ఏప్రిల్‌ మొదటి వారంలో టెన్త్‌ పరీక్షలు | Tenth Public Examinations in first week of April 2023 | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ మొదటి వారంలో టెన్త్‌ పరీక్షలు

Published Thu, Dec 29 2022 4:30 AM | Last Updated on Thu, Dec 29 2022 11:16 AM

Tenth Public Examinations in first week of April 2023 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు–2023 ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ముగింపు తేదీకి అటుఇటుగా ఒకరోజు వ్యవధిలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌(ఎస్సెస్సీ బోర్డు) షెడ్యూల్‌ను రూపొందించింది. ఇంటర్‌ పరీక్షలు మార్చి 15న ప్రారంభమై ఏప్రిల్‌ 4వ తేదీతో ముగుస్తాయి.

రాష్ట్రంలో పాఠశాల విద్యలో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో.. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలనూ అదే ప్యాట్రన్‌లో చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. సీబీఎస్‌ఈలో పబ్లికపరీక్షలు రోజు విడిచి రోజు జరుగుతాయి. టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను కూడా  రోజు విడిచి రోజు నిర్వహించాలని ఎస్సెస్సీ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహించేలా ప్రభుత్వం ఇంతకు ముందు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆరు పేపర్ల పరీక్షలను రోజు విడిచి రోజు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దేవానందరెడ్డి ఇటీవల పలు విద్యాసంస్థల యాజమాన్యాలతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించి.. పలు అంశాలపై చర్చించారు.

సైన్స్‌ సబ్జెక్టుకు సంబంధించి ఫిజికల్‌ సైన్స్, నేచురల్‌ సైన్స్‌లు కలిపి ప్రశ్నపత్రాలిస్తారు. పీఎస్‌లో 16,  ఎన్‌ఎస్‌లో 17 ప్రశ్నలుంటాయి.  సమాధాన పత్రాలు రెంటికీ వేర్వేరుగా రాయాల్సి ఉంటుంది. ముందు పీఎస్, అనంతరం ఎన్‌ఎస్‌ ప్రశ్నలుంటాయి. అలానే  సమాధానాలూ రాయాలి.  

పేర్లు, వివరాల్లో తప్పులు సరిచేసుకునేందుకు.. ఎడిట్‌ ఆప్షన్‌ 
పరీక్ష ఫీజును పాఠశాలల యాజమాన్యాలు కట్టినా, లేదా సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఎవరు కట్టినా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ తదితర వివరాలు తప్పుగా నమోదు చేసి ఉంటే కనుక ఆందోళన చెందాల్సిన పనిలేదని, పరీక్ష ఫీజు చెల్లించిన అనంతరం ఎడిట్‌ ఆప్షన్‌ ఇస్తామని దేవానందరెడ్డి ఆయా యాజమాన్యాలకు వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement