
రాజ్యాంగేతర వ్యవస్థగా సిట్ ఏర్పాటు
పోలీస్ స్టేషన్ నిర్వచనాన్ని పట్టించుకోని ప్రభుత్వం
ఏ న్యాయస్థానం పరిధి అన్న దానిపైనా అస్పష్టత
బెదిరింపులు, వేధింపులు, హింసించేందుకే ఇలా..
అబద్ధపు వాంగ్మూలాల నమోదుకు బరితెగింపు
సాక్షి, అమరావతి : పోలీస్ స్టేషన్‌కు ఉండాల్సిన అర్హతలు ఉండవు.. ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందో చెప్పరు.. కానీ అది పోలీస్ స్టేషనే. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరో చెప్పరు కానీ అది పోలీస్ స్టేషనే. ఇదంతా ఏమనుకుంటున్నారు? ఇది రెడ్‌బుక్ రాజ్యాంగ కుట్రల కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా సిద్ధం చేసిన రాజ్యాంగేతర శక్తి. దీనిపేరు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు పేరిట ప్రభుత్వం బరితెగిస్తోంది. అందుకోసమే ఏర్పాటు చేసిన సిట్ ద్వారా అరాచకాలకు తెగబడుతోంది. చట్టంలో పేర్కొన్న నిబంధనలను బేఖాతరు చేస్తూ.. ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతోనే సిట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రలోభపెట్టి, బెదిరించి, వేధించి మరీ అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసే కుట్ర దాగుంది.
చట్ట విరుద్ధంగా సిట్ ఏర్పాటు
సిట్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోనే ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తోంది. కేవలం కక్ష సాధింపే లక్ష్యంగా సిట్‌ను ఏర్పాటు చేశారనేది జీవోనే స్పష్టం చేస్తోంది. చట్టంలో నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలను పూర్తిగా ఉల్లంఘించారని స్పష్టమవుతోంది. ఏదైనా వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఏర్పాటు చేసే సిట్‌ను ఓ పోలీస్ స్టేషన్‌గా పరిగణించాలి. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సిట్‌ను ఓ పోలీస్ స్టేషన్‌గా గుర్తిస్తున్నట్టు పేర్కొంది.
కానీ అసలు పోలీస్ స్టేషన్‌కు చట్ట ప్రకారం ఉండాల్సిన నిబంధనలను మాత్రం గాలికి వదిలేయడం గమనార్హం. బీఎన్‌ఎస్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా పోస్టుగానీ, ప్రదేశంగానీ పోలీస్ స్టేషన్‌గా పరిగణిస్తారు’ అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ స్టేషన్ కోసం ప్రత్యేకంగా గుర్తించిన ఏదైనా ‘స్థానిక ప్రాంతం’ కూడా అయ్యుండాలని చట్టం స్పష్టం చేసింది. అంటే పోలీస్ స్టేషన్‌కు స్థానిక ప్రాంతం ఏదన్నది స్పష్టం చేయాలి.
కానీ మద్యం విధానంపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ‘స్థానిక ప్రాంతం’ ఏదన్నది పేర్కొన లేదు. స్థానిక ప్రాంతం అన్నది లేకుండా ఏదైనా పోస్టునుగానీ, ప్రదేశాన్నిగానీ పోలీస్ స్టేషన్‌గా గుర్తించడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌కు కచి్చతంగా స్టేషన్ హౌస్ అధికారిగానీ లేదా ఆఫీసర్ ఇన్‌చార్జ్ ఆ పోలీస్ స్టేషన్‌కు బాధ్యుడిగా ఉండాలి.
మరి సిట్‌ను పోలీస్ స్టేషన్‌గా ప్రకటించిన ప్రభుత్వం అక్కడ ఇన్‌చార్జ్ ఎవరన్నది పేర్కొన లేదు. అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా సిట్‌ను ఏర్పాటు చేసినట్టేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఏర్పాటైన సిట్ ఏ న్యాయస్థానం పరిధిలోకి వస్తుందన్నది కూడా ప్రభుత్వం వెల్లడించ లేదు. ఫలితంగా బాధితులెవరైనా సిట్‌పై ఫిర్యాదు ఎవరికి చేయాలన్నది స్పష్టత లేదు. తద్వారా పోలీస్ స్టేషన్‌కు ఉండాల్సిన అర్హతలు ఏవీ సిట్‌కు లేవని తేల్చి చెబుతున్నారు.
అబద్ధపు వాంగ్మూలాలు
సిట్ అధికారులు ఈ కేసులో పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతరులను వేధిస్తూ.. భయభ్రాంతులకు గురి చేస్తూ బలవంతంగా వాంగ్మూలాలు నమోదు చేయిస్తున్న తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. అసలు అభియోగాలు ఏమిటన్నది చెప్పకుండానే వారితో అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయిస్తుండటమే ఇందుకు నిదర్శనం. బీఎన్‌ఎస్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 2(క్యూ) ‘చేయకూడని పని ఏదైనా చేసినా, చేయాల్సిన పని చేయకుండా ఉన్నా అది నేరం’ అని నిర్వచించింది.
అటువంటి నేరం చట్ట ప్రకారం శిక్షార్హం అని కూడా పేర్కొంది. మద్యం విధానంపై నమోదు చేసిన కేసులో పలువురు అధికారులు, ఇతరులను దర్యాప్తు పేరిట వేధిస్తున్న సిట్.. అసలు నేరం ఏమిటన్నది చెప్పకపోవడం గమనార్హం. ఎందుకంటే చేయకూడని పని చేసినా, చేయాల్సిన పని చేయకపోయినా ఆ ప్రభుత్వ అధికారులు కూడా బాధ్యులు అవుతారు.
బీఎన్‌ఎస్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 34 ప్రకారం.. ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే ప్రభుత్వ అధికారి సంబంధిత బాధ్యులకు తెలియజేయడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఏ పౌరుడైనా సరే తనకు ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకుగానీ, ఇతర దర్యాప్తు సంస్థల అధికారులకుగానీ తెలియజేయాలని బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 33 పేర్కొంటోంది. మరి ప్రభుత్వ అధికారులకు మరింత బాధ్యత ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కక్ష సాధింపు కోసమే బరితెగింపు
చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగానే నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ పోలీస్ స్టేషన్‌కు ఓ స్థానిక ప్రాంతాన్ని గుర్తిస్తే.. సిట్ కార్యకలాపాలు అక్కడి నుంచే నిర్వహించాలి. సాక్షులు, నిందితులను ఎక్కడ అదుపులోకి తీసుకున్నా సరే ఆ పోలీస్‌స్టేషన్‌గా గుర్తించిన ఆ ప్రదేశానికి తీసుకెళ్లి విచారించాలి. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసు నమోదు చేసింది కాబట్టి ప్రభుత్వ అధికారులు, పూర్వ అధికారులు, ఇతర సాక్షులుగా భావిస్తున్న వారిని దర్యాప్తు పేరుతో ఓ పరిధికి మించి వేధించడం సాధ్యం కాదు.
అక్రమంగా నిర్బంధిస్తే బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. అందుకే టీడీపీ కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా సిట్‌ను పోలీస్ స్టేషన్‌గా గుర్తించింది. తద్వారా సిట్‌ను ఓ అరాచక శక్తుల అడ్డాగా, ప్రభుత్వ అధికారిక వేధింపులకు కేంద్రంగా, పోలీసు దాదాగిరీ డెన్‌గా తీర్చిదిద్దింది.
ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేయడమే పనిగా పెట్టుకున్న సిట్ అధికారులు దాంతో విచ్చలవిడిగా చెలరేగి పోతున్నారు. దర్యాప్తు పేరిట ఇప్పటికే పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, పూర్వ అధికారులు, డిస్టిలరీల ప్రతినిధులు, ఇతరులను దర్యాప్తు పేరిట తీవ్రంగా వేధించారు.
వారిని గుర్తు తెలియని ప్రదేశాల్లో అక్రమంగా నిర్బంధించి శారీరకంగా మానసికంగా హింసించారు. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరించారు. లేకపోతే వారిపైనా, వారి కుటుంబ సభ్యులపైనా అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తామని బెంబేలెత్తించారు.
Comments
Please login to add a commentAdd a comment