Tenth board examination
-
టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 3 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఏర్పాట్లు చేస్తోంది. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ముందు నుంచే ఎస్సెస్సీ బోర్డు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. 26 జిల్లాల్లో మొత్తం 3,348 కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకు రిజిస్టరైన విద్యార్థుల సంఖ్య ప్రకారం ఈ పరీక్షలకు 18,601 స్కూళ్ల నుంచి 6,64,153 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థుల్లో ప్రభుత్వ స్కూళ్ల నుంచి 3,97,549 మంది, ప్రైవేటు స్కూళ్ల నుంచి 2,11,521 మంది ఉన్నారు. బాలురు 3,46,542 మంది కాగా బాలికలు 3,17,611 మంది పరీక్ష రాయనున్నారు. ప్రైవేటుగా పరీక్ష రాసే విద్యార్థులు మరో 53,411 మంది ఉన్నారు. వీరితోపాటు ఓఎస్సెస్సీ విద్యార్థులు మరో 1,672 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలు పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ, జడ్పీ స్కూళ్లు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, మున్సిపల్ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల్లో సీసీ కెమెరాలు ఉన్న వాటినే పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తున్నారు. పరీక్ష ముగిసే వరకు సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. గతంలో విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 8.30 నుంచి అనుమతించేవారు. ఈసారి ఉదయం 8.45 గంటల తరువాత మాత్రమే అనుమతిస్తారు. చీఫ్ సూపరింటెండెంట్ సహా ఎవరికీ పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ప్రశ్న పత్రాలకు 7 అంకెల సీరియల్ నంబర్ ఈసారి పంపిణీ చేసే ప్రశ్నపత్రాలకు కొత్తగా సీరియల్ నంబర్లను ముద్రిస్తారు. 7 అంకెలతో కూడిన సీరియల్ నంబర్ల వారీగానే సెంటర్లలోని విద్యార్థులకు ప్రశ్నపత్రాలను అందిస్తారు. సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్లెట్ ఇస్తారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు పరిమితం చేసింది. గతంలో 11 పేపర్లు ఉండగా, కరోనా సమయంలో వాటిని ఏడింటికి తగ్గించారు. ఇకపై ఆరు పేపర్లలో మాత్రమే టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సుకు కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇస్తారు. ఈ రెండు సబ్జెక్టులకు సమాధానాలు వేర్వేరుగా రాసేందుకు రెండు బుక్లెట్లు (12 పేజీలు చొప్పున) ఇస్తారు. పేపర్–1లో ఫిజికల్ సైన్సులో 16 ప్రశ్నలు, పేపర్–2 బయోలాజికల్ సైన్సులో 17 ప్రశ్నలు ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2 (కాంపోజిట్ కోర్సులైన సంస్కృతం, అరబిక్, పర్షియన్, హిందీ), వొకేషనల్ కోర్సులకు కూడా ఈసారి రెండు బుక్లెట్లు ఇస్తారు. ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 26 వరకు టెన్త్ మూల్యాంకనాన్ని నిర్వహిస్తారు. ఈసారి కొత్త జిల్లాలను కూడా కలుపుకొని 25 మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. -
'ఇలాగే ఉంటే టెన్త్ కూడా పాసవ్వలేవన్నారు'
ఎంఎస్ ధోని.. ఈ పేరు వింటేనే ఏదో తెలియని వైబ్రేషన్స్. ఈతరం అభిమానులకు ధోని ఒక ప్రత్యేకం. ఎందుకంటే రెండుమార్లు ఐసీసీ ప్రపంచకప్ టోర్నీలు అందించడమే కాదు.. టీమిండియా కెప్టెన్‌గా, ఫినిషర్‌గా అతని సేవలు మరిచిపోలేనివి. టికెట్ కలెక్టర్ జాబ్ నుంచి ఫ్రొఫెషనల్ ఆటగాడిగా.. గోల్ కీపర్ నుంచి వికెట్ కీపర్‌గా టర్న్ తీసుకోవడం ఒక్క ధోనికే చెల్లింది. తన ఆటతీరు, కెప్టెన్సీతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న ధోని రిటైర్ అయి రెండేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. తాజాగా ధోని మంగళవారం తమిళనాడులోని హోసూరులో క్రికెట్ మైదానాన్ని ప్రారంభించాడు. ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ అకాడమీతో విద్యార్థులకు క్రికెట్ శిక్షణ అందించేందుకు ఒప్పందం కుదిరింది. ఇక కార్యక్రమం అనంతరం ధోనీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలో తన స్కూల్ డేస్‌ని గుర్తు చేసుకున్నాడు. ''నేను ఏడో తరగతిలో క్రికెట్ ఆడటాన్ని ప్రారంభించాను. అప్పటికి నేను ఓ యావరేజ్ స్టూడెంట్‌ని. అయితే క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసిన తర్వాత క్లాస్‌లో నా అటెండెన్స్ నెమ్మదిగా తగ్గుతూ వెళ్లింది. ఒక అటెండెన్స్ విషయం వదిలేస్తే నేను చాలా గుడ్ స్టూడెంట్. టెన్త్ క్లాస్‌కి వచ్చేసరికి ఎక్కువగా గ్రౌండ్‌లోనే ఉండేవాడ్ని. దాంతో టెన్త్ క్లాస్‌లో చాలా ఛాప్టర్స్‌పై నాకు కనీసం అవగాహన కూడా లేకపోయింది. కానీ ఎగ్జామ్స్‌లో ఆ ఛాప్టర్స్‌కి సంబంధించిన ప్రశ్నలే వస్తే ఎంత బాధగా ఉంటుంది. ఇక మా నాన్న నేను కనీసం టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ కూడా పాసవనని అనుకున్నాడు. మళ్లీ సంప్లిమెంటరీలు రాసుకోవాల్సిందేనని కంగారుపడ్డారు. ఆయన అంచనాలకు భిన్నంగా 66శాతం మార్కులతో పదో తరగతి పాసయ్యాను. ఇది తెలుసుకున్న తర్వాత నాన్నతో పాటు నేను చాలా సంతోషపడ్డాను'' అని ధోనీ గుర్తు చేసుకున్నాడు. ఇక ధోని కెప్టెన్‌గా భారత జట్టుకి 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్‌లు అందించాడు. ఆ తర్వాత 2013లో టీమిండియాను ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విజేతగా నిలిపాడు. క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ ధోనీనే. అలాగే ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. -
టెన్త్ హాల్ టికెట్లు రెడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను సిద్ధం చేశామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు దేవానందరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ‘బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్’ వెబ్సైట్ నుంచి స్కూల్ లాగిన్ ద్వారా వీటిని డౌన్లోడ్ చేసుకుని అటెస్ట్ చేసిన తరువాత విద్యార్థులకు అందించాలని సూచించారు. హాల్ టికెట్లలో విద్యార్థుల ఫొటో ఇమేజ్ లేకపోయినా, అస్పష్టంగా ఉన్నా వాటిపై సదరు విద్యార్థుల ఫొటోలను అతికించి అటెస్ట్ చేసి, వారితో కూడా సంతకం చేయించి పరీక్షలు రాసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫొటోలను కొత్తగా అతికించిన హాల్టికెట్లకు సంబంధించిన ఫోటోలను అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపాలని కోరారు. -
అప్పుడు 761.. ఇప్పుడు 1506!
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ మేరకు విద్యాశాఖ అధికారులు అదనపు పరీక్ష కేంద్రాల ఎంపికలో నిమగ్నమయ్యారు. పాత హాల్‌టికెట్‌తో.. కొంత మంది విద్యార్థులు కొత్త పరీక్ష కేంద్రంలో వార్షిక పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించాలనే కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ప్రస్తుత సెంటర్లకు అర కిలోమీటర్ దూరంలో కొత్తగా అదనపు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలు సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యార్థులకు జారీ చేసిన హాల్ టికెట్లపై పరీక్ష కేంద్రాలను కేటాయించారు. తాజా మార్గదర్శకాల మేరకు ప్రస్తుతం పరీక్ష కేంద్రాలు మారే అవకాశం ఉంది. విద్యార్థులకు కొత్తగా హాల్ టికెట్లు జారీ చేసే అవకాశం లేదు. వారంతా పాత హాల్‌టికెట్లపైనే పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అయితే పరీక్ష కేంద్రం మారిన విషయాన్ని విద్యార్థులకు ఎలా చేరవేస్తారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో 761 పరీక్ష కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం వీటి సంఖ్యను 1506కు పెంచారు. మొత్తం విద్యార్థులు 1,69,290 మార్చి 19 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలుగు, హిందీ లాంగ్వేజ్ పరీక్షలు మాత్రమే ముగిశాయి. ఆ తర్వాత జనతా కర్ఫ్యూ అమలు, ఆ వెంటనే లాక్డౌన్ ప్రకటన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. మిగితా సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించే అంశంపై నెలకొన్న సందిగ్ధానికి హైకోర్టు తెర దించింది. జూన్ 8 తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేయడంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 1,69,290 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గతంలో బెంచికి ఇద్దరు.. ప్రస్తుతం ఒక్కరే.. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ఒక్కో గదిలో పది నుంచి 12 మంది (గతంలో బెంచికి ఇద్దరు ఉండేవారు.. తాజా మార్గదర్శకాల మేరకు ఒకరినే కూర్చోబెడతారు) విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టాలని నిర్ణయించారు. పరీక్ష కేంద్రాల ఎదుట థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, శరీర ఉష్ణోగ్రతలను రికార్డు చేసిన తర్వాతే విద్యార్థులను లోనికి అనుమతించాలని భావిస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు, ఇన్విజిలేటర్లకు మాస్క్ మస్ట్ అని స్పష్టం చేయడంతో పాటు పరీక్ష కేంద్రంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి శానిటైజర్ ఇవ్వనున్నారు. ‘పరీక్ష కేంద్రాల మార్పుపై విద్యార్ధులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటనర్సమ్మ స్పష్టం చేశారు. అదనపు సెంటర్ల పేరుతో పాటు వాటిలో కేటాయించిన నంబర్లను మీడియా ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు చేరవేయనున్నట్లు తెలిపారు. సెంటర్ దగ్గర ఉన్న సిబ్బంది వారికి ఇదే విషయాన్ని సూచించనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. -
మళ్లీ సీబీఎస్ఈ టెన్త్ బోర్డు పరీక్షలు!
న్యూఢిల్లీ: విద్యాప్రమాణాలు దిగజారుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో సీబీఎస్ఈ టెన్త్ బోర్డు పరీక్షలను తిరిగి ప్రవేశపెట్టడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. దీనిపై మానవ వనరుల అభివృద్ధిమంత్రి ప్రకాశ్ జవదేకర్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పరీక్షలను తిరిగి ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తున్నామని, అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. 5 రాష్ట్రాల మంత్రులతో ఏర్పాటైన కమిటీతో పాటు దేశవ్యాప్తంగా తల్లిదండ్రులూ విద్యా ప్రమాణాలు పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారని, ఈ పరీక్షలు జరపాలంటున్నారని తెలిపారు. బోర్డు పరీక్ష తిరిగి ప్రవేశ పెట్టడంపై హెచ్ఆర్డీ మంత్రి అధ్యక్షతన ఈ నెల 25న జరిగే సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. నో-డిటెన్షన్ విధానం వల్ల ప్రమాణాలు దిగజారాయనే ఆందోళన వ్యక్తమవుతోందని హెచ్ఆర్డీ అధికారి ఒకరు చెప్పారు.