నేటి నుంచి డౌన్‌లోడ్ ప్రక్రియ ప్రారంభం
ఈ నెల 18 నుంచి 30 వరకు పరీక్షలు
హాజరుకానున్న 7.25 లక్షల మంది విద్యార్థులు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి 30 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థుల హాల్‌టికెట్లను సిద్ధం చేసినట్లు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ కోడ్
నంబర్‌తోను, విద్యార్థులు తమ పుట్టిన తేదీని నమోదు చేసి సోమవారం మధ్యాహ్నం నుంచి www.bse.ap.gov.in నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలున్నారు. గతేడాది పదో తరగతి తప్పి తిరిగి ప్రవేశం పొందినవారు మరో 1,02,528 మంది కూడా రెగ్యులర్‌గా పరీక్షలు రాయనున్నారు.
ఈ ఏడాది మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగుస్తుండగా, మరో రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలుంటాయి. విద్యాశాఖ 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్వాడ్స్‌ను సిద్ధం చేసింది. 130కి పైగా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment