సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సైన్సు పరీక్ష ఇకనుంచి ఒకే పేపర్‌గా జరుగుతుంది. సైన్సులో భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రాలను రెండు వేర్వేరు పేపర్లుగా కాకుండా ఒకే ప్రశ్నపత్రంతో నిర్వహించనున్నారు. ఈ రెండు సబ్జెక్టుల ప్రశ్నలను రెండు విభాగాలుగా.. ఒకే ప్రశ్నపత్రంలో ఇస్తారు. ఈ విద్యాసంవత్సరం నుంచి టెన్త్‌లో 6 పేపర్ల విధానాన్నే అనుసరిస్తున్నట్టు ప్రభుత్వం ఇంతకుముందు ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్‌టీ) బ్లూప్రింట్లు, నమూనా ప్రశ్నపత్రాలను రూపొందించిన సంగతి తెలిసిందే. బ్లూప్రింట్ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేపట్టింది.
ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు
గతంలో టెన్త్ పరీక్షలు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో 11 పేపర్లలో జరిగేవి. అంతర్గత మార్కులు 20 ఉండగా పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించేవారు. 2016–17 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలు అంతర్గత మార్కుల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు రావడంతో తరువాత టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో అంతర్గత మార్కులను రద్దు చేసి 100 మార్కులకు నిర్వహించేలా ఉత్తర్వులు ఇచ్చారు.
అనంతరం కరోనా సమయంలో పరీక్షల నిర్వహణకు తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో 11 పేపర్లకు బదులు పరీక్షను 7 పేపర్లకు ప్రభుత్వం కుదించింది. తెలుగు, ఇంగ్లిష్,, హిందీ, మేథ్స్, సోషల్ స్టడీస్ పేపర్లను 100 మార్కులకు, ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పేపర్లను 50 మార్కుల చొప్పున రెండురోజుల పాటు నిర్వహించారు. 2022 టెన్త్ పబ్లిక్ పరీక్షలు కూడా ఇదే విధానంలో జరిగాయి. కాగా, సీసీఈ విధానంలో 4 ఫార్మేటివ్, 2 సమ్మేటివ్ పరీక్షలను నిర్వహిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను ఏడాదిలో నిరంతరం మూల్యాంకనం చేస్తున్నందున ఇక నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలను 7 లేదా 6 పేపర్లకు కుదించి నిర్వహించడం మంచిదని ఎస్సీఈఆర్‌టీ ప్రభుత్వానికి ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదనలు పంపించింది.
పరిశీలించిన ప్రభుత్వం 2022–23 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు 6 పేపర్లతోనే నిర్వహించేలా జీవో–136ను ఆగస్టు 22న విడుదల చేసింది. గత ఏడాది ఏడు పేపర్లుగా టెన్త్ పరీక్షలు నిర్వహించిన సమయంలో సైన్సును ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు పేపర్లుగా వేర్వేరుగా నిర్వహించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి మొత్తం పేపర్లను ఆరింటికే కుదించినందున సైన్సును రెండు పేపర్లుగా కాకుండా ఒకే పేపర్‌గా 100 మార్కుల ప్రశ్నపత్రంతో ఒకేరోజు నిర్వహించనున్నారు.
పరీక్ష ఒకటే.. సమాధాన పత్రాలు రెండు
ఇకనుంచి సైన్సు ఒకే పేపర్‌గా 33 ప్రశ్నలతో 100 మార్కులకు నిర్వహించనున్నారు. మొత్తం 33 ప్రశ్నలను 2 భాగాలుగా చేసి ఫిజికల్ సైన్సులో 16 ప్రశ్నలను, బయోలాజికల్ సైన్సులో 17 ప్రశ్నలను ఇవ్వనున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలను వేర్వేరు బుక్‌లెట్లలో రాయాల్సి ఉంటుంది. ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సు సమాధానాలను వేర్వేరు టీచర్లు మూల్యాంకనం చేయాల్సి ఉన్నందున ఇలా రెండు సమాధానాల బుక్‌లెట్లను ఇవ్వనున్నారు.
25 నుంచి ఫీజుల చెల్లింపు
మార్చి–2023లో నిర్వహించే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలస్య రుసుము రూ.50తో డిసెంబర్ 11 నుంచి 20 వరకు, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్ 21 నుంచి 25 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు చెల్లించవచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment