ముందు మాధ్యమంపై తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదని తీర్పులో అభిప్రాయపడింది. ► ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం (2020–21)లో తమ పిల్లలకు ఏ మాధ్యమంలో బోధన కోరుకుంటున్నారనే దానిపై విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ► ఈ ఆదేశాల మేరకు తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించిన కమిషనర్ ప్రభుత్వానికి నివేదించారు. ► 1 నుంచి 5 తరగతి వరకు చదువుతున్న 17,87,035 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆప్షన్లు కోరగా.. 17,85,669 మంది నుంచి ఆప్షన్లు అందాయి. ► 96.17 శాతం మంది ఆంగ్ల మాధ్యమం.. 3.05 శాతం మంది తెలుగు మాధ్యమం, 0.78 మంది ఇతర మైనర్ మాధ్యమాలు కావాలని ఆప్షన్లు ఇచ్చారు. ► హైకోర్టు తీర్పును అనుసరించి నిర్వహించిన ఆప్షన్ల సేకరణలో మాధ్యమంపై పిల్లలు/తల్లిదండ్రుల అభిప్రాయాలు ఇలా ఉన్న నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలుపై తగిన సిఫార్సులు అందించాలని ప్రభుత్వం ఈ జీవోలో ఎస్సీఈఆర్టీని కోరింది. -
ప్రమాణాలే ప్రామాణికం
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలు పాటించని విద్యా సంస్థలపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ స్పష్టం చేసింది. పాఠశాలల్లో బోధన, నిర్వహణ ఖర్చులను అనుసరించి ఏప్రిల్ నాటికి ఫీజులు నిర్ణయిస్తామని తెలిపింది. ఫీజులపై చట్టబద్ధమైన విధివిధానాలు లేనందున ప్రత్యేక చట్టం కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తామని పేర్కొంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం సీట్లు పేదలకు అందాలని, దీన్ని అమలు చేయిస్తామని పేర్కొంది. సోమవారం విజయవాడలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు, వైస్ చైర్మన్ డాక్టర్ ఎ.విజయశారదారెడ్డి, కార్యదర్శి ఎ.సాంబశివారెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల్లో వసతులు, ఫీజులు.. విద్యార్థులు– ఉపాధ్యాయుల నిష్పత్తి, మరుగుదొడ్లు, మంచినీరు, తరగతి గదులు, లైబ్రరీ లాంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని తనిఖీలు చేశామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని చెప్పారు. వారు వెల్లడించిన వివరాలు ఇంకా ఇలా.. 260 విద్యా సంస్థల్లో తనిఖీలు – రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13, 14వ తేదీల్లో 130 ప్రైవేట్ పాఠశాలలు, 130 ప్రైవేట్ జూనియర్ కాలేజీలను తనిఖీ చేయగా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించాం. – లోపాలపై విద్యా సంస్థలకు నోటీసులిస్తాం. గడువులోగా సరిదిద్దుకోకుంటే చట్టపరమైన చర్యల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. దిద్దుబాటుకు అవకాశం లేని విద్యాసంస్థల గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తాం. – సీబీఎస్ఈ, ఐసీఎస్సీ పాఠశాలలు, కాలేజీల విషయంలో కూడా ఫీజులు, ఇతర అంశాలపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలుంటాయి. – పాఠశాలలు ఫీజు రూ.70 వేలు చెబుతూ రూ.95 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. సృజనాత్మక బోధనకు బదులుగా బట్టీ విధానాల్లో పాఠాలు చెబుతున్నారు. – ప్రతి యూనిట్ టెస్టుకు విద్యార్ధులను ఒక సెక్షన్ నుంచి మరో సెక్షన్‌కు మారుస్తున్నారు. కఠిన శిక్షలు అమలు చేస్తుండడంతో విద్యార్థులు ఒత్తిడితో మానసిక స్థైర్యం కోల్పోతున్నారు. – విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు ఎక్కడా లేవు. బాలికలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. 40 మంది పట్టే తరగతి గదుల్లో 80 – 100 మంది వరకు ఉంటున్నారు. – ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లు పూర్తి అపరిశుభ్ర వాతావరణంలో కొనసాగుతున్నాయి. విద్యార్థులతో పాటు సిబ్బంది పరిస్థితి దయనీయంగా ఉంది. రోజువారీ కూలీలకన్నా తక్కువ వేతనాలు ఇస్తున్నారు. – గతంలో విద్యార్థుల ఆత్మహత్యలు కూడా చోటు చేసుకున్నాయి. – ఇంజనీరింగ్, డాక్టర్ విద్య మాత్రమే చదువులన్నట్లుగా కార్పొరేట్ విద్యాసంస్థల ప్రచారం వల్ల విద్యార్థుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతూ ఒత్తిడికి గురవుతున్నాయి. నిబంధనల మేరకు వ్యవహరించాల్సిందే మీడియా సమావేశంలో కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు, వైస్ చైర్మన్ డాక్టర్ విజయశారదారెడ్డి, కార్యదర్శి ఎ.సాంబశివారెడ్డి రాష్ట్రంలో ఏ విద్యా సంస్థ అయినా ప్రభుత్వ విధివిధానాల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుంది. సొసైటీల పేరిట కొన్ని సంస్థలు ఫీజుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ప్రతి విద్యా సంస్థకు సంబంధించిన ఐటీ రిటర్న్‌లను తెప్పించి పరిశీలిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ విద్యాబోధన, ప్రమాణాల విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. నాణ్యతా ప్రమాణాలపై అలసత్వాన్ని ఉపేక్షించం. – జస్టిస్ కాంతారావు అనువైన వాతావరణం లేదు ప్రైవేట్ సంస్థలు నిపుణులైన ఉపాధ్యాయులను నియమించడం లేదు. బోధనా సిబ్బంది నాలుగైదు బ్రాంచిలకు వెళ్లి పాఠాలు చెబుతున్నారు. 3, 4, 5 తరగతుల పిల్లలకు ప్రత్యేక తరగతులంటూ ఇబ్బంది పెడుతున్నారు. సరైన ఆటస్థలం, చదువుకునేందుకు అనువైన వాతావరణం ఎక్కడా లేదు. అపార్టుమెంట్లు, బహుళ అంతస్థుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్, ఈ–మెయిల్ ప్రవేశపెడుతున్నాం. – విజయ శారదారెడ్డి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యాచట్టం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మఒడి, నాడు–నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ విద్యాలయాలను అభివృద్ధి చేస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చింది. చంద్రబాబు బినామీ సంస్థలైన నారాయణ, చైతన్య విద్యాసంస్థలు ఇష్టానుసారం వ్యవహరించాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యాచట్టాన్ని మార్చి, సింగిల్ విండో ద్వారా ఆన్లైన్లో అనుమతులు ఇచ్చే విధానాన్ని రూపొందిస్తాం. – ఆలూరు సాంబశివారెడ్డి -
వయసు ఒకటే..తరగతులే వేరు!
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లు నిండిన వారినే ఒకటో తరగతిలో చేర్పించాలి.. ఇదీ విద్యా హక్కు చట్టం చెబుతున్న నిబంధన. అందుకు భిన్నంగా ఉంది రాష్ట్రంలో పిల్లల పరిస్థితి. ఐదేళ్లు నిండని పిల్లలు కొందరు ప్రీప్రైమరీలో ఉంటే, మరి కొందరు ఒకటో తరగతి చదువుతు న్నారు. ఇక ఆరేళ్లు వచ్చినా కొందరు ఇంకా ప్రీప్రైమరీ స్కూళ్లోనే/అంగన్ వాడీ కేంద్రాల్లోనే ఉండగా, కొందరు ఒకటో తరగతిలో ఉన్నారు. ఆయా విద్యార్థుల వయసు ఒక్కటే ఐనా, చదివే తరగతులు వేర్వేరు. తల్లిదం డ్రుల ఆకాంక్షలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఈ అంతరాలకు కారణం. పిల్లలను త్వరగా చదివించాలన్న తప నతో కొందరు తల్లిదండ్రులు రెండేళ్లకే పిల్లలను ప్రీప్రైమరీ స్కూళ్లకు పంపి స్తుంటే.. ఐదేళ్లు నిండకుండానే ఒకటో తరగతికి వచ్చేస్తున్నారు. పల్లెల్లో ఆర్థిక స్తోమత లేని నిరుపేదలు తమ పిల్ల లను ప్రైవేటు ప్రీప్రైమరీ స్కూళ్లకు పంపించకుండా ఆరేళ్లు వచ్చినా అంగన్వాడీ కేంద్రాలకే పంపుతుం డగా, మరికొంత మంది తల్లిదండ్రులు మాత్రం ఐదేళ్లు నిండాకే తమ పిల్లలను ఒకటో తరగతిలో చేర్చుతున్నారు. రాష్ట్రంలో ప్రీప్రైమరీ, ప్రైమరీస్కూళ్లలో ప్రవేశాల తీరుపై ‘ప్రథమ్’ సంస్థ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసర్) పేరుతో సర్వే చేసింది. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 24 రాష్ట్రాల్లోని 26 జిల్లాల్లో సర్వే.. దేశంలోని 24 రాష్ట్రాలకు చెందిన 26 జిల్లాల్లోని 1,514 గ్రామాల్లో అసర్ ప్రతినిధులు ఈ సర్వేను నిర్వహించారు.ఆయా గ్రామాల్లోని 30,425 ఇళ్లు తిరిగి 4 నుంచి 8 ఏళ్ల వయసున్న 36,930మంది పిల్లలతో మాట్లాడి వివరాలను సేకరించారు. అందులో రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలోని 60గ్రామాలకు చెందిన 1,201 ఇళ్లను తిరిగి 1,426 మంది విద్యార్థులను కలిసి, 4 నుంచి 8 ఏళ్ల వయసు పిల్లల స్థితిగతులపై నివేదికను రూపొందించారు. తాజాగా ఢిల్లీలో విడుదల చేసిన నివేదికలోని ప్రధానాంశాలు ►రాష్ట్రంలో ఐదేళ్ల వయసున్న విద్యార్థుల్లో 21.6 శాతం మంది ఒకటో తరగతి చదువుతుండగా, మిగతా వారు అంగన్వాడీ/ప్రీప్రైమరీ తరగతులు చదువుతున్నారు. ►ఇక ఆరేళ్ల వయసు వారిలో 32.8 శాతం మంది అంగన్వాడీ కేంద్రాలు/ప్రీప్రైమరీ స్కూళ్లలో ఉన్నారు. ఇక 46.4 శాతం మంది ఒకటో తరగతి చదువుతుండగా, 18.7 శాతం మంది రెండో తరగతి, మిగతా వారు ఆపై తరగతుల్లో ఉన్నారు. ►4 నుంచి 8 ఏళ్ల వయసు వారిలో బాలికలు ఎక్కువ మంది ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరగా, బాలురు ఎక్కువ మంది ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్నారు. ►నాలుగైదేళ్ల వయసు పిల్లల్లో 56.8% మంది బాలికలు ప్రభుత్వ ప్రీప్రైమరీ స్కూల్స్/అంగన్వాడీ కేంద్రాల్లో ఉండగా, బాలురు మాత్రం 50.4% మందే ప్రభుత్వ సంస్థల్లో ఉన్నారు. ►అదే వయసు పిల్లలు ప్రైవేటు ప్రీప్రైమరీ స్కూళ్లలో 43.2% బాలికలుండగా, బాలురు 49.6% ఉన్నారు. ►6 నుంచి 8 ఏళ్ల వయసు పిల్లల్లో 61.1% బాలికలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్తుండగా, బాలురు 52.1% మందే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తున్నట్లు తేలింది. 10 మందిలో ప్రతి నలుగురు తక్కువ వయసు వారే.. విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో చేరాలంటే ఐదేళ్లు నిండి ఉండాలి. కానీ రాష్ట్రంలో ఒకటో తరగతిలో చేరిన ప్రతి 10 మందిలో సగటున నలుగురు ఐదేళ్లు నిండని వారే ఉన్నట్లు సర్వేల్లో వెల్లడించింది. నిబంధనల ప్రకారం ఆరేళ్లకు వచ్చి ఒకటో తరగతిలో చేరిన వారు 41.7 శాతమే ఉన్నట్లుగా తేలింది. అలాగే ఒకటో తరగతిలో చేరిన వారిలో ఏడెనిమిదేళ్ల వయసు వారు 36.4 శాతం ఉండగా, నాలుగైదేళ్ల వయసు వారు 21.9 శాతం ఉన్నట్లుగా వెల్లడైంది. -
టెట్టా.. టెట్ కమ్ టీఆర్టీనా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో వాటి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో కోటి ఆశలు వెల్లివిరుస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం అయిదేళ్ల పాటు టీచర్‌పోస్టులు భర్తీచేయకుండా కాలక్షేపం చేసింది. ప్రయివేటుకు ప్రోత్సాహం అందించేందుకు వీలుగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు లేక బోధన కుంటుపడినా పట్టించుకోలేదు. గత ఏడాది అక్టోబర్‌లో 7,902 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినా నిబంధనల్లో సమస్యల కారణంగా వాటిపై న్యాయ వివాదాలు ఏర్పడి నేటికీ తేలలేదు. ఈ నేపథ్యంలో ఖాళీ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆదేశించడంతో విద్యాశాఖ ఆ అంశంపై ప్రస్తుతం దృష్టి సారించింది. రానున్న నోటిఫికేషన్ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ పోస్టుల అర్హతకు అవసరమైన టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్)ను వేరేగా నిర్వహిస్తారా? లేక టీచర్ రిక్రూట్మెంట్తో కలిపి పెడతారా? అని తర్జనభర్జన పడుతున్నారు. గత ప్రభుత్వం తడవకో విధానాన్ని అనుసరించడంతో ఈసారి ఏ విధానం అమలు చేస్తారోనన్న ఆందోళనలో ఉన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీలో నిర్దిష్ట పద్ధతిని పాటించకపోవడంతో అభ్యర్ధుల్లో ఈ గందరగోళం నెలకొంది. టెట్‌ను రిక్రూట్‌మెంటును కలిపేసి.. ఏటా రెండుసార్లు టెట్ పెట్టాల్సి ఉన్నా రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం పెట్టలేదు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్ణయించిన పోస్టుల భర్తీకోసం ప్రభుత్వం టెట్‌ను, డీఎస్సీ రెండిటినీ కలిపి 2015లో నిర్వహించింది. ఆ తరువాత మళ్లీ టెట్, డీఎస్సీల ఊసేలేదు. అభ్యర్థుల నుంచి టీచర్ పోస్టుల భర్తీకి ఆందోళనలు రావడంతో 2018 ఫిబ్రవరి, మేలలో టెట్‌ను పెట్టారు. తరువాత డీఎస్సీ–2018కు వచ్చేసరికి విధానాన్ని మార్పుచేశారు. 2018 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంటు, భాషాపండితుల పోస్టులకు రిక్రూట్మెంటు టెస్టును పెట్టారు. బీఈడీ అభ్యర్ధులకు కొత్తగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అవకాశం కల్పిస్తూ ఎన్సీటీఈ నిర్ణయం తీసుకోవడంతో ఎస్జీటీ పోస్టులకు టెట్ కమ్‌టీఆర్టీని పెట్టారు. కాలపరిమితి ముగుస్తుండడంతో.. ఏడేళ్ల కాలపరిమితి నిబంధనతో ప్రస్తుతం 2014 టెట్, 2018 టెట్లలో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే డీఎస్సీకి అర్హత ఉంటుంది. అయితే గతంలో టెట్‌లో ఉత్తీర్ణులై కాలపరిమితి దాటిన వారు, టెట్లలో అర్హత సాధించలేని వారు టెట్ కోసం ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం టెట్‌ను ఏటా నిర్వహించి ఉన్నట్లయితే ఏదో ఒకసారి తాము అర్హత సాధించి టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండేదని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీకి నిర్ణయించడంతో ఈసారి ఏ విధంగా పరీక్ష నిర్వహిస్తారన్న చర్చ వారిలో కొనసాగుతోంది. టెట్‌ను వేరేగా పెడితేనే ఆధ్రువపత్రానికి ఏడేళ్లపాటు వేలిడేషన్ ఉంటుంది కనుక అదే తమకు మేలని వారు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ హయాంలో ఒక్కోసారి ఒక్కో విధానం ఉపాధ్యాయ పోస్టుల నియామకాలను గతంలో డీఎస్సీ ద్వారా ఎంపిక పరీక్ష నిర్వహించి భర్తీ చేసేవారు. జాతీయ విద్యాహక్కు చట్టం ఏర్పాటు తరువాత టీచర్‌పోస్టుల ఎంపికకు టీచర్ ఎలిజిబులిటీ టెస్టును నిర్వహించాలన్న నిబంధన అమల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రమైనా టీచర్ ఎలిజిబులిటీ టెస్టును తప్పనిసరిగా పాటించాలని అందులో పేర్కొన్నారు. ఈ టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే టీచర్ పోస్టులకు అర్హులవుతారు. ఆయా రాష్ట్రాలు టీచర్ పోస్టుల భర్తీకి తమతమ పద్ధతుల్లో ఎంపిక పరీక్షలు నిర్వహించినా టెట్ పాసైన వారిని మాత్రమే వాటికి అనుమతించాలి. టెట్ పాసైన వారికి ఆ ధ్రువపత్రం చెల్లుబాటు ఏడేళ్ల వరకు ఉంటుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం తాను ప్రత్యేక పరీక్ష నిర్వహించకుండా టెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపికలు నిర్వహించగా, బీహార్ వంటి కొన్ని రాష్ట్రాలు టెట్‌ను లేకుండా నేరుగా తమ ఎంపిక పరీక్షల ద్వారానే టీచర్‌పోస్టుల భర్తీ చేపట్టాయి. దీంతో టీచర్ పోస్టులకు ఈ అర్హత పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని ఎన్సీటీఈ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఏపీలో కూడా 2009లో విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చినా 2011 జులైలో మొదటి టెట్‌ను, 2012 జనవరిలో రెండో టెట్‌ను, అదే ఏడాది జూన్‌లో మూడో టెట్‌ను నిర్వహించారు. ఆ తరువాత 2013లో టెట్ నోటిఫికేషన్ వచ్చినా ఆ పరీక్షను మళ్లీ 2014 మార్చిలో పెట్టారు. ఈ టెట్‌లో పేపర్1లో 40,688 మంది, పేపర్2లో 115510 మంది అర్హత సాధించారు. -
విద్యా సంస్థల నియంత్రణకు ప్రత్యేక కమిషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల వసూ లు, ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు వీలుగా పాఠశాల విద్య, ఉన్నత విద్యలకు వేర్వేరుగా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం శాసనసభలో బిల్లులను ప్రవేశపెట్టారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు చైర్మన్లుగా ఉండే ఈ కమిషన్లలో ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులను సభ్యులుగా నియమించనున్నారు. రెండు కమిషన్లకు సివిల్ కోర్టు అధికారాలుంటాయి. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడం, విద్యా సంస్థల్లో చేరికలు పెంచడం, డ్రాపవుట్లు తగ్గించడం, సుస్థిర విద్యాభివృద్ధి సాధన, లక్ష్యాల సాధన దిశగా విద్యార్థులకు అవకాశాలు కల్పించడం ఈ బిల్లుల ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్.. ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల కింద ఉన్న 62,063 పాఠశాలల్లో 70,41,568 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 2,87,423 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీటితో పాటు 778 ఉపాధ్యాయ శిక్షణ సంస్థలున్నాయి. ఈ సంస్థలను పాఠశాల విద్యా శాఖ పర్యవేక్షిస్తోంది. బోధన పద్ధతులు, పాఠ్యాంశాలు, కోర్సులు, స్కూళ్ల నిర్వహణ, సదుపాయాల కల్పన, పరీక్షల విధానం ఇలా అన్నింటిలోనూ విద్యా రంగంలో వస్తున్న ఆధునిక పోకడలకు అనుగుణంగా మార్పులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల పర్యవేక్షణకు ప్రత్యేక నియంత్రణ కమిషన్ అవసరమని ప్రభుత్వం పేర్కొంది. విద్యా సంస్థల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడం, ఫీజుల నియంత్రణ, స్కూళ్ల పర్యవేక్షణ మరింత సమర్థంగా ఉండేలా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లన్నీ ఈ కమిషన్ పరిధిలోకి రానున్నాయి. కమిషన్‌కు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్మన్‌గా, జాతీయ స్థాయిలో పేరొందిన నిపుణుడు వైస్ చైర్మన్‌గా ఉంటారు. ఐదుగురు విద్యావేత్తలు, ఇద్దరు ఐఏఎస్ అధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ కార్యదర్శి స్థాయి వ్యక్తి సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తారు. కమిషన్‌కు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. కమిషన్ అధికారాలు, విధులు.. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రవేశాలు, బోధన, బోధకుల అర్హతలు, విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాగుతున్నాయో? లేదో పరిశీలిస్తుంది. ప్రైవేటు స్కూళ్లలోని ఫీజుల నియంత్రణ అధికారం కూడా ఉంటుంది. జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం ఆయా సంస్థల్లో 25 శాతం సీట్లు పేద వర్గాలకు అందేలా చూస్తుంది. ఆయా స్కూళ్ల ఫీజుల నిర్ణయానికి అక్రిడిటేషన్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తుంది. ప్రమాణాలు, నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలకు సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇస్తుంది. ఆయా సంస్థలకు జరిమానా విధించడం, నిబంధనలు పాటించని సంస్థల గుర్తింపు రద్దు చేసే అధికారాలు ఉంటాయి. కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. ఆయా అంశాలపై ఎవరినైనా పిలిచి విచారించే అధికారం ఉంటుంది. కమిషన్ ఆదేశాలను సవరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కమిషన్ పరిధిలోకి ఇంటర్, ప్రైవేటు వర్సిటీలు.. ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ పరిధిలోకి ఇంటర్మీడియెట్ కళాశాలలతోపాటు ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలను కూడా చేరుస్తూ మరో బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్‌కు కూడా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్మన్‌గా, ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక ఐఏఎస్ అధికారి, ఉన్నత విద్యా సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ కార్యదర్శి స్థాయి వ్యక్తి సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధనకు కమిషన్ చర్యలు చేపడుతుంది. ప్రవేశాలు, బోధన, పరీక్షలు, పరిశోధన, బోధన సిబ్బంది అర్హతలు, మౌలిక సదుపాయాలు నిబంధనల మేరకు ఉన్నాయో.. లేదో పరిశీలిస్తుంది. జూనియర్, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కాలేజీలు, అన్ని ప్రైవేటు యూనివర్సిటీలు కమిషన్ పరిధిలోకి వస్తాయి. వీటితోపాటు పాఠశాల విద్య నియంత్రణ కమిషన్‌కు ఉన్నట్టే ఇతర అధికారాలు, విధులు ఉంటాయి. కాగా ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ ఏర్పాటుతో ఇప్పటివరకు ఫీజులు, ప్రవేశాలను పర్యవేక్షిస్తున్న ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) కనుమరుగు కానుంది. -
ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్లలో చిగురిస్తున్న ఆశలు
సాక్షి, విశాఖపట్నం: విద్యా హక్కు చట్టం ప్రకారం నియమించిన ఆర్ట్, క్రాఫ్ట్ ఉపాధ్యాయుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించి సర్వీసుల్ని క్రమబద్ధీకరిస్తుందని వీరంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. పాదయాత్ర సమయంలో పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లను క్రమబద్ధీకరిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలని ఆర్ట్, క్రాఫ్ట్ ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థి మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఆర్ట్ (చిత్రలేఖనం), క్రాఫ్ట్ (హస్తకళలు) విద్యలు దోహదపడతాయి. ఈ విషయంలో కొఠారి కమిషన్, యూజీసీ, ఎన్సీఈఆర్టీ ప్రతిపాదనల్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆర్ట్, క్రాఫ్ట్ ఉపాధ్యాయుల్ని 1995లో అప్పటి సీఎం చంద్రబాబు నిషేధించడంతో ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ల జాడ లేకుండా పోయింది. కాంట్రాక్టు పద్ధతిలో: విద్యా హక్కు చట్టంలో సూచించిన మేరకు 2012–13 విద్యా సంవత్సరంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విద్యను మళ్లీ పాఠశాలల్లో ప్రవేశపెట్టేందుకు పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 3,000 పోస్టుల్ని భర్తీ చేసింది. క్రమంగా వీరి సంఖ్య 5 వేలకు చేరింది. పూర్తి కాంట్రాక్ట్ బేసిక్ అంటూ సర్వశిక్షా అభియాన్ ద్వారా నియామకాలు చేపట్టింది. ప్రస్తుతం వీరికి గౌరవ వేతనంగా రూ.14,203 చెల్లిస్తున్నారు. ఏటేటా ఉద్యోగులు ప్రభుత్వానికి ఒప్పంద పత్రం (బాండ్)ని ఇస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో వీరంతా ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పాదయాత్రలో హామీతో ఆశలు: గత ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా సానుకూలంగా స్పందించకపోవడంతో ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేసిన వైఎస్ జగన్‌ని వీరంతా పలుమార్లు కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. అర్హతలు ఆధారంగా ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తానని వీరికి జగన్ హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 ఫిబ్రవరి 13న జీవో నం.31, 38, 84లను విడుదల చేస్తూ రాష్ట్రంలోని 1,030 మంది ఒకేషనల్ పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లను రెగ్యులర్ చేశారు. వీరంతా అప్పట్లో ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకంలో విధులు నిర్వర్తించేవారు. వారి లాగానే పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న తమ జీవితాల్లోకి రాజన్న తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెలుగు తీసుకొస్తారని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉపాధ్యాయులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రిపై పూర్తి ఆశలు పెట్టుకున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైనే మేము పూర్తి ఆశలు పెట్టుకున్నాం. పాదయాత్రలో పలుమార్లు ఆయన్ను కలిసి మా బాధలు విన్నవించుకున్నాం. మేమంతా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏడేళ్లుగా పనిచేస్తున్నాం. గతంలో ఉండే రెగ్యులర్ డ్రాయింగ్, క్రాఫ్ట్ టీచర్ల స్థానంలో మేము పనిచేస్తున్నా వేతనాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దివంగత సీఎం వైఎస్సార్ మాదిరిగా ఆయన తనయుడు జగన్ ముఖ్యమంత్రిగా మా జీవితాలకు దారి చూపిస్తారని కోరుతున్నాం. – ఎస్.శివకుమారిరెడ్డి, రాష్ట్ర ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షురాలు -
నీరుగారుతోన్న ఆర్టీఈ లక్ష్యం
జైపూర్: పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) లక్ష్యం మధ్యలోనే నీరుగారిపోతోంది. 6 నుంచి 14 సంవత్సరాల్లోపు పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలన్న సమున్నత లక్ష్యంతో కేంద్రం ఈ చట్టాన్ని 2010, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రాథమిక విద్య పూర్తయేంతవరకు పిల్లలకు ఉచితంగా, నిర్బంధ విద్యను అందించాల్సి ఉంటుంది. పిల్లలు తమకు సమీపంలోని పాఠశాలలో ఉచితంగా ప్రాథమిక విద్యను పూర్తి చేసేందుకు విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 3 అవకాశం కల్పిస్తోంది. ఆర్టీఈ కింద పాఠశాలన్నీ 25శాతం సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం ప్రముఖ పాఠశాలల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన విద్యార్థులు తర్వాత బడి మానేసి దినసరి కూలీలుగా మారిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల కారణంగా ఆర్టీఈ విద్యార్థులు విద్య కొనసాగించలేకపోతున్నారు. ఆర్టీఈ కింద 8వ తరగతి వరకు మాత్రమే ఉచితంగా అందిస్తున్నారు. అక్కడి నుంచి ఫీజులు చెల్లించి చదువు కొనసాగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత చదివించే స్తోమతలేక తల్లిదండ్రులు పిల్లలను చదువు మాన్పించేసి, తమతో పాటు పనులకు తీసుకెళ్లిపోతున్నారు. ‘ఆర్టీఈ కోటాలో చేరిన విద్యార్థుల్లో కొంత మంది చాలా తెలివైనవారు ఉంటున్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేక మధ్యలోనే చదువు ఆపేస్తుండటం బాధ కలిగిస్తోంది. వీరిలో డ్రైవర్లు, దినసరి కూలీల పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. 8వ తరగతి పూర్తి చేసిన తర్వాత తమ తల్లిదండ్రులతో కలిసి పనులకు వెళ్తుఉన్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత వీరిని పాలకులు పట్టించుకోకపోవడం విచారకరమ’ని జైపూర్‌లోని ప్రముఖ పాఠశాల ప్రిన్సిపాల్ ఒకరు వ్యాఖ్యానించారు. ఆర్టీఈ కోటాను 8 నుంచి 12వ తరగతి వరకు పొడించాలని కేంద్రానికి లేఖ రాయనున్నట్టు రాజస్తాన్ విద్యా శాఖ మంత్రి గోవింద్ సింగ్ తెలిపారు. దీనికి అనుగుణంగా జాతీయ విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. -
విద్యాహక్కు.. ఇక ఉండదు చిక్కు
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, ఈబీసీ విద్యార్థులను బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు సొమ్ము చెల్లిస్తూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన పిల్లలు, పేదలకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలి. కానీ.. రాష్ట్రంలో ఎక్కడా ఈ చట్టం అమలు కావడం లేదు. ఎస్సీ, ఎస్టీ, పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలను కార్పొరేట్ కాలేజీలు చేర్చుకోవడం లేదు. చేర్చుకున్నా పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఎస్సీ, ఎస్టీలు, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసి తనకు నివేదించాలని ఆదేశించారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు నిర్దేశించారు. ఐదేళ్లలో రూ.591.50 కోట్ల నష్టం బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం ఏటా రూ.103.26 కోట్ల చొప్పున చెల్లిస్తోంది. ఒక్కసారి స్కూల్లో చేరిన విద్యార్థులు పదో తరగతి వరకు అక్కడే విద్యనభ్యసిస్తారు. ఇలా గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం రూ.520 కోట్ల వరకు చెల్లించింది. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో అడ్మిషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 34,421 మంది విద్యార్థులకు వాటిల్లో చదువు చెప్పించేందుకు ఎంపిక చేశారు. వీరిలో ఎస్సీలు 22,814 మంది, ఎస్టీలు 11,580 మంది, ఇతరులు 27 మంది ఉన్నారు. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.30 వేల చొప్పున ప్రభుత్వం ఫీజు చెల్లిస్తోంది. ఇదిలావుంటే.. కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత విద్య పొందేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, దివ్యాంగ, ఈబీసీ విద్యార్థులు అర్హులు. పదో తరగతి పాసైన వారిని ఇంటర్మీడియెట్‌లో చేర్పించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. 2019–20 సంవత్సరానికి 3,765 మంది విద్యార్థులను కార్పొరేట్ కాలేజీల్లో చేర్చారు. ఒక్కొక్కరికి రూ.35 వేల ఫీజు, రూ.3 వేల పాకెట్ మనీ కలిపి మొత్తం రూ.38 వేల చొప్పున ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలకు చెల్లిస్తోంది. ఏటా రూ.14.30 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.71.50 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ఏడాది కార్పొరేట్ కళాశాలల్లో ఎస్సీలు 1,795 మంది, ఎస్టీలు 582 మంది, బీసీలు 1,050 మంది, మైనార్టీలు 189 మంది, కాపులు 83, ఈబీసీలు 65 మంది, దివ్యాంగుల్లో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేసింది. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో పేద విద్యార్థులను చదివిస్తున్నందుకు గడచిన ఐదేళ్లలో సుమారు రూ.591.50 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలు చేసి ఉంటే ప్రభుత్వానికి ఈ భారం తగ్గేది. ఇకపై కార్పొరేట్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో విద్యాహక్కు చట్టం కింద ఆయా వర్గాల్లోని పేదలకు 25 శాతం సీట్లు విధిగా ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలివ్వడంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రానున్న రోజుల్లో విద్యాహక్కు చట్టం అమలుకు చిక్కు ఉండదని, పేదవర్గాల వారికి మేలు కలుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు విద్యాశాఖ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
విద్యాహక్కు చట్టం అమలు తీరును వివరించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యాహక్కు చట్టం అమలు కావడం లేదని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, డీఈవోలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాహక్కు చట్టంలో ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠ శాలల జాబితాను ఏటా అధికారికంగా ప్రకటించాలని నిబంధనలున్నా, అవి అమలు కావడం లేదని పేర్కొంటూ సికింద్రాబాద్‌కు చెందిన విజయ్ గోపాల్ పిల్ దాఖలు చేశారు. విద్యాహక్కు చట్టం–2009ని అమలు చేయకుండా 1994 నాటి చట్టాన్నే అమలు చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది బి.రచనారెడ్డి వాదించారు. చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. పాఠశాలల రాబడిలో 50 శాతం జీతభత్యాలకు, 15 శాతం ఇతర ఖర్చులకు వినియోగించాలన్న నిబంధన అమలు కావడం లేదన్నారు. మహేంద్రహిల్స్‌లోని డీపీఎస్ పాఠశాలపై మెజిస్టీరియల్ విచారణ జరిపాక రూ.1.2 లక్షలున్న స్పోర్ట్స్ ఫీజు సగానికిపైగా తగ్గిందని తెలిపారు. పాఠశాలల ఖాతాల వివరాలు ప్రభుత్వం వద్ద లేవన్నారు. చట్ట ప్రకారం ఆ వివరాలన్నీ పాఠశాలలు డీఈవోలకు సమర్పించాలన్న నిబంధన అమలు కావడం లేదని, ఇందుకు హైదరాబాద్ డీఈవో కార్యాలయమే ఉదాహరణ అన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. -
విద్యార్థులు తక్కువున్న స్కూళ్లు తరలింపు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని స్కూళ్లు 793 ఉండగా, ఒకటి నుంచి పదిమంది లోపే విద్యార్థులున్న స్కూళ్లు 1,544 ఉన్నాయి. ఇపుడు ఆ స్కూళ్లన్నీ సమీపంలోని మరో పాఠశాలల పరిధిలోకి వెళ్లనున్నాయి. అవేకాదు 20 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలు, 30 మందిలోపు ఉన్న ఉన్నత పాఠశాలలది కూడా అదే పరిస్థితి. మరోవైపు ఒక్క విద్యార్థి లేని స్కూళ్లలో 715 మంది టీచర్లు ఉండగా, వారిని గతేడాదే అవసరం ఉన్న స్కూళ్లలో సర్దుబాటు చేశారు. ఇక 1 నుంచి 10 మందిలోపు విద్యార్థులున్న స్కూళ్లలో 1,900 మంది టీచర్లు ఉన్నారు. ఇప్పుడు వారితో పాటు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లలోని టీచర్లు, 30 మందిలో విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లోని టీచర్లను అవసరం ఉన్న స్కూళ్లకు పంపించనున్నారు. విద్యా శాఖ గతేడాది ఈ లెక్కలు వేసింది. తాజాగా ఆ వివరాలను సేకరించి, అలాంటి పాఠశాలలను సమీప పాఠశాలల్లో రీలొకేట్ చేసేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. వాటిల్లోని టీచర్లను టీచర్లను అవసరం ఉన్న పాఠశాలల్లోకి తరలించేందుకు చర్యలు చేపట్టింది. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఈనెల 11న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లాల్లో డీఈవోలు పాఠశాల రీలొకేషన్‌కు చర్యలు చేపట్టారు. అక్కడి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా వారిని సమీప స్కూళ్లకు పంపించేందుకు రవాణ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే తాజాగా మండలాల వారీగా అలాంటి స్కూళ్లను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని మండల విద్యాధికారులకు (ఎంఈవో) డీఈవోలు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు రవాణా సదుపాయం.. విద్యార్థులు తక్కువ ఉన్న పాఠశాలలను రీలొకేట్ చేయడం, టీచర్లను అవసరం ఉన్న స్కూళ్లకు పంపించడం ద్వారా అక్కడి విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని విద్యా శాఖ ఆదేశించింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆవాస ప్రాంతంలో పాఠశాల లేకపోతే అక్కడి విద్యార్థులకు ట్రాన్స్‌పోర్టు సదుపాయం కల్పించాల్సి ఉంది. ఆ నిబంధనను పక్కాగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రీలొకేట్ చేసే స్కూళ్లలోని విద్యార్థులందరికి ట్రాన్స్‌పోర్టు సదుపాయం కల్పించేందుకు సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపించాలని డీఈవోలు ఆదేశాలు జారీ చేశారు. -
ఫలితాలు ఓకే.. ప్రమాణాలేవీ?
సాక్షి, అమరావతి: పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం ఏటేటా అనూహ్యంగా పెరుగుతోంది. ఆమేరకు విద్యార్థుల్లో సబ్జెక్టులపై పట్టు పెరగడంలేదు. ప్రమాణాలూ అంతంత మాత్రమే. పాస్ పర్సంటేజీ పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రమాణాల అభివృద్ధిపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు, బోధకుల్లోనూ కనిపించడం లేదు. 1998–99 సంవత్సరంలో టెన్త్‌లో పాస్ పర్సంటేజీ 52.67 శాతం మాత్రమే ఉండగా అది నేడు 95 శాతం వరకు చేరుకోవడం గమనించదగ్గ అంశం. నాలుగైదు శాతం తేడాలో ప్రతి ఏటా ఇదేరకమైన ఉత్తీర్ణత శాతాలు నమోదు అవుతున్నాయి. తాజాగా మంగళవారం విడుదలయిన టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణత 94.88 శాతంగా నమోదైంది. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ల ఆవిర్భావంతోనే ఈ మార్పు 1998కి ముందు వరకు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం కచ్చితమైన నియమ, నిబంధనలను అమలు చేసేది. విద్యార్ధుల్లో నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవడంతోపాటు వారిలో ఏమేరకు విద్యాప్రమాణాలు అభివృద్ధి చెందాయనే అంశాలు తెలుసుకునేందుకు మూల్యాంకనం చేయడంలోనూ అంతే కచ్చితమైన విధానాలు పాటిం చేది. 1998–99 నుంచి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో ప్రయివేటు స్కూళ్లకు, కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేయడం ప్రారంభించినప్పటినుంచి ఆనారోగ్యకర వాతావరణం ఏర్పడింది. విద్య వ్యాపారంగా మారింది. ప్రయివేటు కార్పొరేట్ సంస్థలు ఉత్తీర్ణత శాతాన్ని పెంచి చూపించుకోవడం ద్వారా ప్రవేశాలను గణనీయంగా పెంచుకొనే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందుకోసం వారు అడ్డదారులు తొక్కుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. లక్ష్యాల నిర్దేశంతో జిల్లాల మధ్య పోటాపోటీ సమీక్షల సందర్భంగా సీఎంనుంచి ఉన్నతాధికారుల వరకు ఉత్తీర్ణత శాతంపైనే ఎక్కువ దృష్టి సారించి వాటిని పెంచేలా అధికారులపై ఎత్తిడి పెంచారు. దీంతో జిల్లా మధ్య పోటీ పెరిగింది. ఇది మాస్ కాపీయింగ్‌కు, ఇతర అడ్డదారులకు దారితీసింది. 1998–99లో 52.67గా ఉన్న టెన్త్ ఉత్తీర్ణత శాతం 2003–04 నాటికి ఒక్కసారిగా 80.55కి పెరిగింది. అంటే 27.88 శాతం పెరిగిందన్న మాట. ఈ పెరుగుదల ప్రయివేటు స్కూళ్లలోనే కనిపించింది. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం ఉత్తీర్ణత శాతం 50నుంచి 55 శాతానికే పరిమితమైంది. దీంతో విద్యార్ధులు ప్రయివేటు స్కూళ్లవైపు ఆకర్శితులవుతూ వచ్చారు. అక్కడ అర్హులైన టీచర్లు లేకున్నా... సరైన బోధన, దానికి తగ్గ సదుపాయాలు లేకున్నా, ప్రమాణాలతో పనిలేకుండా బట్టీ పద్దతులకు శ్రీకారం చుట్టారు. తమకు అనుకూలమైన కేంద్రాల్లో తమ విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేలా పైరవీలు చేసేవారు. మాస్ కాపీయింగ్ తదితర మార్గాల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకుంటూ పోయారు. ప్రభుత్వ స్కూళ్లలోనూ అదే సంస్కృతి... ప్రయివేటు స్కూళ్లతో సమానంగా పరుగులు పెట్టేందుకు ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇదే వాతావరణం తప్పనిసరైంది. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కలెక్టర్లు, డీఈఓలు, విద్యాధికారులు పరీక్షల సమయంలో, మూల్యాంకనం వేళ ఒకింత వెసులుబాటు కల్పిస్తూ సాధ్యమైనంత మేర ఆయా ప్రశ్నలకు సమాధానాల్లో సంపూర్ణత లేకున్నా పాస్‌మార్కులు వేసే సంప్రదాయానికి తెరతీశారు. మాస్ కాపీయింగ్ కూడా పెరిగింది. దీంతో ఉత్తీర్ణత శాతం అమాంతం పెరిగిపోతూ వస్తోంది. జంబ్లింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చినా పరిస్థితిలో మార్పులేదు. చివరకు మార్కుల పరుగులో విద్యార్ధులపై ఒత్తిడి పెరిగి అనారోగ్యకర వాతావరణం ఏర్పడడంతో ప్రభుత్వం మార్కులు తీసేసి గ్రేడింగ్ పద్ధతిని ప్రవేశపెట్టింది. అయినా గ్రేడ్లతోనూ కార్పొరేట్ సంస్థలు ప్రచారాన్ని చేసుకుంటున్నాయి. సీసీఈ విధానంతో మరింతగా... విద్యాహక్కు చట్టం ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు దరిమిలా మూడేళ్ల నుంచి ఆ విధానంలో పరీక్షలు పెడుతున్నారు. అంతర్గత ప్రాజెక్టులు, ఇతర అంశాలకు 20 మార్కులు వేస్తూ, పబ్లిక్ పరీక్షల్లో 80 మార్కులకు ప్రశ్నపత్రం ఇస్తున్నారు. అయితే అంతర్గత మార్కుల కేటాయింపులో ప్రయివేటు పాఠశాలలు వందకు వందశాతం తమపిల్లలకు వేయిస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. పెరిగిన డిమాండ్–చుక్కల్లో ఫీజులు టెన్త్‌లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుండడంతో ఆ తదుపరి ఇంటర్మీడియెట్ విద్యకు డిమాండ్ తలెత్తుతోంది. ఇదే అదునుగా ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు దీన్ని ఆసరా చేసుకొని కాలేజీ ఫీజులను అమాంతం పెంచేస్తున్నాయి. ఎక్కువ మార్కులు వచ్చిన వారికి కొంతమేర రాయితీ ఇస్తూ తక్కిన వారినుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 3,361 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలు 1143. తక్కినవన్నీ ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీలే. టెన్త్‌లో ఉత్తీర్ణులు అవుతున్న విద్యార్ధుల సంఖ్య 2018–19లోనే చూసుకుంటే దాదాపు 6 లక్షల మంది వరకు ఉన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల్లో కేవలం లక్ష సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. తక్కిన వారంతా ప్రయివేటు కార్పొరేట్ కాలేజీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్దులు 9.30 లక్షల మంది ఉండగా వీరిలో 2.30 లక్షల మంది ప్రభుత్వ కాలేజీల్లో చదువుతుండగా తక్కిన 7 లక్షల మందీ ప్రయివేటు కాలేజీల్లో చేరుతున్నారు. అప్పట్లో ఫస్ట్ క్లాస్ అంటే అదో పండగే... ఒకప్పుడు 60 నుంచి 70 శాతం మార్కులు సాధించడమంటే చాలా గొప్పవిషయంగా ఉండేది. ఫస్టుక్లాస్ వచ్చిందటే అదో పండగ. కానీ ఇప్పుడు 60 శాతం మార్కులు అంటే చాలా చిన్నచూపుగా మారింది. 80– 90కి పైగా మార్కులు సాధించిన వారే తెలివైన వారన్న ముద్రపడింది. విద్యార్ధుల్లో ప్రమాణాలతో సంబంధం లేకుండా మార్కులకోసం వక్రమార్గాల్లో పయనిస్తున్నాయి. ఇపుడు 70 నుంచి 90 శాతానికి పైగా మార్కులు సాధించిన వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. -
టెన్త్ ఇంటర్నల్ మార్కుల్లో ప్రైవేట్ పడగ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు సాక్షాత్తూ ప్రభుత్వమే కొమ్ముకాస్తోంది. ఫలితంగా ప్రతిఏటా ఉత్తీర్ణత శాతం, జీపీఏ పాయింట్లలో ఆయా సంస్థలే పైచేయి సాధిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు తగ్గుతున్నట్లు చూపించి, క్రమంగా వాటిని పూర్తిగా మూసివేసే దిశగా సర్కారు కుట్ర పన్నిందన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఉత్తీర్ణతా శాతం పెరుగుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అంతా అటువైపే మొగ్గు చూపుతున్నారు. దీనివెనుక కార్పొరేట్ శక్తుల కుట్ర దాగి ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయోగాల్లేకున్నా పూర్తి మార్కులా? విద్యా హక్కు చట్టం ప్రకారం అన్ని పాఠశాలల్లో సమగ్ర నిరంతర మూల్యాంకన విధానాన్ని(సీసీఈ) అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ విధానాన్ని చాలాకాలం అమలుకు నోచుకోలేదు. చివరకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆలస్యంగా అమల్లోకి తీసుకొచ్చారు. విద్యార్థులు పాఠశాలల్లో ప్రయోగాలు, ఇతర అంతర్గత కార్యక్రమాల్లో పాలుపంచుకొంటూ, అందులో సాధించే నైపుణ్యాల ఆధారంగా కొన్ని మార్కులు కేటాయించాలన్నది సీసీఈ విధానం లక్ష్యం. ఇందులో భాగంగా దీనికి 20 మార్కులు కేటాయిస్తున్నారు. వీటిని అంతర్గత(ఇంటర్నల్) మార్కులు అంటున్నారు. వార్షిక పరీక్షలోవిద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసి మిగతా 80 మార్కులు ఇవ్వాలి. ఇంటర్నల్ మార్కుల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని, ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు తమ విద్యార్థులకు పూర్తి మార్కులు వేసుకుంటున్నాయని విద్యారంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులతో ప్రయోగాలు, ఇతర కృత్యాలు చేపట్టకుండానే పూర్తి మార్కులు వేసేస్తున్నారు. దీంతో ఆయా స్కూళ్ల విద్యార్థులు ఉత్తీర్ణతలో ముందంజలో ఉండడమే కాకుండా మెరుగైన జీపీఏ పాయింట్లనూ దక్కించుకుంటున్నారు. పత్తా లేని పర్యవేక్షణ కమిటీ ఇంటర్నల్ మార్కులకు సంబంధించి చేపట్టే కార్యక్రమాలు, పిల్లల్లో నైపుణ్యాలను ఉపాధ్యాయులు ఏ మేరకు అంచనా వేస్తున్నారో పరిశీలించడానికి ఒక పర్యవేక్షణ కమిటీ ఉండాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. మండల విద్యాధికారులు, డిప్యూటీ విద్యాధికారుల పోస్టులు 80 శాతానికి పైగా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న అరకొర సిబ్బంది పాఠశాలల్లో సీసీఈ విధానం అమలును పట్టించుకోవడం లేదు. దాంతో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. విద్యా వ్యాపారంలో భాగంగా తమ స్కూళ్ల ఉత్తీర్ణత శాతం, జీపీఏలను పెంచుకోవడానికి ఎలాంటి అంతర్గత కృత్యాలు చేపట్టకుండానే తమ విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులను 20కి 20 పూర్తిగా కేటాయిస్తున్నాయి. వాటిని యథాతథంగా పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాయి. 90 శాతానికి పైగా ప్రైవేట్ విద్యార్థులే.. 2014–15 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన వారిలో 90 శాతానికి పైగా విద్యార్థులు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు చెందినవారే. 2018లో 6,04,527 మంది టెన్త్ పరీక్ష రాయగా, వీరిలో 5,71,175 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు 2,29,405 మంది పరీక్ష రాయగా, 2,25,072 (98.11 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ మున్సిపల్ స్కూళ్లలో 90.40 శాతం, జెడ్పీ స్కూళ్లలో 92.57 శాతం, ఇతర ప్రభుత్వ స్కూళ్లలో 90.77 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. 100 శాతం ఉత్తీర్ణత సాధించిన స్కూళ్లు 5,340 ఉండగా, ఇందులో ప్రైవేట్ స్కూళ్లు 3,125 ఉన్నాయి. మొత్తం 29,921 మంది 10 జీపీఏ సాధించగా, వీరిలో 26,475 మంది ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులే కావడం గమనార్హం. తూతూమంత్రంగా కమిటీ సీసీఈ విధానం దుర్వినియోగం అవుతోందని, తమిళనాడు, కర్ణాటక తరహాలో ఈ విధానంతో సంబంధం లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు, నిపుణులు పలుమార్లు సూచించినా ప్రభుత్వం తొలుత లెక్కచేయలేదు. చివరకు ఒత్తిడి పెరగడంతో అధికారులతో ఒక కమిటీని నియమించింది. ప్రభుత్వ పెద్దల సూచన మేరకే కమిటీ తన నివేదికను సమర్పించింది. దాంతో ఈ ఏడాది కూడా టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో సీసీఈ విధానాన్నే కొనసాగించారు. బడా కార్పొరేట్ విద్యా సంస్థల లాబీయింగే దీనికి కారణమని సమాచారం. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల అధినేతలు ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులుగా ముద్రపడ్డారు. దీంతో వారి చెప్పిందే వేదంగా మారింది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్తీర్ణత, జీపీఏ పాయింట్లలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లే పైచేయి సాధించబోతున్నాయి. -
కేంద్రం నిధులు ఇవ్వకుంటే చట్టాన్ని అమలు చేయరా?
సాక్షి, హైదరాబాద్: విద్యా హక్కు చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వాల్సిన డబ్బును ఇవ్వనప్పుడు, దాని కోసం ఎందుకు కేంద్రాన్ని గట్టిగా అడగటం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని మంగళవారం హైకోర్టు ప్రశ్నించింది. అడిగినా కూడా కేంద్రం నిధులు ఇవ్వకపోతే, దానిపై సుప్రీం కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం ఎందుకు చేయడం లేదని నిలదీసింది. కేంద్ర ప్రభుత్వమేమీ అతీత శక్తి కాదని, రాజ్యాంగంలో కేంద్రం విధులు స్పష్టంగా నిర్వచించారని, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదంది. కేంద్రం నిధులు రాలేదంటూ చట్టాన్ని అమలు చేయకపోవడం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. ప్రభుత్వ మే చట్టాన్ని అమలు చేయకుంటే, ఇక ప్రైవేటు విద్యా సంస్థలు ఏం అమలు చేస్తాయని నిలదీసింది. విద్యా హక్కు చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలని 2013లోనే ఈ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటి వరకు అమలుకు నోచుకోకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు అడిగినా ఇవ్వడం లేదు... రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం సక్రమంగా అమలు కావడం లేదంటూ న్యాయ విద్యార్థి తాండవ యోగేష్ 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, విద్యా హక్కు చట్టం అమలుకు కేంద్రం సగం నిధులు భరించాల్సి ఉందని తెలిపారు. ఈ నిధుల కోసం ఎన్నిసార్లు అడిగినా ప్రయోజనం ఉండటం లేదన్నారు. నిధులు ఇవ్వకుంటే అమలు చేయరా? కేంద్రం నిధులు ఇవ్వకుంటే మీ నిధులతో చట్టాన్ని అమలు చేయవచ్చు కదా? కేంద్రం నిధులిచ్చే వరకు చట్టాన్ని అమలు చేయరా? అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద 25 శాతం సీట్లను పేదలకు ఇవ్వాలని, మరి వాటి సంగతేమిటని నిలదీసింది. ప్రభుత్వమే చట్టం గురించి పట్టించుకోకపోతే, ఇక ప్రైవేటు విద్యా సంస్థల గురించి చెప్పేదేముందని వ్యాఖ్యానించింది. చట్టం వచ్చినా పేద పిల్లలు అలానే ఉండిపోవాల్సిందేనా? అంటూ నిలదీసింది. కేంద్రం తన వాటా కింద తప్పనిసరిగా నిధులు ఇవ్వాలని చట్టం చెబుతోందని ఏఏజీ గుర్తు చేయగా, మరి అలాంటప్పుడు సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్ దాఖలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. విద్యాశాఖ ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నామని, కేంద్రం వంటి పెద్ద శక్తితో ఘర్షణ పెట్టుకోలేమని రామచంద్రరావు చెప్పారు. ఏ రాష్ట్రం కూడా కేంద్రం ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మీ పిల్లలకోసం మీరేమీ చేయలేరా..? ఇదే విషయంలో కోర్టులోనే ఉన్న విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. ఎవరో పిటిషన్ వేసేదాకా వేచి చూసే బదులు, మీ బిడ్డల విషయంలో మీరు ఎందుకు న్యాయ పోరాటం చేయరని ప్రశ్నించింది. తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఉదయమే నిధుల గురించి కేంద్రానికి లేఖ రాశామని ఆయన చెప్పారు. ఎన్ని రోజు ల్లో చర్యలు తీసుకుంటారని ధర్మాసనం అడగగా, రెండు నెలల గడువు కావాలని ఆయన కోరారు. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలుకు ఏం చర్యలు తీసుకోబోతున్నారో తెలియచేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను జూన్ 3కి వాయిదా వేసింది. -
అవినీతి పోవాలి.. మార్పు రావాలి
సాక్షి, అమరావతి : ‘ఐవీ’గా ఉపాధ్యాయ, ఉద్యోగ లోకానికి సుపరిచితులైన ఇళ్ల వెంకటేశ్వరరావు సాధారణ బడి పంతులు. యూటీఎఫ్ అధ్యక్షుడిగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. సచివాలయానికి సైతం ఆయన మోటర్ సైకిల్ మీదే వచ్చేవారు. యూటీఎఫ్ అధ్యక్షుడిగా పదవీ కాలం పూర్తయిన వెంటనే.. మళ్లీ స్కూల్లో టీచర్‌గా చేరారు. తూర్పుగోదావరి జిల్లా అయినవెల్లి మండలం సిరిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో సోషల్ టీచర్‌గా పనిచేస్తూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. వర్తమాన రాజకీయ పరిస్థితులపై వెంకటేశ్వరరావు విశ్లేషణ ఆయన మాటల్లోనే.. అవినీతి రాజకీయాలు అంతం కావాలి ఎన్నికల సంస్కరణల వల్ల మార్పు వస్తుందనుకోవడం లేదు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంపాదించిన అవినీతి సొమ్ము వెదజల్లి ఓట్లు కొనుక్కోవడానికి ప్రయత్నించడమే అసలు సమస్య. ఓటర్లు తమకు సొమ్ము కావాలని కోరుకోవడం లేదు. ఇస్తే వద్దనడం లేదు. అధికారం కావాలనే తాపత్రయంతో రాజకీయ పార్టీలే ఎన్నికల్లో డబ్బు వెదజల్లుతున్నాయి. రాజకీయ పార్టీలు నడుం బిగించి.. డబ్బులు నియంత్రిస్తే తప్ప ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గదు. ప్రభుత్వంలోనే కార్పొరేట్ శక్తులున్నాయి కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం నియంత్రించాలి. కానీ ప్రభుత్వంలోనే కార్పోరేట్ శక్తులు భాగమై ఉన్నప్పుడు.. నియంత్రణ ఎలా సాధ్యమవుతుంది? ప్రభుత్వంలో నారాయణ మంత్రిగా ఉన్నారు. మరికొంత మంది కార్పొరేట్ విద్యాసంస్థల యజమానులు పలు పదవుల్లో ఉన్నారు. ప్రభుత్వంలో నేరుగా భాగం కాకపోయినా, కార్పోరేట్ విద్యాసంస్థల యజమానులు పరోక్షంగా ప్రభుత్వ పెద్దలతో అంటకాగుతున్నారు. ఇక నియంత్రించేది ఎవరు? అధికారుల స్థాయిలో నియంత్రణ సాధ్యం కాదు. స్కూళ్లు ప్రారంభమయ్యే సమయంలో అధికారులు ఫీజుల నియంత్రణ గురించి హడావుడి చేస్తారు. తర్వాత పట్టించుకోరు. తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నా.. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. వాళ్లు వెలగబెడుతుందేమీ లేదు వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటున్న కార్పొరేట్ స్కూళ్లేమీ గొప్పగా లేవు. వాళ్లు వెలగబెడుతుందేమీ లేదు. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లిష్ మీడియం పెట్టారు. కార్పొరేట్ వ్యవస్థను బద్దలు కొట్టాలంటే.. ప్రభుత్వ స్కూళ్లలోనూ మంచి విద్య అందుబాటులో ఉండే విధంగా విద్యావ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేయాలి. ప్రైవేటు రంగంలో చిన్నపాటి విద్యాసంస్థల యాజమాన్యాలూ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. లంచాల రూపంలో అధికారులు వసూళ్లు చేస్తున్నారు. విద్యుత్ చార్జీలు భరించలేకపోతున్నామని యాజమాన్యాలు వాపోతున్నాయి. సిబ్బంది జీతాల గురించి మాట్లాడేవారు లేరు. కనీస వేతన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. చట్టం ఉంటే కనీస వేతనాలు ఇస్తారని కాదు... చట్టం అంటూ ఉంటే అడగడానికి అవకాశమైనా ఉంటుంది. విద్యాహక్కు చట్టం వచ్చినా.. కేంద్ర ప్రభుత్వం 2010లో విద్యాహక్కు చట్టం తెచ్చినా ప్రభుత్వ విద్యారంగంలో పెద్దగా మార్పు రాలేదు. బడ్జెట్లో విద్యకు కేటాయింపులు పెరగాలి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ మంచి విద్య అందుబాటులో ఉందనే నమ్మకం ప్రజల్లో పెరగాలి. ఆ నమ్మకం కలిగితేనే.. సర్కారీ స్కూళ్లు బాగుపడినట్టు లెక్క. ప్రైవేటు స్కూళ్లను మింగేస్తున్నాయి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లు మింగేశాయి. ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారు. తర్వాత కార్పొరేట్ స్కూళ్లు వచ్చాయి. నగరాల్లో ప్రైవేటు స్కూళ్లను మింగేశాయి. తర్వాత చిన్న పట్టణాలకూ విస్తరించి అక్కడి చిన్నపాటి ప్రైవేటు స్కూళ్లను మింగేస్తున్నాయి. కొన్ని కార్పొరేట్ స్కూళ్లే విద్యా వ్యవస్థను శాసించే స్థాయికి చేరుకున్నాయి. -
‘విద్యాహక్కు చట్టం అమల్లో టీఆర్ఎస్ విఫలం’
సాక్షి, హైదరాబాద్: పేద, దళిత వర్గాల విద్యార్థులకు విద్యను అందించాలన్న దృక్పథం రాష్ట్ర ప్రభుత్వంలో కొరవడిందని, విద్యాహక్కు చట్టం అమల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి విమర్శించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితమైందన్నారు. బడ్జెట్లో రూ.13 వేల కోట్లు పెట్టిన ప్రభుత్వం కనీసం రూ.200 కోట్లను ఖర్చుచేసినా విద్యావ్యవస్థలో మార్పు వచ్చేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా విద్యాహక్కు చట్టం అమలు ద్వారా పేద దళిత విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం అడ్మిషన్లు లభించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
ఆరేళ్ల పిల్లాడికి కరాటే, యోగా ఫీజు..!
తిరుపూర్/తిరువనంతపురం : ఒకటో తరగతి విద్యార్థికి కరాటే, యోగ ఫీజు కింద 20 వేల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో ఆ పిల్లాడి తండ్రి షాక్ గురయ్యాడు. ఆరేళ్ల పిల్లాడికి యోగా, కరాటే ఎందుకని ప్రశ్నించడంతో స్కూలు యాజమాన్యం వారిని గేటు బయటే నిల్చోబెట్టింది. అయినా, ప్రభుత్వ సహకారంతో విద్యనభ్యసిస్తున్న తన కొడుక్కి ఫీజు ఎలా వసూలు చేస్తారని ఆ తండ్రి మంగళవారం ఉదయం నుంచి గేటు బయటే నిరసన వ్యక్తం చేస్తున్నాడు. వివరాలు.. ‘విద్యా హక్కు చట్టం - 2009’ (ఆర్టీఈ) ప్రకారం అన్ని ప్రైవేటు, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం 25 శాతం సీట్లు కేటాయించాలి. తిరుపూర్‌లోని కొంగు వెల్లలార్ ప్రైవేటు పాఠశాలలో గాంధీజీ అనే విద్యార్థి ఆర్టీఈ కోటాలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగానే తన కొడుకు గాంధీజీని స్కూల్లో దింపడానికి వచ్చిన పళనికుమార్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ‘ఎక్స్ట్రా కరిక్యులర్’ ఫీజుల కింద 20 వేల రూపాయలు చెల్లించాలని అతన్ని స్కూలు యాజమాన్యం డిమాండ్ చేసింది. ఆర్టీఈ కోటాలో చదువుకుంటున్న తన కొడుకుపై ఈ ఫీజుల భారమేంటో పళని కుమార్‌కు అర్థం కాలేదు. కరాటే, యోగా, లైబ్రరీ, తమిళ్, ఇంగ్లిష్ హ్యాండ్ రైటింగ్, టేబుల్ టెన్నిస్ అంటూ చాంతాడంతా ఫీజుల చిట్టాను పాఠశాల సిబ్బంది అతని చేతిలో పెట్టారు. గాంధీజీతో పాటు ఆర్టీఈ కోటాలో విద్యనభ్యసిస్తున్న మరో ఇద్దరు విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. పళనికుమార్ ఆందోళనకు ఆ విద్యార్థుల తండ్రి సెల్వం కూడా తోడయ్యారు. చేతిలో ప్లకార్డులతో వారంతా నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న తిరుపూర్ తహసీల్దార్ స్పందించారు. స్కూలు యాజమాన్యంతో చర్చలు జరిపారు. ప్రభుత్వం కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే చెల్లిస్తుందనీ, ఎక్స్ట్రా కరిక్యులర్ ఫీజు చెల్లింపు తప్పనిసరని తేల్చారు. అరవై రోజుల గడువుతో ఫీజు చెల్లించాలనే షరతుతో విద్యార్థులను తరగతులకు అనుమతించారు. అయితే, తహసీల్దార్ స్కూలు యాజమాన్యంతో కుమ్మక్కయ్యారనీ, అందుకే ఫీజు చెల్లించమంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంకా ఎందరో ఆర్టీఈ కోటాలో చదువుకుంటున్న విద్యార్థులు ఎక్స్ట్రా ఫీజులతో సతమతమవుతున్నారనీ, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. -
‘విద్యా హక్కు’లోకి ప్రీప్రైమరీ!
సాక్షి, హైదరాబాద్: విద్యా హక్కు చట్టం పరిధిలోకి ఆరేళ్లలోపు పిల్లలను తీసుకురావాలని సెంట్రల్ అడ్వయిజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ (కేబ్) నిర్ణయించింది. ఇప్పటి వరకు 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు విద్యా హక్కు చట్టం ద్వారా ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తోంది. ఈ మేరకు తమ తుది నివేదికను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి అందజేయనుంది. తద్వారా ప్రైవేటు పాఠశాలల్లో చదివే ప్రీప్రైమరీ విద్యార్థులను, ప్రభుత్వ పాఠశాలలతో అంగన్వాడీ కేంద్రాలను అనుసంధానం చేసి వాటిల్లోని పిల్లలను విద్యాహక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని తేల్చింది. విద్యా హక్కు చట్టం పరిధిలోకి ప్రీప్రైమరీ విద్య, సెకండరీ విద్యను తీసుకువచ్చేందుకు కేంద్రం ఎప్పటినుంచో కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా 2016 ఏప్రిల్ 19న సెంట్రల్ అడ్వయిజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్‌ను ఏర్పాటు చేసింది. ఆగ్రా బీజేపీ ఎంపీ రామ్‌శంకర్ కఠారియా చైర్మన్‌గా, వివిధ రాష్ట్రాలకు చెందిన 23 మందితో ఏర్పాటు చేసిన ఈ కమిటీ సమావేశం ఇటీవల ఢిల్లీలో జరిగింది. ఆరేళ్లలోపు పిల్లలను విద్యా హక్కు చట్టం పరిధిలోకి తేవాల్సిందేనని, అన్ని రాష్ట్రాలు దీనిని అమలు చేయాలని స్పష్టం చేసింది. పాఠశాలలతో అనుసంధాన చర్యలు.. దేశ వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలలతో అనుసంధానం చేసే చర్యలు ఇప్పటికే మొదలయ్యాయి. అందుకే కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సహకారంతో అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు పాఠ్యాంశాలను కూడా రూపొందించింది. ప్రస్తుతం ఆరేళ్లలోపు పిల్లలకు విద్యా హక్కు చట్టాన్ని వర్తింపజేయాలని నిర్ణయించిన నేపథ్యంలో వారి కోసం సమగ్ర పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల పరిధిలోకి తెచ్చే చర్యలు గతేడాదే మొదలయ్యాయి. ఇప్పటివరకు దాదాపు 5 వేలకు పైగా పాఠశాలల ఆవరణలోకి అంగన్వాడీ కేంద్రాలను తరలించారు. రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు 7,64,905 మంది ఉన్నారు. -
కాగితాలపైనే చట్టం..
అటకెక్కిన 25 శాతం రిజర్వేషన్లు పట్టించుకోని పాలకులు, అధికారులు రిజర్వేషన్లు కల్పించాలంటున్న తల్లిదండ్రులు వైరా: విద్యాహక్కు చట్టం కాగితాలకే పరిమితమైంది. నిరుపేద, అనాథ, ఎయిడ్స్ బాధిత పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నా.. పట్టించుకునేవారు కరువయ్యారు. విద్యాహక్కు చట్టం ప్రకారం నిరుపేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్ల కేటాయింపు.. ప్రభుత్వమే వారి ఫీజులు భరించాలని చట్టంలో పేర్కొంది. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే బాలబాలికలకు వేర్వేరుగా గురుకులాలు, మోడల్ స్కూళ్లను ప్రారంభించింది. అయితే ప్రైవేటు పాఠశాలల్లో నిరుపేద విద్యార్థులకు కేటాయించాల్సిన సీట్ల గురించి మాత్రం ఆలోచించడం లేదు. దీనిపై పలు స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. 2016–17 విద్యాసంవత్సరం నుంచి ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచితంగా అడ్మిషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించేందుకు ఎలాంటి ఇబ్బందులనైనా ఎదుర్కొని విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించినా.. ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం విద్యాసంవత్సరం ప్రారంభమైనా 25 శాతం రిజర్వేషన్‌పై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అమలుకు నోచుకోని ‘సుప్రీం’ తీర్పు విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయించాలని ఐదేళ్ల క్రితం సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇది ప్రతి యేటా అమలవుతుందని పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆశపడ్డారు. ఆ తీర్పు ఆచరణ సాధ్యం కాకపోవడంతో పేద విద్యార్థులు ప్రైవేటు చదువులకు దూరమవుతున్నారు. ఇప్పటికైనా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. రిజర్వేషన్ ప్రకారం భర్తీ చేయాలి.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులతో భర్తీ చేయాలి. ఇందులో అనాథలు, ఎయిడ్స్ బాధితుల పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు సీట్లను కేటాయించారు. అయితే పూర్తిగా వ్యాపార దృక్పథంలో నడుపుతున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈ చట్టాన్ని మొత్తానికే విస్మరించాయి. సంబంధిత శాఖ అధికారులు కూడా చట్టం అమలుపై దృష్టి సారించకపోవటంతో అబాసుపాలవుతోంది. ఫీజులు ప్రభుత్వమే భరిస్తుందా.. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు కేటాయించేందుకు యాజమాన్యాలు సుముఖంగా లేవు. ఒకవేళ సీట్లు కేటాయించినా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న వేలకు వేల ఫీజులు భరిస్తుందా అనే అనుమానం తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాల్లోనూ ఉంది. టెక్నో, ఒలింపియాడ్, కాన్సెప్ట్, డిజిటల్, ప్లే స్కూల్ తదితర పేర్లతో వచ్చిన పాఠశాలల్లో ఫీజులు వేలాది రూపాయలు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి భారమైనా పేదలకు ప్రైవేటు విద్యను అందించేందుకు చట్టాన్ని అమలు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యావేత్తలు ముక్తకంఠంతో కోరుతున్నారు. చట్టం అమలైతే.. జిల్లాలో సుమారు 172 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకుంటే సుమారు 5,454 మంది పేద విద్యార్థులకు మేలు జరగనుంది. నిబంధన ఉంది.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్ పద్ధతిన సీట్లు కేటాయించాలనే నిబంధన ఉంది. దీనిపై ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలకు కూడా ఆదేశాల జారీ చేశాం. తప్పకుండా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పేద విద్యార్థులకు సీట్లు కేటాయించి సహకరించాలి. ఎస్.విజయలక్ష్మీబాయి, జిల్లా విద్యాశాఖాధికారి, ఖమ్మం Right to Education Act , private schools, విద్యాహక్కు చట్టం, ప్రైవేటు పాఠశాలలు -
‘బడిబాట’ పట్టేనా..!
► జిల్లాలో 2వేలకు పైగా పిల్లలు బడిబయటే.. ► నెరవేరని విద్యాహక్కు చట్టం లక్ష్యం ► పట్టించుకోని అధికారులు ► ఈ నెల 13 నుంచి బడిబాట ఆదిలాబాద్‌టౌన్: పలకా బలపం పట్టాల్సిన చేతులు మెకానిక్ షెడ్లు, ఇటుక బట్టీల్లో పానలు, పారలు పడుతున్నారు. పుస్తకాలు చేతపట్టి అక్షరాలు దిద్దాల్సిన వీరు రోడ్లపై చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని ఆయా పట్టణాల్లోని రద్దీ ప్రదేశాల్లో బడీడు పిల్లలు భిక్షాటన చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, హోటళ్లు, లాడ్జిల్లో దర్శనమిస్తున్నారు. విద్యాహక్కు చట్టం, కార్మిక శాఖ ఇటు వైపు చూస్తున్నట్లుగా కనిపించడం లేదు. ఫలితంగా బాల కార్మికులకు విముక్తి కలగడం లేదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రవేశ పెట్టిన పలు కార్యక్రమాలు, చట్టాలన్ని మొక్కుబడిగా అమలవుతున్నాయి. కాగా ఈయేడాది రెండు నెలల ముందుగా మార్చి 21 నుంచే విద్యా సంవత్సరం ప్రారంభమైంది. బడి బయటి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు పది రోజులపాటు బడిబాట కార్యక్రమాలను నిర్వహించినా అంతగా ఫలించలేదు. దీంతో జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. 13 నుంచి 17వ తేదీ వరకు మళ్లీ బడిబాట చేపట్టనున్నారు. ఈసారైనా బడిబయట పిల్లలు బడిలో చేరేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బడికి రాని పిల్లలు సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమాలు చేపడుతోంది. ఉపాధ్యాయులు చిన్నారుల ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించి చేర్పించేలా చూడాలని ఆదేశించింది. ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ పిల్లలు బడిబాట పట్టడం లేదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఎన్రోల్మెంట్ డ్రైవ్, చదువుల పండుగ, బడిబాట, విద్యా పక్షోత్సవాలు, విద్యా సంబరాలు.. ఆచార్య జయ శంకర్ చదువుల పండగ.. ఇలా గత పదేళ్లలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో ఏ ఒక్కటైనా సరిగ్గా అమలైతే పిల్లలు బడిలోనే ఉండేవారు. కానీ అలా జరగడం లేదు. ప్రధానంగా ఐదేళ్ల క్రితం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకోకపోవడం బాలలకు శాపంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 2వేలకు పైగా మంది చిన్నారులు బడిబయట ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయా మండలాల్లో బాల కార్మికులు అధికంగానే ఉన్నట్లుగా అధికారులు కూడా గుర్తించారు. కాగా, అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలో 811 మంది పిల్లలు బడిబయట ఉన్నట్లు గుర్తించారు. మార్చిలో నిర్వహించిన బడిబాటలో కనీసం 200 మందిని కూడా బడిలో చేర్పించలేక పోయారు. విద్యాహక్క చట్టంలో భాగంగా బాల కార్మికులను బడిలో చేర్పించేందుకు పట్టణ శివారు ప్రాంతంలో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన అధికారులు ఆ తర్వాత వాటిని పట్టించుకోకపోవడంతో అవి మూతబడ్డాయి. నెరవేరని లక్ష్యం.. సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టంతోనైనా నిరుపేద కుటుంబాల్లోని పిల్లలకు విద్య అందించాలనే లక్ష్యం నెరవేరడం లేదు. గత ఆరు సంవత్సరాల క్రితం విద్యాహక్కు చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. పిల్లలు బడికి.. పెద్దలు పనికి అనే నినాదంతో విద్యాహక్కు చట్టానికి మరింత పదును పెట్టి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నా అనుకున్న లక్ష్యానికి చేరువ కావడానికి చట్టం తీసుకువచ్చింది. లక్ష్యం సాధించకపోవడంతో విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. 2009 అగస్టు 27న పార్లమెంటులో విద్యాహక్కు చట్టాన్ని ఆమోదించింది. 2010 ఏప్రిల్ నుంచి ఈ చట్టాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేస్తోంది. చట్టాలు రూపొందించి అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు వివక్ష చూపడం వల్లే నేటికి ఉచిత నిర్బంధ విద్య అమలు కావడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే మరో విద్యా సంవత్సరంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించాలనేది కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉండగా, బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించిన అధికారులు ఆ తర్వాత పిల్లలు బడికి వస్తున్నారో.. లేదో.. పర్యవేక్షించకపోవడంతో బడిలో చేరిన పిల్లలు తిరిగి బయటకు వెళ్లిపోతున్నారు. 13 నుంచి బడిబాట.. ఈ నెల 13 నుంచి 17 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. బడి బయట ఉన్న పిల్లలందరినీ బడిలో చేర్పించే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉంది. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరూ బడిలోనే ఉండాలి. బడీడు పిల్లల్ని పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరమవుతుంది. ఉపాధ్యాయులు బడిబయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించేలా చూడాలి. – కె.లింగయ్య, డీఈవో, ఆదిలాబాద్ -
‘బడి’కి నోటిఫికేషన్!
-
‘బడి’కి నోటిఫికేషన్!
రాష్ట్రంలో తొలిసారిగా పాఠశాలల్లో ప్రవేశాలకు షెడ్యూల్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పాఠశాలల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు దానిని కచ్చితంగా అమలు చేసేలా చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 20న ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. కేంద్ర ప్రభుత్వ స్కూళ్ల తరహాలో ఈనెల 21వ తేదీనుంచే కొత్త విద్యా సంవత్సరాన్ని (పైతరగతుల బోధన) ప్రారంభించాలని ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారులకు (డీఈవోలకు) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రోజు వారీగా చేపట్టాల్సిన చర్యలనూ వివరించింది. డ్రాపౌట్లు ఉండకుండా చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల్లో వంద శాతం పైతరగతుల్లో చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం వచ్చే నెల 3 నుంచి 13 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈసారి ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం కోసం డిమాండ్ ఉంటే.. బోధనకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు టీచర్లు, తల్లిదండ్రులు ముందుకు వస్తే.. ‘బడిబాట’కార్యక్రమంలోనే నిర్ణయం తీసుకుని, (ఒకటో తరగతిలో) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరోవైపు విద్యార్థులకు అందించేందుకు ఇప్పటికే 90 శాతం పాఠ్య పుస్తకాలను జిల్లాలకు చేర్చింది. ఈనెల 21న స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్థులందరికి పుస్తకాలు అందించేందుకు కసరత్తు చేస్తోంది. వేసవిలో పాఠశాలల్లో విద్యార్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఈమేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త విద్యా సంవత్సర కార్యక్రమాలు ► ఈనెల 21 నుంచి పాఠశాలల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం. పిల్లలకు పైతరగతుల బోధన. పాఠ్య పుస్తకాల పంపిణీ, స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం నిర్వహణ. తల్లిదండ్రులతో సమావేశం, డ్రాపౌట్స్‌ను తిరిగి పాఠశాలల్లో చేర్చేలా చర్యలు, విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అప్డేషన్. ► 22న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అంగన్వాడీ కేంద్రాల ను సందర్శించి అక్కడి పిల్లల జాబితాను సేకరించడం. పైతరగతులకు వెళ్లే విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేయడం. ప్రత్యామ్నా య బోధనకు ప్రణాళికల రూపకల్పన. ► 23న అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేర్పించడం. అక్షరాభ్యాసం కార్యక్రమం. 24వ తేదీ నుంచి..: చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యామ్నాయ బోధన ప్రారంభం. పాఠశాల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయడం. ► 25 నుంచి ఏప్రిల్ 15 వరకు: పాఠశాలల్లోని విద్యార్థుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం. ప్రీప్రైమరీ కోసం 5,318 స్కూళ్ల దరఖాస్తులు గతేడాది హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ప్రీప్రైమరీ విద్యార్థి లిఫ్టులో పడి మరణించడంతో.. ప్రీప్రైౖమరీ స్కూళ్ల నియంత్రణ, వాటి గుర్తింపు అంశం తెరపైకి వచ్చింది. అంతకుముందు ప్రీప్రైమరీ స్కూళ్ల గుర్తింపును ఎవరూ పట్టించుకోలేదు. ఆ ఘటనతో ప్రీప్రైమరీకి కూడా తప్పనిసరిగా గుర్తింపు పొందేలా, నిబంధనలు పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రీప్రైమరీ గుర్తింపు కోసం ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా.. రాష్ట్రవ్యాప్తంగా 5,318 ప్రైవేటు పాఠశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. అందులో పాత స్కూళ్లు 4,773 ఉండగా.. కొత్త గా ప్రీప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు 545 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 3 వేల వరకు పాఠశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇదీ ప్రవేశాల షెడ్యూల్ ► ఈ నెల 20న ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల ► 20 నుంచి 24 దాకా ప్రారంభ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ► 25 న ఎంపిక జాబితాల ప్రకటన ► 27 నుంచి ప్రారంభ తరగతిలో చేరిన వారికి తరగతుల బోధన ప్రారంభం ► ఏప్రిల్ 15 లోగా ఆయా విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు ► జూలై 30 వరకు ఇతర తరగతుల్లో సాధారణ ప్రవేశాల గడువు. ► సెప్టెంబర్ 24 వరకు ప్రవేశాలకు అవకాశం. ► విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఏ పాఠశాల కూడా విద్యార్థులకు ప్రవేశాలను నిరాకరించడానికి వీల్లేదు. ► పాఠశాలల్లో ఆలస్యంగా చేరిన వారికి ప్రత్యేక బోధన చేపట్టాలి. -
ఎన్సీటీఈ నిబంధనలు బేఖాతరు!
‘గురుకుల’పోస్టుల విద్యార్హతలపై సంక్షేమ శాఖల ఇష్టారాజ్యం 6, 7, 8 తరగతుల బోధనకు డిగ్రీలో 50% ఉంటే చాలన్న ఎన్సీటీఈ డిగ్రీతో పాటు రెండేళ్ల డీఎడ్ చేసిన వారికి అవకాశమివ్వాలని సూచన ఈ నిబంధనలను పక్కనబెట్టి మరీ అర్హతల నిర్ణయం లక్షల మంది అభ్యర్థులకు అవకాశం దూరం పీఈటీ పోస్టుల్లో బీపీఈడీ వారికి ఇవ్వని అవకాశం సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఆదేశాలను రాష్ట్ర సంక్షేమ శాఖలు తుంగలో తొక్కాయి. 6, 7, 8 తరగతులకు బోధించేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులుంటే చాలన్న నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరించాయి. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆందోళన నింపాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు టెట్ అర్హులు 4.5 లక్షల మంది వరకు ఉన్నారు. ఇందులో మూడు లక్షల మంది వరకు గురుకులాల్లోని టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నట్లు అంచనా. కానీ ఇప్పుడు డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలన్న నిబంధన కారణంగా.. దాదాపు 2 లక్షల మంది వరకు అర్హత కోల్పోతున్నారు. ఇక పీజీటీ పోస్టులకు విద్యార్హతలతోపాటు కనీసం మూడేళ్ల బోధన అనుభవం ఉండాలన్న నిబంధన కారణంగా గత మూడేళ్లలో పీజీ పూర్తి చేసిన వారు అనర్హులు అవుతున్నారు. అసలు ఎన్సీటీఈ నిబంధనల్లో ఈ అంశమే లేకపోవడం గమనార్హం. మరోవైపు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టుల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పీఈటీ పోస్టులకు ఇంటర్‌తోపాటు అండర్ గ్రాడ్యుయేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హులన్న నిబంధన విధించారు. కానీ డిగ్రీ చదివి, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) పూర్తి చేసిన వారిని విస్మరించారు. మరోవైపు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు పీజీతోపాటు మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ) పూర్తి చేసిన వారు అర్హులని ప్రకటించారు. అసలు ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఉన్నవి ఈ రెండు కేటగిరీల పోస్టులే. కానీ ఎందులోనూ బీపీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించకపోవడం ఆందోళనకరంగా మారింది. మరోవైపు ఇంగ్లిషులోనే ప్రశ్నపత్రం ఇస్తామనడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తీవ్ర ఆందోళనలో పడ్డారు. డిగ్రీ, రెండేళ్ల డీఎడ్ ఉన్నవారికి అన్యాయం! డిగ్రీ చదివి, రెండేళ్ల డీఎడ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు 6, 7, 8 తరగతులకు బోధించే అవకాశం కల్పించాలని ఎన్సీటీఈ నిబంధనలున్నాయి. కానీ గురుకులాల్లో 6, 7, 8 తరగతులకు బోధించే టీచర్ల విషయంలో.. డిగ్రీ, డీఎడ్ వారికి అవకాశం ఇవ్వలేదు. డిగ్రీతో బీఎడ్ చేసిన వారు మాత్రమే టీజీటీ పోస్టుకు అర్హులని నిబంధన విధించాయి. నిబంధనలు ఏం చెబుతున్నాయి..? విద్యా హక్కు చట్టం అమల్లో భాగంగా ఉపాధ్యాయులకు ఉండాల్సిన అర్హతలను ఎన్సీటీఈ నిర్ణయిస్తుందని కేంద్రం 2010 ఏప్రిల్‌లో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎన్సీటీఈ 2002 నాటి అర్హతలను సవరిస్తూ 2010 ఆగస్టులో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనిపై గెజిట్ జారీ చేసిన కేంద్రం.. 2002 ఎన్సీటీఈ నిబంధనలకు ముందు అర్హతలు పొందిన వారికి మాత్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ఆ గెజిట్‌లోని ప్రధాన అంశాలు.. ► 1 నుంచి 5 తరగతులకు బోధించే వారు సీనియర్ సెకండరీ (ఇంటర్)లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే రెండేళ్ల డీఎడ్ కోర్సు చేసి ఉండాలి. అదే ఇంటర్లో 45 శాతం మార్కులు ఉంటే.. డీఎడ్ మాత్రం 2002 ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం ఉండాలి. ► 6, 7, 8 తరగతులకు బోధించే వారు డిగ్రీ, రెండేళ్ల డీఎడ్ చేసి ఉండాలి.. లేదా 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు బీఎడ్ చేసి ఉండాలి.. లేదా 45 శాతం మార్కులతో డిగ్రీ చేసి ఉంటే బీఎడ్ ఎన్సీటీఈ నిబంధనల మేరకు ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో ఇంటర్, నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. ► వీటన్నింటితోపాటు ప్రతి ఉపాధ్యాయ అభ్యర్థి ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)’లో అర్హత సాధించి ఉండాలి. ► 9, 10 తరగతులకు బోధించేవారికి డిగ్రీలో 50శాతంతోపాటు బీఈడీ, 11, 12 తరగతులకు బోధించేవారికి పీజీలో 50శాతంతోపాటు బీఈడీ చేసి ఉండాలని పేర్కొంది. ఒకవేళ డిగ్రీ, పీజీల్లో 45 శాతమే ఉంటే.. బీఎడ్ మాత్రం ఎన్సీటీఈ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. బీసీలకు అన్యాయం విద్యార్హతల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు 5 శాతం సడలింపు వర్తిస్తుందని ఎన్సీటీఈ స్పష్టం చేసింది. కానీ ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు ఉండాలని.. బీసీ, ఇతరులైతే 60 శాతం ఉండాలని టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది. అంటే ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే 5 శాతం సడలింపు ఇచ్చింది. దీంతో బీసీలకు, వికలాంగుల కు అన్యాయం తప్పడం లేదు. విద్యాశాఖ చెప్పినా.. విద్యా శాఖ ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలపై సంక్షేమ శాఖలకు వివరాలిచ్చినా పట్టించుకో లేదని అధికారులు చెబుతున్నారు. ఎన్సీటీఈ జారీ చేసిన ఉత్తర్వులను సైతం సంక్షేమ శాఖలకు అందజేశా మని.. అయినా ఇష్టానుసారం నిబంధన లు పెట్టారని పేర్కొంటున్నారు. -
కడియం చైర్మన్‌గా ‘కేబ్’ ఉపసంఘం
ప్రకటించిన కేంద్ర మంత్రి జవదేకర్ - బాలికల విద్య అంశాలపై అధ్యయనం చేయనున్న కమిటీ - 64వ కేబ్ సమావేశంలో పలు నిర్ణయాలు - ‘నో డిటెన్షన్ పాలసీ’అమలుపై రాష్ట్రాలకు స్వేచ్ఛ - డిటెన్షన్ విధానాన్ని వ్యతిరేకించిన కడియం - లోటుపాట్లు సరిచేస్తే సత్ఫలితాలు వస్తాయని స్పష్టీకరణ సాక్షి, న్యూఢిల్లీ: బాలికల విద్యకు సంబంధించిన పలు అంశాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా ‘కేబ్’ (సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్) ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. జాతీయ స్థాయిలో విద్యారంగ వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలివ్వడానికి ఏర్పాటైన కేబ్ 64వ సమావేశంలో జవదేకర్ ఈ మేరకు ప్రకటించారు. జాతీయ నూతన విద్యా విధానంతోపాటు విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన అంశంపై మంగళవారం ఇక్కడ జరిగిన సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. నో డిటెన్షన్‌పై నిర్ణయం రాష్ట్రాలకే..! విద్యా హక్కు చట్టంలో భాగంగా అమలు చేస్తున్న ‘నో డిటెన్షన్’ విధానంపై రాజస్థాన్ విద్యా శాఖ మంత్రి అధ్యక్షతన ఏర్పా టైన కేబ్ ఉపసంఘం తమ నివేదికను సమావేశంలో అందించింది. నో డిటెన్షన్ పాలసీ వల్ల ఫలితాలు ఆశించిన మేరకు లేవని, విద్యా ప్రమాణాలు తరగడమే కాక నాణ్యమైన విద్య కొరవడుతోందని పలు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు అభిప్రాయపడ్డారు. ‘నో డిటెన్షన్’ పాలసీని ఎత్తివేయాలని మెజారిటీ రాష్ట్రాల మంత్రులు డిమాండ్ చేశారు. అయితే కడియం అందుకు వ్యతిరేకించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల వెనుకబాటుతనానికి ఈ పాలసీ కారణం కాదని స్పష్టంచేశారు. ఈ విధానాన్ని కొనసాగిస్తూనే విద్యా ప్రమాణాలు పెంచడానికి మార్గాలను అన్వేషించాలని సూచించారు. టీచర్లను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచి, డ్రాపవుట్స్ పెరగకుండా జాగ్రత్తలు పాటిస్తే సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. డిటెన్షన్ విధానాన్ని అమలు చేయడమంటే విద్యా హక్కును కాలరాయడమేనన్నారు. దీంతో నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవుతారన్నారు. అందువల్ల డిటెన్షన్ విధానం అమలుకు తాము సుముఖంగా లేమన్నారు. ప్రస్తుత విధానంలో లోటుపాట్లు ఉంటే సరి చేయాలని, స్కూళ్లలో మౌలిక వసతులు పెంచాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా డ్రాపవుట్స్ శాతం పెరగడానికి ప్రైవేటు స్కూళ్లకు ఊతమిచ్చేలా ఉన్న కొన్ని ప్రభుత్వ పథకాలే కారణమని, వాటిని సవరించాల్సిన అవస రముందన్నారు. ఈ వాదనలతో కొన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు ఏకీభవించారు. దీంతో ఈ పాలసీని సమీక్షించే స్వేచ్ఛను రాష్ట్రాలకే ఇస్తామని జవదేకర్ తెలిపారు. విద్య జాతీయ ఎజెం డా అని, నాణ్యమైన విద్య అందించే విషయంపై ప్రతి ఒక్కరూ దృష్టి కేంద్రీకరించాల్సి ఉందన్నా రు. శిక్షణ లేని టీచర్లకు శిక్షణనిచ్చే కార్యక్రమాన్ని రానున్న ఐదేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయిం చారు. కేంద్రమంత్రులు విజయ్ గోయల్, రాజీవ్ ప్రతాప్ రూడీ తో పాటు వివిధ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆడపిల్లల విద్యపై చర్చ ఏది? బాలికల విద్య అంశాన్ని కేబ్ భేటీలో చర్చించకపోవడం దురదృష్టకరమని మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా ఆడపిల్లల విద్య కోసం ‘బేటీ బచావో... బేటీ పడావో’ నినాదాన్ని ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. వెంటనే స్పందించిన కేంద్రమంత్రి జవదేకర్... కడియం నేతృత్వంలోనే కేబ్ ఉపసంఘం ఏర్పాటు చేయడం గమనార్హం. -
పాఠశాలా?.. చెరసాలా?
ప్రకాశం : ప్రభుత్వం నిర్బంధ విద్యా హక్కుచట్టం సక్రమంగా అమలు చేస్తుందో లేదో కానీ ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులను గదిలో నిత్యం ఇలాగే నిర్బంధిస్తున్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో అటవీ ప్రాంత సమీపంలోని మారుమూల గ్రామం బొమ్మిలింగం. ఈ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా శనివారం ముగ్గురు విధులకు హాజరయ్యారు. వీరంతా మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్టాఫ్ రూంలో ముచ్చట్లు చెప్పుకుంటూ పిల్లలను ఇలా గదిలో పెట్టి తాళం వేశారు. పిల్లలు బయటకు వచ్చి గొడవ చేయకుండా రోజూ ఇలాగే తాళం వేస్తుంటారని స్థానికులు తెలిపారు. దీనిపై ఉపాధ్యాయులను ప్రశ్నించగా ఎవరూ స్పందించలేదు. -అర్ధవీడు -
బతుకు భారమై.. బడికి దూరమై..
విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని.. బడి ఈడు పిల్లలందరూ బడిలోనే ఉండేటట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న చెబుతున్న మాటలు నీటిమూటలే అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహిస్తున్న వేళ.. రామచంద్రపురానికి చెందిన ఇద్దరు బాలురు రాయవరంలో చెత్త ఏరుకుంటూ.. పెదపూడి మండలం పైన గ్రామానికి చెందిన బాలలు చెత్త ఏరుకోవడానికి రిక్షాపై వి.సావరం వెళ్తూ. ఇలా కనిపించారు. బతుకు భారమై.. బడిబాట పట్టాల్సిన బాల్యం చెత్తకుప్పలపాలవుతోంది. చట్టాలెన్ని ఉన్నా అక్కరకు రావడం లేదనడానికి ఇటువంటి చిత్రాలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. - రాయవరం -
ఏబీసీడీ.. ఫీజుల దాడి!
- ప్రైవేటు స్కూళ్లలో అడ్డగోలు ఫీజులు - శాస్త్రీయ విధానం లేకుండా ఏటేటా పెంపు - ఇష్టారాజ్యంగా కేపిటేషన్, డొనేషన్ల వసూళ్లు - ఐఐటీ, ఒలింపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ-టెక్నో పేర్లతో దందా - పట్టించుకోని విద్యాశాఖ.. కానరాని నియంత్రణ చర్యలు - జీవోలన్నీ బుట్టదాఖలు - యాజమాన్యాలకు ముకుతాడు వేసేదెప్పుడు: తల్లిదండ్రులు సాక్షి, హైదరాబాద్: సురేశ్‌కుమార్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు ఉద్యోగి. తన కొడుకు విశ్వాస్ను బాగా చదివించాలన్న కోరికతో గతేడాది ఓ కార్పొరేట్ స్కూల్లో చేర్పించాడు. రూ.65 వేల ఫీజు. యూనిఫారం, షూస్, పుస్తకాలు, రవాణా, ఇతరత్రా ఖర్చులన్నింటికీ మొత్తం లక్ష వరకు వెచ్చించాడు. ఈ ఏడాది విద్యార్థి పైతరగతికి వెళ్లాడు. ఫీజు రూ.85 వేలు చేశారు. అన్ని ఖర్చులు కలిపి రూ.1.35 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది! ► వరంగల్‌లో కాస్త పేరున్న ఓ ప్రైవేటు స్కూల్లో సుధీర్ తన కొడుకును గతేడాది ఒకటో తరగతిలో చేర్చాడు. రూ.25 వేల ఫీజు కట్టాడు. ఇప్పుడు రెండో తరగతికి వచ్చేసరికి స్కూలు యాజమాన్యం ఫీజు కింద రూ.35 వేలు చెల్లించాలంటోంది. ► కరీంనగర్‌లోని మరో ప్రైవేటు స్కూలు యాజమాన్యం గతేడాది మూడో తరగతికి రూ.22 వేలు వసూలు చేసింది. ఇప్పుడు రూ.30 వేలు కట్టాలంటోంది! ..ఒకట్రెండు కాదు.. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లన్నింటిదీ ఇదే దారి! ఏటేటా భారీగా ఫీజులు పెంచేస్తూ తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నాయి. అయినా పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న ఆశతో అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. ఒక విధానం అంటూ లేకుండా ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ప్రతి సంవత్సరం అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తున్నా వాటిని నియంత్రించే చర్యలు కానరావడం లేదు. ఫీజులపై అనేక ఫిర్యాదులు అందుతున్నా ఉన్నతాధికారులు ఒక్క స్కూల్‌పైనా చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు! ఇక ఐఐటీ, ఒలింపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఈ-శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి పేర్లతో ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా రూ.లక్షల్లో కేపిటేషన్ ఫీజులు, డొనేషన్లు గుంజుతున్నాయి. ‘మీ అబ్బాయికి సీటిస్తాం.. డొనేషన్ ఎంతిస్తారు..?’ అంటూ బేరమాడుతున్నాయి. స్కూళ్ల ఆగడాలు ఏటేటా పెరిగిపోతున్నా విద్యాశాఖకు పట్టడం లేదు. ప్రభుత్వమో, ఉన్నతాధికారులో.. చర్యలు చేపట్టాలని ఆదేశించినప్పుడే జిల్లా, క్షేత్రస్థాయి అధికారులు హడావుడి చేస్తున్నారు. వారైనా కఠినంగా వ్యవహరిస్తున్నారా అంటే అదీ లేదు! తనిఖీల పేరుతో పాఠశాలలకు వచ్చి యాజమాన్యాల వద్ద వసూళ్ల దందాకు దిగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజులపై నియంత్రణ ఏదీ? తెలంగాణలో 14,250 ప్రైవేటు పాఠశాలలున్నాయి. అందులో 32.70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, ఇతర పట్టణ ప్రాంతాల్లోనే 9 వేల స్కూళ్లు ఉండగా.. వాటిలో 20 లక్షల మంది వరకు చదువుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జీవో 91ని జారీ చేసింది. దాని ప్రకారం ప్రతి ప్రైవేటు పాఠశాలలో గవర్నింగ్ బాడీలను ఏర్పాటు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలను (డీఎఫ్ఆర్సీ) ఏర్పాటు చేయాలి. పాఠశాల గవర్నింగ్ బాడీలు ప్రతిపాదించే ఫీజులను డీఎఫ్ఆర్సీ పరిశీలించి తుది ఫీజులను ఖరారు చేయాలి. వాటినే స్కూళ్లలో వసూలు చేయాలి. అందులోనూ గరిష్టంగా వసూలు చేయాల్సిన ఫీజులను పేర్కొంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏటా గరిష్టంగా రూ.24 వేలు, ఉన్నత పాఠశాలల్లో రూ.30 వేల ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. అయితే ఆ ఉత్తర్వులపై ప్రైవేటు పాఠశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. డీఎఫ్ఆర్సీల ఏర్పాటు సరిగ్గా లేదని 2010లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం జీవో 91న పక్కన పడేసి జీవో 41, 42ను జారీ చేసింది. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే ఏడాదికి గరిష్టంగా రూ.9 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,800 వసూలు చేయాలని పేర్కొంది. అలాగే ఉన్నత పాఠశాలల్లో పట్టణాల్లో రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10,800కు మించి వసూలు చేయవద్దని పేర్కొంది. అయితే ఆ జీవోపైనా యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో వాటి అమలు కూడా ఆగిపోయింది. దీంతో ఫీజుల నియంత్రణ వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారింది. ఫీజులు ఆకాశంలో.. వసతులు పాతాళంలో.. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నా.. చాలా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు, వసతులు అంతంతే ఉంటున్నాయి. అపార్ట్మెంట్లలో స్కూళ్ల నిర్వహణ, అగ్గిపెట్టెల్లాంటి తరగతి గదులు, శిక్షణ లేని ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాల కొరత మధ్య స్కూళ్లు సాగుతున్నాయి. 1 నుంచి ఐదో తరగతి క్లాసులు కూడా 2, 3, 4వ అంతస్తుల్లో నిర్వహిస్తుండడంతో బ్యాగుల మోతతో మెట్లెక్కలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. లంచ్ టైం కేవలం 30 నిమిషాలు ఇస్తున్నారు. మెట్లెక్కి, దిగే సరికే సగం టైం అయిపోతుండడంతో పిల్లలు సరిగా భోజనం చేయడం లేదు. నర్సరీ నుంచే ఐఏఎస్ పాఠాలా? నర్సరీ నుంచే ఐఏఎస్ శిక్షణ? అదేంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే. వరంగల్‌లోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఐఐటీకే కాదు.. ఐఏఎస్‌కు సైతం నర్సరీ నుంచే శిక్షణ ఇస్తామంటూ ఫీజులు గుంజాయి. ఒక్కో విద్యార్థి నుంచి ఇందుకు రూ.2 వేల చొప్పున వసూలు చేశాయి. ఇక హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఆ శాఖ ఇటీవల ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ప్రముఖ పాఠశాలల్లో తనిఖీలు చేసింది. ఇందులో విస్తుగొలిపే వాస్తవాలు బయట పడ్డాయి. ఏసీ క్లాస్ రూమ్‌లు, ఐఐటీ ఫౌండేషన్ శిక్షణల పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులను వసూలు చేస్తున్నట్లు తేలింది. వసూలు చేస్తున్న ఫీజులకు, విద్యాబోధనకు సంబంధం లేదని స్పష్టమైంది. ఆకర్షణీయమైన పేర్లతో గాలం ఐఐటీ ఫౌండేషన్ గతంలో ఆరో తరగతి నుంచి మొదలైతే ఇప్పుడు ఒకటో తరగతి నుంచే చెబుతామంటూ అనేక స్కూళ్లు వెలిశాయి. ఆడుతూ పాడుతూ ఓనమాలు దిద్దాల్సిన ప్రాయంలో వారి మానసిక స్థాయితో సంబంధం లేకుండా లక్షల ఫీజులు వసూలు చేస్తూ కోచింగ్‌లు మొదలుపెడుతున్నాయి. ఐఐటీ, ఒలింపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఈ-శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి ఆకర్షణీయమైన పేర్లతో తల్లిదండ్రులకు గాలమేస్తున్నాయి. ఇలా ఆకర్షణీయ పేర్లు పెట్టడానికి వీల్లేదని, వాటిని వెంటనే తొలగించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ గతంలో ఆదేశించినా ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. ఆ జీవో అమలు ఎక్కడ? ప్రభుత్వం 1994లో జీవో నంబర్ 1 జారీ చేసింది. దీని ప్రకారం.. పాఠశాలకు ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం మొత్తాన్ని 100 శాతం అనుకుంటే.. అందులో 50 శాతం మొత్తాన్ని ఉపాధ్యాయుల వేతనాలకు వెచ్చించాలి. మరో 15 శాతం నిధులను పాఠశాల అభివృద్ధి, వసతుల కల్పనకు ఉపయోగించాలి. మరో 15 శాతం నిధులను పాఠశాల నిర్వహణకు వెచ్చించాలి. మరో 15 శాతం నిధులను ఉపాధ్యాయులు, సిబ్బంది సంక్షేమం కోసం ఉపయోగించాలి. యాజమాన్యం కేవలం 5 శాతం నిధులను మాత్రమే లాభంగా తీసుకోవాలి. కానీ ఈ జీవో అమలు అటకెక్కింది. అసలు ఆ జీవోను పట్టించుకునేవారే లేరు. ఫలితంగా ఫీజులకు ఏటేటా రెక్కలు వస్తూనే ఉన్నాయి. అడ్డగోలు ఫీజుల ను నియంత్రించి, యాజమాన్యాలకు ముకుతాడు వేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
అనుమతి లేకుండా స్కూలు నడిపితే జైలుకే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేటు స్కూళ్లు నడిపినా.. ప్రీ ప్రైమరీ, కిండర్‌గార్టెన్, ప్లేస్కూల్ తరగతులను నిర్వహించినా ఆయా పాఠశాలలను సీజ్ చేస్తామని విద్యాశాఖ మరోసారి స్పష్టం చేసింది. దీనిని అతిక్రమిస్తే యాజమాన్యాలకు 6 నెలల జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది. అనుమతి లేకుండా విద్యా సంస్థలు తరగతులను నిర్వహిస్తే విద్యా హక్కు చట్టం సెక్షన్ 18 ప్రకారం జైలుశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తారని పేర్కొంది. ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులు ప్రైవేటు పాఠశాలలకు జారీ చేసిన నోటీసుల్లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అనుమతి కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన గడువు ఆదివారంతో ముగియనుంది. వారం రోజుల్లో విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో అటు ప్రైవేటు యాజమాన్యాలు, ఇటు విద్యాశాఖ మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. స్పందన నామమాత్రమే.. ప్రైవేటు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ, కిండర్ గార్టెన్, ప్లేస్కూల్ తరగతుల నిర్వహణకు అనుమతి తప్పనిసరని విద్యాశాఖ ఎన్ని హెచ్చరికలు చేసినా.. యాజమాన్యాల నుంచి నామమాత్రపు స్పందనే కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 14,500 ప్రైవేటు పాఠశాలలుండగా.. అందులో ప్రీ ప్రైమరీ, కిండర్‌గార్టెన్ కోసం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నది 263 స్కూళ్లే. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 121 పాఠశాలలు నమోదు చేసుకోగా... విద్యాశాఖను పర్యవేక్షించే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సొంతజిల్లా వరంగల్ నుంచి ఒక్క పాఠశాల కూడా దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికే ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులకు అనుమతి తప్పనిసరి చేయొద్దని ప్రైవేటు యాజమాన్యాలు కోరుతుండగా... విద్యాహక్కు చట్టం ప్రకారం అనుమతి తప్పనిసరని సర్కారు పట్టుదలగా ఉంది. దీంతో అనుమతి కోసం రిజిస్ట్రేషన్ చేసుకోని పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు జిల్లా విద్యా శాఖాధికారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రస్థాయిలో ఆందోళన చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని ప్రైవేటు యాజమాన్యాల సంఘాలు నిర్ణయించాయి. చట్టాన్ని గౌరవించాల్సిందే.. ‘‘విద్యాహక్కు చట్టంలోని అంశాలను అన్ని పాఠశాలల యాజమాన్యాలు గౌరవించాల్సిందే. అనుమతి లేకుండా ప్రీప్రైమరీ తరగతులు నిర్వహించే పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. నిబంధనల అమలుకు ప్రైవేటు యాజమాన్యాలు సహకరించాలి. ఇప్పటికే 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని అనుమతులు పొందిన పాఠశాలలు పాత అనుమతి పత్రాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాం. జీవో 91 ప్రకారం ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు, కరిక్యులం సిద్ధంగా ఉంది..’’ - కిషన్, పాఠశాల విద్యా శాఖ డెరైక్టర్ కొత్తగా అనుమతులెందుకు..? ‘‘ప్రైవేటు పాఠశాలల నిర్వహణ యాజమాన్యాలకు ఇప్పటికే భారంగా మారింది. ఒకసారి అనుమతి తీసుకున్న విద్యా సంస్థలు కింది తరగతుల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలనడం ఎంత మాత్రం సబబు కాదు. ప్రీప్రైమరీ తరగతులకు అనుమతి తప్పనిసరని భావిస్తే.. ఇప్పటికే ప్రభుత్వ గుర్తింపుతో నడుస్తున్న పాఠశాలలన్నింటికీ దరఖాస్తు లేకుండానే అనుమతులు జారీ చేయాలి. అంతేగానీ జైలుకు పంపుతామని బెదిరిస్తే వెనుకాడం..’’ - ఎన్.శ్రీనివాస్‌రెడ్డి, గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) అధ్యక్షుడు -
ఫీజుల నియంత్రణపై అఖిలపక్షం వేయండి
ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ విద్యాలయాల్లో ఫీజుల నియంత్రణ, విద్యాహక్కు చట్టం అమలుపై చర్చించేం దుకు వెంటనే అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయాలని బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది. పోలీసు తనిఖీలను ప్రైవేట్ యాజమాన్యాలు వ్యతిరేకించాలి తప్ప, పరీక్ష కేంద్రాలను అనుమతించమనే వైఖరి సరైంది కాదని పేర్కొం ది. ప్రభుత్వ నియమ, నిబంధనలను ప్రైవేట్ విద్యాసంస్థలు అమలు చేస్తున్న తీరుపై రెగ్యులర్‌గా తనిఖీలు చేయడాన్ని తమ పార్టీ సమర్థిస్తున్నదని రాష్ట్ర పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అయితే ప్రభుత్వ విద్యారంగానికి చెందిన సంస్థలతో కాకుండా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, సీబీసీఐడీ వంటి పోలీసు విభాగాలతో తనిఖీలు చేయించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. విద్యారంగాన్ని పరిరక్షించాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉంటే ప్రైవేట్ విద్యాలయాలపై ప్రభుత్వ విద్యావిభాగాల ద్వారా సమర్థంగా తనిఖీలు చేయించాలన్నారు. ఉల్లంఘనలకు పాల్పడుతున్న సంస్థలపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
బాలలు... బాటసారులు
ఈ చిత్రంలోని విద్యార్థులు జుక్కల్ మండలం పెద్దగుల్ల గ్రామానికి చెందిన వారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో కాలినడకన రోజూ 5 కి.మీ దూరంలో ఉన్న పెద్ద ఎడ్గి గ్రామానికి వచ్చి చదువుకుంటున్నారు. మండే ఎండ లోనూ వీరు ఇలా కష్టపడుతూ బడికి వస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 3 కిలోమీటర్ల దూరంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు విద్యాహక్కుచట్టం కింద రవాణా భత్యం చెల్లించాలి. కానీ నాలుగేళ్లుగా విద్యార్థులకు రవాణా భత్యం అందడం లేదు. రవాణా భత్యం సొమ్ముతో సైకిళ్లు కొనుగోలు చేద్దామని ఉన్నతాధికారులు తెరమీదికి తెచ్చినప్పటికీ.. ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. విద్యార్థులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు అధికారులకు అందడంలో జాప్యం, ఉన్నతాధికారుల ఆదేశాలు లేకపోవడం వల్ల రూ. లక్షలు రాజీవ్ విద్యా మిషన్ ఖాతాలో మూలుగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రాథమిక పాఠశాల నివాసానికి కిలోమీటర్ దూరంలో, ఉన్నత పాఠశాల 3 కిలో మీటర్ల దూరంలో ఉండి రవాణా సౌకర్యం (ఆర్టీసీ బస్సు సౌకర్యం) లేకపోతే విద్యార్థులు రవాణా భత్యం పొందవచ్చు. ఇందుకు విద్యార్థికి నెలకు రూ. 300 చొప్పున 10 నెలల భత్యం చెల్లిస్తారు. జిల్లాలో విద్యాహక్కుచట్టం అమలులోకి వచ్చిన తరువాత 2010-11, 2011-12 సంవత్సరాలకు ఒక్కపైసా విడుదల కాలేదు. 2012-13 సంవత్సరంలో 143 మంది విద్యార్థులకు 9 నెలల భత్యం చెల్లించారు. 2013-14, 2014-15 సంవత్సరాలకు జిల్లాలో 13 పాఠశాలల నుంచి 191 మందికి రవాణా భత్యం చెల్లించారు. కానీ 7 నెలల భత్యం మాత్రమే అందింది. ఈ విద్యా సంవత్సరం.. ఈ విద్యా సంవత్సరం జిల్లాలో దాదాపు 250 పాఠశాలల నుంచి ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు చేరాయి. జిల్లాలో 480 మంది విద్యార్థులకు రవాణా భత్యం అందాల్సి ఉండగా నిధులు మాత్రం 191 మందికి మాత్రమే వచ్చాయి. వచ్చిన నిధులు ఇంకా విద్యార్థుల ఖాతాల్లో జమ కాలేదు. ఇందులో భవిత పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా ఉండడం విశేషం. దీంతో విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తూ ప్రయాణ ఖర్చులతో చదువును కొనుక్కుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. విద్యార్థుల రవాణా భత్యం నిబంధనలకు విరుద్ధంగా మండల విద్యా శాఖాధికారుల(ఎంఈవో)ల బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. అక్కడి నుంచి ఎంఈవో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుని ఖాతాల్లో జమ చేస్తున్నారు. కాని పేద విద్యార్థులకు అందాల్సిన భత్యం కొన్నా చోట్ల పక్కదారి పడుతుందనే విమర్శలు ఉన్నాయి. సక్రమంగా పంపిణీ చేయకపోవడం, విద్యార్థులకు ఆలస్యంగా అందజేయడం వంటి కారణాలతో మారుమూల గ్రామాల తండా ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకు దూరమై బాలకార్మికులుగా మారుతున్నారు. తెరపైకి సైకిళ్ల వ్యవహారం.. రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు ఈ విద్యా సంవత్సరం వి ద్యార్థులకు అందజేయాల్సిన రవాణా భత్యానికి బదులుగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని భావించారు. అయితే ఆ దిశగా ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో జుక్కల్, కమ్మర్పల్లి, బిచ్కుంద, గాంధారి, సిరికొండ భీంగల్ వంటి మారుమూల మండలాల్లో చదువుకునే విద్యార్థు లు ఆర్థిక స్థోమత లేక, కిలో మీటర్ల దూరం నడవలేక బడి మా నేస్తున్నారు. ఈ మండలాల్లో అధికారుల లెక్కల ప్రకారం 1,130మంది బాలకార్మికులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పాఠశాల విద్యార్థులు అర్హులు కారా... * భీమ్‌గల్ మండలం కుప్కల్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు ఉన్నత చదువు కోసం 4 కి.మీ దూరంలో ఉన్న జాగిర్యాల్ గ్రామానికి వెళ్తుంటారు. వీరికి రవాణా బత్యం అందడం లేదు. * జుక్కల్ మండలం బంగారుపల్లి, దోసుపల్లి, మైబాపూర్,సిద్దాపూర్, లోంగన్ గ్రామాల విద్యార్థులు దాదాపుగా 40 మంది జుక్కల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు చదువుకోవడానికి వస్తుంటారు. వీరికి రవాణా భత్యం అందనిద్రాక్షగా మారింది. * గాంధారి మండలం కరక్‌వాడి గ్రామానికి చెందిన ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు పై చదువుల కోసం ఉత్తునూర్ వెళ్తుంటారు. వీరికి రవాణా భత్యం గత ఆరేళ్లుగా ఒక్కసారి కూడా అందకపోవడం గమనార్హం. * మోర్తాడ్ మండలం బట్టాపూర్ విద్యార్థులు చదువుకోవడానికి తడపాకల్ వెళ్తుంటారు. వీరిని రవాణా భత్యం పథకం కింద ఇంత వరకు చేర్చలేదు. * ధర్పల్లి మండలం దన్బండాతండా ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు పై చదువుల కోసం దుబ్బాక ఉన్నత పాఠశాలకు వెళ్తుంటారు. వీరికి ఒక్కసారి కూడా రవాణా భత్యం అందలేదు. -
‘విద్యాహక్కు’ అమలు చేయాల్సిందే
♦ టీ సర్కార్‌కు తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం ♦ ఇది ప్రభుత్వాల బాధ్యత ♦ 25 శాతం సీట్ల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని సూచన సాక్షి, హైదరాబాద్: విద్యాహక్కు చట్టాన్ని అమలు చేసి తీరాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇది ప్రభుత్వాల బాధ్యతని స్పష్టం చేసింది. చట్టం కూడా ఇదే చెబుతోందని, అందువల్ల ఈ బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోజాలవని పేర్కొంది. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు విద్యా సంస్థల్లో బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించే విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 25 శాతం సీట్ల కేటాయింపు విషయంలో తగిన విధంగా స్పందించాలని, లేకుంటే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తామని తేల్చి చెప్పింది. 25 శాతం సీట్ల కేటాయింపు వ్యవహారంలో అన్ని ప్రైవేటు స్కూళ్లకు సర్క్యులర్లు జారీ చేయనున్నామని తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు కోర్టుకు నివేదించారు. అయితే ఆ సర్కులర్లను తమ ముందుంచాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాహక్కు చట్ట నిబంధనలను అమలు చేసే విషయంలో ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని, అలాగే విద్యాహక్కు చట్టం కింద బలహీనవర్గాలకు 25 శాతం సీట్లు కేటాయించని పాఠశాలలపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం వాటిని మరోసారి విచారించింది. మళ్లీ వాయిదాలంటే ఎలా? ఈ సందర్భంగా అదనపు ఏజీ జె.రామచంద్రరావు స్పందిస్తూ, 25 శాతం సీట్ల కేటాయింపు విషయంలో సర్క్యులర్లు జారీ చేయనున్నామని, అందుకు మూడు వారాల గడువు కావాలని కోరారు. ఇప్పటికే పలుసార్లు వాయిదాలు ఇచ్చామని, మళ్లీ ఇప్పుడు వాయిదా అడగడం ఎంత మాత్రం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రవేశాల కోసం పాఠశాలలను ఆశ్రయించినప్పటికీ ప్రవేశాలు పొందలేకపోయిన 10 మంది విద్యార్థుల పేర్లు ఇవ్వాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
అదో దుర్మార్గమైన చట్టం
- విద్యా హక్కు చట్టంపై సీఎం కేసీఆర్ - ప్రైవేటు స్కూళ్లలో పేద వర్గాలకు 25 శాతం రిజర్వేషన్ ఇస్తే ప్రభుత్వ బడులేం కావాలి? - విద్యాహక్కు చట్టం అమలు చేస్తే 40 వేల మంది ప్రభుత్వ టీచర్లకు పనుండదు - యూపీఏ దుర్మార్గమైన చట్టం చేసి పోయింది - విద్యా విధానం అమలుపై సమగ్ర చర్చ జరగాలి - సభలో దీనికోసం సగం రోజు సమయం కేటాయించాలి - విద్యను మొత్తం ఒకే గొడుగు కిందికి తీసుకురావాలి - ఏప్రిల్ నాటికి ‘ఫీజు’ బకాయిలు ఉండకుండా చూస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: విద్యాహక్కు చట్టం అమలు చేసి, ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం పేద విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తే 40 వేల మంది ప్రభుత్వ టీచర్లకు పనుండదని... యూపీఏ ప్రభుత్వం పోతూపోతూ దుర్మార్గమైన చట్టం చేసి పోయిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం ఎంతమందికి ఉపయోగం, ఏం చేయాలనే దానిపై సమగ్ర చర్చ జరగాలని చెప్పారు. అవసరమైతే అందుకోసం సగం రోజు సభా సమయాన్ని కేటాయించాలని, దీనితో పాటు వైద్యం విషయంలోనూ చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రైవేటు పాఠశాలలు, ఫీజులపై ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానమిచ్చినా... సభ్యులు సంతృప్తి చెందకపోవడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. ‘‘కేంద్రంలో అధికారం మారినప్పుడల్లా విద్యకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రభుత్వం రాగానే వాటిని వదిలేయడం జరుగుతోంది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు మోడల్ స్కూల్లను తీసుకొచ్చి 3వేల మంది టీచర్లను నియమించింది. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని ఎత్తేశారు. దీంతో మోడల్ స్కూళ్ల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల మీద పడింది..’’ అని కేసీఆర్ చెప్పారు. విద్య విషయంలో నెలకొన్న సమస్యలను అందరం కలసి సమూలంగా చర్చించాలని, విద్యాహక్కు చట్టం ఎంత వ రకు ఉపయోగం? ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయానికి రావాలని ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఏం కావాలి.. విద్యా హక్కు చట్టంలో పేర్కొన్నట్లుగా పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఇస్తే ప్రభుత్వ పాఠశాలలు ఏం కావాలని.. దానివల్ల 50 నుంచి 60 శాతం పాఠశాలల మీద ప్రభావం పడుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో 1.50 లక్షల మంది టీచర్లేనని, అందులో 40 వేల మంది టీచర్లకు పని లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. ‘‘ఈ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా ఈ విషయంలో రిక్వెస్ట్ చేశాం. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 9 మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లున్న పరిస్థితి. ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం మందిని చేర్పించి ప్రభుత్వం ఫీజు చెల్లిస్తే ప్రభుత్వ స్కూళ్లకు ఎవరొస్తారు?..’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. కొత్తగా 70 మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని, ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాలు బాగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. సాంకేతిక, వృత్తివిద్య మినహా మిగతా విద్యా విధానాన్ని పూర్తిగా ఒకే గొడుగు కిందికి తీసుకువస్తే బాగుంటుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను మార్చి, ఏప్రిల్‌కల్లా పూర్తిగా చెల్లించాలని ఆర్థిక శాఖకు సూచించినట్లు తెలిపారు. విద్యా విధానంపై సభలో సమగ్ర చర్చ జరగాలన్నారు. సగం రోజు విద్యా విధానంపై, గంట సేపు వైద్యంపై ప్రత్యేక చర్చ నిర్వహించాలని సభాపతి మధుసూదనాచారికి సూచించారు. గుర్తింపు లేని పాఠశాలల అంశంతో పాటు కేంద్రంలో ఉన్న విద్యా సంబంధమైన పథకాలు, వాటి అమలు తీరుపై సభ్యులు చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. -
టెట్ వాయిదా
♦ ‘పరీక్ష’పై కేంద్రం కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిర్ణయం ♦ మరింత ఆలస్యం కానున్న డీఎస్సీ సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మళ్లీ వాయిదా పడింది. ఏప్రిల్ 9న నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జి.కిషన్ సోమవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా టెట్ పరీక్షల కోసం అవలంబిస్తున్న నిబంధనల విశ్లేషణ, పరీక్ష నిర్వహణ విధానం, ఉపాధ్యాయుల ఎంపిక తదితర అంశాలపై అధ్యయనానికి కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ఉపాధ్యాయుల ఎంపికలో ప్రమాణాలు పాటించేందుకు సీబీఎస్ఈతో సహా అన్ని రాష్ట్రాల విద్యాశాఖలు ఇప్పటికే ఏడు సార్లు టెట్ నిర్వహించాయని, అయితే ఈ పరీక్షల్లో పలు సమస్యలు ఉత్పన్నమైనట్లు కేంద్రం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని మానవ వనరుల శాఖ ఆదేశించిందని, కమిటీ నివేదిక అనంతరం రూపొందించే నూతన నిబంధనల మేరకు టెట్ నిర్వహణపై తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరింత ఆలస్యం కానున్న డీఎస్సీ టెట్ వాయిదాపడడంతో ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహించే డీఎస్సీ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చేందుకు మూడు నెలల సమయం ఉంది. ఆ నివేదిక వచ్చాక టెట్ నిర్వహించే అవకాశం ఉంది. టెట్ నిర్వహించకుండా డీఎస్సీ పరీక్షలు జరిగే అవకాశం లేకపోవడంతో ఇప్పట్లో ఉపాధ్యాయుల నియామకం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. -
ప్రైవేటు స్కూళ్లలో 25% ఉచిత సీట్లు!
♦ లక్ష మంది పేద విద్యార్థులకు వర్తింపు ♦ విద్యా హక్కు చట్టానికి ‘టీఎస్ఆర్టీఈ రూల్స్’ పేరుతో కొత్త నిబంధనలు ♦ ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపిన విద్యా శాఖ.. ఒక ట్రెండు రోజుల్లో ఉత్తర్వులు ♦ తొలి ఏడాదే రూ.218 కోట్లు అవసరమని అంచనా..{పాథమిక స్థాయిలో సీసీఈ తప్పనిసరి ♦ ‘పిల్లలు’ నిర్వచనం 6 నుంచి 3 ఏళ్లకు కుదింపు..3 ఏళ్ల వారికి ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ సెంటర్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) అమలుకు విద్యా శాఖ కొత్త నిబంధనలను రూపొందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఉమ్మడి రాష్ట్ర నిబంధనలనే కొనసాగించారు. తాజాగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా, గతంలో పూర్తి వివరణలతో లేని నిబంధనలను సమగ్రపరుస్తూ పలు మార్పుచేర్పులతో తెలంగాణ రాష్ట్ర విద్యా హక్కు చట్టం(టీఎస్ఆర్టీఈ రూల్స్) పేరుతో రాష్ట్రంలో విద్యా హక్కు చట్టానికి కొత్త నిబంధనలను జారీ చేసేందుకు విద్యా శాఖ సర్వం సిద్ధం చేసింది. సంబంధిత ప్రతిపాదనలను గతంలోనే ఆమోదానికి పంపగా ప్రభుత్వం కొన్ని సవరణలు సూచించింది. వాటిని పొందుపరుస్తూ ప్రభుత్వ ఆమోదానికి మళ్లీ ఫైలును పంపించింది. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఒకట్రెండు రోజుల్లో నిబంధనలు వెలువడనున్నాయి. అయితే విద్యాశాఖ పంపిన నిబంధనల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ప్రారంభ తరగతిలో చేరే విద్యార్థుల్లో 25 శాతం మందికి ఉచిత విద్యను అందించాలన్న ప్రతిపాదనలతో ఈ నిబంధనలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ఇటీవల హైకోర్టు ప్రైవేటు స్కూళ్లలోని ప్రారంభ తరగతిలో(1వ తరగతిలో) చేరే విద్యార్థుల్లో 25 శాతం మందికి విద్యా హక్కు ప్రకారం ఉచిత విద్యను అందించాల్సిందేనని స్పష్టం చేయడంతో ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కొత్త నిబంధనల జారీకి సిద్ధమైంది. ఆవాస ప్రాంతంలో కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలల్లోని 25 శాతం సీట్లలో ఉచిత విద్యను అందించేందుకు నోటిఫికేషన్ ద్వారా విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరిస్తుంది. రిజర్వేషన్ల ఆధారంగా పేద పిల్లలను గుర్తించి నిర్ణీత రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. అందుకయ్యే మొత్తాన్ని విద్యాశాఖ పాఠశాల యాజమాన్యానికి రీయింబర్స్ చేస్తుంది. ప్రైవేటు స్కూళ్లలో విద్యా హక్కు చట్టాన్ని లక్ష మంది విద్యార్థులకు విద్యాశాఖ వర్తింప చేయనుంది. ఇందులో ఒక్కో విద్యార్థికి ఏటా రూ. 21 వేల చొప్పున ఖర్చవుతుంది. ఇలా మొత్తంగా తొలి ఏడాదే రూ. 218 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని లెక్కలు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రూల్స్‌లో ఉండనున్న మరిన్ని ప్రధాన అంశాలు.. ► గత నిబంధనల్లో లేని నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని(సీసీఈ) ప్రాథమిక స్థాయిలో తప్పనిసరిగా అమలు చేయాలి. ► ఇప్పటివరకు పిల్లలు అంటే 6 నుంచి 14 ఏళ్ల వయసు వారు. ఏటా సెప్టెంబర్ 1 నాటికి 5 ఏళ్ల వయసు పూర్తయిన వారినే స్కూళ్లలో చేర్చుకుంటున్నారు. కానీ ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విధానం ఉంది. మూడేళ్ల వయసులోనే స్కూల్ కు వెళ్తున్నారు. కాబట్టి పిల్లలు అంటే 3 నుంచి 14 ఏళ్ల వయస్సు వారిగా పేర్కొనాలి. ► చట్టంలోని సెక్షన్-12(1)(సి) ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో ప్రారంభ తరగతిలో(1వ తరగతిలో) చేరే వారిలో 25 శాతం మందికి ఉచిత విద్యను అందించాలి. ► 25 శాతం సీట్లను సామాజికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించాలి. ఇందులో గతం లో లేని వర్గాలను చేర్చింది. గతంలో వికలాంగులు, హెచ్ఐవీ బాధిత పిల్లలు, ఎస్సీ, ఎస్టీ వంటి కేటగిరీలు ఉండగా తెల్ల రేషన్ కార్డు కలిగిన బీసీల పిల్లలను(తండ్రి/గార్డియన్) ప్రతిపాదనల్లో చేర్చినట్లు తెలిసింది. ► ఎకనామిక్ వీకర్ సెక్షన్ కేటగిరీలో మైనారిటీలు, ఓసీల్లో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారిని చేర్చింది. ► 3-5 ఏళ్ల వయస్సు వారికి ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్న నిబంధనను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ► మండల రీసోర్స్ పర్సన్ వ్యవస్థను తొలగించింది. ► పాత నిబంధనల్లో మండల పరిషత్తు అనే పదాన్ని ఎక్కడా చేర్చలేదు. తాజాగా నిబంధనల్లో మండల పరిషత్తులను చేర్చింది. దీంతో స్థానిక సంస్థలకు ప్రాధాన్యం కల్పిస్తోంది. అలాగే జిల్లా పరిషత్తు పదాన్ని చేర్చింది. ► నర్సరీ, ఎల్కేజీ, మాంటిస్సోరీ, అంగన్వాడీ, బాల్వాడి, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్(ఈసీఈ) కేంద్రాలు అన్నింటిని ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్‌గా పరిగణిస్తారు. ► టీచర్ కావాలనుకునే వారు కచ్చితంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో అర్హత సాధించి ఉండాల్సిందే. ► ప్రైవేటు స్కూళ్ల అనుమతుల్లో ఎలిమెంటరీ స్కూల్ అంటే ఎల్కేజీ, యూకేజీ వంటివి కలిపే ఉండాలి. 8వ తరగతి వరకు డీఈవో అనుమతి ఇవ్వాలి. ► ఒక సెక్షన్లో కనీసంగా 20 మంది విద్యార్థులుండాలి. గిరిజన ప్రాంతాల్లో 15 మంది ఉంటే చాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 60 మంది దాటితే మరొక సెక్షన్ ఏర్పాటు చేయాలి. అదే ప్రైవేటు పాఠశాలల్లో 40 మందికి మించకూడదు. ► బడి బయటి పిల్లలను గుర్తించి ముందుగా సమీపంలోని స్కూళ్లలో చేర్చాలి. ఆ తరువాత ప్రత్యేక శిక్షణకు పంపించాలి. ► విద్యార్థులను శిక్షించడం, మానసికంగా వేధించడం నిషేధం. వాటికి పాల్పడిన వారిపై సర్వీసు రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయి. దీనిని తాజాగా నిబంధనల్లో చేర్చుతున్నారు. ► పాఠశాలల వారీగా ఉండాల్సిన స్టాఫ్ ప్యాటర్న్‌ను కూడా నిబంధనల్లో చేర్చుతున్నారు. -
ఆ ఐదుగురూ స్పెషల్
జిల్లాలో కీలక నేత హుకుం పాఠాలు చెప్పకున్నా ఎస్‌వోలుగా నియమించిన విద్యాశాఖ నిర్భీతిగా నిబంధనోల్లంఘన విశాఖపట్నం: ‘ఆ ఐదుగురు టీచర్లు మా వాళ్లు. పాఠాలు చెప్పరు. వారిని కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లుగా నియమించండి. విద్యా హక్కు చట్టం అంటూ రూల్స్ చెప్పొద్దు...అవన్నీ మాకు అనవసరం. ఎస్‌వోలుగా పోస్టింగులు ఇవ్వాల్సిందే’. ఇదీ జిల్లాకు చెందిన ఓ కీలక నేత హుకుం. విద్యాహక్కు చట్టం అమలును పర్యవేక్షించాల్సిన కీలన నేత ఆయనే ఆ చట్టాన్ని అపహాస్యం పాలు చేశారు. విద్యాశాఖలో అప్రతిహాతంగా సాగుతున్న అవినీతిపర్వంలో మరో అంకం ఇది. ఐదుగురు ఉపాధ్యాయులను కేజీబీవీ ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిన్నగా పాఠాశాలకు వెళ్లకుండా కాలం వెళ్లదీస్తున్న ఆ ఐదుగురు ఉపాధ్యాయులు చివరికి అనుకున్నది సాధించారు. ఏం జరిగిందంటే..: 2013వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులనే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు(కేజీబీవీ)లలో ప్రత్యేక అధికారులుగా నియమించేవారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించవద్దని సుప్రీంకోర్టు 2013లో తీర్పునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీ ప్రత్యేక అధికారులుగా ఉన్న ఉపాధ్యాయులను వారివారి పాఠశాలలకు పంపించి వేసింది. బీఈడీ చేసిన అభ్యర్థులను ప్రత్యేక పరీక్ష ద్వారా కాంట్రాక్టు విధానంలో ప్రత్యేక అధికారులుగా నియమించింది. జిల్లాలో కూడా 29మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కేజీబీవీ ప్రత్యేక అధికారులు ఉండేవారు. వారిలో 24మంది ఉపాధ్యాయులుగా చేరిపోయారు. ఐదుగురు మాత్రం ప్రభుత్వ నిర్ణయంతో విభేదించారు. ప్రత్యేక అధికారులుగా కొనసాగించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇది విద్యాహక్కు చట్టానికి విరుద్ధమవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. 2014 ఏప్రిల్‌లో ఓ తీర్పులో విద్యా సంవత్సరం ముగిసిన తరువాత కొత్తగా ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పింది. ఆ ప్రకారం 2014, ఏప్రిల్ 22 తరువాత ఆ ఐదుగురిని ప్రత్యేక అధికారులుగా కొనసాగించడానికి వీల్లేదు. కొత్తవారిని నియమించాలి. కానీ... అలా చేయలేదు. మా వాళ్లనే కొనసాగించండి ఆ ఐదుగురు ఉపాధ్యాయులు తాము పాఠశాలకు వెళ్లి విద్యాబోధన చేసేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఏడాదిన్నరగా ఇటు ప్రత్యేక అధికారులుగా లేరు... మరోవైపు ఉపాధ్యాయులుగా కాకుండా విధులు నిర్వర్తించడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆ ఐదుగురూ కీలక సమీప బంధువును సంప్రదించారు. ‘డీల్’ కుదురడంతో ఆయన కీలక నేత ద్వారా కథ నడిపారు. కీలక నేత హైదరాబాద్‌లోని విద్యాశాఖ ఉన్నతాధికారులకు హుకుం జారీ చేశారు. ఆ ఐదురుగిరినీ ప్రత్యేక అధికారులుగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. అది విద్యాహక్కు చట్టానికి విరద్ధమని చెప్పినా ఆయన వినిపించుకోలేదు.‘ వాళ్లు మా వాళ్లు. ఇప్పుడు పాఠాలు చెప్పరు. ప్రత్యేక అధికారులుగా ఉంటారని చెప్పేశారు. దాంతో వారు కేజీబీఎస్ ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
25% రిజర్వేషన్ల బాధ్యత టీ సర్కారుదే
- నిర్బంధ విద్యా హక్కు చట్టం అమలుకు ఏ చర్యలు తీసుకున్నారు - 25% సీట్లు అందేలా చూసేందుకు యంత్రాంగం ఉండాలి - స్పష్టత ఇవ్వాలని టీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థల్లో బలహీనవర్గాల విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే నిబంధనను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో వివరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ చట్టం వచ్చి ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. పేద కుటుంబాల పిల్లలకు 25 శాతం సీట్లు అందించేందుకు ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 25 శాతం సీట్లు పొందేందుకు అర్హులైన పిల్లల జాబితా ఇవ్వాలని, దానిని పరిశీలించి వారికి ఈ ఏడాది నుంచే ప్రవేశాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేస్తామని పిటిషనర్ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బలహీనవర్గాల విద్యార్థులకు చట్టప్రకారం 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రైవేటు విద్యా సంస్థలను ఆదేశించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ వాలంటరీ అసోసియేషన్(కోవా), మరో రెండు సంస్థలు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిల్‌ను ఇప్పటికే పలుమార్లు విచారించిన హైకోర్టు గురువారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. విద్యా హక్కు చట్టం పూర్తిస్థాయి అమలు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సిఫారసుల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం సీట్ల భర్తీ వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని, ఎందుకంటే ఆ విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ చేయాల్సి ఉంటుందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. కమిటీ ఏర్పాటు చేయాలని చట్టంలో ఎక్కడుందని ప్రశ్నించింది. ఫీజు రీయింబర్స్ చేస్తే విద్యాహక్కు చట్టం లక్ష్యం నెరవేరదని, ఉచితంగానే 25 శాతం సీట్లను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
వామ్మో..జూన్ !
నల్లగొండ : విద్యా వ్యాపారంగా మారింది. ప్రైవేటు పాఠశాలలు పోటాపోటీగా అధిక ఫీజులు వసూలు చేస్తూ హడలెత్తిస్తున్నాయి. ప్రైవేటు దోపిడీ పుణ్యమాని చదువుకునే స్థాయి నుంచి చదువు ‘కొందాం’ అనే పరిస్థితులు దాపురించాయి. ఏటికేడు ప్రైవేటు పాఠశాలలు వేలకొద్ది ఫీజులు పెంచడమే గాక విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. జూన్ నెల వచ్చిందంటేచాలు విద్యార్థుల తల్లిదండ్రులు అమ్మో.. అని భయపడేలా పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా చేతిలో చట్టాలను ఉంచుకుని ప్రయోగించని దుస్థితిలో జిల్లా విద్యాశాఖ ఉంది. వేసవి సెలవులు గురువారంతో ముగుస్తుడడంతో శుక్రవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. కొత్త లక్ష్యాలతో సరికొత్త పాఠ్యపుస్తకాలతో బడిగడప తొక్కాల్సిన విద్యార్థులకు ఫీజుల మోత భారంగా మారనుంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 2,96,570, ప్రైవేటు విద్యార్థులు 2,41,6 89 మంది బడిబాట పట్టనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రధానంగా మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి వసతి కల్పించడంతోపాటు పాఠశాలల తెరవగానే విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఎటొచ్చి ప్రైవేటు యాజమాన్యాలు వసూలు చేసే ఫీజులపై వి ద్యాశాఖ ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో అందినకాడికి దండుకుంటున్నారు. లక్షల ఆదాయానికి కక్కుర్తి పడి అనుమతి లేకుండానే సెక్షన్లు ఏర్పాటు చేసుకుని ఇరుకు గదుల్లో విద్యార్థులను కుక్కుతూ విద్యాబోధన చేస్తున్నారు. ఫీజుల బాదుడు... ప్రైవేటు స్కూళ్లలో కనీస సదుపాయాలు లేకున్నా ప్రకటనలు, పబ్లిసిటీలతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు 1,400 ఉన్నాయి. దీంట్లో హైస్కూల్ స్థాయిలో 539 పాఠశాలలు ఉంటే...వీటికి దీటుగానే ప్రాథమిక పాఠశాలలు 518 ఉన్నాయి. అంటే ప్రాథమిక స్థాయిలోనే విద్యావ్యాపారం జోరుగా సాగుతోందని దీనిని బట్టి చెప్పొచ్చు. కొత్తగా స్థాపించిన స్కూల్ యాజమాన్యాలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. మిర్యాలగూడలో కొత్తగా స్థాపించిన ఓ స్కూల్లో నర్సరీ అడ్మిషన్ ఫీజు నెల రోజుల క్రితం రూ.35వేలు కాగా...ప్రస్తుతం దానిని రూ.50 వేలకు పెంచేశారు. జిల్లా వ్యాప్తంగా ఆయా యాజమాన్యాలు నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు ఏడాదికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నాయి. 8 నుంచి పదో తరగతి వరకు అయితే రూ.20 వేల నుంచి రూ.30వేలు వసూలు చేస్తున్నాయి. పుస్తకాల మోత..యూనిఫాం భారం... ప్రైవేటు పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ప్రభుత్వ సరఫరా చేసే పాఠ్యపుస్తకాలనే బోధించాలని ఆదేశించింది. కానీ జిల్లాకు పన్నెండు లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇప్పటి వరకు కేవలం 5 లక్షల పుస్తకాలు మాత్రమే వచ్చాయి. దీనిన్నే అదనుగా తీసుకుని ప్రైవేటు యాజమాన్యాలు ఏజెన్సీల నుంచి పుస్తకాలు కొనుగోలు చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ కోసం రెండు వేల నుంచి నాలుగు వేల వరకు ఖర్చు వస్తుంది. ఇవిగాక యూనిఫాం, బ్యాగుల కొ నేందుకు మరింత భారవుంతోంది. ఒక్కో యూనిఫాం ధర రూ. 300 నుంచి రూ. 500 వరకు ఉంది. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.... జిల్లాలో అనుమతిలేని విద్యాసంస్థలను గుర్తించి మండల పరిషత్ కార్యాలయాల్లో నోటీస్ బోర్డు మీద ప్రకటించాల్సిన విద్యాశాఖ ఆ దిశగా ఇప్పటివరకు ఎలాంటి కార్యాచరణ ప్రారంభించలేదు. గతేడాది లెక్కల ప్రకారం జిల్లాలో అనుమతి లేని ప్రైవేటు విద్యాస ంస్థలు 30 ఉన్నాయి. జీఓ ఎం.ఎస్న ంబర్: 1, యాక్షన్ (1) 82 ప్రకారం అమనుతి లేకుండా విద్యాసంస్థల ప్రారంభం, ప్రచారం నేరం. ఇలా చేస్తే విద్యాహక్కు చట్టం మేర కు కనీసం ఆరు నెలల జైలు శిక్ష, లక్ష రూపాయాల వరకు జరిమానా విధించాలి. దీంతో పాటు అధిక ఫీజుల నియంత్రణ చట్టం (డీ ఎఫ్ఆర్సీ) మేరకు కొత్తగా స్థాపించబడే స్కూళ్లు లేదా కొనసాగుతున్న పాఠశాలలు వివిధ పేర్లతో అడ్మిషన్లు చేయకూడదు. జీఓనంబర్: 91 ప్రకారం డీఎఫ్ఆర్సీ చట్టం మేరకు జాయింట్ కలెక్టర్, డీఈఓ, జిల్లా అడిట్ అధికారి, జిల్లా పే అండ్ అకౌంట్స్ అధికారుల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఫీజుల నిర్ధారణ జరిగాలి. కానీ ఎక్కడా అమలు కావడం లేదు. ఈ చట్టం ప్రకారం పాఠశాల్లో విద్యార్థి చేరేందుకు దరఖాస్తు ఫీజు రూ.100కు మించరాదు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 కు దాటి ఉండకూడదు. క మిటీ సూచించిన విధంగా రూ.5 వేలకు మించకుండా విద్యార్థులు కాషన్ డిపాజిట్ చెల్లించాలి. కాని విద్యాచట్టాలు ఎక్కడా అమలవుతున్న దాఖలాలు కపించడం లేదు. -
పాఠశాలల నిర్వహణ ఇలా....
ఒంగోలు వన్‌టౌన్: విద్యాహక్కు చట్టం ప్రకారం మారిన పాఠశాలల పని వేళలను దృష్టిలో పెట్టుకొని పాఠశాలల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు సూచిస్తూ ఎస్‌సీఈఆర్‌టి డెరైక్టర్ ఎంఎస్ఎస్ లక్ష్మీవాట్స్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక పాఠశాలలకు: ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.45 గంటల వరకు పని చేయాలి. పాఠశాలల్లో మొదటి గంట ఉదయం 9 గంటలకు, రెండో గంట 9.05కు, పాఠశాల అసెంబ్లీ 9.05 నుంచి 9.15 వరకు నిర్వహించాలి. మొదటి పీరియడ్‌ను 9.15 నుంచి 10 గంటలకు వరకు, రెండో పీరియడ్‌ను 10 నుంచి 10.40 వరకు, అనంతరం 10 నిమిషాలు విరామం ఇవ్వాలి. మూడో పీరియడ్‌ను 10.50 నుంచి 11.30 గంటల వరకు, నాల్గవ పీరియడ్‌ను 11.30 నుంచి 12.10 వరకు నిర్వహించాలి. 12.10 నుంచి 1 గంట వరకు భోజన విరామ సమయం. ఐదో పీరియడ్‌ను 1 గంట నుంచి 1.40 వరకు, ఆరో పీరియడ్‌ను 1.40 నుంచి 2.20 వరకు అనంతరం 10 నిమిషాలు విరామం ఇవ్వాలి. ఏడో పీరియడ్‌ను 2.30 నుంచి 3.10 వరకు, ఎనిమిదో పీరియడ్‌ను 3.10 నుంచి 3.45 గంటల వరకు నిర్వహించాలని ఎస్‌సీఈఆర్‌టి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలకు: ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు పని చేయాలి. పాఠశాలల్లో మొదటి గంట ఉదయం 9 గంటలకు, రెండో గంట 9.05కు, పాఠశాల అసెంబ్లీ 9.05 నుంచి 9.15 వరకు నిర్వహించాలి. మొదటి పీరియడ్‌ను 9.15 నుంచి 10 గంటలకు వరకు, రెండో పీరియడ్‌ను 10 నుంచి 10.40 వరకు, అనంతరం 10 నిమిషాలు విరామం ఇవ్వాలి. మూడో పీరియడ్‌ను 10.50 నుంచి 11.30 గంటల వరకు, నాల్గవ పీరియడ్‌ను 11.30 నుంచి 12.10 వరకు నిర్వహించాలి. 12.10 నుంచి 1 గంట వరకు భోజన విరామ సమయం. ఐదో పీరియడ్‌ను 1 గంట నుంచి 1.40 వరకు, ఆరో పీరియడ్‌ను 1.40 నుంచి 2.20 వరకు అనంతరం 10 నిమిషాలు విరామం ఇవ్వాలి. ఏడో పీరియడ్‌ను 2.30 నుంచి 3.10 వరకు, ఎనిమిదో పీరియడ్‌ను 3.10 నుంచి 3.45 గంటల వరకు, తొమ్మిదో పీరియడ్ 3.45 నుంచి 4.10 వరకు నిర్వహించాలి. ఉన్నత పాఠశాలలకు: ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పని చేయాలి. పాఠశాలల్లో మొదటి గంట ఉదయం 9.30 గంటలకు, రెండో గంట 9.35కు, పాఠశాల అసెంబ్లీ 9.35 నుంచి 9.45 వరకు నిర్వహించాలి. మొదటి పీరియడ్‌ను 9.45 నుంచి 10.30 గంటలకు వరకు, రెండో పీరియడ్‌ను 10.30 నుంచి 11.10 వరకు, మూడో పీరియడ్‌ను 11.10 నుంచి 11.50 గంటల వరకు, అనంతరం 10 నిమిషాలు విరామం, నాల్గవ పీరియడ్‌ను 12 నుంచి 12.35 వరకు నిర్వహించాలి. ఐదో పీరియడ్‌ను 12.35 గంట నుంచి 1.10 వరకు, 1.10 నుంచి 2 గంట వరకు భోజన విరామ సమయం, ఆరో పీరియడ్‌ను 2 నుంచి 2.40 వరకు, ఏడో పీరియడ్‌ను 2.40 నుంచి 3.20 వరకు, అనంతరం 10 నిమిషాలు విరామం, ఎనిమిదో పీరియడ్‌ను 3.30 నుంచి 4.10 గంటల వరకు, తొమ్మిదో పీరియడ్ 4.10 నుంచి 4.45 వరకు నిర్వహించాలి. -
ఈ తిప్పలు తప్పేదెన్నడో?
నేడు ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల (వికలాంగులు) సమస్యలు పరిష్కారం కావడం లేదు. 2009లో అమలులోకి వచ్చిన విద్యా హక్కు చట్టాన్ని అనుసరించి వీరికి సాధారణ తరగతి గదులలో మిగతా విద్యార్థులతోపాటే ప్రత్యేక శిక్షకుల ద్వారా (సమ్మిళిత విద్య) విద్యాబోధన చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ చట్టం అమలుకు నోచుకోలేదు. వైకల్యంతో జన్మించిన తమ పిల్లలకు కనీసం తెలంగాణ రాష్ట్రంలోనైనా పాఠశాల విద్య అందుతుందేమోనని ఎదురు చూసిన తల్లిదండ్రులకు నిరాశే ఎదురవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తోంది. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య తన డ్రీమ్ ప్రాజెక్టు అంటూ పలు మార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అందుకు ప్రణాళిక సైతం రూపొందిం చుకొని ముందుకు సాగుతున్నారు. కా నీ అవే ప్రభుత్వ పాఠశాలలలో నిరాద రణకు గురవుతున్న తమ పిల్లల గురిం చి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఐదేళ్లవుతున్నా ప్రచార ఆర్భాటమే విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చి ఐదేళ్లవుతున్నా అందరికీ విద్య అనే నినాదం ప్రచార ఆర్భాటాలకే పరిమితమవుతోంది. వైకల్య పిల్లలకు విద్యనందించడానికి అంకిత భావంతో స్పెషల్ ఎడ్యూకేషన్ చదివినవారు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. దైనందిన కార్యక్రమాలు చేసుకోవడంలో ఇబ్బం దులు ఎదుర్కొనేవారిని వికలాంగులు గా (ప్రత్యేక అవసరాలు గలవారిగా) గుర్తిస్తారు. 2014-15 విద్యా సంవత్సరంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, సర్వశిక్షా అభియాన్ సంయుక్తంగా ఇంటింటి సర్వే నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలలో 1.50 లక్షలకు పైగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్న ట్లు గుర్తించారు. వారిలో సుమారు 69 వేల మంది విద్యార్థులు పాఠశాలలలో ఉంటే మిగతావారు పాఠశాలల బయ ట ఉన్నట్లు తేలింది. సాధారణ పాఠ శాలలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఎలా బోధించాలో అక్కడి ఉపాధ్యాయులకు తెలియదు. దీంతో చాలా మంది పిల్లలు బడి మానేస్తున్నారని నిర్ధారించారు. వైకల్య బాలలకు ప్రత్యేక విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయు లు మాత్రమే బోధించడానికి అర్హులని గతంలో భారత పునరావాస మండలి తీర్మానించింది. కేవలం ఏడు పాఠశాలలే వాస్తవాలు మాత్రం పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 1.50 లక్షల మం ది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కేవలం ఏడు పాఠశాలలనే ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో బధిరులకు మిర్యాలగూడ, కరీంనగర్, హైదరాబాద్‌లో నాలుగు పాఠశాలలు ఉన్నాయి. అంధులకు మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్లో కలిపి మూడు పాఠశాలలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలలు ఎక్కడా అందుబాటులో లేవు. ఏటా ఉద్యోగ నియామకాలలో మూడు శాతం రిజర్వేషన్‌ను వికలాంగుల కోసం కేటాయిస్తుంటారు. చదువుకోవడానికి విద్యా సంస్థలే అందుబాటులో లేని పరిస్థితులలో వారు ఉద్యోగం పొం దే స్థాయికి ఎప్పుడు వెళ్తారో ప్రభుత్వాలే ఆలోచించాలి. జిల్లాలో 8,603 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. ప్రతీ ఐదుగురు ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఒక ప్ర త్యేక ఉపాధ్యాయుడు అవసరం ఉండగా, సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో కేవలం 42 మందిని కాంట్రాక్టు రిసోర్స్పర్సన్లను నియమించి బోధన అందిస్తున్నారు. మోక్షం లేని ప్రత్యేక పాఠశాలలు సాధారణ విద్యార్థుల కోసం కిలోమీటర్‌కు ఒక ప్రాథమిక పాఠశాల అన్న ప్రభుత్వం నిర్ణయం హర్షించదగ్గదే. అయితే, అడుగు తీసి అడుగు వేయలేని ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య కోసం కనీసం ప్రతీ వంద కిలో మీ టర్లకు ఒక ప్రత్యేక పాఠశాలనైనా ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుం చి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికి ఉచిత నిర్బంధ విద్యను ప్రభుత్వం అందజేయాల్సి ఉంటుంది. ప్రత్యే క అవసరాలు గల పిల్లలకు బోధించడానికి జిల్లావ్యాప్తంగా ఒక్క రెగ్యులర్ ఉపాధ్యాయుడు కూడా లేడు. ఒక్క ప్ర భుత్వ ప్రత్యేక పాఠశాల లేదు. దీంతో ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రుల సంఘం ఆధర్వం లో గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు. అది విచారణలో ఉంది. ఇప్పటికైనా ఈ పిల్లలకు, తల్లిదండ్రు లకు న్యాయం చేకూరుతుందా! -
పంతుళ్లకూ పరీక్షలే!
దోమ: ప్రభుత్వ ఉపాధ్యాయుల పనితీరును మెరుగుపరిచి తద్వారా విద్యా ప్రమాణాల్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఓ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పరీక్షల ద్వారా కేవలం విద్యార్థుల ప్రగతిని మాత్రమే అంచనా వేసి దానికి తగినట్లుగా బోధనాభ్యసన వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేసేవారు. ఇకమీదట ఉపాధ్యాయుల పనితీరును కూడా పరిగణనలోకి తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. విద్యార్థులు సాధించిన ప్రగతిని కొలమానంగా తీసుకొని ఉపాధ్యాయులకు రేటింగ్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యా సంవత్సరంలో నాలుగుసార్లు విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేస్తారు. తమ పనితీరును తామే బేరీజు వేసుకుని సంబంధిత ఉపాధ్యాయులే నిజాయతీగా నివేదికలు ఇచ్చేలా అధికారులు నిబంధనలు రూపొందించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే పాఠశాలలకు సైతం చేరవేశారు. వాటిని నింపడంపై ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ‘విద్యాహక్కు’ నిబంధనలకనుగుణంగా.. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 24, 29లలో పొందుపరిచిన అంశాల ఆధారంగా విద్యార్థుల గ్రేడింగ్‌లతో పాటు ఉపాధ్యాయుల పనితీరు ఎలా ఉందనే విషయాన్ని పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. అభ్యసన అనుభవం, ప్రణాళిక రూపకల్పన, పాఠ్యాంశాల వారీగా విద్యార్థులు సాధించిన ప్రగతి, అవగాహన స్థాయి, అభ్యసనకు అవలంబిస్తున్న విధానాలు, విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులు, హెచ్ఎం, ఎస్ఎంసీ కమిటీ సభ్యులతో మమేకమైన తీరు, వృత్తిపర అభివృద్ధి, పాఠశాల అభివృద్దికి చేసిన కృషి, పాఠశాల హాజరు తదితర అన్ని రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేయడానికి చర్యలు చేపట్టారు. మొత్తం 7 విభాగాల్లో 54 అంశాల వారీగా ఉపాధ్యాయుల పనితీరును లెక్కించనున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు తమకు తామే పనితీరును అంచనా వేసుకునే విధంగా.. 1. నిర్దేశించిన అంశాల్లో లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాను... 2. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఉన్నాను... 3. లక్ష్యాన్ని చేరుకున్నాను... 4. లక్ష్యాన్ని దాటి ముందుకు వెళ్లాను. అనే ఆప్షన్లను ఇచ్చారు. వీటి ఆధారంగా సమర్పించే నివేదికను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ, డిప్యూటీ డీఈఓలు పరిశీలించి ఉపాధ్యాయుడి పనితీరును అంచనా వేస్తారు. ఆన్లైన్లో వివరాల నమోదు.. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సమర్పించే నివేదికల సారాంశాన్ని అంతా ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పొందుపరుస్తారు. దీని ఆధారంగా పాఠశాల పర్యవేక్షణ పత్రంలో పార్ట్ ఎ, పార్ట్ బి, పార్ట్ సీలలో నమోదైన మొత్తం వివరాలను డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (డీఎస్ఈ) వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తారు. ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఏ పాఠశాలలో విద్యార్థులు ఏయే విషయాల్లో వెనుకబడి ఉన్నారు, కనీసం అభ్యసనా స్థాయిని చేరుకోలేని వారెందరు అనే విషయాలను తెలుసుకునే వీలుంటుందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు వారు తెలిపారు. -
విద్యార్థుల భవితను నిర్దేశించే.. స్కూల్ టీచర్!
నేటి బాలలైన రేపటి పౌరుల భవిష్యత్తును, తద్వారా దేశ గమనాన్ని నిర్ణయించేది ఉపాధ్యాయులే. ఉత్తమ గురువులే ఉత్తమమైన పౌరులను సమాజానికి అందిస్తారు. దేశ ప్రగతిలో విద్య పాత్ర ఎనలేనిది. విద్యార్థులకు విలువలతో కూడిన విద్య నేర్పి, సుశిక్షితులైన మానవ వనరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది. గురు సాక్షాత్ పరబ్రహ్మ అని తరతరాలుగా నమ్ముతున్న మనదేశంలో టీచర్లకు గౌరవ మర్యాదలకు, అవకాశాలకు, ఆదాయానికి లోటు లేదు. వృత్తిపరమైన ఆత్మసంతృప్తి పొందడానికి ఆస్కారం ఉన్న ఈ రంగంలోకి అడుగుపెట్టేందుకు నేటి యువత ఆసక్తి చూపుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అవకాశాలు పాఠశాల ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడంతో టీచర్లకు డిమాండ్ పెరిగింది. దేశంలో లక్షలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వాలు టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుడుతున్నాయి. కొత్త ఉద్యోగాలను మంజూరు చేస్తున్నాయి. దీంతో డీఈడీ, బీఈడీ వంటి కోర్సులను పూర్తిచేసిన వారికి అవకాశాలు తలుపు తడుతున్నాయి. విద్యారంగం ప్రైవేట్ పరంగా ఎంతో అభివృద్ధి చెందింది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అంతటా ప్రైవేట్ స్కూల్స్ వెలుస్తున్నాయి. పట్టణాల్లోనూ పేరొందిన కార్పొరేట్ పాఠశాలలు భారీ స్థాయిలో ఏర్పాటవుతున్నాయి. నైపుణ్యాలు కలిగిన ఉపాధ్యాయులకు వీటిలో మంచి గిరాకీ ఉంది. ఇటీవలి కాలంలో టీచర్లకు వేతనాలు భారీగా పెరిగాయి. ఇతర రంగాలతో సమానంగా వేతనాలు అందుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో డీఈడీ, బీఈడీ కోర్సుల్లో చేరేవారి సంఖ్య అధికమవుతోంది. బోధనా రంగంలో కొలువులకు కొరత లేకపోవడం యువత దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఉపాధ్యాయ కోర్సులను చదివినవారు సొంతంగా పాఠశాలను స్థాపించుకోవచ్చు. మరికొందరికి ఉపాధి కల్పించవచ్చు. టీచర్లు.. నిత్య విద్యార్థులు టీచర్‌గా వృత్తిలో రాణించాలంటే.. ప్రధానంగా సబ్జెక్ట్ పరిజ్ఞానం ఉండాలి. ఉపాధ్యాయులు అంటే బోధించేవారే కాదు.. నిత్య విద్యార్థులు కూడా. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి. విద్యార్థులందరినీ సమదృష్టితో చూసే పక్షపాత రహిత ధోరణి అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. విద్యార్థులకు ఆదర్శప్రాయులుగా మారి, వారి ఉన్నతికి తోడ్పాటునందించాలి. అర్హతలు ఇంటర్మీయెట్, గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టేందుకు అవకాశం ఉంది. ఇంటర్ అర్హతతో ప్రవేశ పరీక్ష రాసి, డీఈడీ కోర్సు పూర్తిచేసిన వారు ప్రాథమిక తరగతులకు బోధించవచ్చు. ఇక గ్రాడ్యుయేషన్ తర్వాత ప్రవేశ పరీక్ష రాసి, బీఈడీ కోర్సు చదివినవారు పదో తరగతి వరకు పాఠాలు చెప్పొచ్చు. వేతనాలు ఉపాధ్యాయులకు ప్రారంభంలో నెలకు రూ.15 వేల వేతనం అందుతుంది. సీనియారిటీని బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. కార్పొరేట్ పాఠశాలల్లో అధిక వేతనాలు ఉంటాయి. ప్రభుత్వ రంగంలోనూ ఆకర్షణీయమైన జీతం, ఇతర భత్యాలు పొందొచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు * ఉస్మానియా విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.osmania.ac.in * ఇగ్నో-హైదరాబాద్ వెబ్సైట్: http://rchyderabad.ignou.ac.in/ * ఆంధ్ర మహిళా సభ వెబ్సైట్: http://andhramahilasabha.org.in/ * మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వెబ్సైట్: www.manuu.ac.in * ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.nagarjunauniversity.ac.in బోధనను నిరంతరం మెరుగుపర్చుకోవాలి! శ్రీఇంజనీర్, డాక్టర్, లాయర్, సైంటిస్ట్... ఎవరైనా ఉపాధ్యాయుడి శిక్షణ నుంచి వచ్చినవారే. గురువు లేకుండా ఎంతటి వారైనా గొప్పవారు కాలేరు. తెల్లకాగితం లాంటి విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దేది గురువే. అంతటి బాధ్యతాయుతమైనది ఉపాధ్యాయ వృత్తి. దానికితోడు సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తోంది. ఇంజనీరింగ్, మెడికల్‌కు ధీటుగా టీచింగ్ కెరీర్లో సంతృప్తి లభిస్తుంది. ఈ వృత్తిపై మక్కువ చూపే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో లక్షల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. జాబ్ సులువుగా ఉంటుందనో, సెలవులు ఎక్కువగా లభిస్తాయని భావించొద్దు. ఉపాధ్యాయులు సరికొత్త శాస్త్రీయ విధానాలతో బోధనను నిరంతరం మెరుగుపర్చుకోవాలి. టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. క్లాస్‌రూం మేనేజ్మెంట్, కంటెంట్ డెవలప్మెంట్ తదితర అంశాల్లో అధ్యయనం చేస్తుండాలి. ఉపాధ్యాయ వృత్తిని కేవలం జాబ్‌లా కాకుండా ఒక మిషన్లా భావించాల్ణి - సీతామూర్తి, ప్రిన్సిపల్ సిల్వర్ ఓక్స్- ది స్కూల్ ఆఫ్ హైదరాబాద్ -
రుణమాఫీ జాప్యాన్ని సహించం
కడప సెవెన్‌రోడ్స్: రైతులు, డ్వాక్రా సంఘాల రుణ మాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని సహించబోమని, సెప్టెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రుణ మాఫీ చేస్తామని ప్రజల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రుణమాఫీకి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా రైతులకు రూ. 1.50 లక్షలు, డ్వాక్రాసంఘాలకు రూ. లక్ష మాఫీ చేసి మళ్లీ కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, జీఓ నెం. 174 ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ ఒక్క బ్యాంకులో కూడా ఇంతవరకు రుణాలు మాఫీ కాలేదన్నారు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేసి రుణాలు ఇప్పించాలని కోరారు. మాఫీ వర్తించని కౌలు రైతులకు ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున ఇవ్వాలన్నారు. డ్వాక్రాసంఘాలపై ఒత్తిడి చేస్తే బ్యాంకుల వద్ద ఆందోళనలు చేపడతామన్నారు. డ్వాక్రా సంఘాలు కోరకుండానే మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఒక్కో గ్రూపునకు రూ. లక్ష రివాల్వింగ్ ఫండ్‌గా ఇస్తామనడం సమంజసం కాదన్నారు. ఎన్నికల హామీ మేరకు మాఫీ చేయాలన్నారు. ప్రతి జిల్లా అభివృద్ధికి ఎన్నో వరాలు ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి కడప పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రుణ మాఫీ చేస్తామంటేనే రైతులు నమ్మి టీడీపీకి ఓట్లు వేశారన్నారు. ఇప్పుడు రాష్ర్ట ఆర్థిక పరిస్థితి బాగా లేదని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఓవైపు రుణాలు చెల్లించాలంటూ రైతులపై బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయన్నారు. యుద్ధ ప్రాతిపదికన రుణ మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలో 884 అడుగులకు నీటిమట్టం చేరినప్పటికీ జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయకపోవడం అన్యాయమన్నారు. కేంద్రం రాష్ట్రానికి 11 జాతీయ సంస్థలను మంజూరుచేసినా జిల్లాకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి జి.చంద్ర, నాయకులు కేసీ బాదుల్లా, టి.రామసుబ్బారెడ్డి, కృష్ణమూర్తి, జి.వేణుగోపాల్, నాగసుబ్బారెడ్డి, డబ్ల్యు రాము, బోగాది శెట్టి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
బల్లకట్టు చదువులు
బల్లకట్టుపై ప్రయాణం...ఒకే గదిలో ఐదు తరగతులకు విద్యా బోధన...అరకొర వసతులు..ఇవీ సంగం జాగర్లమూడి ఎస్టీ కాలనీ మండల పరిషత్ పాఠశాల విద్యార్థుల కష్టాలు... ఎన్ని చట్టాలు చేసినా..ఎందరు పాలకులు మారినా వీరి కష్టాలు మాత్రం తొలగిపోవటం లేదు. ►బడికి పోవాలంటే కాలువ దాటాల్సిందే ►ఐదు తరగతులకు ఓకే ఒక్క గది ►ఇవీ సంగం జాగర్లమూడి ఎస్టీ కాలనీ విద్యార్థుల కష్టాలు తెనాలి మారీసుపేట : ►తెనాలి మండలం సంగం జాగర్లమూడిలోని కాలువ కట్టపై మూడు దశాబ్దాలుగా దాదాపు 70 ఎస్టీ కుటుంబాలు జీవిస్తున్నాయి. ►ప్రభుత్వం వీరికి ఆసరా చూపించనప్పటికీ,అక్కడి చిన్నారుల కోసం 2001 లో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది. ►అప్పటి నుంచి పాఠశాలకు రావాలంటే బల్లకట్టుపై కొమ్మమూరు కాలువ దాటాల్సిందే. నిత్యం విద్యార్థులు సంగమేశ్వర స్వామి దేవస్థానం రోడ్డు నుంచి బల్లకట్టు ఎక్కి ఇవతల ఒడ్డుకు చేరుకుంటున్నారు. ►బల్లకట్టుతో ఇబ్బంది వస్తే మరో నాలుగు కిలోమీ టర్లు చుట్టు తిరిగి గరువుపాలెం మీదుగా పాఠశాలకు చేరుకోవాలి. ►ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకూ ఈ పరిస్థితి ప్రాణసంకటంగానే ఉంది. ►పూరిపాకలో ఏర్పాటు చేసిన పాఠశాలలో రికార్డు లకు భద్రత లేకపోవటంతో తెనాలి-వైకుంఠపురం రోటరీ క్లబ్ ప్రతినిధులు 2013లో స్పందించి రేకులతో ఓ గదిని నిర్మించారు. ►ఈ ఒక్క గదిలోనే 1 నుంచి 5 వరకు చదివే చిన్నారులకు విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి. ►గతంలో ఈ పాఠశాలకు గ్రామంలోనే స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపడతామని అధికారులు చేసిన ప్రకటన ప్రకటనగానే మిగిలిపోయింది. ►పాఠశాలలో మొత్తం 33 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకటి నుంచి ఐదు తరగతులకు ఇద్దరే ఉపాధ్యాయులు. ►విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలలో మరుగు దొడ్లు, రక్షిత మంచినీరు, గాలి, వెలుతురు ఉండేలా చూడాలి. ►విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు లేకుండా వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. ►విద్యాశాఖ వద్ద నిధులున్నా ఇక్కడి విద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించటం లేదనే విమర్శలు వున్నాయి. ► గతంలో దాతల సహకారంతో నిర్మించిన ఒకే ఒక మరుగుదొడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయుల అవసరాలు తీరుస్తోంది. ►ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు స్పందించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. -
హవ్వ.. ఇదేం దుస్థితి!
సర్కార్ బడుల్లో మరుగుదొడ్ల ఏర్పాటు కలేనా? - ఎవ్వరికీ పట్టని విద్యార్థినుల గోస - సుప్రీంకోర్టు హెచ్చరించినా ఫలితం శూన్యం - ఆర్వీఎం, ఆర్డబ్ల్యూఎస్ మధ్య సమన్వయ లోపం - ముందుకు సాగని పనులు.. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని విద్యాహక్కు చట్టం చెప్తున్నా.. అవసరాలకు అనుగుణంగా మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా.. పాఠశాలల దుస్థితి మారడం లేదు. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం వంటి కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర సమయాల్లో.. పాఠశాల నుంచి దూరంగా వెళ్లలేక.. ఎవరికీ చెప్పుకోలేక బాలికలు లోలోపలే కుంగిపోతున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో నిర్మించిన టాయిలెట్స్‌కు నిర్వహణ లేక, శుభ్రపరిచేందుకు సిబ్బంది, నిధులు, నీటి వసతులు లేక కంపుకొడుతున్నాయి. ఫలితంగా నిర్మించిన మూణ్నాళ్లకే నిరుపయోగంగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించినా.. విద్యాశాఖ(రాజీవ్ విద్యామిషన్), ఆర్డబ్ల్యూఎస్ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో పనులు ముందుకు సాగడంలేదు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండాలి. ఈ లెక్కన 138 ప్రభుత్వ పాఠశాలల్లో 1,230 మరుగుదొడ్లు అవసరమని అధికారులు తేల్చి చెప్పారు. కాగా విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో వసతులు లేవని ఆరోపిస్తూ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు తక్షణమే అవసరాలకు అనుగుణంగా మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పించాలని ఆదేశించడంతో విద్యాశాఖ అధికారుల్లో చలనం వచ్చింది. ప్రతి పాఠశాలలో బాలురకు, బాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలి. ప్రతి 40 మంది బాలికలకు ఒకటి, ప్రతి 80 మంది బాలురకు ఒకటి చొప్పున మరుగుదొడ్లు ఉండాలని కోర్టు సూచించింది. దీంతో జిల్లా అధికారులు కసరత్తు చేశారు. ఇప్పటివరకు 138 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని, 70 పాఠశాలల్లో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని నిర్ధారించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 238 మరుగుదొడ్లు లేవని అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు అత్యవసర సమయాల్లో పాఠశాల నుంచి దూరంగా వెళ్లాల్సి వస్తోందని, విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో 240 పాఠశాలలకు తాగునీటి సౌకర్యం లేదు. కాగా విద్యార్థులు తాగడానికే నీరు లేకపోవడంతో ఉన్న టాయిలెట్స్‌ను శుభ్రం చేసే పరిస్థితి లేక కంపు కొడుతున్నాయి. సమన్వయ లోపంతోనే జాప్యం జిల్లాలో పలు పాఠశాలకు టాయిలెట్స్ మంజూరు కాకపోగా మంజూరైనవాటిని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సకాలంలో పూర్తి చేయడంలేదు. ఆర్వీఎం, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో పనులు ముందుకు సాగడంలేదని విమర్శలు వినవస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిధులు మంజూరు చేశారు. వీటితో మరుగుదొడ్లు, తాగునీటి వసతుల యూనిట్లు నిర్మించాలని ఈ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు అప్పగించారు. ఈ పనులు అప్పగించి 15 నెలలు కావస్తున్నా నేటికి 450 మరుగుదొడ్లు, 400 తాగునీటి యూనిట్లు మాత్రమే పూర్తిచేశారు. మిగిలిన పనులు నిలిచిపోయాయి. -
25 నుంచి ‘బడి పిలుస్తోంది’ : కలెక్టర్
విజయవాడ: జిల్లాలో 25వ తేదీ నుంచి ‘బడి పిలుస్తోంది’ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించాలని కల్టెక్టర్ ఎం. రఘునందన్‌రావు విద్యాశాఖాధికారులను ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 25వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు ‘బడి పిలుస్తోంది’ లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లాలో ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులతో కలెక్టర్ బుధవారం నగరంలో తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రధానంగా బడి బయట పిల్లలను తప్పనిసరిగా బడిలో చేర్పించాలన్నారు. 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలను తప్పనిసరిగా బడిలోచేర్చాలని 2009 విద్యాహక్కు చట్టం నిర్దేశించిందన్నారు. ఇప్పటికే నమోదై బడిమానేసిన వారిని గుర్తించి తిరిగి వారిని బడిలో చేర్పించాలన్నారు. జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జిల్లాలో ప్రజాప్రతినిధులుతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు కమిటీలో ఉంటారని చెప్పారు. ముఖ్యంగా ఎస్.సి., ఎస్.టి. బలహీన వర్గాలు ఎక్కువగా నివశించే కాలనీల్లో ఈ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డి. దేవానందరెడ్డి మాట్లాడుతూ 25వ తేదీన జిల్లా మంత్రివర్యులు కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. ఆగస్టు1న 10వ తరగతి వరకు విద్య కొసాగిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ణ చేయించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఐ.కె.పి. అర్బన్ పి.డి.హిమబిందు, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డెరైక్టర్ డి.పుష్పమణి పాల్గొన్నారు. -
ఎలా ‘నోట్’ చేసుకోవాలి
మోర్తాడ్ : విద్యాహక్కు చట్టం అభాసుపాలవుతోంది. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సామగ్రి (పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బ్యాగులు, చెప్పులు, యూనిఫాం)ని ప్రభుత్వమే సరఫరా చేయాలి. కేవలం యూని ఫాంలు, పాఠ్య పుస్తకాలతోనే సరిపెడుతున్నారు. జిల్లాలో 1,573 ప్రాథమిక, 265 ప్రాథమికోన్నత, 461 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 41 ఎయిడెడ్ , 30 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 2.40 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలు పాఠశాలలు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు విద్యా సామగ్రిని ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వాల్సి ఉంది. కానీ యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలను మాత్రమే సరఫరా చేసింది. ముందుగా టెండర్లను నిర్వహించి సామగ్రిని ప్రభుత్వం సేకరించకపోవడంతో నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బ్యాగులు, చెప్పులు విద్యార్థులకు సరఫరా కాలేదు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వమే తనకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో విద్యార్థులకు న్యాయం జరగడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో ఎక్కువ మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే ఉంటారు. వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో విద్యా సామగ్రి కొనుగోలు వారికి తలకు మించిన భారంగా మారిం ది. విద్యా సామగ్రి ధరలు మార్కెట్లో భారీ గానే పెరిగాయి. పెరిగిన ధరలకు అనుగుణం గా విద్యార్థుల కుటుంబాల ఆదాయం పెరగలేదు. దీంతో ప్రభుత్వంపై వారు ఆధారపడి ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని కొనుగోలు చేసి ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలి విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం విద్యా సామగ్రిని కొనుగోలు చేసి ఇవ్వాలి. ప్రభుత్వం చట్టాన్ని పాటించక పోతే ఎలా. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని విద్యాహక్కు చట్టంలో విద్యా సామగ్రిని ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం చట్టం ప్రకారం పని చేయాలి.- సత్యానంద్, బీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు -
కొత్త బడి గంటలు
- ఉదయం 9 గంటలకే తరగతులు ప్రారంభం - అమలు కావల్సింది రాష్ట్ర పరిధి పాఠశాలల్లోనే.. మంచిర్యాల సిటీ : కేంద్ర ప్రభుత్వం 2009లో అమలు చేసిన విద్యాహక్కు చట్ట ప్రకారం బడిగంటలు మారనున్నాయి. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పనివేళలు ఒక్కో రకంగా ఉన్నాయి. కొత్తగా అన్నిపాఠశాలలు ఒకే సమయానికి ప్రారంభమై ఒకే సమయానికి విద్యార్థులను విడుదల చేయాలనే నిబంధనలు రాబోతున్నాయి. ఉదయం 9 గంటలకే తరగతులు ప్రారంభించి సాయంత్రం 4.30 గంటలకు విద్యార్థులను విద్యాహక్కు చట్టం ప్రకారం విడుదల చేయాలి. ఈ సవృయాన్ని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని కేంద్రీయ విద్యాలయం, నవోదయ, ఆదర్శ, సాంఘీక సంక్షేమ, గురుకుల పాఠశాలలతోపాటృ ప్రైవేటు పాఠశాలలు అమలు చేస్తున్నాయి. కేవలం రాష్ట్రప్రభుత్వం పరిధిలోని మండల, జిల్లా పరిషత్ పాఠశాలలు అమలు చేయడం లేదు. తరగతుల నిర్వహణ సమయాల్లో మార్పులు జరగాల్సి ఉన్నప్పటికీ నేటికి విద్యాహక్కు నిబంధనలు అమలు కావడం లేదు. బడి వేళలను మార్చాల్సిందే అంటూ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తుండగా, మరికొన్ని సమర్థిస్తున్నాయి. బోధన ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు తరగతులు బోధించడానికి రోజుకు ఏడున్నర గంటల చొప్పున వారానికి 45 గంటల సమయాన్ని కేటాయించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించడానికి ఏడాదికి 800 గంటలు, ఉన్నత పాఠశాలల్లో ఒక 1000 గంటలు కేటాయించాలని చట్టం చెబుతోంది. ఇబ్బందులు కొత్త సమయసారిణి అమలు అయితే విద్యార్థులకు మేలు జరుగుతుంది. కొత్త బడిగంటల ప్రకారం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఏడున్నర గంటలు పనిచేయనున్నాయి. ఉపాధ్యాయులు సమయాన్ని పాటించినచో విద్యార్థులకు మేలు చేసినవారవుతారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉండాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేసినపుడే కొత్త బడి గంటలకు న్యాయం జరుగుతుంది. ప్రధానంగా రవాణా సౌకర్యాలు మెరుగుపర్చాలి. అన్ని రూట్లకు బస్ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వం అనుకున్నట్లు లక్ష్యం నెరవేరుతుంది. కొన్ని రూట్లలో కార్పొరేట్ పాఠశాలు బస్ సౌకర్యం కల్పిస్తున్నాయి. రహదారులు మెరుగ్గా ఉన్న ప్రాంతాలకు కనీసం ఆర్టీసీ బస్ వేయిస్తే సులువవుతుంది. -
సర్దు‘పోటు’
కర్నూలు(విద్య): రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది డీఎస్సీ నిర్వహించకుండా విద్యా సంవత్సరం గట్టెక్కించేందుకు అడ్డదారులు వెతుకుతోంది. విద్యా హక్కు చట్టం లెక్కల ప్రకారం ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు మించి పని చేస్తున్న ఉపాధ్యాయులను అవసరమైన చోట సర్దుబాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఎక్కువ, తక్కువ ఉపాధ్యాయులు కలిగిన పాఠశాలల వివరాలను విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం, ఆర్జేడీ కార్యాలయం, డీఈవో కార్యాలయాల నుంచి ఆయా మండల విద్యాధికారులకు జాబితా అందింది. నిబంధనల మేరకు 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అవసరం. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 1ః30 నిష్పత్తిలో అధికారులు తక్కువ, ఎక్కుక ఉపాధ్యాయుల సంఖ్యను తేల్చారు. ఫలితంగా జిల్లాలో 1500 మంది పైగా ఉపాధ్యాయులు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. ప్రధానంగా కర్నూలు, నంద్యాల, ఆదోని తదితర నగరం, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో అవసరానికి మించి ఉపాధ్యాయులు పని చేస్తున్నట్లు గుర్తించారు. ఇదే సమయంలో కౌతాళం, కోసిగి, మంత్రాలయం, హాలహర్వి, ఆలూరు, ఆస్పరి తదితర మండలాల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రతరంగా ఉంది. ప్రధానంగా హైస్కూళ్లలో ఉపాధ్యాయుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖాధికారి కె.నాగేశ్వరరావు ఈనెల 24న డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలతో సమావేశం ఏర్పాటు చేశారు. కాగా ఎంఈవోలకు పంపిన జాబితాపై డీఈఓ స్పందిస్తూ ఆర్జేడీ కార్యాలయంలో అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని.. వాస్తవ పరిస్థితిని ఆర్జేడీకి తెలియజేశామన్నారు. ఇదిలాఉండగా రేషనలైజేషన్‌కు సంబంధించి రాష్ట్ర ఉన్నతాధికారులు అనుసరిస్తున్న విధానంపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఖాళీలు భర్తీ చేయకుండా తప్పించుకునేందుకు సర్దుబాటు ప్రక్రియకు ప్రభుత్వం తెర తీయడం సమంజసం కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఉపాధ్యాయులు తక్కువ, ఎక్కువ ఉన్న పాఠశాలల్లో కొన్ని... ఉపాధ్యాయులు ఎక్కువున్న పాఠశాలలు 1. కర్నూలు నగరం కుమ్మరివీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 72 మంది విద్యార్థులుండగా ఆరుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారు. 2. కర్నూలు నగరం వడ్డేపేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 123 మంది విద్యార్థులకు గాను ఏడుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ముగ్గురు ఉపాధ్యాయలు అదనంగా ఉన్నారు. 3. కర్నూలు నగరం ఎర్రబురుజులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 15 మంది విద్యార్థులుండగా ఆరుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 4. కర్నూలు నగరం పెద్దమార్కెట్ వద్దనున్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 22 మంది విద్యార్థులకు గాను నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 5. కర్నూలు నగరం బండిమెట్ట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 107 మంది విద్యార్థులకు 8 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నలుగురు ఉపాధ్యాయలు అదనంగా ఉన్నారు. 6. కర్నూలు నగరం గడ్డవీధిలో ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 44 మంది విద్యార్థులకు గాను నలుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఒక్క టీచరే చాలని అధికారులు భావిస్తున్నారు. 7. కర్నూలు నగరం కుమ్మరి వీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 43 మంది విద్యార్థులకు గాను 8 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇక్కడ అదనంగా ఏడుగురు ఉపాధ్యాయులున్నట్లు తేల్చారు. 8. కర్నూలు నగరం బుధవారపేటలోని 17వ వార్డు మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో 100 మంది విద్యార్థులకు గాను 8 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఐదుగురు అదనంగా ఉన్నారు. ఉపాధ్యాయులు తక్కువున్న పాఠశాలలు 1. కౌతాళం మండలం గోతులదొడ్డి ఎంపీపీ స్కూల్లో 285 విద్యార్థులుండగా ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. మరో 8 మంది టీచర్లు అవసరం. 2. కౌతాళం మండలం కామవరం ఎంపీపీ స్కూల్లో 354 మంది విద్యార్థులుండగా ఐదుగురు టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారు. మరో ఏడుగురు అవసరం. 3. కౌతాళం మండలం చిత్రపల్లి ఎంపీపీ స్కూల్లో 212 మంది విద్యార్థులుండగా ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. ఐదుగురు ఉపాధ్యాయులు కావాల్సి ఉంది. 4. కౌతాళం ఎంపీపీ స్కూల్(ఎస్‌డబ్ల్యు)లో 354 మంది విద్యార్థులుండగా ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు. మరో ఏడుగురు అవసరం. 5. కోసిగి మండలం అగసనూరులోని ఎంపీపీ స్కూల్లో 214 మంది విద్యార్థులుండగా ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. ఐదుగురిని నియమించాల్సి ఉంది. 6. కోసిగి మండలం కామనదొడ్డి ఎంపీపీ స్కూల్లో 227 మంది విద్యార్థులుండగా ఇద్దరు టీచర్లే ఉన్నారు. మరో ఆరుగురు అవసరం. 7. కోసిగి మండలం జంపాపురం ఎంపీపీ స్కూల్లో 283 మంది విద్యార్థులుండగా ఇద్దరు టీచర్లతోనే నెట్టుకొస్తున్నారు. ఇంకా ఏడుగురు ఉపాధ్యాయులు కావాలి. 8. కర్నూలు కలెక్టరేట్ వెనుకనున్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో 503 విద్యార్థులుగా 12 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మరో ఐదుగురు ఉపాధ్యాయుల అవసరం ఉంది. -
ప్రజాప్రతినిధుల చుట్టూ కొందరు ఉద్యోగులు ప్రదక్షిణలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎన్నికల క్రతువు ముగిసి కొత్త పాలకులు కొలువుదీరిన నేపథ్యంలో వారి వద్దకు పైరవీల జాతర మొదలైంది. వారికి ప్రభుత్వ ఉద్యోగిని వ్యక్తిగత సహాయకుడి(పీఏ)గా నియమించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిన నేపథ్యంలో తాజాగా ప్రజాప్రతినిధుల చుట్టూ కొందరు ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇందులో అగ్రభాగంలో ప్రభుత్వ టీచర్లుండడం విశేషం. వాస్తవానికి విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రజాప్రతినిధుల వ్యక్తిగత సహాయకులుగా నియమించుకునే అవకాశం లేదు. కానీ జిల్లాలో మాత్రం ఇప్పటికే ముగ్గురు టీచర్లను వ్యక్తిగత సహాయకులుగా నియమించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వారిని ప్రస్తుత విధులనుంచి రిలీవ్ చేయాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారికి సూచనలు పంపడం గమనార్హం. ఆర్టీఈ ప్రకారం.... విద్యాహక్కు చట్టం 2010 ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను బోధనేతర విధుల బాధ్యతలు అప్పగించొద్దు. ఎన్నికలు, జనగణనలాంటి కీలక విధులు మినహా మిగతా పనులకు ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకునే వీలు లేదు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఈ అంశాలను గుర్తు చేస్తూ ఇటీవల రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సహా విద్యాశాఖ అధికారులకు ప్రత్యేకంగా సర్కులర్లను పంపింది. ఇంత స్పష్టంగా విషయాన్ని వివరించినప్పటికీ.. జిల్లా యంత్రాంగం ఈ అంశాన్ని గాలికొదిలేసినట్లుంది. ఎప్పటిలాగే ముగ్గురు టీచర్లకు పీఏలుగా నియమించేందుకు చర్యలు తీసుకుంది. వారిని విధులనుంచి రిలీవ్ చేయాలంటూ జిల్లా రెవెన్యూ అధికారి, డీఈఓకు ఆదేశించారు. ఇందులో ఒక టీచరు రాష్ట్ర మంత్రికి పీఏగా, మరో టీచర్‌ను అధికారపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడికి పీఏగా, మరో టీచర్‌ను ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పీఏగా నియమితులైనట్లు సమాచారం. మొత్తమ్మీద ఆర్టీఈ నిబంధనలకు పాతరేస్తూ ఉపాధ్యాయులను పీఏలుగా నియమించినప్పటికీ.. వారికి జిల్లా విద్యాధికారి రిలీవ్ చేస్తారా.. లేదా అనేది వేచిచూడాల్సిందే. -
పాఠాలు చెప్పేవారేరి..!
- జిల్లాలో 935 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ - రెండేళ్లుగా నియామకాలు నిల్ - కొత్త ప్రభుత్వంలో ఉపాధ్యాయ నియామకాలపై సందిగ్ధత గుంటూరు ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్ల నుంచి కొత్తగా ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీకి నోచుకున్నది లేదు. ప్రతీ పాఠశాలలో 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున ఉండాలని విద్యాహక్కు చట్టం స్పష్టం చేస్తున్నప్పటికీ నాలుగేళ్లయినా దానిని అమలు పరిచిన దాఖలాలు జిల్లాలో లేవు. రెండేళ్లుగా ఉపాధ్యాయ నియామకాలు నిలిచిపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఆటంకం ఏర్పడుతోంది. ఉద్యోగ విరమణతో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఎక్కడికక్కడ ఖాళీలు పేరుకుపోతున్నాయి. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల్లోకి అడుగుపెట్టిన విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు లేకపోవడంతో తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు వెనకాడుతున్నారు. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో వందలాది ఎస్జీటీ పోస్టులు పేరుకుపోవడంతో విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారు. ఉన్నత పాఠశాలల్లో సైతం సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా మారడంతో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జిల్లాలో 935 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ వేసవి సెలవులను సరదాగా గడిపి భవితపై కోటి ఆశలతో మళ్లీ పాఠశాలల్లో అడుగుపెడుతున్న విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా లేరు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 935 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటమే ఇందుకు నిదర్శనం. డీఎస్సీ 2012 ద్వారా జిల్లాలో 404 పోస్టులు భర్తీ చేయగా, మళ్లీ ఇప్పటివరకూ ఉపాధ్యాయ నియామకాల ఊసే లేదు. ఫలితంగా రెండేళ్లుగా నూతన నియామకాలు, పదవీ విరమణతో ఖాళీ అయిన పోస్టులు భారీగా పేరుకుపోయాయి. కేటగిరీ వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులు జిల్లాలోని 30 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం-50 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-300, ఎస్జీటీ పోస్టులు-577 సహా భాషా పండిత, పీడీ, పీఈటీ పోస్టులు-62 భర్తీకి నోచుకోకుండా ఉండిపోయాయి. ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత రెండేళ్ళుగా డీఎస్సీ నిర్వహణపై దృష్టి సారించని ప్రభుత్వ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను ఆర్నెల్లకోసారి నిర్వహిస్తూ వచ్చింది. సాధారణంగా టెట్ పరీక్ష తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాల్సిండగా, రెండేళ్ళుగా టెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులే వేల సంఖ్యలో ఉన్నారు. గత మార్చిలో జరిగిన టెట్‌కు జిల్లాలో బీఈడీ, డీఈడీ అభ్యర్థులు 19,496 మంది హాజరయ్యారు. టెట్‌లో అర్హత సాధించిన నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఇప్పటివరకూ ఉపాధ్యాయ కొలువులపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఈ ఏడాదిలోనైనా డీఎస్సీ ప్రకటన వస్తుందో లేదో తెలియని సందిగ్ధత నెలకొంది. -
విద్యా ‘హక్కు’ ఉత్తదేనా?
యాచారం : విద్యా హక్కు చట్టం కాగితాలకే పరిమితమైంది. ప్రతి పిల్లవాడికీ చదువును హక్కుగా చేస్తూ రూపొందించిన చట్టం, దాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు క్షేత్రస్థాయిలో అధికారుల అశ్రద్ధతో అమలు కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకపోగా, చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలన్న నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందని ద్రాక్షగానే మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో లేక చదువులు అంతంతమాత్రంగా సాగుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిద్దామంటే ఫీజులు దడ పుట్టిస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉచిత ప్రవేశాలు లేవు... ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలో యూకేజీ నుంచి పదో తరగతి వరకూ 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని విద్యాహక్కు చట్టం నిర్దేశించింది. ఈ మేరకు పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు కల్పించాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఈ నెల 12నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఒక్క విద్యార్థికి కూడ ఉచితంగా సీటు ఇచ్చిన దాఖలాల్లేవు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి కార్పొరేట్ స్కూల్లో 25 శాతం సీట్లు కేటాయిస్తే మండలంలో వివిధ గ్రామాల్లోని వెయ్యిమందికి పేద విద్యార్థులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మండలంలోని యాచారం, మాల్, నందివనపర్తి, నక్కర్తమేడి పల్లి, గునుగల్ తదితర గ్రామాల్లో పదికి పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో కనీసం 300మంది నుంచి 500కి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీకిలో వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. -
నత్తనడకన ‘కేజీబీవీ’ నిర్మాణం!
చేవెళ్ల, న్యూస్‌లైన్ : బాలికల్లో అక్షరాస్యతా శాతాన్ని పెంచే ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రారంభించిన కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) నిర్మాణం నత్తనడకన సాగుతోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా ఎప్పుడో పూర్తి కావాల్సిన భవన నిర్మాణం ఇంకా సాగుతుండడంతో ఈ విద్యా సంవత్సరం కూడా విద్యార్థినులు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. నాలుగైదు సంవత్సరాలుగా అద్దె భవనంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులకు ఈ విద్యాసంవత్సరం కూడా నూతన భవనంలోకి మారే యోగం కనిపించడంలేదు. చేవెళ్ల మండల కేంద్రoలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం నిర్మాణానికి మూడు సంవత్సరాల క్రితం రూ.కోటి 25 లక్షల నిధులు మంజూరయ్యాయి. భవన నిర్మాణానికి నిధులు మంజూరైన తరువాత రెండు సంవత్సరాలకు అంటే గత సంవత్సరం ఆరంభంలో ఎట్టకేలకు పనులు ప్రారంభమైనా ఈ విద్యాసంవత్సరం కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. రెండేళ్లుగా శ్రీసత్యసాయి కాలనీలోని ఓ ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న కేజీబీవీలో వసతులు లేక పిల్లలు సతమతమవుతున్నారు. ఇక్కడ పాఠశాలలో దాదాపు 114 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. 20 మంది విద్యార్థినులు పదోతరగతి పూర్తి చేశారు. విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడంలేదు. విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించాల్సి ఉండగా అసౌకర్యాలతో ఇబ్బందులు తప్పడంలేదు. కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, స్నానపుగదులు సరిపడా లేకపోవడంతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. శంకుస్థాపన చేసి రెండేళ్లు... కేజీబీవీ నూతన భవన నిర్మాణానికి మొదట్లో స్థల సమస్య ఏర్పడింది. ఎక్కడా స్థలం లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయం వెనుక భాగంలో స్థలాన్ని కేటాయించారు. ఇది గుంతలు, గుంతలుగా ఉండటంతో కాంట్రాక్టు దక్కించుకున్న గుత్తేదారు పనులు చేపట్టేందుకు మొదట్లో నిరాసక్తత చూపించాడు. ఈ క్రమంలోనే 2012 ఏప్రిల్ 22న మాజీ హోంమంత్రి సబితారెడ్డి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో కాంట్రాక్టరు 2013 జనవరిలో పనులు ప్రారం భించాడు. ప్రస్తుతం రెండు అంతస్తులు స్లాబ్ వే శారు. గదుల్లో ఫ్లోరింగ్ పూర్తి చేస్తే కొన్ని గదులు పాఠశాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ పనులు పూర్తి కావాలంటే మరికొన్ని నెలలుపట్టే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో భవనం అందుబాటులోకి రావా లంటే మరో ఏడాది పట్టవచ్చని చెబుతున్నారు. కాగా కొన్ని గదులనైనా సిద్ధం చేసి పాఠశాలకు అప్పగించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అధికారులు తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుండటం కాంట్రాక్టరుకు అలుసుగా మారిందని, దీంతో భవన నిర్మాణం నత్తనడకన సాగుతోందని పేర్కొంటున్నారు. -
చదువుకొనలేం..
ప్రైవేట్ స్కూళ్లలో అడ్డగోలు ఫీజులు - ఐఐటీ, డీజీ, కాన్సెప్ట్, ఈటెక్నో, ఇతర పేర్లతో దోపిడీపర్వం - నియంత్రణంలో సర్కారు విఫలం - పేదలకు భారమవుతున్న విద్య చదువుకునే రోజులు పోయి, చదువు‘కొనే’ రోజులొచ్చాయి. ప్రైవేట్ పాఠశాలలు ఐఐటీ, డీజీ, కాన్సెప్ట్, ఈ టెక్నో అంటూ కొత్త పేర్లు పెట్టుకొని వేలల్లో ఫీజులు, డొనేషన్లు గుంజుతున్నాయి. పోటీ ప్రపంచంలో తమ పిల్లలు ఎక్కడ వెనకబడతారోననే భయంతో తల్లిదండ్రులు సైతం ఖర్చుకు వెనకాడకుండా ఇలాంటి స్కూళ్లలోనే చదివి స్తున్నారు. దీంతో యాజమాన్యాలు ఫీజులను అమాంతం పెంచుతున్నాయి. ఫలితంగా పాఠశాల విద్య భారమవుతోంది. ఇంత ఫీజులా? నాకు ఇద్దరు పిల్లలు... పెద్దోడు మూడో క్లాస్, చిన్నోడు ఎల్కేజీ. మనం ఎంత చేసినా పిల్లల కోసమే కదా అని కరీంనగర్లో పేరున్న స్కూళ్లో చదివిద్దామని పోతే... వాళ్లు ఫీజు చెప్పగానే కళ్లు తిరిగినయ్. ఎల్కేజీకి బస్సు ఫీజుతో కలిపి 20 వేలు చెప్పిండ్రు. మూడో క్లాస్‌కు 24 వేలు అన్నరు. ఇద్దరు పిల్లలను అందులో చదివించాలంటే స్కూల్ ఫీజే 45 వేల రూపాయల అయితది. స్కూల్ డ్రెస్‌లు, బుక్కులు, స్టేషనరీ వీటన్నింటికీ మరో 10 వేలన్నా అయితయ్. నాకొచ్చే జీతం ఏడాదికి 72 వేలు. పిల్లల స్కూల్‌కే 55 వేలు పోతే ఇంకా మా కుటుంబం ఎట్ల గడవాలె. - మహేందర్, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ, న్యూస్‌లైన్ : మరో పది రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలు... ఆపై మరో వారం రోజులకు ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు రంగురంగుల కరపత్రాలతో రాజకీయ ప్రచారాన్ని తలపించేలా ఇళ్లిళ్లూ తిరుగుతున్నారు. చాలాపాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేవు. కొన్ని పాఠశాలలకు గుర్తింపు లేదు. ఒలింపియాడ్, ఐఐటీ, టెక్నో, కాన్సెప్ట్, ఈ టెక్నో, ఈ కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ తదితర పేర్లను గతేడాది తొలగించారు. పేర్లు మారినా ఫీజుల్లో ఎలాంటి మార్పులు లేవు. వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. పిల్లలను చేర్పించడంపై టీచర్లకు కూడా ‘ప్రైవేటు’ యాజమాన్యాలు టార్గెట్ విధించాయి. ఒక్కో టీచర్ కనీసం పది మందిని చేర్పిస్తే వేతనాలు సంతృప్తికరంగా ఇస్తామని హామీలు ఇస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఏం మాట్లాడినా ఓపికతో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఫీజులు పలు పాఠశాలల్లో ఫీజులు లక్ష రూపాయలకు చేరాయి. జిల్లాకేంద్రంతోపాటు గోదావరిఖని, పలు మున్సిపాలిటీల పరిధిలోని కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో హాస్టల్ ఫీజుతో కలుపుకుని రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు. మండలకేంద్రాల్లోనూ ఫీజులు ఇంచుమించు ఇంతే ఉన్నా యి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాశాఖ నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాలి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయి నుంచే భారీగా ఫీజులు గుంజుతున్నారు. బోధనతోపాటు ఐఐటీ కోచింగ్, అబాకస్, స్పోకెన్ ఇంగ్లిష్, కరాటే, డ్రాయింగ్, బాక్సింగ్ ఇతర టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నామంటూ పలు రకాల ఫీజుల పేరుతో వసూళ్లు చేస్తున్నారు. పాఠశాలల్లోనే యూనిఫాంలు, పుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, సాక్సులు, టై అంటూ ఇష్టమొచ్చిన ధరలు యాజమాన్యాలే నిర్ణయించి, తప్పనిసరిగా వారి వద్దనే తీసుకోవాలంటూ నిబంధన విధిస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఓ విద్యాసంస్థ మొదటిసారిగా ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ అంటూ జిల్లా కేంద్రానికి చేరుకుని... అప్పటివరకు రూ.3 నుంచి రూ.5 వేలు ఉన్న పాఠశాల ఫీజును ఏకంగా రూ.15 వేలకు పెంచింది. ఆ తర్వాత జిల్లాలో అసలు విద్యా సంస్థల తీరే మారిపోయింది. సాధారణ స్థాయి పాఠశాలల్లో నర్సరీకి రూ.3 వేల వరకు ఫీజుండగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి దాకా తరగతి ప్రకారం రూ.4 వేల నుంచి రూ.15 వేల దాకా ఉన్నాయి. అదనంగా హాస్ట ల్ ఫీజులు రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఉంది. కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో నర్సరీ నుంచి ఎల్కేజీ వరకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి దాకా 12వేల నుంచి 30 వేల దాకా ఫీజులుంటున్నా యి. హాస్టళ్లో ఉంచి చదివించాలంటే స్కూలు ఫీజు కాకుండా రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా కట్టాల్సిందే. పదో తరగతి అయితే ఇంకా ఎక్కువే. కొన్ని పాఠశాలలు మరో అడుగు ముందుకేసి ఐఏఎస్ ఫౌండేషన్ కోర్సులో బీజాలు వేస్తామంటూ లక్ష రూపాయల ఫీజు అంటూ కొత్త విధానానికి రూపకల్పన చేశాయి. కొన్ని పాఠశాలలు బ్రాండ్ ఇమేజ్ పేరుతో దోచుకుంటున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరుతో జిల్లాకేంద్రంలో 20కి పైగా పాఠశాలలు ఉన్నాయంటే దోపిడీ ఎంత మేర ఉందో ఊహించుకోవచ్చు. ఆధునిక విధానంలో బోధన అందించడం, భవిష్యత్ లక్ష్యాలకు ఇప్పటినుంచి తర్ఫీదు ఇవ్వడం మంచిదే అయినా అలా విజయాలు సాధించినవారి సంఖ్య ఒకటిరెండుకే పరిమితమవుతుండడంతో ధనార్జనకోసమే ఇలాంటి కోర్సులనే మాటలు వినిపిస్తున్నాయి. ఇంత సొమ్ము వెచ్చించి ప్రైవేట్‌లో చదివించడం పేదలకు సాధ్యమయ్యే పనికాదు. నిబంధనలకు విరుద్ధం విద్యాహక్కుచట్టం ప్రకారం ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిం చకూడదనే నిబంధన ఉన్నా చాలా స్కూళ్లు దీన్ని పాటించడం లేదు. ఎంట్రెన్స్‌లతో విద్యార్థులు చిన్న వయసులోనే మానసికంగా కుంగిపోయి చదువు పై ఏకాగ్రత సాధించలేకపోతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. దీనికితో డు భారీగా ఫీజులు వసూలు చేస్తున్న చాలా పాఠశాల లు డిగ్రీ, ఇంటర్ చదివిన వారితోనే బోధన సాగిస్తున్నాయి. కరపత్రాల్లో ఆకర్షణీయమైన ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది - ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు ఏర్పాటు చేయకూడదు. - పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి. - ప్రవేశపరీక్ష నిర్వహించకూడదు. - అర్హత కలిగిన ఉపాధ్యాయులతోనే విద్యాబోధన చేపట్టాలి. - అనాథలు, హెచ్ఐవీ బాధితులు, వికలాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, 60 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులకు 6 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. - పాథమిక పాఠశాలల్లో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:35 చొప్పున ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ఉండాలి. - ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ప్రత్యేక కేటగిరీ పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి. అందుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. -
కాగితం పులేనా..?
నాలుగేళ్ల కిందట ప్రవేశపెట్టిన ఆర్టీఈ(రైట్ టూ ఎడ్యుకేషన్) చట్టం చివరకు కాగితపు పులిగానే మిగిలిపోయింది. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చట్టం చేయడంతో పాటు విస్తృత ప్రచారం చేయడంతో పేద వర్గాల్లో ఎన్నో ఆశలు రేపింది. కార్పొరేట్ పాఠశాలల్లో సైతం 25 శాతం సీట్లు పేదలకు కేటాయించాలని ఆ చట్టంలో పేర్కొనడంతో పేద విద్యార్థులు మనకు మంచిరోజులొచ్చాయని భావించారు. నిర్బంధ విద్య ప్రవేశపెట్టడం ద్వారా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంది. ఎన్నో ఉత్తమ ఆశయాలతో రూపొందించిన ఈ చట్టం అమలులో ఇంకా ఆమడదూరంలోనే ఉంది. ప్రభుత్వం చట్టం చేసి చేతులు దులుపుకొందే కాని, అమలు విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో చట్టం కాగితాలకే పరిమితమైంది. గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ :బడి ఈడు బాలలందరికీ నిర్బంధ విద్య అందించే లక్ష్యంతో రూపొందించిన నిర్బంధ విద్యాహక్కు చట్టం అమలుకు నోచుకున్న దాఖలాలు లేవు. చదువు కావాలని కోరిన ప్రతి పిల్లవాడికి విద్యను హక్కుగా చేసి ఉచితంగా చదువు చెప్పించేలా ప్రతిష్టాత్మకంగా తెచ్చిన చట్టం అమల్లో ప్రభుత్వం అడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2010లో దేశ వ్యాప్తంగా ఆర్భాటంగా అమల్లోకి తెచ్చిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ (ఆర్టీఈ-2009)కు బూజు పట్టింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై అటు ప్రభుత్వం, ఇటు విద్యా శాఖాధికారులు దృష్టి సారించకపోవడంతో విద్యాహక్కు చట్టం ప్రహసనంగా మారింది. ఆరేళ్ల వయసు నుంచి 14 ఏళ్ల లోపు బాలలను పాఠశాలలకే పరిమితం చేసి, బాల కార్మిక వ్యవస్థను సమూలంగా రూపు మాపే లక్ష్యంతో తీసుకొచ్చిన మహత్తరమైన చట్టం ద్వారా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను నిరుపేద, అల్పాదాయ వర్గాల పిల్లలతో ఉచితంగా భర్తీ చేయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం చట్టం అమలుకు ముందుకు రాని నేపథ్యంలో విద్యాశాఖాధికారులు సైతం చేతులు ముడుచుకుని కూర్చున్నారు. 2010లో అమల్లోకి వచ్చిన చట్టం విద్యాభివృద్ధి లేనిదే సమాజం అభివృద్ధి సాధించలేదనే కోణంలో కేంద్ర ప్రభుత్వం 2009 ఆగస్టు 27న విద్యాహక్కు చట్టాన్ని రూపొందించింది. చట్టం వచ్చిన ఎనిమిది నెలల తరువాత 2010 ఏప్రిల్ 1న అమల్లోకి తెచ్చింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పేద విద్యార్థులకు 25 శాతం రిజర్వేషన్, ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు కొనసాగరాదనే ప్రధానాంశాలు చట్టం ఇమిడి ఉండగా, వీటిలో ఏ ఒక్కటీ జిల్లాలో సక్రమంగా అమలుకాలేదు. చట్టం వచ్చిన నాలుగేళ్ల కాలంలో జిల్లాలోని ఏ ఒక్క కార్పొరేట్ పాఠశాలలనూ పేద విద్యార్థులకు 25 శాతం సీట్లను ఉచితంగా భర్తీ చేయలేదు. గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంభించింది. ప్రతి ఏటా జూన్‌లో పాఠశాలలు తెరిచే ముందుగా విద్యా పక్షోత్సవాలను నిర్వహిస్తున్న ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై నిర్దిష్టమైన చర్యలు చేపట్టడంలో విఫలమైంది. పేదలపై ఫీజుల భారం... సమాజంలో బడుగు, బలహీన వర్గాల కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించడం ద్వారా ఆయా వర్గాలను ఉద్ధరించవచ్చనే ఉద్దేశంతో తెచ్చిన నిర్బంధ విద్యాహక్కు చట్టం ఉద్దేశం నెరవేరలేదు. పేద, అల్పాదాయ వర్గాల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ తమ పిల్లలను వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారు. చట్టం నిర్దేశించిన విధంగా జరిగితే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వడం ద్వారా పేద ప్రజలకు ఆర్థికంగా వెసులు బాటు కల్పించినట్లయ్యేది. ఈ విధంగా 25 శాతం సీట్లను పేద వర్గాల పిల్లలతో భర్తీ చేసిన పాఠశాలలకు ఆ మేరకు ఫీజులను ప్రభుత్వం చెల్లించాలని చట్టంలో పొందుపర్చారు. మరోవైపు చట్టంలో పొందుపర్చిన విధంగా ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవన నిర్మాణాలు చేపట్టి, పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా, చట్టం అమలుకు నిధులు విడుదల చేసిన పరిస్థితులు లేదు. అసాధారణమైన అంశాలను చట్టంలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చట్టాన్ని అమలుపర్చే దిశగా విఫలం చెందింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో విద్యాశాఖాధికారులు చేసేది లేక మిన్నకుండిపోతున్నారు. ఫలితంగా చట్టం చట్టుబండగా మారి ప్రభుత్వాల చిత్తశుద్ధిని వెక్కిరిస్తోంది. ఆదేశాలు వస్తే అమలు చేస్తాం... ప్రైవేటు పాఠశాలల్లో 25 సీట్లను అల్పాదాయ వర్గాల పిల్లలతో భర్తీ చేసే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే అమలు పరుస్తాం. గుర్తింపు లేని పాఠశాలలపై గతంలో దాడులు చేసి నోటీసులు ఇవ్వడంతో పాటు భారీ మొత్తంలో జరిమానాలు వసూలు చేశాం. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఏటా పటిష్టమైన చర్యలు చేపడుతున్నాం. -డి.ఆంజనేయులు, జిల్లా విద్యాశాఖాధికారి ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తే సిద్ధమే విద్యాహక్కు చట్టం నిర్దేశించిన ప్రకారం పేద కుటుంబాల పిల్లలకు 25 సీట్లను ఇచ్చేందుకు పాఠశాలల యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయి. ఓవైపు ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో చెల్లించాల్సిన నిధులను చెల్లించడంలోనే విఫలమవుతున్న ప్రభుత్వం ఇక స్కూలు పిల్లల ఫీజులు చెల్లిస్తుందనే నమ్మకం లేదు. ఇదే విషయమై జాతీయ ప్రైవేటు స్కూల్స్ యాజమాన్య సంఘం సుప్రీం కోర్టును ఆశ్రయించిన కేసులో తీర్పు వెలువడాల్సి ఉంది. -ఎన్.చక్రనాగ్, జిల్లా కార్యదర్శి,ఏపీ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ -
విద్యాహక్కుకు ‘ప్రైవేటు’ తూట్లు
- ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు అంతంతమాత్రంగా ప్రవేశాలు - గత ఏడాది యథేచ్ఛగా ఫీజులు వసూలు కానరాని టాస్క్ఫోర్స విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: విద్యాహక్కు చట్టం అమలుకు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు తూట్లు పొడుస్తున్నాయి. చట్ట ప్రకారం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సి ఉన్నా మూడేళ్లుగా అమలు చేయడంలేదు. చట్టం అమలయ్యేలా చూడాల్సిన అధికారు లు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేర డం లేదు. రానున్న విద్యా సంవత్సరంలోనూ ఈ విధా నం అమలయ్యే పరిస్థితి కానరావడం లేదు. దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నా అధికారులు పట్టించుకోవ డం లేదు. ఈ విధానం పకడ్బందీగా అమలు కావడానికి టాస్క్ఫోర్సు బృందం ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఇంతవరకు పట్టించుకోలేదు. దీంతో ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యాహక్కుకు వ్యతిరేకంగా ప్రవేశాలు చేపడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఉచిత విద్య అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలలు సైతం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ప్రవేశం కల్పించి ఉచితంగా విద్యనందించాలని నిర్దేశించింది. గత విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను వీరికి కేటాయించి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రవే శం కల్పించాలని పేర్కొంది. గతంలో ప్రవేశం పొందిన బడుగు, బలహీ న వర్గాల విద్యార్థుల నుంచి కూడా ఫీజులు తీసుకోకూడదని స్పష్టం చేసింది. జిల్లాలో ప్రైవేటు యాజమాన్యా ల కింద ప్రాథమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాల లు 1300 ఉండగా వీటిలో ప్రస్తుతం 1.6 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం వీరిలో నాలుగో వంతు మందికి ఉచితంగా విద్య అందించాలి. అయితే యాజమాన్యాలు ఇందుకు విరుద్ధంగా బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల నుంచి కూడా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీట్ల భర్తీకి రిజర్వేషన్.. ఒకటో తరగతిలో 25 శాతం సీట్లను రిజర్వేషన్ ప్రకా రం భర్తీ చేయాలని చట్టం నిర్దేశించింది. అనాథలు, ఎయిడ్స్ బాధితులకు ఐదు శాతం, ఎస్సీలకు పది శాతం, గిరిజనులకు నాలుగు శాతం, బీసీలకు ఆరు శాతం సీట్లను కేటాయించింది. అయితే కేవలం వ్యాపార దృక్పథంతో పనిచేస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు దీన్ని పట్టించుకోవడం లేదు. కానరాని టాస్క్‌ఫోర్స్ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్రప్రభుత్వం ప్రతి ఏడాదీ ప్రకటిస్తుంది. రెండో ఏడాది గడిచినా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు కాకపోవడంతో ఈ విద్య సంవత్సరంలోనూ అదే తీరుగా ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు అవకాశం లేకుండా పోయింది. ఫీజుల నియంత్రణపై పర్యవేక్షణ.. ఈ విషయాన్ని డీఈఓ జి.కృష్ణారావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అన్ని విద్యాసంస్థలపై ఉందన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలల్లో చట్టం అమలు, ఫీజుల నియంత్రణ వ్యవహారాలను జిల్లా విద్యాశాఖ పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. -
కొరగాని ‘విద్యాహక్కు’!
నిద్రపోతున్నవారిని లేపవచ్చుగానీ...నిద్ర నటిస్తున్నవారికి మెలకువ తెప్పించడం అసాధ్యమని మరోసారి రుజువైంది. ప్రాథమిక విద్యా సంస్థలు సౌకర్యాల లేమితో అల్లాడుతున్నాయని, ఈ కారణంగా విద్యా హక్కు చట్టం ఎందుకూ కొరగానిదవుతున్నదని ఎందరో ఆరో పిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కొందరు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. వివిధ రాష్ట్రాల నుంచి అఫిడవిట్లు కోరిన సర్వోన్నత న్యాయస్థానం కూడా ప్రాథమిక విద్యారంగంలో నెలకొన్న దుస్థితిపై రాష్ట్రాలకు నిర్ణీత గడువు విధించి ఆలోగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కానీ, పరి స్థితి యథాతథంగా కొనసాగుతున్నదని తాజాగా ఒక పిటిషన్ విచా రణ సందర్భంగా తేలింది. అక్షరక్రమంలో ముందు వరుసలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సౌకర్యాల లేమిలో, వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడంలో కూడా ముందే ఉన్నదని వెల్లడైంది. సరిగ్గా నాలుగేళ్లక్రితం...అంటే 2010 ఏప్రిల్ 1న విద్యా హక్కు చట్టాన్ని ఆర్భాటంగా అమలుచేయడం మొదలెట్టారు. మూడేళ్లలోగా చట్టంలో నిర్దేశించిన అంశాలన్నిటినీ అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, ఇప్పటికీ మొండి గోడలు, చెట్లకింది చదువులు, ఎంతకూ రాని పుస్త కాలు... ఇలా అన్నీ ఎప్పటిలాగే ఉన్నాయని పలు క్షేత్రస్థాయి నివేది కలు చెబుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే బాలబాలికలకు మరుగు దొడ్ల సౌకర్యం లేకపోవడం మరో ఎత్తు. మంచినీటి సంగతి చెప్పనవ సరమే లేదు. రెండేళ్లక్రితం ప్రాథమిక పాఠశాలల్లో మంచినీరు, మరు గుదొడ్ల విషయమై దాఖలైన పిటిషన్ విచారణకొచ్చినప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలనూ సుప్రీంకోర్టు గట్టిగా మందలించింది. ఈ రెండు సౌక ర్యాలనూ ఆరు నెలల వ్యవధిలో సమకూర్చాలని ఆదేశించింది. నాలు గురోజులనాడు ఒక పిటిషన్ విచారించిన సందర్భంలోనూ ఇదే స్థితి. పర్యవసానంగా ధర్మాసనం ముందు మన రాష్ట్ర ప్రభుత్వం తలదించు కుంది. మరికొంత సమయమిస్తే దీన్ని సరిచేస్తామని సంజాయిషీ ఇచ్చుకుంది. ఎప్పటిలాగే సుప్రీంకోర్టు మరోసారి ప్రభుత్వాన్ని మందలించాల్సి వచ్చింది. చదువుకోవడానికి పాఠశాలల కొచ్చే బాలబాలికలకు కనీస సౌకర్యాలు కొరవడితే, అందువల్ల వారు చదువులో వెనకబడిపోతే దేశానికి అవసరమైన ఉత్తమ పౌరులను తయారుచేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. అన్నిటికీ జవాబు ఒకటే...మరికొంత సమయమిస్తే చేస్తామని చెప్పడమే. విద్యాహక్కు చట్టం మన రాష్ట్రంలో పరమ అధ్వానంగా అమలవుతున్నదని వార్షిక విద్యా నివేదిక(ఏసర్)-2013 వెల్లడిం చింది. సర్వే చేసిన పాఠశాలల్లో కేవలం 65 శాతం పాఠశాలలకు మాత్రమే మంచినీటి సదుపాయం ఉన్నదని ఆ నివేదిక తెలిపింది. 19 శాతం పాఠశాలలకు అసలు మరుగుదొడ్ల సదుపాయమే లేదు. 43 శాతం పాఠశాలల్లో మాత్రమే బాలబాలికలకు విడిగా మరుగుదొడ్లు ఉన్నాయని నివేదిక అంటున్నది. అసలు ఏ పాఠశాలలో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు అవసరమో చూసి, వాటిని కల్పించే బాధ్యతను పంచాయతీలకు అప్పగిస్తే ఈ సమస్య చాలా త్వరగా పరిష్కారమవుతుంది. కానీ, ప్రభుత్వం మాత్రం తనకలవాటైన పద్ధతుల్లో అన్నీ తానే నిర్ణయించాలనుకోవడం సమస్య పరిష్కారానికి అవరోధంగా నిలుస్తున్నది. ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న ఇలాంటి పరిస్థితులవల్ల బాలికల చదువు దెబ్బతింటున్నది. ఎదిగివస్తున్న తమ బిడ్డలను బడులకు పంపడానికి తల్లిదండ్రులు సందేహిస్తున్నారు. వారి భయాలు కూడా సహేతుకమైనవే. మరుగుదొడ్లులేని బడుల్లో ఆడ పిల్లలు రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అందు వల్ల వారిని చదువు మాన్పించడమే పరిష్కారమని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఒకటో తరగతిలో చేరిన బాలికల్లో మూడోవంతు మంది పదో తరగతికొచ్చేసరికి చదువుకు స్వస్తి చెబుతున్నారని ఒక అంచనా. వీరిలో ఎక్కువమంది బడుగు, బలహీన వర్గాల పిల్లలేనని చెప్పనవసరం లేదు. ప్రభుత్వానికి మాత్రం ఇదేమీ పట్టడంలేదు. అది యథాప్రకారం నిమ్మకు నీరెత్తిన ధోరణిలోనే వ్యవహరిస్తున్నది. మనకంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌వంటి రాష్ట్రాలు ఈ విషయంలో మన ప్రభుత్వంకంటే సున్నితంగా ఆలోచిస్తున్నాయి. సౌకర్యాల కల్పనలో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. పంచాయతీ మొదలుకొని పార్లమెంటు వరకూ భిన్నస్థాయిల్లో ప్రజా ప్రతినిధులుంటారు. వారంతా జనం ఓట్లతో ఎన్నికయ్యేవారే. తమ తమ ప్రాంతాల్లో ఉండే సమస్యలు వారికి తెలియకపోవు. అయినా, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన నాలుగేళ్లనుంచీ...సుప్రీంకోర్టు దృష్టికొచ్చి సరిచేయమని చెప్పిన రెండేళ్లనుంచీ సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయంటే అది సిగ్గుచేటైన సంగతి. మన రాష్ట్రంలో ఉన్న 78,000కుపైగా పాఠశాలల్లో సగానికిపైగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, మంచినీరు సదుపాయాలు లేవని ఆమధ్య జరిపిన సర్వేలో తేలింది. ఒకపక్క బోధనావిద్యలో పట్టాలు పొందిన వందలాదిమంది నిరుద్యోగులుగా మిగిలిపోతుంటే పాఠశాలల్లో చట్టం నిర్దేశించిన మేరకు ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఉండటంలేదని ఆ సర్వే వివరించింది. ఇక ఆటస్థలాల సంగతి చెప్పనవసరమేలేదు. ఇలాంటి పరిస్థితులన్నిటినీ సరిచేస్తామని ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు చెప్పే ప్రభుత్వం ఆ దిశగా కాస్తయినా ప్రయత్నించడంలేదని స్పష్టమైంది. విద్యాహక్కు చట్టం నిబంధనలు, తమ ఆదేశాలు ఎంతవరకు అమలయ్యాయో సూచించే స్థాయీ నివేదికను జూలై 7 నాటికి అందజేయాలని సుప్రీంకోర్టు తాజా గడువు విధించింది. కనీసం అప్పటికైనా మన ప్రభుత్వం బాధ్యతను గుర్తెరుగుతుందా అన్నదే ప్రశ్న. -
మైనారిటీ సంస్థలకు ఆర్టీఈ వర్తించదు
* సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ * 2010 నాటి త్రిసభ్య బెంచ్ తీర్పు సరికాదు * అలాగైతే మైనారిటీ పాఠశాలల రాజ్యాంగపరమైన హక్కు రద్దవుతుంది న్యూఢిల్లీ: ఉచిత, నిర్బంధ విద్యా చట్టం మేరకు చిన్నారులకు సంక్రమించిన హక్కు (ఆర్టీఈ) మైనారిటీ విద్యా సంస్థలకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ సంస్థల విషయంలో ఈ హక్కు రాజ్యాంగ విరుద్ధమైనదిగా, సంస్థలకున్న హక్కును హరించేదిగా సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆర్టీఈ చట్ట ప్రకారం.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అన్ని పాఠశాలల్లోనూ 25% సీట్లకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. అరుుతే 2009 నాటి ఈ చట్టం ఎరుుడెడ్ మైనారిటీ పాఠశాలలకూ వర్తిస్తుందని సుప్రీం త్రిసభ్య ధర్మాసనం 2010లో ఇచ్చిన తీర్పు సరి కాదని ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం పేర్కొంది. రాజ్యాంగానికి సంబంధించిన ప్రాథమిక స్వరూపాన్ని లేదా నిర్మాణాన్ని.. అధికరణం 21ఏ (విద్యాహక్కు), అధికరణం 15(5) (ఆర్థికంగా బలహీనవర్గాలకు సంబంధించినది)లు మార్చలేవని, అవి రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటయ్యే అధికరణాలని విస్తృత ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే సమయంలో 2009 నాటి విద్యా హక్కు చట్టం రాజ్యాంగంలోని అధికరణం 19(1)(జీ) (వాక్ స్వాతంత్య్రానికి సంబంధించినది)కి విరుద్ధం కాదని బెంచ్ అభిప్రాయపడింది. అరుుతే రాజ్యాంగంలోని అధికరణం 30, క్లాజ్ 1 (మైనారిటీల హక్కులు) పరిధిలోకి వచ్చే ఎరుుడెడ్ లేదా అన్ ఎరుుడెడ్ మైనారిటీ పాఠశాలలకు సంబంధించినంత వరకు ఆర్టీఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమేనని తాము భావిస్తున్నట్టు విస్తృత ధర్మాసనం పేర్కొంది. మైనారిటీ పాఠశాలలకు ఈ చట్టాన్ని వర్తింపజేస్తే రాజ్యాంగం ప్రకారం వారికున్న హక్కు రద్దవుతుందని పేర్కొంది. ఆర్టీఈ చట్టాన్ని ఎరుుడెడ్ మైనారిటీ స్కూళ్లకు వర్తింపజేయడం సరికాదని కోర్టు మెజారిటీ తీర్పు అభిప్రాయపడినట్టు 2010 నాటి తీర్పును ప్రస్తావిస్తూ ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వ సంస్థలూ ఉత్తమ విద్యార్థులను తయూరు చేస్తున్నాయ్.. అధికరణం 15 (5).. ప్రాథమిక హక్కుకు, వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందన్న మైనారిటీయేతర ప్రైవేట్ అన్ ఎరుుడెడ్ విద్యాసంస్థల వాదనను బెంచ్ తోసిపుచ్చింది. వెనకబడిన తరగతులకు, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన సీట్లలో ఆయూ విద్యార్థులను చేర్చుకుంటున్న ఐఐటీలు, ఏఐఐఎంఎస్, ప్రభుత్వ వైద్య కళాశాలలు, కేంద్రీయ విద్యాలయూల వంటి ప్రభుత్వ విద్యా సంస్థలు సైతం అపారమైన ప్రతిభా పాటవాలు కలిగిన విద్యార్థులను తయూరు చేయగలిగాయంది. వారు మంచి పాలకులుగా, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లుగా ఎదగగలిగారని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పెపైచ్చు ఈ వర్గాలకు సీట్లివ్వడం వల్ల ఉత్తమతతో రాజీపడాల్సి వస్తోందనే ప్రైవేటు విద్యా సంస్థల అభిప్రాయం.. పౌరులంద రి సౌభ్రాతృత్వ పరిరక్షణకు, వ్యక్తుల గౌరవానికి, దేశ సమగ్రతలకు హామీ ఇస్తున్న రాజ్యాంగ ప్రవేశికకే విరుద్ధమని పేర్కొంది. మైనారిటీయేతర ప్రైవేట్ అన్ ఎరుుడెడ్ సంస్థలు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. -
‘బడిఈడు’ సర్వేల్లో లోపాలు
నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : బడి బయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలకు పంపి, చదివించాల్సిందేనని విద్యాహక్కు చట్టం ద్వారా ప్రభుత్వం స్పష్టంచేసింది. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి, పిల్లలను బడిబాట పట్టించాలనీ చెప్పింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, పర్యవేక్షణ లోపంతో ఈ లక్ష్యం నీరుగారుతోంది. లెక్కింపులో నిర్లక్ష్యం జిల్లాలో బడిఈడు పిల్లల లెక్కింపులో అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టమవుతోంది. పిల్లల సంఖ్యకు తగ్గట్లు ఏర్పాట్లు చేసి, వారికి సరైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే అధికారులు మాత్రం అంతగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పిల్లల లెక్కింపు కోసం తూతూమంత్రంగా సర్వేలు చేపట్టి చేతులు దులుపుకున్నారు. బాలకార్మిక నిర్మూలన ప్రాజెక్టు అధికారులు, రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) అధికారులు సర్వే లోపాలపై తమ తప్పు లేదని, మరోసారి చేపడతామని చెబుతున్నారు. తూతూ మంత్రంగా జిల్లాలో బడిబయట ఉన్న పిల్లలను గుర్తించడానికి ఆర్వీఎం అధికారులు మూడు నెలలుగా సర్వేచేయించారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో లెక్కింపును మూడు స్వచ్ఛంద సంస్థలకు, మున్సిపాలిటీలను మెప్మా అధికారులకు అప్పగించారు. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల్లో సర్వే చేపట్టారు. ఈ సర్వే లెక్కల ప్రకారం 1401 మంది బాల కార్మికులు జిల్లాలో ఉన్నట్లు తేలింది. ఇందులో 123 మంది చిన్నారులు అతి పేదరికంలో ఉన్న బాలలుగా గుర్తించారు. ఈ సర్వే ఫలితాలపై ఆర్వీఎం అధికారులే నివ్వెరపోయారు. గతంలోనే జిల్లాలో రెండువేల వరకు బాల కార్మికులు ఉండగా, ప్రస్తుత సర్వేలో తక్కువ రావడంపై అనుమానాలు వ్యక్తంచేశారు. దీంతో ఈ సర్వే సక్రమంగా లేదంటూ మళ్లీ చేపట్టాలని ఆర్వీఎం పీఓ భిక్షునాయక్ నిర్ణయించారు. ఈ లెక్కింపులో భాగస్వామంగా ఉన్న బాలకార్మిక నిర్మూలన అధికారులు సర్వేలో తమ తప్పు లేదని చెబుతున్నారు. అసంపూర్తి సర్వేతోనే బడిబయట పిల్లల లెక్కింపునకు సంబంధించిన అసంపూర్తి సర్వే ఆధారంగానే జిల్లాలో మూడు ఆర్బీసీ సెంటర్లను ప్రారంభించారు. నిజామాబాద్ మండలం మోపాల్, డిచ్పల్లి మండలం నడిపల్లి, ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి , మాక్లూర్ మండలం మామిడిపల్లి, సక్రినాయక్తండాల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఇటుక బట్టీల్లో పనిచేసే బాల కార్మికుల కోసం ఈ సెంటర్లను ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు, విద్యాబోధనకు సంబంధించి అతి తక్కువ ఆర్థికమొత్తం అందిస్తున్నారు. నెలకు 600 మాత్రమే ఒక్కో విద్యార్థిపై ఖర్చు చేస్తున్నారు. ఇందులోనే టీచర్ మెటీరియల్, వేతనం అందించాల్సి ఉంటుంది. జిల్లా అధికారులు మరిన్ని నిధుల కోసం ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నారు. -
అర్హులకే ఆర్టీఈ
= సర్కార్ యోచన.. = తప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో సీట్లు అక్రమార్కుల పాలు = ఇక ప్రవేశానికి బీపీఎల్ కార్డుతో లింక్ = సీఎంతో చర్చించి తుది నిర్ణయం: మంత్రి కిమ్మనె రత్నాకర్ సాక్షి, బెంగళూరు : విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద ప్రైవేటు పాఠశాలల్లో చేరదలచిన విద్యార్థుల కుటుంబాలకు విధిగా బీపీఎల్ కార్డు ఉండాలన్న షరతు విధించాలని యోచిస్తున్నట్లు పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ తెలిపారు. ఇక్కడి కేపీసీసీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తప్పుడు ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో కొందరు తమ పిల్లలకు ఆర్టీఈ కింద సీటు సంపాదిస్తుండటం ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. దీనిని నివారించడానికి, నిజమైన పేదలకు న్యాయం జరగడానికి బీపీఎల్ కార్డు నిబంధన విధించాలనుకుంటున్నామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీఈ అమల్లోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇతర విద్యార్థుల ఫీజులు పెంచినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై చర్యలు చేపడతామన్నారు. ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, మైనారిటీ విద్యా సంస్థలు ఆర్టీఈ కింద విధిగా 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలన్నారు. అలా కేటాయించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి జూన్ 1నే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫారం, సైకిళ్లను అందజేస్తామన్నారు. దీనిపై వాయిదాలు ఉండబోవని ఆయన భరోసా ఇచ్చారు. -
ఆర్టీఈ అభాసుపాలు
= సీట్లు భర్తీకాని వైనం = తల్లిదండ్రుల్లో అవగాహనలేమి = అడ్డంకులు సృష్టిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు = ఆర్టీఈ టాస్క్‌ఫోర్స్ సర్వేలో తేలిన నిజాలు సాక్షి, బెంగళూరు : విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా పూర్తి స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు. ఇందుకు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యవైఖరితో పాటు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం స్వార్థపూరిత విధానాలే కారణమని ఆర్టీఈ టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అన్ఎయిడెడ్ పాఠశాలల్లోని సీట్లలో 25 శాతం సీట్లను కేటాయించడం ఆర్టీఈలోని ముఖ్యమైన నిబంధన. దీని ప్రకారం రాష్ట్రంలో 1.50 లక్షల సీట్లు ఆర్టీఈ కింద అందుబాటులో ఉన్నాయి. అయితే ఆర్టీఈ చట్టం అమల్లోకి వచ్చి రెండు ఏళ్లు పూర్తి కావస్తున్నా ఈ సీట్లూ పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. 2012-13 విద్యా ఏడాది 59 వేల సీట్లు, 2013-14 ఏడాది 37 వేల ఆర్టీఈ సీట్లలో పిల్లలు ఎవరూ చేరలేదు. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం కారణమని సర్వేలో తేలింది. స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సర్వే తేల్చి చెప్పింది. ఇక ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం కూడా విద్యార్థులను చేర్చుకునేందుకు సవాలక్ష అడ్డంకులుృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉపాధి కోసం వలస వచ్చివారి పిల్లలను నివాస ధ్రువీకరణ పత్రం లేదనే నెపంతో ఆర్టీఈ కింద తమ సంస్థలో చేర్చుకోవడానికి ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం నిరాకరిస్తోందని సర్వేలో తేలింది. అయితే ఆర్టీఈ మూల సూత్రానికి ఇది విరుద్ధమని అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. మరోవైపు ఆర్టీఈ కింద చేర్చుకున్న విద్యార్థులపై వివక్ష చూపుతూ పిల్లలను శారీరకంగా, మానసికంగా హింసించడం మూలంగా విద్యార్థులు మధ్యలోనే పాఠశాలను మానేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ విధంగా ప్రవర్తించిన యాజమాన్యంపై న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి అవసరమైన నిబంధనలు ‘ఆర్టీఈ’ చట్టం స్పష్టంగా పేర్కొన లేక పోవడం ప్రధాన లోపమని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. మెరుగు పడని మౌలిక సదుపాయాలు ఆర్టీఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఆశించిన స్థాయిలో మెరుగు పడలేదని, అవసరమైన పరిమాణంలో ఉపాధ్యాయులు కూడా లేదని సర్వే తేల్చి చెప్పింది. ‘మౌలిక సదుపాయాలు, మానవవనరుల’ పరిశీలన కోసం సర్వేలో పాల్గొన్న అధికారులు బెంగళూరు అర్బన్, రూరల్, కోలారు, చిక్కబళాపుర, తుమకూరు, రామనగరం, శివమొగ్గ, దావణగెరె, చిత్రదుర్గ జిల్లాల్లో 83 పాఠశాలలను ఎంపిక చేసుకున్నాయి. ఇందులో 54 పాఠశాలలు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందడం లేదని సర్వే నివేదిక తేల్చి చెప్పింది. 36 స్కూళ్లల్లో స్కూల్ డెవలప్మెంట్, మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు కాలేదని సర్వేలో తేలింది. 23 పాఠశాలలకు ఆట స్థలాలు లేవని, తొమ్మిది పాఠశాలలు అమ్మాయిల కోసం ప్రత్యేక శౌచాలయాలను నిర్మించలేదని సర్వేలో తేలింది. ఈ విషయమై సర్వే కన్వీనర్ జీ. నరసింహారావు మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఆర్టీఈ పకడ్బంధీగా అమలు కావడానికి చేపట్టాల్సిన విధానాలపై ఓ నివేదిక రూపొందించాం. దీనిని త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తాం. మౌలిక సదుపాయాల కొరత కూడా ఆర్టీఈ ఫలాలు పూర్తిస్థాయిలో అందకపోవడానికి కారణం’ అని పేర్కొన్నారు. -
6 నుంచి ఆర్టీఈ ప్రవేశ ప్రక్రియ ప్రారంభం
సాక్షి,బెంగళూరు: రాబోయే విద్యా ఏడాది (2014-15)కి ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం (రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్-ఆర్టీఈ) కింద ప్రవేశ ప్రక్రియ వచ్చేనెల 6 నుంచి ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది ఈ చట్టం కింద ఎల్కేజీ, ఒకటో తరగతికి అర్హులైన పిల్లలకు ప్రవేశం కల్పించనున్నారు. అల్పాదాయ, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆర్టీఈ చట్టాన్ని అమల్లోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ప్రైవేటు విద్యా సంస్థలు ఆయా తరగతిలోని మొత్తం సీట్లలో 25 శాతాన్ని ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు కచ్చితంగా కేటాయించాల్సిందే. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఆర్టీఈ క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో అధికారికంగా అందుబాటులో ఉంచింది. ఇందులోని వివరాల ప్రకారం.... జనవరి 6న ప్రతి బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి కార్యాలయంలో స్థానిక విద్యా సంస్థల్లో ఆర్టీఈ కింద అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు నోటీసు బోర్డులో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులు సంబంధిత పాఠశాలలో కాని లేదా బీఈఓ కార్యాలయాల్లో ఉచితంగా పొందవచ్చు. జన వరి 7 నుంచి ఫిబ్రవరి 8 తేదీల్లో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్చదలిచిన పాఠశాలలో దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తుల్లో అర్హత కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి ఆ వివరాలను స్థానిక బీఈవో అధికారుల విద్యాసంస్థల యాజమాన్యం ఫిబ్రవరి 17లోపు అందజే యాల్సి ఉంటుంది. సదరు బీఈవో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి తుది జాబితాను కార్యాలయంతో పాటు విద్యా సంస్థల నోటీసు బోర్డులో అదేనెల 28న పెట్టాల్సి ఉంటుంది. అటుపై విద్యా ఏడాది ప్రారంభం రోజు నుంచి ఆర్టీఈ కింద అడ్మిషన్ పొందిన విద్యార్థులు తము ఎంచుకున్న పాఠశాలకు వెళ్లవచ్చు. నిధుల వ్యయం ప్రభుత్వానిదే! ఆర్టీఈ కింద అన్ఎయిడెడ్ పాఠశాలల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థుల చదువుకు అయ్యే మొత్తాన్ని (ఒక్కొక్కరికి ఏడాదికి రూ.11,500) ప్రభుత్వమే భరిస్తుంది. ఇందులో 65 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం, 35 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ప్రతి విద్యా సంస్థ మొత్తం సీట్లలో 25 శాతం సీట్లు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు కేటాయించాల్సి ఉంటుంది. వీటిలో 7.5 శాతం ఎస్సీ, 1.5 శాతం ఎస్టీ, 3 శాతం వికలాంగులకు, 2 శాతం హెచ్ఐవీ పీడిత విద్యార్థులకు కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన సీట్లలో ఓబీసీ వర్గానికి చెందిన విద్యార్థులు అడ్మిషన్ పొందవచ్చు. మరింత సమాచారం కోసం www.schooleducation.kar.nic. in లో సంప్రదించవచ్చు. -
సిగ్గు పడాలి
న్యూస్‌లైన్ బృందం, అనంతపురం : జిల్లాలో 2,963 ప్రాథమిక, 504 ప్రాథమికోన్నత, 602 ఉన్నత పాఠశాలలున్నాయి. అలాగే ప్రత్యేకావసరాల పిల్లల (వికలాంగులు) కోసం 13 పాఠశాలలు నడుస్తున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలుండాలి. అయితే, జిల్లాలో ఎక్కడా ఆ పరిస్థితి కన్పించడం లేదు. చాలా చోట్ల మరుగుదొడ్లు లేక విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఉన్న చోట కూడా నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారాయి. మొత్తం 4,069 ప్రభుత్వ పాఠశాలలకు గాను 666 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని గుర్తించిన ఆర్వీఎం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంతో ప్రభుత్వం 2011-12 విద్యా సంవత్సరంలో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఒక్కో మరుగుదొడ్డికి రూ.45 వేల చొప్పున మొత్తం రూ.2.99 కోట్లు విడుదల చేసింది. ఇందులో ఇప్పటివరకు 600 పూర్తికాగా, 66 మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టణాల్లో మునిసిపల్ ట్యాంకర్ల ద్వారా మరుగుదొడ్లకు నీటిని సరఫరా చేస్తున్నామని అంటున్నారు. గ్రామీణ పాఠశాలల్లో మరుగుదొడ్లపై సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేసి, వాటికి ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే... చాలా చోట్ల సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో ఆయా పాఠశాలల్లో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి పూర్తి స్థాయిలో మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. రెండు నెలల్లో సమస్య పరిష్కరిస్తాం ప్రతి యేటా మరుగుదొడ్లు లేని ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి, వాటిని నిర్మిస్తున్నాం. అయితే... పర్యవేక్షణ సరిగా లేక అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడంతో సెలవుల్లో ఇతరులు ప్రవేశించి మరుగుదొడ్లను అధ్వానం చేస్తున్నారు. వీటిపై స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు దృషి ్టసారించేలా అవగాహన కల్పిస్తాం. ఏదిఏమైనా రెండు నెలల్లో పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్యను పరిష్కరించి తీరతాం. - రామారావు, రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్టు ఆఫీసర్ -
చట్టం వచ్చినా... మనకు పట్టదా?
ప్రేమగా చెవి మెలిపెట్టి, తియ్యగా లడ్డూ తినిపించే చట్టం... రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్! ఆర్‌నుంచి పద్నాలుగేళ్ల వయసు పిల్లలంతా చదివి తీరాల్సిందే. డబ్బుల్లేవా? ప్రభుత్వం ఇస్తుంది. సీట్లు లేవా? ప్రభుత్వమే ఇప్పిస్తుంది. చదవడం ముఖ్యం. పిల్లలంతా చదువుకుని పైకి రావడం ముఖ్యం. ఇదే మన ప్రభుత్వం ధ్యేయం, లక్ష్యం, ఆశ, ఆకాంక్ష కూడా. ఇదెంత గొప్ప చట్టమో తెలుసా? మూడేళ్ల క్రితం - ఈ చట్టం అమలుకు ముందు మన్మోహన్ సింగ్ పెద్ద స్పీచ్ ఇచ్చారు! భారతదేశ చరిత్రలోనే ఇలా ఒక కొత్త చట్టం గురించి దేశ ప్రధాని ప్రసంగించడం అదే మొదటిసారి!! చట్టం రానైతే వచ్చింది. కంప్లైంట్లే ఎక్కువయ్యాయి. ‘ఉచిత నిర్బంధ విద్య’ బాలల హక్కు అయినప్పుడు... ఆ హక్కుకు భంగం వాటిల్లినప్పుడు ఫిర్యాదు ఎవరికి చేయాలన్నదే అసలు ఫిర్యాదు! దీనిపై ‘సాధన’ చేస్తున్న నిర్విరామ పోరాటమే ఈవారం ‘ప్రజాంశం’. ఇప్పటికీ కొన్ని గ్రామాలకెళితే...అమ్మానాన్నలతోపాటు పిల్లలు కూడా పొలానికెళ్లే దృశ్యాలు మన కంటపడతాయి. కొన్ని ఊళ్లలో అయితే బడి పక్కనే ఉన్న కల్లుదుకాణాలు కనిపిస్తాయి. గిరిజన తండాలకెళితే బడి ఆవరణలోనే కట్టేసి ఉన్న బర్రెలు, బడి వరండాల్లోనే ఏర్పాటు చేసిన సంతలు కూడా కనిపిస్తాయి. ‘విద్యాహక్కు చట్టం’ వచ్చాక కూడా ఇదేం దుస్థితి అని ప్రశ్నిస్తారు సిహెచ్ మురళీమోహన్. గత ఇరవైఏళ్లుగా ఆయన ‘సాధన’ పేరుతో విద్యాహక్కు చట్టం కోసం పోరాడి... ఇప్పుడు చట్టం వచ్చాక దాని అమలు కోసం పోరాడుతున్నారు! ‘‘2010 ఏప్రిల్ 1 తేదీని సువర్ణాక్షరాలతో లిఖించుకోవచ్చు. ఆ రోజు విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు. ప్రపంచమంతా ఒక్క గొడుగుకిందకు చేరుతున్న తరుణంలో అక్షరజ్ఞానం లేని వ్యక్తిని వింతపశువుతో కూడా పోల్చలేం. విద్యాహక్కు చట్టం కోసం ఉన్నికృష్ణన్ కోర్టులో కేసు వేసినపుడు తీర్పుసమయంలో న్యాయమూర్తి మాట్లాడుతూ...‘ప్రస్తుతం మన దేశంలో చదువుకున్నవారే జీవించినట్టు...మిగతావారంతా మృతజీవులే’ అన్నారు. అంతటి ప్రాధాన్యత గల చట్టం వచ్చాక లెక్క ప్రకారం మన విద్యావిధానాల్లో గొప్ప మార్పులు రావాలి. అయితే పొరుగు రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రానికి మాత్రం ఆ చట్టం అందని ద్రాక్ష చందాన తయారయింది’’....అని అంటోన్న మురళీమోహన్ ఆవేదన వెనకున్న సత్యాలు వింటే అక్షర జ్ఞానం లేనివారికి కూడా ఆవేశం వస్తుంది. చదివించుకునే స్తోమత ఉంటేనే పిల్లల్ని చదివించాలి అనే రోజులు పోయాయి. ఇప్పుడు ఈ చట్టం పుణ్యాన దేశంలోని బాలలందరూ బడుల్లోనే ఉండాలి. ఆ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే. ఒక్క రూపాయి కూడా విద్యార్థి నుంచి ఆశించకుండా విద్యబోధించాలన్నది ఆ చట్టం లక్ష్యం. విద్య ఒక్కటే కాదు దానికి సంబంధించి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసే బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఈ విషయంలో ఏమైనా తేడా వస్తే విద్యాచట్టం కళ్లెర్రజేస్తుంది. అవసరమైతే కర్ర పట్టుకుంటుంది కూడా. ఈ అవగాహననంతటినీ ప్రతి ఇంటి ముంగిటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు మురళీమోహన్. ‘సాధన’ లక్ష్యం... బాలల హక్కుల కోసం పోరాడుతున్న ‘సాధన’ సంస్థ హైదరాబాద్‌లో 1992లో స్థాపించారు. 2010 వరకూ బాలలకు ఏ అన్యాయం జరిగినా... వీధుల్లోకి వెళ్లి ధర్నాలు, ర్యాలీలు చేసి పోరాడిన మురళీమోహన్ ఇప్పుడు నేరుగా ఢిల్లీకి ఉత్తరాలు రాస్తున్నారు. ఇప్పటివరకూ సాధన లక్షమంది బాలకార్మికుల్ని బడుల్లో చేర్పించింది. మెదక్, కర్నూలు, నిజామాబాద్ జిల్లాలోని 700 గ్రామాల్లో సాధన సిబ్బంది పని చేస్తున్నారు. ఆ గ్రామాల్లో పిల్లలెవరూ పనుల్లోకి వెళ్లరు. ఒకవేళ అలా జరిగితే...సాధన వెంటనే స్పందిస్తుంది. సంబంధిత అధికారులకు చెప్పి దగ్గరుండి అక్షరాలు దిద్దిస్తోంది. ‘‘గ్రామాల్లో బాలకార్మికుడిని బడికి పంపడం అంటే చిన్న విషయం కాదు. ముందు తల్లిదండ్రుల్ని ఒప్పించాలి. తర్వాత ఆ చిన్నారి ఎవరిదగ్గరయితే పనిచేస్తున్నాడో ఆ పెద్దమనిషిని ఒప్పించాలి. పోలీసుల్ని, మమ్మల్ని చూసి భయపడి స్కూల్లో చేర్పించినా...ఆ కుర్రాణ్ని మళ్లీ పనిలో పెట్టేవరకూ నిద్రపోరు కొందరు. ‘అక్షరం అన్నం పెట్టాలంటే పదేళ్లు పడుతుంది. అదే వాడు పనిలోకి పోతే...వాడి పొట్టకి వాడు తెచ్చుకుంటాడు’ అనే పేద తల్లిదండ్రుల్ని ఒప్పించడం తేలికే గాని...వారి పిల్లల్ని బడిలో కొనసాగించడం మాత్రం చాలా కష్టం. అందుకే డ్రాప్ అవుట్స్ లేకుండా చూసుకోవడాన్ని కూడా ‘సాధన’ తన బాధ్యతగా తీసుకుంది. అలాగే పల్లెబడుల్లో ఆడపిల్లలకు రక్షణ కల్పించడంకోసం ఉద్యమిస్తోంది. హక్కుల పెట్టె... ‘‘బాలలు ఏడు, ఎనిమిది తరగతులు దాటగానే రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి విషయాన్ని నేరుగా వచ్చి మాకు చెప్పలేరు. దీనికోసం మేం వంద పాఠశాలలో ‘బాలల హక్కుల పెట్టె’ పెట్టాం. పదిరోజులకొకసారి మా సిబ్బంది వెళ్లి అందులో పిల్లలు వేసిన చిట్టీలు తీసి చదివి... వారికి న్యాయం జరిగేలా చూస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య మామూలే. ఇప్పుడు ఈ చట్టం వచ్చాక... తేలిగ్గా తీసుకోవడం కుదరదు. మా కంటపడ్డ ఏ పాఠశాలనూ మేం వదల్లేదు. అన్నింటిపై ఫిర్యాదు చేసి దగ్గరుండి కట్టించేవరకూ ఊరుకోలేదు. అలాగే సంస్థ పెట్టిన కొత్తలో ‘సాధన’ పేరుతో మాసపత్రికను నడిపించాం. అందులో మన విద్యావిధానంలో రావాల్సిన మార్పులు, దేశంలో ఇతర ప్రాంతాల్లో విద్యలో వచ్చిన మార్పులు...వంటి విషయాలు ఉండేవి. ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గరున్న సిలబస్ బతకడానికి ఉపయోగపడేది కాదంటూ మేం రాసిన కథనాలు చాలామంది ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని ఆలోచింపజేశాయి’’ అంటూ మురళీమోహన్ తమ సంస్థ కార్యకలాపాల గురించి వివరంగా చెప్పారు. బాలల హక్కుల గురించి సాధన లాంటి సంస్థలు చాలా ఉన్నప్పటికీ విద్యాహక్కు చట్టం గురించి ప్రచారం చేసే పనిమాత్రం ‘సాధన’ స్థాయిలో జరగడం లేదనే చెప్పాలి. బస్సు యాత్ర... విద్యాహక్కు చట్టంపై అవగాహన పెంచేందుకు సాధన కొత్త పథకం తయారుచేసింది. సేవ్ ద చిల్డ్రన్‌తో చేయి కలిపి ‘విద్యా హక్కు ప్రచార రథం’ పేరుతో ఒక బస్సుని మెదక్ జిల్లా మొత్తం తిప్పుతోంది. విద్యాహక్కు చట్టం అనే ఆయుధం ప్రతి ఒక్కరు చేతబడితే మన విద్యావ్యవస్థలోనే కాదు సమాజంలో కూడా ఊహకందని మార్పులొస్తాయని అంటున్నారు మురళి. ‘‘ఈ చట్టంలో ప్రధానమైన విషయం ఎస్సి, ఎస్టి పిల్లల్లో ఇరవై అయిదుశాతం పిల్లలకు కార్పోరేట్ బడులు ఉచితంగా విద్య చెప్పాలి. ఆ పనిని ప్రభుత్వ అధికారులు దగ్గరుండి చేయించాలి. చట్టంవచ్చి మూడేళ్లవుతున్నా...మన రాష్ట్రంలో ఒక్క ఎస్సి, ఎస్టి విద్యార్థి కూడా ఉచితంగా కార్పోరేట్ బడిలో అక్షరం నేర్చుకోలేదు. అదొక్కటేనా...బడుల్లో పిల్లల్ని గురువులు దండించడంపై రాష్ర్టంలో ఏదో ఒక పాఠశాల నుంచి రోజుకో వార్త వినిపిస్తోంది. అలాంటి సంఘటనల్లో ఉపాధ్యాయుడ్ని యాజమాన్యం మందలించడం, లేదంటే ఉద్యోగం నుంచి తీసేయడం వంటివి చేసి ఊరుకుంటున్నారు. అలాకాకుండా... కొన్ని సీరియస్ కేసుల్లో సెక్షన్ 17 చట్టం కింద కేసు పెట్టొచ్చు అన్న విషయం కూడా ఈ చట్టంకిందకే వస్తుంది. దీని గురించి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియకపోతే పోనీలే అని సరిపెట్టుకోవచ్చు. కాని దురదృష్టవశాత్తు ఉపాధ్యాయుల్లో కూడా చాలామందికి తెలియదు. ఈ అవగాహన సమస్యలన్నీ తీరాలంటే...మన రాష్ర్టంలో స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ రావాలంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఢిల్లీస్థాయిలో ధర్నాలు, ర్యాలీలు చేశాం. దాంతో తాత్కాలికంగా రాజీవ్ విద్యా మిషన్ కింద ‘రైట్ టు ఎడ్యుకేషన్ సెల్’ ఏర్పాటు చేశారు కాని దానివల్ల పెద్దగా ప్రయోజనాలు లేవు. దాంతో మేం ప్రతి చిన్న విషయానికి జాతీయ బాలల హక్కుల కమిషన్ని ఆశ్రయిస్తున్నాం. మానవ హక్కులతో సమానంగా విద్యాహక్కుకి ప్రచారం పెరగాలి. ఈ చట్ట ప్రయోజనాల్ని ప్రజలు పూర్తిస్థాయిలో పొందేవరకూ మా ‘సాధన’ పోరాటం ఆగదు’’ అంటూ ముగించారు మురళీమోహన్. దేశాభివృద్ధికి విద్యకి మించిన పెట్టుబడి మరొకటిలేదు. ప్రపంచపటంలో మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోకూడదంటే దేశంలో విద్యాహక్కు చట్టం పూర్తిస్థాయిలో అమలవ్వాలి. అందరికీ అక్షరం ఉంటే...అభివృద్ధి మన దేశానికి టాగ్ లైన్ అవుతుంది. దీనికోసం మురళీమోహన్లాంటివారు చాలామంది కృషిచేయాలి. అలాంటివారు ఎదురైతే వారితో చేయి కలపడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ‘‘విద్యాహక్కు చట్టం వచ్చి మూడేళ్లు అవుతున్నా...మన రాష్ర్టంలో దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ని ఏర్పాటుచేయలేకపోయింది ప్రభుత్వం. కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో చట్టం వచ్చిన వెంటనే ‘స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్’ని ఏర్పాటు చేసుకున్నారు. విద్యాపరంగా ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా వెంటనే ఫిర్యాదు చేస్తున్నారు. మన దగ్గర మాత్రం చట్టాన్ని తీసుకెళ్లి అందనంత దూరంలోనే ఉంచారు. నేనంటే ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నాను కాబట్టి నేరుగా ఢిల్లీలోని ‘బాలల హక్కుల జాతీయ కమిషన్’కి ఫిర్యాదు చేస్తున్నాను. మరి గ్రామాల్లోని సామాన్యులు ఫిర్యాదు చేయాలంటే ఎలా?చేసేది లేక...మా సంస్థ సిబ్బంది తల్లిదండ్రుల నుంచి, విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని ఇంగ్లీషులోకి మార్చి ఢిల్లీకి పంపిస్తున్నాం. వాళ్లు వెంటనే స్పందించి సంబంధిత జిల్లా కలెక్టర్‌కి సమన్లు పంపిస్తున్నారు. అదే కమిషన్ ఇక్కడ ఉంటే ఇంకా చాలా సమస్యలు బయటకి వస్తాయి. చాలామంది సామాన్యులకు న్యాయం జరుగుతుంది’’