సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి (ఏప్రిల్ 27, బుధవారం) నుంచి మే 9 వరకు జరగనున్న ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,20,063 మంది బాలురు కాగా 3,02,474 మంది బాలికలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 3,776 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.
పదో తరగతి పరీక్షలు నిర్దేశిత తేదీల్లో రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రాల్లోకి 9.30 గంటల వరకు అనుమతిస్తామని.. ఆ తర్వాత ఎవరినీ లోపలకు అనుమతించబోమని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నందున పూర్వపు 13 జిల్లాల విద్యాధికారులే కొత్త జిల్లాలకూ నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు.
24 పేజీల బుక్‌లెట్‌లోనే సమాధానాలు
పదో తరగతి పరీక్షల చరిత్రలో తొలిసారిగా విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను పంపిణీ చేయనున్నారు. వీటిలోనే సమాధానాలు రాయాలి. ఇందులో పార్టు–1లోని ఓఎమ్మార్ షీట్‌లో పేర్కొన్న వివరాలను హాల్‌టికెట్లలోని సమాచారంతో సరిచూసుకోవాలి. 24 పేజీల బుక్‌లెట్‌లో విద్యార్థులు రోల్ నంబర్లను, తమ పేర్లను, స్కూల్ పేర్లను రాయకూడదు. అలాగే గ్రాఫ్స్‌లో, మ్యాప్ పాయింట్లలో కూడా రోల్ నంబర్ వేయకూడదు. రోల్ నంబర్ వేసి ఉన్న ఆన్సర్ షీట్లను మూల్యాంకనం చేయరు. అలాంటివారిని మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డవారిగా పరిగణిస్తారు.
156 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 292 సిట్టింగ్ స్క్వాడ్లు
పదో తరగతి పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ జరగకుండా 156 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 292 సిట్టింగ్ స్క్వాడ్లు పర్యవేక్షించనున్నాయి. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన సామగ్రి మొత్తాన్ని అన్ని జిల్లాల కేంద్రాలకు తరలించారు. విద్యార్థులకు ఏప్రిల్ 18 నుంచే హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను అనుసరించి పరీక్షలకు ఏర్పాట్లు చేపట్టారు. రూముకు 16 మంది చొప్పున ఉంచడంతోపాటు భౌతికదూరం పాటించేలా, మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు. మంచినీటి సదుపాయం, ఏఎన్‌ఎంల నియామకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సదుపాయం, పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రత వంటి చర్యలు చేపట్టారు.
పరీక్ష కేంద్రాల్లో ఫోన్లు, డిజిటల్ పరికరాలకు నో ఎంట్రీ
పరీక్ష కేంద్రాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్లు తప్ప ఇతరులెవరూ ఫోన్లను తీసుకువెళ్లడానికి వీలులేదు. అలాగే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ పరికరాలను కూడా అనుమతించరు. ప్రశ్నపత్రాల లీకేజీకి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో విద్యాశాఖతోపాటు ట్రెజరీ, రెవెన్యూ, పోలీసు, పోస్టల్, ఏపీఎస్‌ఆర్టీసీ, ట్రాన్స్‌కో, వైద్య, ఆరోగ్య శాఖ, తదితర అన్ని విభాగాలను సమన్వయం చేసి ఎక్కడా సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ సంఘవిద్రోహ శక్తులు పుకార్లను వ్యాపింప చేయకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు చేపట్టారు. ఫేక్, గాసిప్ ప్రశ్నపత్రాలను కూడా ప్రచారంలోకి తేకుండా చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వాటిని వ్యాపింపచేసే వారిపై క్రిమినల్ చర్యలు చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment