టెన్త్‌కు కోవిడ్‌ ఎఫెక్ట్‌ | Pass percentage 2022 tenth annual exam results dropped drastically | Sakshi
Sakshi News home page

టెన్త్‌కు కోవిడ్‌ ఎఫెక్ట్‌

Published Tue, Jun 7 2022 3:41 AM | Last Updated on Tue, Jun 7 2022 3:00 PM

Pass percentage 2022 tenth annual exam results dropped drastically - Sakshi

విజయవాడలో పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు

సాక్షి, అమరావతి: వరుస వేవ్‌లతో ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి విద్యారంగాన్నీ వదల్లేదు. కోవిడ్‌ ప్రభావంతో వరుసగా రెండేళ్ల పాటు టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొనగా తాజాగా వెలువడ్డ 2022 పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం బాగా తగ్గిపోయింది. సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కాగా బాలురపై బాలికలు పైచేయి సాధించారు.

పరీక్షలకు 6,20,788 మంది నమోదు చేసుకోగా 6,15,908 (99.21 శాతం) మంది హాజరయ్యారు. వీరిలో 4,14,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,16,820 మంది బాలురకు గాను 2,02,821 (64.02 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 2,99,088 మంది హాజరు కాగా 2,11,460 (70.70 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

బాలురకన్నా బాలికలు 6.68% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల డైరక్టర్‌ డి.దేవానందరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. 

ప్రకాశం ఫస్ట్‌.. చివరిలో ‘అనంత’
► 797 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
► 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాలేదు. వీటిల్లో 31 ప్రైవేట్‌ స్కూళ్లు కాగా 18 ఎయిడెడ్‌ స్కూళ్లున్నాయి.
► ఉత్తీర్ణతలో ప్రకాశం జిల్లా 78.30 శాతంతో అగ్రస్థానంలో ఉండగా అనంతపురం జిల్లా 49.70 శాతంతో చివరిస్థానంలో నిలిచింది.
► ఏపీ రెసిడెన్సియల్‌ స్కూళ్లు 91.10 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లు 50.10 శాతంతో అత్యల్ప ఉత్తీర్ణత నమోదు చేశాయి.

లాంగ్వేజెస్‌లో అధిక ఉత్తీర్ణత
ఈసారి లాంగ్వేజెస్‌లలో ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. మేథ్స్, జనరల్‌ సైన్స్, సోషల్‌ స్టడీస్‌లో ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఫస్ట్‌ లాంగ్వేజ్‌లో 5,64,294 (91.73 శాతం) మంది, సెకండ్‌ లాంగ్వేజ్‌లో 5,95,801 (97.03 శాతం) మంది, థర్డ్‌ లాంగ్వేజ్‌లో 6,01,644 (97.95 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మేథమెటిక్స్‌లో 4,93,839 (80.26 శాతం) మంది, జనరల్‌ సైన్సులో 5,05,719 (82.18 శాతం) మంది, సోషల్‌ స్టడీస్‌లో 5,00,975 (81.43 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

ఆంగ్ల మాధ్యమం విద్యార్ధుల ఆధిక్యం
టెన్త్‌ పరీక్షల్లో తెలుగు మాధ్యమం కన్నా ఇంగ్లీషు మీడియం విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. తెలుగు మాధ్యమంలో 43.97 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఆంగ్ల మాధ్యమంలో 77.55 శాతం ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. 

అత్యధికులకు ఫస్ట్‌ డివిజన్‌
టెన్త్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో అత్యధికులు ఫస్ట్‌ డివిజన్‌లో నిలిచారు. 3,17,789 మంది ఫస్ట్‌ డివిజన్‌ సాధించగా 69,597 మంది సెకండ్‌ డివిజన్‌లో, 26,895 మంది థర్డ్‌ డివిజన్‌లో నిలిచారు.

రెండేళ్లుగా చదువులపై ప్రభావం
కరోనా వ్యాప్తితో పాఠశాలలు తెరుచుకోని పరిస్థితుల్లో 2020, 2021లో పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. మహమ్మారి వల్ల పిల్లల చదువులు బాగా దెబ్బతిన్నాయి.

2016లో 94.52 శాతం, 2017లో 91.92 శాతం, 2018లో 94.61 శాతం, 2019లో 94.88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రెండేళ్లుగా కరోనాతో పిల్లల చదువులు ముందుకు సాగకపోవడంతో ఆ ప్రభావం ఈసారి టెన్త్‌ పరీక్షలపై పడి 67.26 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 2,01,627 మంది ఫెయిలయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement