విద్యా సంస్థల నియంత్రణకు ప్రత్యేక కమిషన్లు | Special Commissions for Regulation of Educational Institutions | Sakshi
Sakshi News home page

విద్యా సంస్థల నియంత్రణకు ప్రత్యేక కమిషన్లు

Published Sat, Jul 27 2019 4:22 AM | Last Updated on Sat, Jul 27 2019 4:22 AM

Special Commissions for Regulation of Educational Institutions - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనల మేరకు మౌలిక సదుపాయాల కల్పన, ఫీజుల వసూ లు, ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు వీలుగా పాఠశాల విద్య, ఉన్నత విద్యలకు వేర్వేరుగా ప్రత్యేక కమిషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ శుక్రవారం శాసనసభలో బిల్లులను ప్రవేశపెట్టారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు చైర్మన్లుగా ఉండే ఈ కమిషన్లలో ఆయా రంగాల్లో నిపుణులు, మేధావులను సభ్యులుగా నియమించనున్నారు. రెండు కమిషన్లకు సివిల్‌ కోర్టు అధికారాలుంటాయి. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడం, విద్యా సంస్థల్లో చేరికలు పెంచడం, డ్రాపవుట్లు తగ్గించడం, సుస్థిర విద్యాభివృద్ధి సాధన, లక్ష్యాల సాధన దిశగా విద్యార్థులకు అవకాశాలు కల్పించడం ఈ బిల్లుల ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. 

పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌..
ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల కింద ఉన్న 62,063 పాఠశాలల్లో 70,41,568 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 2,87,423 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీటితో పాటు 778 ఉపాధ్యాయ శిక్షణ సంస్థలున్నాయి. ఈ సంస్థలను పాఠశాల విద్యా శాఖ పర్యవేక్షిస్తోంది. బోధన పద్ధతులు, పాఠ్యాంశాలు, కోర్సులు, స్కూళ్ల నిర్వహణ, సదుపాయాల కల్పన, పరీక్షల విధానం ఇలా అన్నింటిలోనూ విద్యా రంగంలో వస్తున్న ఆధునిక పోకడలకు అనుగుణంగా మార్పులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల పర్యవేక్షణకు ప్రత్యేక నియంత్రణ కమిషన్‌ అవసరమని ప్రభుత్వం పేర్కొంది. విద్యా సంస్థల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడం, ఫీజుల నియంత్రణ, స్కూళ్ల పర్యవేక్షణ మరింత సమర్థంగా ఉండేలా ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లన్నీ ఈ కమిషన్‌ పరిధిలోకి రానున్నాయి. కమిషన్‌కు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్మన్‌గా, జాతీయ స్థాయిలో పేరొందిన నిపుణుడు వైస్‌ చైర్మన్‌గా ఉంటారు. ఐదుగురు విద్యావేత్తలు, ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ కార్యదర్శి స్థాయి వ్యక్తి సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తారు. కమిషన్‌కు ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. 

కమిషన్‌ అధికారాలు, విధులు..
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ప్రవేశాలు, బోధన, బోధకుల అర్హతలు, విద్యా ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాగుతున్నాయో? లేదో పరిశీలిస్తుంది. ప్రైవేటు స్కూళ్లలోని ఫీజుల నియంత్రణ అధికారం కూడా ఉంటుంది. జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం ఆయా సంస్థల్లో 25 శాతం సీట్లు పేద వర్గాలకు అందేలా చూస్తుంది. ఆయా స్కూళ్ల ఫీజుల నిర్ణయానికి అక్రిడిటేషన్‌ ఏజెన్సీని ఏర్పాటు చేస్తుంది. ప్రమాణాలు, నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై చర్యలకు సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇస్తుంది. ఆయా సంస్థలకు జరిమానా విధించడం, నిబంధనలు పాటించని సంస్థల గుర్తింపు రద్దు చేసే అధికారాలు ఉంటాయి. కమిషన్‌కు సివిల్‌ కోర్టు అధికారాలు ఉంటాయి. ఆయా అంశాలపై ఎవరినైనా పిలిచి విచారించే అధికారం ఉంటుంది. కమిషన్‌ ఆదేశాలను సవరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

కమిషన్‌ పరిధిలోకి ఇంటర్, ప్రైవేటు వర్సిటీలు..
ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ పరిధిలోకి ఇంటర్మీడియెట్‌ కళాశాలలతోపాటు ప్రైవేటు, డీమ్డ్‌ యూనివర్సిటీలను కూడా చేరుస్తూ మరో బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్‌కు కూడా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్మన్‌గా, ఇద్దరు ప్రొఫెసర్లు, ఒక ఐఏఎస్‌ అధికారి, ఉన్నత విద్యా సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ కార్యదర్శి స్థాయి వ్యక్తి సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధనకు కమిషన్‌ చర్యలు చేపడుతుంది. ప్రవేశాలు, బోధన, పరీక్షలు, పరిశోధన, బోధన సిబ్బంది అర్హతలు, మౌలిక సదుపాయాలు నిబంధనల మేరకు ఉన్నాయో.. లేదో పరిశీలిస్తుంది. జూనియర్, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ కాలేజీలు, అన్ని ప్రైవేటు యూనివర్సిటీలు కమిషన్‌ పరిధిలోకి వస్తాయి. వీటితోపాటు పాఠశాల విద్య నియంత్రణ కమిషన్‌కు ఉన్నట్టే ఇతర అధికారాలు, విధులు ఉంటాయి. కాగా ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ ఏర్పాటుతో ఇప్పటివరకు ఫీజులు, ప్రవేశాలను పర్యవేక్షిస్తున్న ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) కనుమరుగు కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement