నిర్మాణాలపై బ్లాక్‌మెయిలర్ల బెదిరింపులు
అమీన్‌పూర్‌లో ఓ నిందితుడి అరెస్టు
వసూళ్లకు పాల్పడితే జైలుకే: కమిషనర్ రంగనాథ్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో కొందరు దందాలకు పాల్పడుతున్నారు. జలవనరుల్లోని అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తున్న హైడ్రా ప్రభుత్వ స్థలాల్లోని వాటినీ విడిచిపెట్టేదిలేదని స్పష్టం చేస్తోంది. దీంతో కబ్జాకోరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ భయాన్ని క్యాష్ చేసుకోవడానికి కొందరు బ్లాక్‌మెయిలర్లు రంగంలోకి దిగారని తమ దృష్టికి వచి్చనట్లు బుధవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. ఇలాంటి దందాలు చేసిన వారికి కటకటాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే అమీన్‌పూర్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారన్న రంగనాథ్... మరికొందరి వ్యవహారంపై సమాచారం ఉందన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
ప్రధానంగా రెండు రకాల దందాలు జరుగుతున్నట్లు హైడ్రా దృష్టికి వచ్చింది. కొందరు వ్యక్తులు సామాజిక కార్యకర్తల ముసుగులో బిల్డర్లను బెదిరిస్తున్నారు. వివిధ జలవనరుల ఫుల్ ట్యాంక్ లెవల్స్ (ఎఫ్‌టీఎల్), బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపడుతున్న వారినే వీళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆ అంశంపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని, మీడియాకు ఉప్పందిస్తామని బిల్డర్లను భయపెడుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే భారీ మొత్తం చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క ఆయా అధికారులతో దిగిన ఫొటోలను చూపిస్తున్న కొందరు మరో దందా మొదలెట్టారు. ఆ ఫొటోల ఆధారంగా సదరు అధికారులతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వారితో మాట్లాడి నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విషయం సెటిల్ చేస్తామని వసూళ్లకు పాల్పడుతున్నారు.
అప్రమత్తమైన అధికారులు..
👉బహుళ అంతస్తులు నిర్మిస్తున్న వారితో పాటు వ్యక్తిగత గృహాలు కట్టుకుంటున్న వాళ్లూ టార్గెట్‌గా మారుతున్నారు. ఇలా భయపెట్టి డబ్బు డిమాండ్ చేస్తున్న వారిలో ఇతర విభాగాలకు చెందిన వాళ్లూ ఉంటున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ రాజధానిలోని మూడు కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, కమిషనరేట్ల అధికారులను అప్రమత్తం చేశారు.
చర్యలు తప్పవు..
👉‘హైడ్రాను నీరుగార్చే ప్రయత్నాలు చేసినా, తప్పు దోవ పట్టించినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ విభాగం పేరుతో ఎవరైనా బెదిరింపులు, డబ్బు వసూళ్లకు పాల్పడితే వారిపై చట్టపరమైన తీసుకుంటాం. ఇతర ప్రభుత్వ విభాగాలైన రెవెన్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాలతో పాటు హైడ్రాకు చెందిన అధికారులు, సిబ్బంది సైతం బెదిరింపులకు పాల్పడితే తక్షణం స్థానిక పోలీసుస్టేషన్, ఎస్పీ, పోలీసు కమిషనర్, ఏసీబీ లేదా హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేయండి’ అని రంగనాథ్ అన్నారు.
👉సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ ప్రాంతానికి చెందిన విప్లవ్ సామాజిక కార్యకర్త ముసుగులో స్థానిక బిల్డర్‌ను హైడ్రా పేరుతో బెదిరించి, డబ్బు డిమాండ్ చేశాడు. దీనిపై ఆ బిల్డర్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించిన ఆయన తగిన చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎస్పీని కోరారు. బిల్డర్ నుంచి ఫిర్యాదు తీసుకున్న ఎస్పీ.. అమీన్‌పూర్ ఠాణాలో కేసు నమోదు చేయించారు. బుధవారం విప్లవ్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment