సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 3 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఏర్పాట్లు చేస్తోంది. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ముందు నుంచే ఎస్సెస్సీ బోర్డు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. 26 జిల్లాల్లో మొత్తం 3,348 కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
ఇప్పటివరకు రిజిస్టరైన విద్యార్థుల సంఖ్య ప్రకారం ఈ పరీక్షలకు 18,601 స్కూళ్ల నుంచి 6,64,153 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థుల్లో ప్రభుత్వ స్కూళ్ల నుంచి 3,97,549 మంది, ప్రైవేటు స్కూళ్ల నుంచి 2,11,521 మంది ఉన్నారు. బాలురు 3,46,542 మంది కాగా బాలికలు 3,17,611 మంది పరీక్ష రాయనున్నారు. ప్రైవేటుగా పరీక్ష రాసే విద్యార్థులు మరో 53,411 మంది ఉన్నారు. వీరితోపాటు ఓఎస్సెస్సీ విద్యార్థులు మరో 1,672 మంది పరీక్షలకు హాజరవుతున్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలు
పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ, జడ్పీ స్కూళ్లు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, మున్సిపల్ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల్లో సీసీ కెమెరాలు ఉన్న వాటినే పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తున్నారు.
పరీక్ష ముగిసే వరకు సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. గతంలో విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 8.30 నుంచి అనుమతించేవారు. ఈసారి ఉదయం 8.45 గంటల తరువాత మాత్రమే అనుమతిస్తారు. చీఫ్ సూపరింటెండెంట్ సహా ఎవరికీ పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.
ప్రశ్న పత్రాలకు 7 అంకెల సీరియల్ నంబర్
ఈసారి పంపిణీ చేసే ప్రశ్నపత్రాలకు కొత్తగా సీరియల్ నంబర్లను ముద్రిస్తారు. 7 అంకెలతో కూడిన సీరియల్ నంబర్ల వారీగానే సెంటర్లలోని విద్యార్థులకు ప్రశ్నపత్రాలను అందిస్తారు. సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు పరిమితం చేసింది. గతంలో 11 పేపర్లు ఉండగా, కరోనా సమయంలో వాటిని ఏడింటికి తగ్గించారు. ఇకపై ఆరు పేపర్లలో మాత్రమే టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.
ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సుకు కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇస్తారు. ఈ రెండు సబ్జెక్టులకు సమాధానాలు వేర్వేరుగా రాసేందుకు రెండు బుక్‌లెట్లు (12 పేజీలు చొప్పున) ఇస్తారు. పేపర్–1లో ఫిజికల్ సైన్సులో 16 ప్రశ్నలు, పేపర్–2 బయోలాజికల్ సైన్సులో 17 ప్రశ్నలు ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2 (కాంపోజిట్ కోర్సులైన సంస్కృతం, అరబిక్, పర్షియన్, హిందీ), వొకేషనల్ కోర్సులకు కూడా ఈసారి రెండు బుక్‌లెట్లు ఇస్తారు. ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 26 వరకు టెన్త్ మూల్యాంకనాన్ని నిర్వహిస్తారు. ఈసారి కొత్త జిల్లాలను కూడా కలుపుకొని 25 మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
Published Fri, Mar 3 2023 4:23 AM | Last Updated on Fri, Mar 3 2023 4:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment