
సాక్షి, హైదరాబాద్: పేద, దళిత వర్గాల విద్యార్థులకు విద్యను అందించాలన్న దృక్పథం రాష్ట్ర ప్రభుత్వంలో కొరవడిందని, విద్యాహక్కు చట్టం అమల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్ రెడ్డి విమర్శించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితమైందన్నారు. బడ్జెట్‌లో రూ.13 వేల కోట్లు పెట్టిన ప్రభుత్వం కనీసం రూ.200 కోట్లను ఖర్చుచేసినా విద్యావ్యవస్థలో మార్పు వచ్చేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా విద్యాహక్కు చట్టం అమలు ద్వారా పేద దళిత విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం అడ్మిషన్లు లభించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.