సాక్షి, అమరావతి/అమరావతిబ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా నేటి (గురువారం) నుంచి జరగనున్న పదోతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈనెల 29 వరకు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థుల హాల్‌టికెట్లను ఇప్పటికే ఆయా పాఠశాలలకు పంపించడంతో పాటు వాటిని వెబ్‌సైట్లో (www.bseap.org) కూడా పొందుపరిచారు. హాల్‌టిక్కెట్లు అందని వారు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత హెడ్మాస్టర్ల సంతకాలతో పరీక్షలకు హాజరుకావచ్చు. 11,356 పాఠశాలలకు చెందిన 6,17,484 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,834 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. పర్యవేక్షణ కోసం 156 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. ఆయా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ విధిస్తున్నారు. పరీక్షహాల్లోకి సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోరు. హాల్‌టిక్కెట్లు తప్ప ఇతర పేపర్లను తీసుకుపోరాదు. హాల్‌టిక్కెట్ల రోల్ నెంబర్లను, మెయిన్ ఆన్షర్ షీట్లు, అడిషనల్, బిట్, మ్యాప్, గ్రాఫ్ షీట్లతో సహ ఎక్కడా రాయరాదు. ఊరు, పేరు, సంతకం వంటి ఇతర చిహ్నాలు పెట్టరాదని అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులను తొలి రెండు రోజులు మాత్రమే పరీక్ష ప్రారంభమైన అరగంటవరకు అనుమతిస్తామని, తరువాత నుంచి అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు.
దివ్యాంగులకు మినహాయింపులు
ఈ పరీక్షలకు సంబంధించి అంధ, మూగ, చెవిటి వంటి దివ్యాంగ విద్యార్థులకు కొన్ని మినహాయింపులు ఇస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ విద్యార్థులకు పాస్‌మార్కులు 35 నుంచి 20కి తగ్గించారు. వీరికి జంబ్లింగ్ ఉండదు. అంతే కాకుండా అరగంట అదనపు సమయం కేటాయించనున్నారు. డైలెక్షియాతో బాధపడే వారికి కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చారు. వీరు థర్డ్ లాంగ్వేజ్ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. వీరికి స్క్రయిబ్ సదుపాయం కల్పించి అదనంగా గంట సమయం కేటాయించనున్నారు.
ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్ల కేంద్రాలతోనే సమస్యలు
ఇలా ఉండగా ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాల్లో అవకవతకలకు పాల్పడే అవకాశం ఉంది. గత ఏడాదిలో నారాయణ స్కూలుకు చెందిన విద్యార్థులున్న కొన్ని కార్పొరేట్ స్కూల్ కేంద్రాల్లో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. మంచినీళ్లు అందించే పేరిట, ఇతర కిందిస్థాయి అటెండర్ల సేవల పేరిట తమ సిబ్బందిని ఆయా కార్పొరేట్ సంస్థలు ఈకేంద్రాల్లోకి తమ వారిని చొప్పించి కాపీయింగ్‌కు పాల్పడ్డాయి. దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రభుత్వాన్ని ఆధారాలతో సహ నిలదీసింది. నెల్లూరు, అనంతపురం తదితర జిల్లాల్లో ఇలాంటి అక్రమాలు జరిగినా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ఫలితంగా టెన్త్ ఫలితాల్లో పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించిన స్కూళ్లలో అత్యధికం ఆ కార్పొరేట్ స్కూళ్లే ఉన్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి ఉందన్న అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.
అభ్యర్థుల వివరాలు ఇలా
కేటగిరీ రెగ్యులర్ ప్రయివేటు మొత్తం
బాలురు 311849 5626 317475
బాలికలు 296341 3668 300009
మొత్తం 608190 9294 617484
ఒత్తిడిని జయిస్తే విజయం మీదే: మంత్రి గంటా
ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా, ఒత్తిడిని జయించి పరీక్షలు రాస్తే తప్పకుండా విజయం సాధించవచ్చని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు పదో తరగతి విద్యార్థులకు సూచించారు. గురువారం నుంచి ప్రారంభంకానున్న పది పరీక్షల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడం గ్రామంలోని ఆదర్శ పాఠశాలను బుధవారం ఉదయం తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని పరీక్ష కేంద్రాల్లో బెంచీలపైనే కూర్చుని పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
విద్యార్థులు పరీక్ష సమయానికి అర్ధగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని గతేడాది నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో జరిగిన ‘పరీక్ష పేపర్ల లీక్’ ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు లొకేటర్ యాప్‌ను ప్రవేశపెట్టామని.. అలాగే విద్యార్థులు తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ 18005994550 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నేటి నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు
Published Thu, Mar 15 2018 5:06 AM | Last Updated on Thu, Mar 15 2018 8:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment