Tenth public examinations
-
పదో తరగతి హాల్‌టికెట్లు సిద్ధం
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 18 నుంచి 30 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థుల హాల్‌టికెట్లను సిద్ధం చేసినట్లు పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలల యాజమాన్యాలు స్కూల్ కోడ్ నంబర్‌తోను, విద్యార్థులు తమ పుట్టిన తేదీని నమోదు చేసి సోమవారం మధ్యాహ్నం నుంచి www.bse.ap.gov.in నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలున్నారు. గతేడాది పదో తరగతి తప్పి తిరిగి ప్రవేశం పొందినవారు మరో 1,02,528 మంది కూడా రెగ్యులర్‌గా పరీక్షలు రాయనున్నారు. ఈ ఏడాది మొత్తంగా 7,25,620 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 3,473 సెంటర్లను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28వ తేదీతో ముగుస్తుండగా, మరో రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్ పరీక్షలుంటాయి. విద్యాశాఖ 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్వాడ్స్‌ను సిద్ధం చేసింది. 130కి పైగా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. -
ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు–2023 ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ముగింపు తేదీకి అటుఇటుగా ఒకరోజు వ్యవధిలో టెన్త్ పబ్లిక్ పరీక్షలను ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్(ఎస్సెస్సీ బోర్డు) షెడ్యూల్‌ను రూపొందించింది. ఇంటర్ పరీక్షలు మార్చి 15న ప్రారంభమై ఏప్రిల్ 4వ తేదీతో ముగుస్తాయి. రాష్ట్రంలో పాఠశాల విద్యలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో.. టెన్త్ పబ్లిక్ పరీక్షలనూ అదే ప్యాట్రన్‌లో చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. సీబీఎస్ఈలో పబ్లికపరీక్షలు రోజు విడిచి రోజు జరుగుతాయి. టెన్త్ పబ్లిక్ పరీక్షలను కూడా రోజు విడిచి రోజు నిర్వహించాలని ఎస్సెస్సీ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. టెన్త్ పబ్లిక్ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహించేలా ప్రభుత్వం ఇంతకు ముందు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆరు పేపర్ల పరీక్షలను రోజు విడిచి రోజు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఇటీవల పలు విద్యాసంస్థల యాజమాన్యాలతో జూమ్ మీటింగ్ నిర్వహించి.. పలు అంశాలపై చర్చించారు. సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్‌లు కలిపి ప్రశ్నపత్రాలిస్తారు. పీఎస్‌లో 16, ఎన్ఎస్లో 17 ప్రశ్నలుంటాయి. సమాధాన పత్రాలు రెంటికీ వేర్వేరుగా రాయాల్సి ఉంటుంది. ముందు పీఎస్, అనంతరం ఎన్ఎస్ ప్రశ్నలుంటాయి. అలానే సమాధానాలూ రాయాలి. పేర్లు, వివరాల్లో తప్పులు సరిచేసుకునేందుకు.. ఎడిట్ ఆప్షన్ పరీక్ష ఫీజును పాఠశాలల యాజమాన్యాలు కట్టినా, లేదా సీఎఫ్ఎంఎస్ ద్వారా ఎవరు కట్టినా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ తదితర వివరాలు తప్పుగా నమోదు చేసి ఉంటే కనుక ఆందోళన చెందాల్సిన పనిలేదని, పరీక్ష ఫీజు చెల్లించిన అనంతరం ఎడిట్ ఆప్షన్ ఇస్తామని దేవానందరెడ్డి ఆయా యాజమాన్యాలకు వివరించారు. -
టెన్త్‌లో సైన్స్‌కు ఒకే పేపర్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సైన్సు పరీక్ష ఇకనుంచి ఒకే పేపర్‌గా జరుగుతుంది. సైన్సులో భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రాలను రెండు వేర్వేరు పేపర్లుగా కాకుండా ఒకే ప్రశ్నపత్రంతో నిర్వహించనున్నారు. ఈ రెండు సబ్జెక్టుల ప్రశ్నలను రెండు విభాగాలుగా.. ఒకే ప్రశ్నపత్రంలో ఇస్తారు. ఈ విద్యాసంవత్సరం నుంచి టెన్త్‌లో 6 పేపర్ల విధానాన్నే అనుసరిస్తున్నట్టు ప్రభుత్వం ఇంతకుముందు ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) బ్లూప్రింట్లు, నమూనా ప్రశ్నపత్రాలను రూపొందించిన సంగతి తెలిసిందే. బ్లూప్రింట్ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు గతంలో టెన్త్ పరీక్షలు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో 11 పేపర్లలో జరిగేవి. అంతర్గత మార్కులు 20 ఉండగా పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు. 2016–17 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలు అంతర్గత మార్కుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు రావడంతో తరువాత టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులను రద్దు చేసి 100 మార్కులకు నిర్వహించేలా ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం కరోనా సమయంలో పరీక్షల నిర్వహణకు తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో 11 పేపర్లకు బదులు పరీక్షను 7 పేపర్లకు ప్రభుత్వం కుదించింది. తెలుగు, ఇంగ్లిష్,, హిందీ, మేథ్స్, సోషల్ స్టడీస్ పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పేపర్లను 50 మార్కుల చొప్పున రెండురోజుల పాటు నిర్వహించారు. 2022 టెన్త్ పబ్లిక్ పరీక్షలు కూడా ఇదే విధానంలో జరిగాయి. కాగా, సీసీఈ విధానంలో 4 ఫార్మేటివ్, 2 సమ్మేటివ్ పరీక్షలను నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను ఏడాదిలో నిరంతరం మూల్యాంకనం చేస్తున్నందున ఇక నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలను 7 లేదా 6 పేపర్లకు కుదించి నిర్వహించడం మంచిదని ఎస్సీఈఆర్టీ ప్రభుత్వానికి ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదనలు పంపించింది. పరిశీలించిన ప్రభుత్వం 2022–23 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు 6 పేపర్లతోనే నిర్వహించేలా జీవో–136ను ఆగస్టు 22న విడుదల చేసింది. గత ఏడాది ఏడు పేపర్లుగా టెన్త్ పరీక్షలు నిర్వహించిన సమయంలో సైన్సును ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పేపర్లుగా వేర్వేరుగా నిర్వహించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి మొత్తం పేపర్లను ఆరింటికే కుదించినందున సైన్సును రెండు పేపర్లుగా కాకుండా ఒకే పేపర్‌గా 100 మార్కుల ప్రశ్నపత్రంతో ఒకేరోజు నిర్వహించనున్నారు. పరీక్ష ఒకటే.. సమాధాన పత్రాలు రెండు ఇకనుంచి సైన్సు ఒకే పేపర్‌గా 33 ప్రశ్నలతో 100 మార్కులకు నిర్వహించనున్నారు. మొత్తం 33 ప్రశ్నలను 2 భాగాలుగా చేసి ఫిజికల్ సైన్సులో 16 ప్రశ్నలను, బయోలాజికల్ సైన్సులో 17 ప్రశ్నలను ఇవ్వనున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలను వేర్వేరు బుక్లెట్లలో రాయాల్సి ఉంటుంది. ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు సమాధానాలను వేర్వేరు టీచర్లు మూల్యాంకనం చేయాల్సి ఉన్నందున ఇలా రెండు సమాధానాల బుక్లెట్లను ఇవ్వనున్నారు. 25 నుంచి ఫీజుల చెల్లింపు మార్చి–2023లో నిర్వహించే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలస్య రుసుము రూ.50తో డిసెంబర్ 11 నుంచి 20 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 నుంచి 25 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించారు. -
టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఆరు పేపర్లే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2022–23 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో 136ను విడుదల చేశారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాల విద్యలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. సీబీఎస్ఈ టెన్త్‌లో ప్రస్తుతం పబ్లిక్ పరీక్షలు ఆరు పేపర్లలో మాత్రమే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలనూ అదే రీతిలో ఆరు పేపర్లలోనే నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని ప్రకారం ఇకపై టెన్త్ పరీక్షల్లో ఫిజికల్ సైన్స్ (పీఎస్), బయోలాజికల్ సైన్స్ (ఎన్ఎస్) సబ్జెక్టులు కలిపి ఒక్క పేపర్‌గానే ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు కూడా ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. 11 పేపర్ల నుంచి ఆరుకు తగ్గింపు.. టెన్త్ పబ్లిక్ పరీక్షలు తొలుత 11 పేపర్లతో ప్రారంభమై ఇప్పుడు ఆరుకు తగ్గాయి. గతంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమల్లో లేనప్పుడు 11 పేపర్లలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరిగేవి. ఆ పరీక్షలకు ముందు నాలుగు యూనిట్ టెస్టులు, రెండు టర్మ్ టెస్టులు నిర్వహించేవారు. సీసీఈ విధానానాన్ని ముందుగా 8వ తరగతి వరకే అమల్లోకి తెచ్చినప్పటికీ.. ఆ తర్వాత 9, 10 తరగతులకూ వర్తింపచేశారు. సీసీఈ విధానంలో విద్యార్థులకు నాలుగు ఫార్మేటివ్ పరీక్షలు, రెండు సమ్మేటివ్ పరీక్షలను నిర్వహించేవారు. అంతేకాకుండా వివిధ ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలతో సీసీఈ విధానం అమలు చేశారు. విద్యార్థులపై పరీక్షల భారం తగ్గించేందుకు.. ఈ నేపథ్యంలో విద్యార్థులను పబ్లిక్ పరీక్షల్లో మరింత నిశితంగా పరీక్షించాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) పాఠశాల విద్యా శాఖకు నివేదికను సమర్పించింది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు సీబీఎస్ఈ.. టెన్త్ పబ్లిక్ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహిస్తోందని నివేదించింది. దీన్ని అనుసరించి రాష్ట్రంలో కూడా ఆరు లేదా ఏడు పేపర్లలో నిర్వహిస్తే సరిపోతుందని తెలిపింది. దీంతో ప్రభుత్వం టెన్త్ పబ్లిక్ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది. -
టెన్త్‌కు కోవిడ్ ఎఫెక్ట్
సాక్షి, అమరావతి: వరుస వేవ్‌లతో ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి విద్యారంగాన్నీ వదల్లేదు. కోవిడ్ ప్రభావంతో వరుసగా రెండేళ్ల పాటు టెన్త్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొనగా తాజాగా వెలువడ్డ 2022 పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం బాగా తగ్గిపోయింది. సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా బాలురపై బాలికలు పైచేయి సాధించారు. పరీక్షలకు 6,20,788 మంది నమోదు చేసుకోగా 6,15,908 (99.21 శాతం) మంది హాజరయ్యారు. వీరిలో 4,14,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,16,820 మంది బాలురకు గాను 2,02,821 (64.02 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2,99,088 మంది హాజరు కాగా 2,11,460 (70.70 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురకన్నా బాలికలు 6.68% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ డి.దేవానందరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ప్రకాశం ఫస్ట్.. చివరిలో ‘అనంత’ ► 797 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ► 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. వీటిల్లో 31 ప్రైవేట్ స్కూళ్లు కాగా 18 ఎయిడెడ్ స్కూళ్లున్నాయి. ► ఉత్తీర్ణతలో ప్రకాశం జిల్లా 78.30 శాతంతో అగ్రస్థానంలో ఉండగా అనంతపురం జిల్లా 49.70 శాతంతో చివరిస్థానంలో నిలిచింది. ► ఏపీ రెసిడెన్సియల్ స్కూళ్లు 91.10 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లు 50.10 శాతంతో అత్యల్ప ఉత్తీర్ణత నమోదు చేశాయి. లాంగ్వేజెస్‌లో అధిక ఉత్తీర్ణత ఈసారి లాంగ్వేజెస్‌లలో ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. మేథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్ట్ లాంగ్వేజ్‌లో 5,64,294 (91.73 శాతం) మంది, సెకండ్ లాంగ్వేజ్‌లో 5,95,801 (97.03 శాతం) మంది, థర్డ్ లాంగ్వేజ్‌లో 6,01,644 (97.95 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మేథమెటిక్స్‌లో 4,93,839 (80.26 శాతం) మంది, జనరల్ సైన్సులో 5,05,719 (82.18 శాతం) మంది, సోషల్ స్టడీస్‌లో 5,00,975 (81.43 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఆంగ్ల మాధ్యమం విద్యార్ధుల ఆధిక్యం టెన్త్ పరీక్షల్లో తెలుగు మాధ్యమం కన్నా ఇంగ్లీషు మీడియం విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు మాధ్యమంలో 43.97 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఆంగ్ల మాధ్యమంలో 77.55 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. అత్యధికులకు ఫస్ట్ డివిజన్ టెన్త్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో అత్యధికులు ఫస్ట్ డివిజన్లో నిలిచారు. 3,17,789 మంది ఫస్ట్ డివిజన్ సాధించగా 69,597 మంది సెకండ్ డివిజన్లో, 26,895 మంది థర్డ్ డివిజన్లో నిలిచారు. రెండేళ్లుగా చదువులపై ప్రభావం కరోనా వ్యాప్తితో పాఠశాలలు తెరుచుకోని పరిస్థితుల్లో 2020, 2021లో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. మహమ్మారి వల్ల పిల్లల చదువులు బాగా దెబ్బతిన్నాయి. 2016లో 94.52 శాతం, 2017లో 91.92 శాతం, 2018లో 94.61 శాతం, 2019లో 94.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండేళ్లుగా కరోనాతో పిల్లల చదువులు ముందుకు సాగకపోవడంతో ఆ ప్రభావం ఈసారి టెన్త్ పరీక్షలపై పడి 67.26 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 2,01,627 మంది ఫెయిలయ్యారు. -
టెన్త్ ఫలితాల్లో ర్యాంకుల ప్రకటనలపై నిషేధం
సాక్షి, అమరావతి: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలపై విద్యార్థులకు ర్యాంకులు అంటూ ప్రకటనలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలు, ట్యుటోరియల్ సంస్థలపై చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు చేస్తే ఆయా సంస్థల యాజమాన్యాలు, ఇతరులకు మూడేళ్లనుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతోపాటు రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని స్పష్టం చేసింది. ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల్లో ర్యాంకులతో ప్రకటనలు జారీచేయడాన్ని నిషేధిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ బుధవారం 83వ నంబరు జీవో జారీచేశారు. ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల్లో గతంలో గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించే వారు. 2020 నుంచి గ్రేడ్లకు బదులు విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు, ట్యుటోరియల్ విద్యాసంస్థలు విద్యార్థులకు ర్యాంకులను ఆపాదిస్తూ తమ సంస్థకే ఉత్తమ ర్యాంకులు, అత్యధిక ర్యాంకులు వచ్చాయంటూ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను పక్కదారి పట్టిస్తున్నాయి. ఇలాంటి అక్రమాలతో ఆయా విద్యాసంస్థలు విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించకుండా చర్యలు తీసుకోవాలని, వీటివల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారని పలువురు పాఠశాల విద్యాశాఖకు వినతులు ఇచ్చారు. ఏపీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్–1997 ప్రకారం ఇటువంటి మాల్‌ప్రాక్టీస్, తప్పుడు ప్రకటనలను చేసే వారికి ఏడేళ్ల వరకు జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. టెన్త్ పరీక్షల్లో గ్రేడ్లకు బదులు మార్కులతో ఫలితాలను ప్రకటించనున్నందున ఆయా సంస్థలు ర్యాంకులతో తప్పుడు ప్రకటనలు చేయరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యాసంస్థలు ఏ రూపంలోను, ఏ స్థాయిలోను ర్యాంకులతో ఇలాంటి ప్రకటనలు చేయడానికి వీల్లేదని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈ వారంలోనే ఫలితాలు ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీవరకు నిర్వహించిన టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈవారంలోనే విడుదలయ్యే అవకాశముంది. మూల్యాంకనాన్ని ముగించిన ఎస్సెస్సీ బోర్డు ఆ వివరాల కంప్యూటరీకరణ వంటి తదుపరి కార్యక్రమాల్లో నిమగ్నమైంది. టెన్త్ ఫలితాలను పదో తేదీలోపు విడుదల చేయాలన్న అభిప్రాయంతో ఉన్న బోర్డు వాటిని ఈ వారంలోనే ప్రకటించేలా చర్యలు చేపట్టింది. -
అన్ని సబ్జెక్టుల మార్కుల ఆధారంగా గ్రేడ్లు
సాక్షి, అమరావతి: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ప్రకటించేందుకు మార్కుల విధానాన్ని హైపవర్ కమిటీ ఖరారు చేసింది. బుధవారం కమిటీ తుది సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించనుంది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఎస్సెస్సీ బోర్డు ఫలితాల విడుదలపై తుది కసరత్తు చేపట్టనుంది. ఆపై వారం పది రోజుల్లో ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలియజేశాయి. అన్ని మార్కుల యావరేజ్‌తో గ్రేడ్లు ఎస్సెస్సీ పరీక్షల్లో విద్యార్థులకు వారి ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల్లోని అన్ని సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతకు ముందు ఆయా సబ్జెక్టుల్లో ఎక్కువ శాతం మార్కులు వచ్చిన(బెస్ట్ 3) సబ్జెక్టుల యావరేజ్‌ను పరిగణనలోకి తీసుకుని గ్రేడ్లు ఇవ్వడంపై కమిటీ దృష్టి పెట్టింది. అయితే బెస్ట్ 3 ప్రకారం కాకుండా అన్ని సబ్జెక్టుల మార్కుల యావరేజ్‌ను పరిగణనలోకి తీసుకోవడం వల్ల అందరికీ మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆ ప్రకారం ఫలితాలివ్వాలని కమిటీ చర్చించింది. ఈ విధానంలోనే 2020–21, 2019–20 విద్యా సంవత్సరాల విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించనున్నారు. ► 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఫార్మేటివ్–1, ఫార్మేటివ్–2 మార్కులను తీసుకుని గ్రేడ్లు ప్రకటిస్తారు. ఎఫ్ఏ(ఫార్మేటివ్ అసెస్మెంట్) పరీక్షలకు సంబంధించి లిఖిత పూర్వక పరీక్షలు, ఇతర పరీక్షలను విభజిస్తారు. ఎఫ్ఏ–1లోని లిఖిత పరీక్షకు సంబంధించిన 20 మార్కులను 70 శాతానికి పెంపుచేస్తారు. ఇతర 3 రకాల పరీక్షలకు సంబంధించిన 30 మార్కులను 30 శాతంగా పరిగణిస్తారు. ఉదాహరణకు 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఒక విద్యార్థికి ఎఫ్ఏ–1 లిఖిత పూర్వక పరీక్షలో 20 మార్కులకు 18 మార్కులు వస్తే వాటిని 70 శాతానికి పెంపుచేసి 31.5 మార్కులుగా పరిగణిస్తారు. మిగతా మూడు విభాగాల్లో 30 మార్కులకు 27 మార్కులు సాధించి ఉంటే వాటిని 30 శాతానికి కుదింపుచేసి 13.5 మార్కులు వచ్చినట్టుగా పరిగణిస్తారు. మొత్తంగా ఎఫ్ఏ–1లో ఆ విద్యార్థికి 45 మార్కులు వచ్చినట్టుగా ప్రకటిస్తారు. అదే విధంగా ఎఫ్ఏ–2 మార్కులనూ విభజిస్తారు. ఎఫ్ఏ–2లో ఆ విద్యార్థికి 47 మార్కులొస్తే కనుక ఆ రెంటినీ కలిపి 100 మార్కులకు 92 మార్కులు సాధించినట్టుగా.. గ్రేడును నిర్ణయిస్తారు. ► 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకూ గ్రేడ్లపై కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ విద్యాసంవత్సరంలో విద్యార్థులు ఫార్మేటివ్ అసెస్మెంటు(ఎఫ్ఏ) పరీక్షలు 3, సమ్మేటివ్ అసెస్మెంటు (ఎస్ఏ) పరీక్ష ఒకటి రాసి ఉన్నారు. ఫార్మేటివ్ 1, 2, 3ల మార్కులను 50గా తీసుకుంటారు. సమ్మేటివ్ పరీక్షలు 100 మార్కులకు నిర్వహించినందున వాటిని యావరేజ్ చేసి 50గా తీసుకుంటారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులను రెండింటినీ కలిపి 100 శాతానికి యావరేజ్ చేసి గ్రేడ్లు ఇవ్వనున్నారు. -
టెన్త్ పరీక్షలపై విద్యా శాఖ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2020–21 విద్యా సంవత్సరంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలను 7 పేపర్లకు పరిమితం చేయనున్నారు. కోవిడ్ కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యం కావడం, స్కూళ్లలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ 5 నెలలు ఆలస్యంగా నవంబర్ 2 నుంచి ఆరంభమైన నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ పరీక్షలను జూన్ 17వ తేదీ నుంచి నిర్వహించే అవకాశం ఉంది. టెన్త్ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బుధవారం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన అనేక అంశాలపై చర్చించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. సైన్స్‌లో రెండు పేపర్లు కరోనా కారణంగా గత ఏడాదిలో విద్యాశాఖ పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించింది. ఆ మేరకు పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించినా కరోనా తీవ్రత కారణంగా రద్దు చేసి విద్యార్థులందరినీ ఆల్‌పాస్‌గా ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో కూడా తరగతులు ఆలస్యం కావడంతో సిలబస్ కుదించి బోధన చేయిస్తున్నారు. దీంతో పాటు బోధనాభ్యసన కార్యక్రమాలు పూర్తిస్థాయిలో జరగనందున గత ఏడాది మాదిరిగానే ఈ సారి పేపర్ల సంఖ్యను 7కు కుదించారు. గత ఏడాది భాషా పేపర్లతో పాటు సబ్జెక్టు పేపర్లను కలిపి 6కు కుదించారు. ఈసారి భాషా పేపర్లు, సైన్స్ మినహా ఇతర సబ్జెక్టు పేపర్లను ఒక్కొక్కటి చొప్పున 5 ఉంటాయి. సైన్స్‌లో మాత్రం భౌతిక శాస్త్రం, వృక్ష శా్రస్తాలకు సంబంధించి వేర్వేరు పేపర్లుగా ఉంటాయి. మొత్తం 7 పేపర్లలో విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. నేరుగా 100 మార్కులకే పరీక్ష నిరంతర సమగ్ర విద్యా మూల్యాంకనం (సీసీఈ) ప్రకారం టెన్త్‌లో గతంలో ఆయా పేపర్లలో 80 మార్కులకు పరీక్షలు నిర్వహించే వారు. 20 మార్కులను అంతర్గత పరీక్షల మార్కుల నుంచి కలిపేవారు. అంతర్గత మార్కుల విషయంలో ప్రైవేట్ పాఠశాలల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం వాటిని రద్దు చేసి టెన్త్‌లో అన్ని పేపర్లను 100 మార్కులకు నిర్వహిస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో కూడా అదే విధానంలో ఒక్కో పేపర్‌ను 100 మార్కులకు నిర్వహించనున్నారు. జూలై మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నారు. వేసవి సెలవులు లేవు విద్యా సంవత్సరం, తరగతులు ఆలస్యంగా ఆరంభించడం వల్ల టెన్త్ విద్యార్థులకు సిలబస్ బోధన పూర్తి చేయడానికి పని దినాలు సర్దుబాటు కావాల్సి ఉంది. ఈ దృష్ట్యా టెన్త్ విద్యార్థులకు వేసవి సెలవులు లేకుండా తరగతులను కొనసాగించనున్నారు. సిలబస్ పూర్తి, విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధులను చేయడానికి 160 పనిదినాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. రెండో శనివారాలు, ఆదివారాలు మినహా తక్కిన అన్ని రోజులను పని దినాలుగా చేయనున్నారు. తరగతులు ఇక ‘ఫుల్ డే’ ప్రస్తుతం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు (హాఫ్ డే) నిర్వహిస్తున్న పాఠశాలలను బుధవారం నుంచి సాయంత్రం 4.30 వరకు (ఫుల్ డే) నిర్వహించేలా విద్యాశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు ఇచి్చంది. 6 నుంచి 10 తరగతి వరకు ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహిస్తారు. -
10 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 10 నుంచి పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించింది. జూన్ 10 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమై 24న ముగుస్తాయి. రోజూ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం12.15 గంటలకు ముగుస్తుంది. పరీక్షలకు సమయం తక్కువగా ఉండటంతో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఎదురుచూడొద్దని ప్రభుత్వం సూచించింది. అడ్వాన్స్ సప్లిమెంటరీకి సంబంధించి ఫీజు చెల్లింపు గడువు ఈనెల 25 వరకు ఉంది. ఈనెల 29న పరీక్ష ఫీజును సంబంధిత పాఠశాల యాజమాన్యం ట్రెజరీలో జమచేసి ఈ నెల 31 నాటికి జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయానికి కంప్యూటర్ ఎక్స్ట్రాక్ట్స్ సమర్పించాలని, వీటిని జూన్ 3లోగా జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రభుత్వ పరీక్షల విభాగానికి సమర్పించాలని స్పష్టం చేసింది. అపరాధరుసుము రూ.50తో పరీక్షలకు రెండ్రోజుల ముందు వరకు చెల్లించే వెసులుబాటు కల్పించినా గడువు తేదీలోగా చెల్లించాలని విద్యార్థులకు సూచించింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం.. పదోతరగతి పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఫలితాలు వెలువడిన నాటి నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ చేయించాలనుకుంటే ప్రతి సబ్జెక్టుకు రూ.500 చొప్పున ప్రభుత్వ ఖజానా హెడ్ అకౌంట్‌టో నిర్దేశిత హెడ్లలో చెల్లించాలి. లేదా డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, తెలంగాణ, హైదరాబాద్ కార్యాలయంలో వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్ కోసం ప్రతి సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున చలానా కట్టాలి. దరఖాస్తు పత్రాన్ని www. bse. telangana. gov. in లేదా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం నుంచి తీసుకోవాలని సూచించింది. డిమాండ్ డ్రాఫ్ట్‌లను అంగీకరించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. రీవెరిఫికేషన్ కేటగిరీలో రీటోటలింగ్, అన్ని జవాబులకు మార్కులు వేశారా లేదా చూస్తారు. మూల్యాంకనం చేయని జవాబులను తిరిగి లెక్కిస్తారు. రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదని సూచించింది. -
నేటి నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు
సాక్షి, అమరావతి/అమరావతిబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా నేటి (గురువారం) నుంచి జరగనున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈనెల 29 వరకు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థుల హాల్‌టికెట్లను ఇప్పటికే ఆయా పాఠశాలలకు పంపించడంతో పాటు వాటిని వెబ్సైట్లో (www.bseap.org) కూడా పొందుపరిచారు. హాల్‌టిక్కెట్లు అందని వారు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సంబంధిత హెడ్మాస్టర్ల సంతకాలతో పరీక్షలకు హాజరుకావచ్చు. 11,356 పాఠశాలలకు చెందిన 6,17,484 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,834 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. పర్యవేక్షణ కోసం 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. ఆయా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధిస్తున్నారు. పరీక్షహాల్లోకి సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోరు. హాల్‌టిక్కెట్లు తప్ప ఇతర పేపర్లను తీసుకుపోరాదు. హాల్టిక్కెట్ల రోల్ నెంబర్లను, మెయిన్ ఆన్షర్ షీట్లు, అడిషనల్, బిట్, మ్యాప్, గ్రాఫ్ షీట్లతో సహ ఎక్కడా రాయరాదు. ఊరు, పేరు, సంతకం వంటి ఇతర చిహ్నాలు పెట్టరాదని అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులను తొలి రెండు రోజులు మాత్రమే పరీక్ష ప్రారంభమైన అరగంటవరకు అనుమతిస్తామని, తరువాత నుంచి అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు. దివ్యాంగులకు మినహాయింపులు ఈ పరీక్షలకు సంబంధించి అంధ, మూగ, చెవిటి వంటి దివ్యాంగ విద్యార్థులకు కొన్ని మినహాయింపులు ఇస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ విద్యార్థులకు పాస్‌మార్కులు 35 నుంచి 20కి తగ్గించారు. వీరికి జంబ్లింగ్ ఉండదు. అంతే కాకుండా అరగంట అదనపు సమయం కేటాయించనున్నారు. డైలెక్షియాతో బాధపడే వారికి కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చారు. వీరు థర్డ్ లాంగ్వేజ్ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. వీరికి స్క్రయిబ్ సదుపాయం కల్పించి అదనంగా గంట సమయం కేటాయించనున్నారు. ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ల కేంద్రాలతోనే సమస్యలు ఇలా ఉండగా ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాల్లో అవకవతకలకు పాల్పడే అవకాశం ఉంది. గత ఏడాదిలో నారాయణ స్కూలుకు చెందిన విద్యార్థులున్న కొన్ని కార్పొరేట్ స్కూల్ కేంద్రాల్లో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. మంచినీళ్లు అందించే పేరిట, ఇతర కిందిస్థాయి అటెండర్ల సేవల పేరిట తమ సిబ్బందిని ఆయా కార్పొరేట్ సంస్థలు ఈకేంద్రాల్లోకి తమ వారిని చొప్పించి కాపీయింగ్‌కు పాల్పడ్డాయి. దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రభుత్వాన్ని ఆధారాలతో సహ నిలదీసింది. నెల్లూరు, అనంతపురం తదితర జిల్లాల్లో ఇలాంటి అక్రమాలు జరిగినా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఫలితంగా టెన్త్ ఫలితాల్లో పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించిన స్కూళ్లలో అత్యధికం ఆ కార్పొరేట్ స్కూళ్లే ఉన్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఉందన్న అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థుల వివరాలు ఇలా కేటగిరీ రెగ్యులర్ ప్రయివేటు మొత్తం బాలురు 311849 5626 317475 బాలికలు 296341 3668 300009 మొత్తం 608190 9294 617484 ఒత్తిడిని జయిస్తే విజయం మీదే: మంత్రి గంటా ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా, ఒత్తిడిని జయించి పరీక్షలు రాస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు పదో తరగతి విద్యార్థులకు సూచించారు. గురువారం నుంచి ప్రారంభంకానున్న పది పరీక్షల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని ఆదర్శ పాఠశాలను బుధవారం ఉదయం తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని పరీక్ష కేంద్రాల్లో బెంచీలపైనే కూర్చుని పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. విద్యార్థులు పరీక్ష సమయానికి అర్ధగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని గతేడాది నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో జరిగిన ‘పరీక్ష పేపర్ల లీక్’ ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు లొకేటర్ యాప్‌ను ప్రవేశపెట్టామని.. అలాగే విద్యార్థులు తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ 18005994550 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
టెన్త్ పరీక్షలకు హాల్ టికెట్లు జారీ
వెబ్సైట్నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సాక్షి, హైదరాబాద్: ఈనెల 21నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ల జారీ ప్రక్రియ పూర్తి చేశామని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ ఎం.ఆర్.ప్రసన్నకుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ హాల్‌టికెట్లను ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈఏపీ.ఓఆర్జీ’’ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. బోర్డు జారీచేసిన హాల్‌టికెట్లు అందకపోయినా, వాటిని పోగొట్టుకున్నా విద్యార్థులు ఈ వెబ్సైట్నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై పాఠశాల ప్రధానోపాధ్యాయునితో అటెస్టెడ్ చేయించుకోవాలని సూచించారు.