దిద్దుబాటు చర్యలు చేపట్టిన పాఠశాల విద్యాశాఖ
అన్ని ప్రశ్నాపత్రాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఉంచాలని ఆదేశాలు
పరీక్షకు గంట ముందు తీసుకోవాలని ఆదేశాలు
సాక్షి, అమరావతి: పదో తరగతి సమ్మెటివ్ అసెస్‌మెంట్–1 లెక్కల ప్రశ్నాపత్రం యూట్యూబ్‌లో ప్రత్యక్షమైన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అన్ని తరగతుల ప్రశ్నాపత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచి, పరీక్ష జరిగే రోజు అక్కడి నుంచే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష పత్రాలకు ఎంఈవో–1, 2 ఇద్దరు కస్టోడియన్లుగా ఉండాలని ఆదేశించారు. పరీక్ష నిర్వహించే రోజు గంటముందు మాత్రమే ప్రశ్నాపత్రాలను సంబంధిత ప్రధానోపాధ్యాయులకు అందించాలని సూచించారు.
సోమవారం జరగాల్సిన పదో తరగతి మేథ్స్ ప్రశ్నాపత్రం మూడు రోజుల ముందే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ విషయం గుర్తించకుండా అదే ప్రశ్నాపత్రం విద్యార్థులకు అందించారు. అనంతరం తేరుకున్న అధికారులు సోమవారం నిర్వహించాల్సిన అన్ని తరగతుల పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అర్ధ వార్షిక పరీక్షల నిర్వహణే ఇంత అధ్వానంగా ఉన్న నేపథ్యంలో మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ఇంకెంత గొప్పగా నిర్వహిస్తారోనని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
గత ఐదేళ్లలో ఒక్క దుస్సంఘటన కూడా లేకుండా అన్ని పరీక్షలను ప్రభుత్వం పక్కాగా నిర్వహించింది. పరీక్షకు గంట ముందు ఆన్‌లైన్‌లో పేపర్ పంపించి, అక్కడే ప్రింట్ తీసుకుని విద్యార్థులకు అందించేవారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న విద్యాశాఖ.. ఇప్పుడెందుకు తేలిగ్గా తీసుకుందని ప్రశ్నిస్తున్నారు.
ఇలా ఉండగా, ఎస్‌ఏ–1 పరీక్షలు ఈనెల 19వ తేదీతో ముగుస్తాయి. అనంతరం లెక్కల పరీక్షను 20వ తేదీన నిర్వహించనున్నారు. కాగా, ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మరోపక్క విద్యాశాఖ డైరెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు.
ఉపాధ్యాయులకు విషమ పరీక్ష
ప్రశ్నాపత్రాల భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల విద్యాశాఖ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు ఉపాధ్యాయులకు సంకటంగా మారాయి. పరీక్షకు గంట ముందు స్థానిక పోలీస్ స్టేషన్‌లో భద్రపరిచిన ప్రశ్నాపత్రాలను ఎంఈవో సమక్షంలో ఉపాధ్యాయులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు ఈ సమయం సరిపోయినా.. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రశ్నాపత్రాలు చేరడం కష్టసాధ్యమవుతుంది. చాలా గ్రామాల్లో పాఠశాలలు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుంచి దాదాపు 20 నుంచి 30 కి.మీ. దూరంలో ఉన్నాయి. పోలీస్ స్టేషన్‌లో అన్ని ప్రక్రియలు పూర్తిచేసి సమయానికి చేరడం ఎంతో ఒత్తిడికి గురి కావాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment