బతుకమ్మ కుంట.. బతికెనంట! | Hydra Begins Bathukamma Kunta Renovation Works | Sakshi
Sakshi News home page

బతుకమ్మ కుంట.. బతికెనంట!

Published Wed, Feb 19 2025 7:59 AM | Last Updated on Wed, Feb 19 2025 7:59 AM

Hydra Begins Bathukamma Kunta Renovation Works

అభివృద్ధి పనులు ప్రారంభించిన హైడ్రా

అడుగున్నర తవి్వతేనే ఉబికి వచ్చిన నీరు 

 హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు

సాక్షి, హైదరాబాద్‌: అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట బతుకుతోంది. కబ్జా చెర వీడటంతో దీని అభివృద్ధిపై హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) దృష్టి పెట్టింది. ఇళ్లను కూల్చకుండా, ఉన్న కుంటపైనే దృష్టి పెట్టింది. తొలుత చెత్త, మొక్కల్ని తొలగించిన అధికారులు.. తాజాగా చెరువులో పూడికతీత మొదలెట్టారు. మంగళవారం జేసీబీలు కేవలం అడుగున్నర తవ్వగా.. లోపల నుంచి నీళ్లు ఉబికివచ్చాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కుంట అభివృద్ధిలో తమ వంతు సహకారాన్ని అందించడానికి ముందుకు వచ్చారు.

 ఇది బతుకమ్మ కుంట కాదు ప్రైవేట్‌ స్థలం అంటూ వాదించిన వాళ్లు ఇప్పుడేమంటారంటూ ప్రశి్నస్తున్నారు. కబ్జాల చెరలో చిక్కిపోయి, ఆనవాళ్లను కోల్పోయిన బతుకమ్మ కుంటకు ప్రాణం పోయాలని కోరుతూ గతంలో అంబర్‌పేటకు చెందిన స్థానికులు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి వాస్తవాలు నిర్ధారించారు. 

బతుకమ్మకుంట స్థలం తనదంటూ స్థానిక నాయకుడు ఎడ్ల సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయ ని న్యాయస్థానం కింది కోర్టుకు వెళ్లాలని సూ చించింది. దీంతో హైడ్రా తన అభివృద్ధి పనులు కొనసాగిస్తోంది. బతుకమ్మ కుంటలో ఉన్న పైపులైన్‌ పగిలి నీళ్లు వచ్చాయంటూ సోషల్‌ మీడియాలో వదంతులు వెల్లువెత్తాయి. ఆ ప్రాంతంలో ఎలాంటి పైపులైన్లు లేవని జలమండలి అధికారులు స్పష్టం చేసినట్లు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. 

పదహారు నుంచి ఐదెకరాలకు తగ్గిన కుంట.. 
అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించి, పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించిన హైడ్రా అధికారులు దాని పూర్వాపరాలు అధ్యయనం చేశారు. 1962–63 నాటి రికార్డుల ప్రకారం సర్వే నం.563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండేది. ఫుల్‌ట్యాంక్‌ లెవల్, బఫర్‌ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలు ఉండేదని అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం అక్కడ కేవలం 5.15 ఎకరాల భూమి మాత్రమే మిగిలినట్లు తేలింది. దీంతో ఈ మేరకు మాత్రమే కుంటను పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ నిర్ణయించారు. 

ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించకుండా, ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చెరువు తవ్వకాలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకుని హైడ్రాకు సహకరించారు. ఒకప్పటి ఎర్రకుంటనే బతుకమ్మకుంటగా మారిందని, రెవెన్యూ రికార్డులూ అదే చెబుతున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తెచ్చారు. ఏళ్లుగా నిర్మాణ వ్యర్థాలు, చెత్తతో నిండిపోయిన బతుకమ్మ కుంటను పునరుద్ధరించే చర్యల్ని హైడ్రా చేపట్టింది. బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలని, అందులో స్వచ్ఛమైన నీళ్లు నిలిచేలా చేయడం ద్వారా పర్యావరణం పరిరక్షణ, భూగర్భ జలా ల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

మరో ఐదు చెరువుల్లోనూ.. 
హైడ్రా అధికారులు బతుకమ్మ కుంటతో పాటు మరో ఐదు చెరువుల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. కూకట్‌పల్లి, ఉప్పల్‌ నల్ల చెరువులు, పాతబస్తీలోని బుమ్రక్‌ దౌలా చెరువు, మాదాపూర్‌లోని తమ్మిడికుంట, సున్నం చెరువుల్లోనూ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. తొలి దశలో వీటిలోని నీళ్లు తొలగిస్తామని, ఆపై కాలుష్యాన్ని శుద్ధి చేసి, చెరువుకు పునరుజ్జీవం కలి్పస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల్ని హెచ్‌ఏండీఏ అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయా చెరువుల అభివృద్ధిని  వచ్చే జూన్‌ మాసం కల్లా పూర్తి చేయనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement