
సహకరించిన పోలీసులకు యూనిఫామ్‌కు వెచ్చించిన వైనం
దొంగ సొమ్ములు బయటపడకుండా పోలీస్ స్టేషన్‌కు రంగులు?
రూ.12.50 లక్షల్లో కొద్ది ఖర్చులు.. ఆపై మొత్తం స్వాహా
‘పోలీసు దొంగల’ కేసులో యంత్రాంగం నివేదిక సిద్ధం?
నలుగురిపై వేటు..? క్రిమినల్ కేసు నమోదుపై ఆరా
చిత్తూరు అర్బన్: దొంగ నుంచి రికవరీ చేసిన సొమ్మును బాధితులకు అప్పగించకుండా వాటాలు వేసేసుకున్నారు. పంచుకున్న వాటాల డబ్బుల్లో ఏకంగా సిబ్బందికి యూనిఫామ్ పంపిణీ చేశారా..? స్టేషన్‌కు రంగులు వేయించారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో ఓ దొంగను పట్టుకున్న పోలీసులు అతడి నుంచి రూ.12.50 కొట్టేయడం, ఈ విషయాన్ని రాయచోటి పోలీసులకు పట్టుబడ్డ దొంగ బహిర్గతం చేయడం తెలిసిందే. అక్కడి నుంచి సమాచారం చిత్తూరు పోలీసుశాఖకు చేరడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. దీనిపై ఇటీవల ‘సాక్షి’లో ‘పోలీసు దొంగలు..?’ శీర్షికన కథనం ప్రచురితం అయింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ మణికంఠ ఇప్పటికే స్పష్టం చేశారు.
ప్రాథమిక విచారణ పూర్తి
జిల్లా పోలీసుశాఖలో సంచలనం సృష్టించిన ఈ ఘటనలో ప్రాథమిక విచారణ పూర్తి చేసి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. దొంగ నుంచి లంచంగా తీసుకున్న రూ.12.50 లక్షల్లో.. ఓ పోలీసు రూ.3.50 లక్షలు, మరో పోలీసు రూ.9 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే దొంగను పట్టుకోవడంలోని బృందంలో ఉన్న కానిస్టేబుల్ పెద్ద మొత్తంలో నగదును తన సమీప బంధువుల బ్యాంకు ఖాతాలకు మళ్లించి, ఆపై దీన్ని తన అధికారికి ఇచ్చినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో దొంగ సొమ్ముతో స్టేషన్‌లో పనిచేసే పోలీసులకు ఖాకీ యూనిఫామ్ పంపిణీ చేయడంతో పాటు స్టేషన్‌కు రంగులు వేయించారనే ఆరోపణ విచారణలో బయటపడినట్లు సమాచారం. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు, లంచంగా తీసుకున్న డబ్బును వ్యక్తిగత అవసరాలను వాడుకోవడంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణకు మారుపేరైన పోలీసుశాఖలోని సిబ్బందికి యూనిఫామ్‌ను కొనుగోలు చేసి ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కేసు నమోదుపై చర్చ
విచారణ అధికారులు పూర్తి చేసిన ప్రాథమిక నివేదికపై ఓ పోలీసు ఉన్నతాధికారి, జిల్లా అధికారితో చర్చించినట్లు తెలుస్తోంది. ‘దొంగ ఇచ్చిన రూ.12.50 లక్షలు ఎన్ని కేసుల్లో చోరీ చేశాడో, అన్ని కేసుల్లోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను నిందితులుగా ఎందుకు చేర్చకూడదు..? అప్పగించిన పనిని పూర్తి చేయడంలో నమ్మక ద్రోహం చేసి, పోలీసుశాఖ పరువు తీసిన వీళ్లపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316(5) కింద కేసు నమోదు చేయొచ్చా..?’ అని సుదీర్ఘంగా చర్చించారనే సమాచారం గుప్పుమంటోంది.
ఇక రూ.3.50 లక్షలు స్వయంగా తీసుకున్న పోలీసును సస్పెండ్ చేయడంతో పాటు, మరో పోలీసును సస్పెండ్ చేయడం లేదా వీఆర్‌కు పంపాలని.. ఇద్దరు కానిస్టేబుళ్లను సైతం విధుల నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. పనితీరు నచ్చి, తాను కాస్త చనువుగా ఉన్నంత మాత్రాన.. తప్పు చేసిన వాళ్లను కాపాడే ప్రసక్తేలేదని, ఈ ఘటనపై చట్టం ప్రకారం ముందుకు వెళ్లడం తప్ప మరో ఆలోచనలేదని పోలీసు ‘బాస్’ సైతం ఒకరిద్దరితో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఏది ఏమైనా దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిస్తే అవార్డులు, రివార్డులు పంపిణీ చేసే అధికారులు.. తప్పు చేసినపుడు చర్యలు తీసుకుంటే తప్ప సామాన్యులకు పోలీసుశాఖపై నమ్మకం ఉండదనేది బహిరంగ వాదన. ఈ ఘటన ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment