సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2022–23 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ జీవో 136ను విడుదల చేశారు. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాల విద్యలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
సీబీఎస్‌ఈ టెన్త్‌లో ప్రస్తుతం పబ్లిక్ పరీక్షలు ఆరు పేపర్లలో మాత్రమే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలనూ అదే రీతిలో ఆరు పేపర్లలోనే నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించింది. దీని ప్రకారం ఇకపై టెన్త్ పరీక్షల్లో ఫిజికల్ సైన్స్ (పీఎస్), బయోలాజికల్ సైన్స్ (ఎన్‌ఎస్) సబ్జెక్టులు కలిపి ఒక్క పేపర్‌గానే ఉంటాయి. అదేవిధంగా లాంగ్వేజ్, నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు కూడా ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది.
11 పేపర్ల నుంచి ఆరుకు తగ్గింపు..
టెన్త్ పబ్లిక్ పరీక్షలు తొలుత 11 పేపర్లతో ప్రారంభమై ఇప్పుడు ఆరుకు తగ్గాయి. గతంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమల్లో లేనప్పుడు 11 పేపర్లలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరిగేవి. ఆ పరీక్షలకు ముందు నాలుగు యూనిట్ టెస్టులు, రెండు టర్మ్ టెస్టులు నిర్వహించేవారు. సీసీఈ విధానానాన్ని ముందుగా 8వ తరగతి వరకే అమల్లోకి తెచ్చినప్పటికీ.. ఆ తర్వాత 9, 10 తరగతులకూ వర్తింపచేశారు. సీసీఈ విధానంలో విద్యార్థులకు నాలుగు ఫార్మేటివ్ పరీక్షలు, రెండు సమ్మేటివ్ పరీక్షలను నిర్వహించేవారు. అంతేకాకుండా వివిధ ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలతో సీసీఈ విధానం అమలు చేశారు.
విద్యార్థులపై పరీక్షల భారం తగ్గించేందుకు..
ఈ నేపథ్యంలో విద్యార్థులను పబ్లిక్ పరీక్షల్లో మరింత నిశితంగా పరీక్షించాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) పాఠశాల విద్యా శాఖకు నివేదికను సమర్పించింది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు సీబీఎస్‌ఈ.. టెన్త్ పబ్లిక్ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహిస్తోందని నివేదించింది. దీన్ని అనుసరించి రాష్ట్రంలో కూడా ఆరు లేదా ఏడు పేపర్లలో నిర్వహిస్తే సరిపోతుందని తెలిపింది. దీంతో ప్రభుత్వం టెన్త్ పబ్లిక్ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment