సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ మేరకు విద్యాశాఖ అధికారులు అదనపు పరీక్ష కేంద్రాల ఎంపికలో నిమగ్నమయ్యారు. పాత హాల్‌టికెట్‌తో.. కొంత మంది విద్యార్థులు కొత్త పరీక్ష కేంద్రంలో వార్షిక పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించాలనే కోర్టు ఆదేశాల మేరకు అధికారులు ప్రస్తుత సెంటర్లకు అర కిలోమీటర్ దూరంలో కొత్తగా అదనపు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే పలు సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యార్థులకు జారీ చేసిన హాల్ టికెట్లపై పరీక్ష కేంద్రాలను కేటాయించారు. తాజా మార్గదర్శకాల మేరకు ప్రస్తుతం పరీక్ష కేంద్రాలు మారే అవకాశం ఉంది. విద్యార్థులకు కొత్తగా హాల్ టికెట్లు జారీ చేసే అవకాశం లేదు. వారంతా పాత హాల్‌టికెట్లపైనే పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అయితే పరీక్ష కేంద్రం మారిన విషయాన్ని విద్యార్థులకు ఎలా చేరవేస్తారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో 761 పరీక్ష కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం వీటి సంఖ్యను 1506కు పెంచారు.
మొత్తం విద్యార్థులు 1,69,290
మార్చి 19 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలుగు, హిందీ లాంగ్వేజ్ పరీక్షలు మాత్రమే ముగిశాయి. ఆ తర్వాత జనతా కర్ఫ్యూ అమలు, ఆ వెంటనే లాక్‌డౌన్ ప్రకటన నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. మిగితా సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించే అంశంపై నెలకొన్న సందిగ్ధానికి హైకోర్టు తెర దించింది. జూన్ 8 తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేయడంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లతో నిమగ్నమయ్యారు. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 1,69,290 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
గతంలో బెంచికి ఇద్దరు.. ప్రస్తుతం ఒక్కరే..
పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు ఒక్కో గదిలో పది నుంచి 12 మంది (గతంలో బెంచికి ఇద్దరు ఉండేవారు.. తాజా మార్గదర్శకాల మేరకు ఒకరినే కూర్చోబెడతారు) విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టాలని నిర్ణయించారు. పరీక్ష కేంద్రాల ఎదుట థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, శరీర ఉష్ణోగ్రతలను రికార్డు చేసిన తర్వాతే విద్యార్థులను లోనికి అనుమతించాలని భావిస్తున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు, ఇన్విజిలేటర్లకు మాస్క్ మస్ట్ అని స్పష్టం చేయడంతో పాటు పరీక్ష కేంద్రంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి శానిటైజర్ ఇవ్వనున్నారు. ‘పరీక్ష కేంద్రాల మార్పుపై విద్యార్ధులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటనర్సమ్మ స్పష్టం చేశారు. అదనపు సెంటర్ల పేరుతో పాటు వాటిలో కేటాయించిన నంబర్లను మీడియా ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు చేరవేయనున్నట్లు తెలిపారు. సెంటర్ దగ్గర ఉన్న సిబ్బంది వారికి ఇదే విషయాన్ని సూచించనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment